14
1 ✽“మీ హృదయం ఆందోళన పడనియ్యకండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. నామీద కూడా నమ్మకం ఉంచండి. 2 ✽నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. ఇది నిజం కాకపోతే మీతో చెప్పి ఉండేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను. 3 ✽ నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను ఎక్కడ ఉంటానో మీరూ అక్కడ ఉండేలా తిరిగి వస్తాను, నా దగ్గర మిమ్ములను చేర్చుకొంటాను. 4 ✽నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అది మీకు తెలుసు, ఆ మార్గం కూడా మీకు తెలుసు.”5 ✽అందుకు తోమా “ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదే! మార్గం మాకెలా తెలుసు?” అని ఆయననడిగాడు.
6 ✽యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని✽, సత్యాన్ని✽, జీవాన్ని✽. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు. 7 ✽నేనెవరినో మీరు తెలుసుకొని ఉంటే నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవారే. ఇప్పటినుంచి మీరు ఆయనను తెలుసుకొంటున్నారు. ఆయనను చూశారు.”
8 ✽ఫిలిప్పు ఆయనతో “ప్రభూ, తండ్రిని మాకు కనపరచు. అది మాకు చాలు” అన్నాడు.
9 యేసు అతనితో ఇలా అన్నాడు: “ఫిలిప్పు, నేను మీతో ఇంత కాలం ఉన్నా ఇంకా నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూశాడు✽. ‘తండ్రిని మాకు కనపరచు’ అని నీవు అడుగుతున్నావేమిటి? 10 ✽నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి నాలో ఉన్నాడు. ఇది నీవు నమ్మడం లేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు. 11 ✽నేను తండ్రిలో ఉన్నాననీ తండ్రి నాలో ఉన్నాడనీ అనుకుంటే నన్ను నమ్మండి. లేదా, ఈ పనుల కారణంగానైనా నన్ను నమ్మండి. 12 ✽మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నేను చేస్తున్న పనులు నామీద నమ్మకం ఉంచేవాడు కూడా చేస్తారు, వీటికి మించిన పనులు చేస్తారు. ఎందుకంటే, నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. 13 ✽కాబట్టి నా పేర మీరు ఏది అడిగినా సరే, కుమారుని మూలంగా తండ్రికి మహిమ కలిగేందుకు అది నేను చేస్తాను. 14 నా పేర మీరు ఏది అడిగితే అది చేస్తాను.
15 ✽“నా మీద మీకు ప్రేమ గనుక ఉంటే నా ఆజ్ఞలను ఆచరించండి. 16 ✽నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను✽ ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. 17 ఈయన సత్యాత్మ✽. లోకం✽ ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడం అసాధ్యం. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు. 18 ✽నేను మిమ్ములను అనాథలనుగా విడిచివెళ్ళను. మీ దగ్గరకు వస్తాను. 19 ✽ఇంకా కొద్ది కాలం అయిందంటే లోకం నన్ను చూడనే చూడదు. మీరైతే నన్ను చూస్తారు. నేను బ్రతుకుతున్నాను గనుక మీరూ బ్రతుకుతారు✽. 20 నేను నా తండ్రిలో ఉన్నాననీ మీరు నాలో ఉన్నారనీ నేను మీలో ఉన్నాననీ ఆ రోజున✽ మీరు తెలుసుకొంటారు. 21 ✽ నా ఆజ్ఞలు కలిగి వాటిని ఆచరించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమిస్తాను. అతనికి నన్ను వెల్లడి చేసుకొంటాను.”
22 ✽ ఇస్కరియోతు కాని యూదా “ప్రభూ, దేనివల్ల లోకానికి కాక, మాకే నిన్ను వెల్లడి చేసుకుంటావు?” అని ఆయనను అడిగాడు.
23 ✽యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రేమించేవారెవరైనా నా మాట ఆచరిస్తాడు. అలాంటి వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. అతని దగ్గరకు మేము వస్తాం, అతనితో నివాసం చేస్తాం.
24 ✽“నన్ను ప్రేమించనివాడు నా మాటలు ఆచరించడు. మీరు వింటున్న మాట నాది కాదు. నన్ను పంపిన తండ్రిదే. 25 నేను మీతో ఉంటూ ఈ విషయాలు చెప్పాను. 26 ✽తండ్రి నా పేర పంపబోయే ఆదరణకర్త మీకు అన్ని విషయాలు ఉపదేశిస్తాడు. ఆయన పవిత్రాత్మ. నేను మీతో చెప్పినవన్నీ మీ జ్ఞప్తికి తెస్తాడు.
27 ✽“శాంతిని నేను మీకిచ్చి వెళ్ళిపోతాను. నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే ప్రకారం నేను మీకివ్వడం లేదు. మీ హృదయం ఆందోళన పడనియ్యకండి, భయపడనివ్వకండి. 28 ✽‘నేను వెళ్ళి మీ దగ్గరకు వస్తాను’ అని నేను మీతో చెప్పినది విన్నారు గదా. నేనంటే మీకు ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నానని నేను చెప్పినందుకు మీరు ఆనందించి ఉంటారు. ఎందుకంటే తండ్రి నాకంటే పైవాడు. 29 ✝ఇప్పుడు ఇది జరిగేముందే మీతో చెప్పాను. ఇది జరిగేటప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం. 30 మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే, లోక పాలకుడు✽ వస్తున్నాడు. వాడికి నాలో ఏమీ లేదు. 31 ✽అయినా నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి తెలిసిపోయేలా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చే ప్రకారమే నేను చేస్తున్నాను. లేవండి ఇక్కడనుంచి వెళ్దాం.”