15
1 “నేను నిజమైన ద్రాక్షచెట్టును. నా తండ్రి వ్యవసాయదారుడు. 2 నాలో ఫలించని ప్రతి తీగెనూ ఆయన తుంచివేస్తాడు. ఫలిస్తూ ఉన్న ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించేలా రెమ్మలు కత్తిరించి దిద్దుతాడు. 3  ఇంతకుముందే నేను మీతో చెప్పిన వాక్కువల్ల మీరిప్పుడు శుద్ధులయ్యారు. 4  నాలో నిలిచి ఉండండి. నేను మీలో నిలిచి ఉంటాను. తీగె దానంతట అదే ఫలించదు – అది ద్రాక్షచెట్టులో నిలిచి ఉండాలి. అలాగే నాలో నిలిచి ఉండక పోతే మీరు ఫలించలేరు.
5 “ద్రాక్షచెట్టును నేను, తీగెలు మీరు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వారు సమృద్ధిగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు చేయ గలిగేదేమీ లేదు. 6 ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతడు తీగెలాగా పారవేయబడి ఎండిపోతాడు. అలాంటి తీగెలను మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అవి కాలిపోతాయి.
7 “మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుతారు. అది మీకు చేయబడుతుంది. 8 మీరు సమృద్ధిగా ఫలిస్తూ ఉండడంవల్ల నా తండ్రికి మహిమ చేకూరుతుంది. అలా మీరు నా శిష్యులుగా ఉంటారు.
9  “తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్ములను ప్రేమించాను. నా ప్రేమలో నిలిచి ఉండండి. 10  నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే నా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు. 11 నా ఆనందం మీలో ఉండాలనీ మీ ఆనందం సంపూర్ణంగా ఉండాలనీ ఈ సంగతులు మీతో చెప్పాను. 12  నా ఆజ్ఞ ఇదే: నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 13 తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం ధారపోయడం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు. 14 నేను మీకిచ్చిన ఆజ్ఞల ప్రకారం చేస్తే మీరు నా మిత్రులు. 15 ఇకమీదట మిమ్ములను దాసులని పిలవను. ఎందుకంటే, తన యజమాని ఏమి చేస్తున్నాడో దాసునికి తెలియదు. నేను నా తండ్రిచేత వినేదంతా మీకు తెలియజేశాను గనుక మిమ్ములను మిత్రులు అన్నాను.
16 “మీరు నన్ను ఎన్నుకోలేదు. నేను మిమ్ములను ఎన్నుకొన్నాను, మిమ్ములను నియమించాను. మీరు వెళ్ళి ఫలించాలనీ మీ ఫలం నిలిచి ఉండాలనీ నా పేర మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకివ్వాలనీ నా ఉద్దేశం. 17  ఇవి మీకు ఆదేశిస్తున్నాను: మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
18 “లోకం మిమ్ములను ద్వేషిస్తే, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీకు తెలుసు. 19 ఒకవేళ మీరు లోకానికి చెంది ఉంటే లోకం తన వారిని ప్రేమించి ఉంటుంది. కానీ మీరు లోకానికి చెందినవారు కారు. మిమ్ములను లోకంలోనుంచి ఎన్నుకొన్నాను. లోకం మిమ్ములను ద్వేషించే కారణం ఇదే. 20  నేను మీతో చెప్పిన ఈ మాట జ్ఞాపకముంచుకోండి – ‘దాసుడు తన యజమానికంటే మించినవాడు కాడు.’ వారు నన్ను హింసించారంటే మిమ్ములను కూడా హింసిస్తారు. వారు నా మాట పాటిస్తే మీ మాట పాటిస్తారు. 21 అయితే నన్ను పంపినవాణ్ణి వారు ఎరుగరు గనుక నా పేరుకారణంగా అవన్నీ మీపట్ల జరిగిస్తారు. 22 ఒకవేళ నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. ఇప్పుడైతే వారికి పాపం విషయం సాకు ఏమీ లేదు. 23 నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24 మరెవరూ చేయని క్రియలు వారిమధ్య నేను చేసి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. ఇప్పుడైతే వారు నన్నూ నా తండ్రినీ చూచి ద్వేషించారు. 25  వారి ధర్మశాస్త్రంలో ఇలా వ్రాసి ఉంది: ‘వారు నన్ను నిష్కారణంగా ద్వేషించారు.’ ఈ మాట నెరవేరేలా ఈ విధంగా జరుగుతూ ఉంది.
26 “నేను ఆదరణకర్తను మీ దగ్గరకు తండ్రినుంచి పంపుతాను. ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెపుతాడు. ఆయన తండ్రినుంచి బయలుదేరే సత్యాత్మ. 27 మీరు మొదటినుంచి నాతో ఉన్నారు గనుక మీరు కూడా సాక్ష్యం చెపుతారు.