16
1 ✽“మీరు తొట్రుపడకూడదని నేను ఈ విషయాలు మీతో చెప్పాను. 2 ✝వారు మిమ్ములను సమాజ కేంద్రాల✽నుంచి వెలివేస్తారు. మిమ్ములను ఎవరైనా చంపితే తాను దేవునికి సేవ చేస్తున్నట్టు అనుకొనేకాలం కూడా వస్తూ ఉంది. 3 ✽వారు తండ్రినీ నన్నూ తెలుసుకోలేదు గనుక ఆ విధంగా మీకు చేస్తారు. 4 ✽ఆ కాలం వచ్చేటప్పుడు ఈ విషయాలు మీతో చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వీటిని గురించి మీతో చెపుతున్నాను. మొదట్లో ఈ విషయాలు మీకు చెప్పలేదు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను.5 “ఇప్పుడైతే నన్ను పంపినవాని దగ్గరకు నేను వెళ్ళి పోతున్నాను గానీ ‘నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?✽’ అని మీలో ఎవరూ నన్ను అడగడం లేదు. 6 అయితే నేను ఈ విషయాలు మీతో చెప్పినందుచేత మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 7 ✽అయినా నేను మీతో చెప్పేది సత్యమే – నేను వెళ్ళిపోవడం మీకు మేలు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళిపోతే ఆయనను మీకు పంపుతాను.
8 ✽“ఆయన వచ్చేటప్పుడు పాపాన్ని గురించీ న్యాయాన్ని గురించీ తీర్పును గురించీ లోకాన్ని ఒప్పిస్తాడు. 9 ✽వారు నా మీద నమ్మకం పెట్టడం లేదు, గనుక పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. 10 ✽నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను, ఇకనుంచి మీరు నన్ను చూడరు గనుక న్యాయాన్ని గురించి ఒప్పిస్తాడు. 11 ఈ లోక పాలకుడికి✽ తీర్పు జరిగింది గనుక తీర్పును గురించి ఒప్పిస్తాడు.
12 ✽“నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. 13 ✽ అయితే ఆయన – సత్యాత్మ – వచ్చేటప్పుడు మిమ్ములను సర్వ సత్యంలోకి తీసుకువస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరగబోయేవి✽ కూడా మీకు తెలియజేస్తాడు. 14 ✽ నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేసి నాకు మహిమ కలిగిస్తాడు. 15 ✽తండ్రికి చెందేవన్నీ నావి. అందుచేతే నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను. 16 ✽నేను తండ్రిదగ్గరికి వెళ్ళిపోతాను గనుక కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు, మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.”
17 అందుకు ఆయన శిష్యులలో కొందరు ఒకడితో ఒకడు ఇలా చెప్పుకొన్నారు: “ఆయన ‘కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు. మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను గనుక’ అని మనతో చెపుతున్నదేమిటి? 18 ✽ఆయన ‘కొద్దికాలం’ అనడంలో అర్థం ఏమిటి? ఆయన చెప్పేది ఏమిటో మనకు తెలియదు” అన్నారు.
19 వారు తనను అడగాలనుకొంటున్నారని తెలుసుకొని యేసు వారితో ఇలా అన్నాడు: “కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు. మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు అని నేను చెప్పిన దాన్ని గురించి ఒకరినొకరు విచారణ చేసుకొంటున్నారా? 20 ✽మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు ఏడుస్తారు, శోకిస్తారు గానీ లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తారు గానీ మీ దుఃఖం ఆనందంగా మారిపోతుంది.
21 ✽“స్త్రీ ప్రసవిస్తూ ఉంటే, తన గడియ వచ్చినందుచేత బాధలు అనుభవిస్తుంది. శిశువు పుట్టినప్పుడు ఒకరు లోకంలో పుట్టడంవల్ల వచ్చిన సంతోషం మూలాన ఆ వేదన ఇంకా జ్ఞాపకం చేసుకోదు. 22 అలాగే ఇప్పుడు మీకు దుఃఖం ఉంది గాని నేను మిమ్ములను మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయాలకు ఆనందం కలుగుతుంది. మీ ఆనందాన్ని మీకు లేకుండా ఎవరూ తీసివేయరు. 23 ✽ఆ రోజున మీరు నన్ను ఏమీ అడగరు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు తండ్రిని నా పేర✽ ఏది అడిగినా అది ఆయన మీకిస్తాడు. 24 ✽ఇదివరకు మీరు నా పేర అడిగినది ఏదీ లేదు. అడగండి, మీకు దొరుకుతుంది. అప్పుడు మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.
25 ✽“అలంకారిక భాషలో ఈ విషయాలు మీతో చెప్పాను. అయితే ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో నేను అలంకారిక భాషలో మీతో మాట్లాడక, తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెపుతాను. 26 ✽ఆ రోజున నా పేర మీరు తండ్రిని అడుగుతారు. నేను మీకోసం తండ్రిని వేడుకొంటానని చెప్పడం లేదు. 27 ఎందుకంటే తండ్రి తానే మిమ్ములను ప్రేమిస్తూ✽ ఉన్నాడు. కారణమేమంటే మీరు నన్ను ప్రేమించారు, నేను దేవుని దగ్గరనుంచి వచ్చానని నమ్మారు. 28 ✽నేను తండ్రి దగ్గరనుంచి బయలుదేరి లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచి తండ్రిదగ్గరకు వెళ్ళిపోతున్నాను.”
29 ఆయన శిష్యులు “ఇదిగో, ఇప్పుడు అలంకారిక భాషలో గాక, స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30 నీకు అన్ని విషయాలూ తెలుసుననీ నిన్ను ఎవరూ ఏమీ అడగనవసరం లేదనీ ఇప్పుడు తెలుసుకొన్నాం. నీవు దేవుని దగ్గరనుంచి వచ్చావని దీనిని బట్టి నమ్ముకొంటున్నాం” అన్నారు.
31 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీరిప్పుడు నమ్ముతున్నారా? 32 ఇదిగో వినండి. ఒక కాలం రాబోతుంది. అది వచ్చి ఉంది కూడా. ఈ కాలంలో మీరంతా చెదరి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. నన్ను ఒంటరిగానే వదలివేస్తారు✽. అయినా నేను ఒంటరివాణ్ణి కాను – తండ్రి నాతో ఉన్నాడు.
33 “నా మూలంగా మీకు శాంతి✽ ఉండాలని ఈ సంగతులు✽ మీకు చెప్పాను. లోకంలో మీకు బాధ✽ ఉంటుంది. అయినా ధైర్యంగా ఉండండి✽. నేను లోకాన్ని జయించాను✽.”