13
1 అప్పుడు, పస్కా✽ పండుగకు ముందు ఈ లోకాన్ని విడిచి తండ్రిదగ్గరకు వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందని యేసుకు తెలుసు. లోకంలో ఉన్న తన సొంతవారిని ఆయన ప్రేమిస్తూ✽ వారిని అంతంవరకూ ప్రేమతో చూశాడు. 2 ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వాలనే ఉద్దేశం అపనింద పిశాచం✽ ఇంతకుముందే సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదా✽ హృదయంలో పుట్టించాడు. అప్పటికి సాయంకాల భోజనం చేయడం ముగిసింది. 3 పరమ తండ్రి సమస్తమూ తన చేతికి అప్పగించాడనీ✽ తాను దేవుని దగ్గరనుంచి వచ్చి దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళిపోతాననీ యేసుకు తెలిసికూడా 4 ✽ఆయన భోజనపంక్తిలోనుంచి లేచి తన పైవస్త్రాలు విడిచి అవతల పెట్టి తువాలు తీసుకొని దానిని నడుముకు చుట్టుకొన్నాడు. 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ నడుముకు చుట్టుకొన్న తువాలుతో తుడవసాగాడు.6 ✽అలాగే ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అతడు ఆయనతో “ప్రభూ! నా పాదాలు కడుగుతావా?” అన్నాడు.
7 అందుకు యేసు జవాబిస్తూ “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కావడం లేదు గాని తరువాత నీకు తెలిసిపోతుంది” అని అతనితో చెప్పాడు.
8 పేతురు “నీవు నా పాదాలు ఎన్నడూ కడగవు!” అని ఆయనతో అన్నాడు.
యేసు “నేను నిన్ను కడుగకపోతే నీకు నాతో భాగం లేదు✽” అని అతనికి బదులు చెప్పాడు.
9 సీమోను పేతురు “ప్రభూ! నా పాదాలు మాత్రమే గాక నా చేతులూ నా తల కూడా కడిగేయండి!” అని ఆయనతో అన్నాడు.
10 ✽యేసు అతనితో ఇలా అన్నాడు: “స్నానం చేసినవాడు తన పాదాలు మాత్రమే కడగాలి. వాడు కేవలం శుద్ధుడు. మీరు శుద్ధులే గాని మీలో ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాదు.”
11 ✝తనను శత్రువులకు పట్టి ఇవ్వబోయే వాడెవడో ఆయనకు తెలుసు. కనుకనే “మీలో ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాదు” అన్నాడు.
12 ✽వారి పాదాలు కడిగి తన పైవస్త్రాలు వేసుకొని మళ్ళీ కూర్చున్న తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు: “నేను మీకు చేసినదాని భావం మీకు తెలుసా? 13 మీరు నన్ను గురువు,✽ ప్రభువు అంటారు. మీరలా అనడం సరిగానే ఉంది – అలాగే ఉన్నాను. 14 ✽ప్రభువుగా గురువుగా ఉన్న నేను మీ పాదాలు కడిగితే మీరూ ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే. 15 ✽నేను మీకు చేసిన ప్రకారం మీరూ చేయాలని మీకు ఆదర్శాన్ని చూపాను. 16 ✝మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, దాసుడు తన యజమానిని మించినవాడు కాడు. పంపేవాని కంటే పంపబడ్డవాడు మించినవాడు కాడు. 17 ✽మీరు ఈ విషయాలు తెలుసుకొంటే వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యజీవులు. 18 ✝మీలో ప్రతి ఒక్కణ్ణి గురించి నేను చెప్పడం లేదు. నేను ఎన్నుకొన్నవారు నాకు తెలుసు. అయితే ఈ విధంగా లేఖనం నెరవేరాలి: రొట్టె నాతో తిన్నవాడు నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు. 19 ఇది జరిగినప్పుడు నేనే ‘ఉన్నవాడను✽’ అని మీరు నమ్మాలని ఇది జరగకముందే మీకు చెపుతున్నాను. 20 ✽ మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నేను పంపేవారిని స్వీకరించేవాడు నన్నూ స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపినవాణ్ణీ స్వీకరిస్తున్నాడు.”
21 ✽ ఈ మాటలు చెప్పిన తరువాత యేసు తన ఆత్మలో ఆందోళన చెందాడు. “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అని సాక్ష్యం చెప్పాడు.
22 ✽ఆయన ఎవణ్ణి గురించి చెప్పాడో అని అనుమానంతో శిష్యులు ఒకరివైపు ఒకరు చూచుకోసాగారు. 23 ✽ఆయన శిష్యులలో ఒకడు – యేసు ప్రేమించినవాడు యేసు ఛాతీని ఆనుకొని ఉన్నాడు. 24 అతనికి సీమోను పేతురు సైగ చేసి ఆయన ఎవణ్ణి గురించి చెప్పాడో అడగమని సూచించాడు. 25 అతడు యేసు ఛాతీని ఆనుకొని ఉండి ఆయనను ఇలా అడిగాడు: “ప్రభూ, అతడెవడు?”
26 అందుకు యేసు “ఎవరికి రొట్టె ముక్క ముంచి ఇస్తానో అతడే” అని జవాబిచ్చాడు.
ఆ ముక్క ముంచి సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చాడు. 27 ✽ ఆ ముక్క తీసుకొన్న తరువాత సైతాను వానిలో చొరబడ్డాడు. అప్పుడు యేసు వానితో “నీవు చేసేది త్వరగా చెయ్యి!” అన్నాడు.
28 ఆయన ఏ కారణంచేత వానికి అది చెప్పాడో భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఎవరికీ తెలియదు. 29 ✽ డబ్బుసంచి యూదాదగ్గర ఉంది గనుక పండుగకోసం తమకు కావలసినవి కొనమని గానీ బీదలకు ఏమైనా ఇమ్మని గానీ యేసు వానితో చెప్పాడేమో అని కొందరు అనుకొన్నారు. 30 ✽వాడు ఆ ముక్క తీసుకోగానే బయటికి వెళ్ళాడు. అది రాత్రివేళ.
31 వాడు బయటికి వెళ్ళినతరువాత యేసు ఈవిధంగా అన్నాడు: “ఇప్పుడు మానవ పుత్రునికి✽ మహిమ చేకూరుతుంది, ఆయనమూలంగా దేవునికి కూడా మహిమ చేకూరుతుంది. 32 ✽ఆయనమూలంగా దేవునికి మహిమ చేకూరితే దేవుడు తనమూలంగా ఆయనను మహిమపరుస్తాడు, వెంటనే ఆయనను మహిమపరుస్తాడు. 33 ✽చిన్నపిల్లలూ! ఇంకా కొంత కాలమే మీతో ఉంటాను. మీరు నన్ను వెదకుతారు గాని నేను యూదులకు చెప్పినట్టు మీకూ చెపుతున్నాను, నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు. 34 ✽ఒక క్రొత్త✽ ఆజ్ఞ మీకిస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. నేను మిమ్ములను ప్రేమతో చూచినట్టే మీరూ ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. 35 ✽మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకొంటే దాన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు.”
36 ✽సీమోను పేతురు “ప్రభూ! ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?” అని ఆయననడిగాడు.
యేసు “నేను వెళ్ళే స్థలానికి నీవిప్పుడు నా వెంట రాలేవు. తరువాత నా వెంట వస్తావు” అని సమాధానం చెప్పాడు.
37 ✽పేతురు “ప్రభూ, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకోసం నా ప్రాణం ధారపోస్తాను” అని ఆయనతో జవాబిచ్చాడు.
38 ✽యేసు “నీ ప్రాణం నాకోసం ధారపోస్తావా? నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నన్ను ‘ఎరగన’ని నీవు మూడు సార్లు చెప్పకముందే కోడి కూయదు” అన్నాడు.