12
1 అందుచేత యేసు పస్కా పండుగకు ఆరు రోజులు ముందుగా బేతనీకి వచ్చాడు. అక్కడ లాజరు మృతి చెందాడు, యేసు చనిపోయిన వారిలోనుంచి అతణ్ణి లేపాడు. 2  వారు ఆయనకు అక్కడ విందు చేశారు. మార్త పరిచర్య చేస్తూ ఉంది, లాజరు యేసుతో భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఒకడు. 3 మరియ అయితే చాలా విలువైన అత్తరు సుమారు సగం కిలో బరువు తెచ్చింది. అది స్వచ్ఛమైన జటామాంసి. ఆమె యేసు పాదాలను అభిషేకించి తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఇల్లంతా పరిమళ సువాసనతో నిండిపోయింది.
4 ఆయన శిష్యులలో ఒకడూ సీమోను కుమారుడూ ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వనై ఉన్నవాడైన ఇస్కరియోతు యూదా 5 “ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారాలకు అమ్మి బీదలకివ్వలేదు?” అన్నాడు. 6 అతడు ఇలా అన్నది బీదలమీద శ్రద్ధ ఉండి కాదు. అతడు దొంగ, అతని దగ్గర శిష్యుల డబ్బుసంచి ఉండడంచేత దానిలో వేసినది సొంతానికి తీసుకొనేవాడు.
7 కనుక యేసు “ఆమెను ఇలా చేయనివ్వండి. ఆమె ఈ అత్తరు ఉంచినది నా అంత్యక్రియలరోజు కోసమే. 8 బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు గానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండను” అన్నాడు.
9 ఆయన అక్కడ ఉన్నాడని యూదులలో చాలామందికి తెలియవచ్చింది. వారు యేసునే కాదు, ఆయన చనిపోయిన వారిలోనుంచి లేపిన లాజరును కూడా చూద్దామని వచ్చారు. 10 లాజరు కారణంగా యూదులలో అనేకులు తమను విడిచి యేసుమీద నమ్మకం ఉంచినందుచేత 11 ప్రధాన యాజులు అతణ్ణి కూడా చంపాలని కుట్రపన్నారు.
12  మరుసటి రోజున యేసు జెరుసలం వస్తున్నాడని పండుగకు వచ్చిన మహా సమూహానికి వినవచ్చింది. 13 వారు ఖర్జూర మట్టలు చేతపట్టుకొని ఆయనకు ఎదురు వెళ్ళి “జయం! ప్రభువు పేరట వచ్చేవాడు, ఇస్రాయేల్‌ప్రజల రాజు ధన్యజీవి!” అని కేకలు వేయడం ఆరంభించారు. 14 ఇలా వ్రాసి ఉంది: సీయోను కుమారీ, భయపడకు! మీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని ఉండి వస్తున్నాడు.
15 దీనిప్రకారమే యేసు ఒక గాడిదపిల్లను కనుక్కొని దానిమీద కూర్చున్నాడు. 16 ఈ విషయాలు మొట్టమొదట ఆయన శిష్యులకు అర్థం కాలేదు గాని యేసు మహిమాస్థితి పొందిన తరువాత అవి ఆయనను గురించి వ్రాసి ఉన్నవనీ వారు ఆయనపట్ల అలా జరిగించారనీ శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.
17 ఆయన లాజరును చనిపోయినవారిలో నుంచి లేపి సమాధినుంచి పిలిచినప్పుడు ఆయనతో ఉన్న ప్రజలు ఆయనను గురించిన సాక్ష్యం చెపుతూ వచ్చారు. 18 ఆయన ఈ సూచకమైన అద్భుతం చేశాడని వినడంచేత ఆ ప్రజలు ఆయనకు ఎదురు వెళ్ళారు.
19 అందుచేత పరిసయ్యులు తమలో తాము ఇలా చెప్పుకొన్నారు: “చూశారా, మీరు చేసినదానిలో నెగ్గినది ఏమీ లేదు. ఇదిగో, లోకమంతా ఆయన వెంట వెళ్ళింది.”
20 పండుగలో ఆరాధించడానికి వచ్చినవారిలో గ్రీసు దేశస్థులు కొందరు ఉన్నారు. 21 వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చారు (అతడు గలలీలోని బేత్‌సయిదా నివాసి). వారు “అయ్యా, యేసును చూడాలని మా ఆశ” అని అతణ్ణి కోరారు. 22 ఫిలిప్పు వచ్చి అంద్రెయకు చెప్పాడు. అంద్రెయ, ఫిలిప్పు యేసుకు చెప్పారు.
23 యేసు వారికిలా సమాధానం చెప్పాడు:
“మానవ పుత్రుడు మహిమాస్థితి పొందే గడియ వచ్చింది. 24 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిరిగానే ఉండిపోతుంది. అది చస్తే సమృద్ధిగా ఫలిస్తుంది. 25 తన ప్రాణం అంటే ప్రీతి ఉన్నవాడు దానిని పోగొట్టుకొంటాడు. కానీ ఈ లోకంలో ఉన్న తన ప్రాణం అంటే ద్వేషం ఉన్నవాడు దానిని శాశ్వత జీవంకోసం సంరక్షిస్తాడు.
26  “ఎవరైనా నాకు సేవ చేస్తే నన్ను అనుసరిస్తూ ఉండాలి. నేనెక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటారు. ఎవరైనా నాకు సేవ చేస్తే అతణ్ణి నా తండ్రి ఘనపరుస్తాడు. 27 ఇప్పుడు నా ప్రాణానికి ఆందోళనగా ఉంది. నేనేమి అనాలి? తండ్రీ, ఈ ఘడియ నుంచి నన్ను తప్పించు అనాలా? కానీ, నేను ఈ ఘడియకు వచ్చినది ఇందుకే. 28 తండ్రీ, నీ పేరుకు మహిమ చేకూర్చుకో!”
అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నేను దానికి మహిమ చేకూర్చుకొన్నాను, మళ్ళీ చేకూర్చుకొంటాను.”
29 అక్కడ నిలుచుండి అది విన్న జనం “ఉరిమింది” అన్నారు. ఇతరులు “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.
30 అందుకు యేసు “ఈ స్వరం వచ్చినది నాకోసం కాదు గాని మీకోసమే. 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు లోక పాలకుణ్ణి బయటికి త్రోసివేయడం జరుగుతుంది. 32 నన్ను భూమినుంచి పైకెత్తడం జరిగితే నేను నావైపుకు అన్ని జనాలనూ ఆకర్షించుకొంటాను” అన్నాడు. 33 ఆయన ఎలాంటి మరణానికి గురి కాబోతున్నాడో సూచించడానికి ఆ మాట చెప్పాడు.
34 ప్రజలు ఆయనకు జవాబిస్తూ “అభిషిక్తుడు ఎప్పటికీ మాతోనే ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మానవపుత్రుణ్ణి పైకెత్తడం జరగాల’ని మీరు అంటున్నారేం? అసలు ఈ మానవ పుత్రుడు ఎవరు?” అన్నారు.
35 అందుచేత యేసు వారితో ఇలా అన్నాడు: “మీ మధ్య వెలుగు ఉండేది ఇంకా కొంత కాలమే. చీకటి మిమ్ములను కమ్మకుండా వెలుగు మీ మధ్య ఉండగానే దానిలో నడుచుకోండి. చీకటిలో నడుస్తున్నవానికి తాను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో తనకు తెలియదు. 36 మీ మధ్య వెలుగు ఉండగానే మీరు వెలుగు సంతానం అయ్యేలా ఈ వెలుగును నమ్మండి.” ఈ సంగతులు చెప్పి యేసు వెళ్ళి వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొన్నాడు.
37 ఆయన వారి ఎదుట సూచనకోసమైన అద్భుతాలు ఇన్ని చేసినా వారు ఆయనమీద నమ్మకం ఉంచలేదు. 38 యెషయాప్రవక్త చెప్పిన వాక్కు నెరవేరేలా అది జరిగింది: “ప్రభూ, మేము తెలియజేసిన సమాచారం నమ్మినదెవరు? ప్రభు హస్తం ఎవరికి వెల్లడి అయింది?” 39 ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎందుకంటే, యెషయా ఇంకా ఇలా చెప్పాడు: 40 వారు తమ కండ్లతో చూడకుండా, తమ హృదయాలతో అర్థం చేసుకోకుండా, నావైపు తిరిగి నావల్ల బాగుపడకుండా ఆయన వారి కండ్లకు గుడ్డితనం కలిగించాడు, వారి హృదయాలను కఠిన పరిచాడు. 41 యెషయా యేసు మహిమ చూచి ఆయన విషయం చెప్పినప్పుడు ఈ విషయాలు అన్నాడు.
42 అయినా అధికారులలో కూడా అనేకులు ఆయనమీద నమ్మకం ఉంచారు గాని పరిసయ్యుల కారణంగా అది ఒప్పుకోలేదు. తమను సమాజ కేంద్రంనుంచి వెలివేయడం జరుగుతుందేమో అని భయపడ్డారు. 43 దేవుని మెప్పుకంటే మనుషుల మెప్పు వారికి ఎక్కువ ప్రీతిపాత్రమైనదన్న మాట.
44 అప్పుడు యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “నామీద నమ్మకం ఉంచేవాడు నామీద కాదు, నన్ను పంపినవాని మీద నమ్మకం ఉంచుతున్నాడు. 45 నన్ను చూచేవాడు నన్ను పంపినవాణ్ణి చూస్తున్నాడు. 46  నామీద నమ్మకం ఉంచేవారు చీకటిలో ఉండిపోకుండా నేను వెలుగుగా లోకానికి వచ్చాను. 47 నా మాటలు ఎవరైనా విని నమ్మకపోతే నేను వానికి తీర్పు చేయడం లేదు. లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు గాని లోకానికి విముక్తి కలిగించడానికే వచ్చాను. 48 నా మాటలు అంగీకరించక నన్ను నిరాకరించేవానికి తీర్పు తీర్చేది ఒకటి ఉంటుంది. చివరి రోజున వారికి తీర్పు తీర్చేది నేను చెప్పిన వాక్కే. 49 ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడలేదు. నేనేమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నన్ను ఆదేశించాడు. 50 ఆయన ఆదేశం శాశ్వత జీవమని నాకు తెలుసు. అందుచేత నేను ఏ సంగతులు చెప్పినా తండ్రి నాకు చెప్పినట్టే చెపుతున్నాను.”