11
1 బేతనీ గ్రామం వాడైన లాజరుకు జబ్బు చేసింది. ఆ గ్రామంలోనే మరియ, ఆమె సోదరి మార్త ఉండేవారు. 2  ఈ మరియ అత్తరుతో ప్రభువును అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాల తుడిచింది. జబ్బుగా ఉన్న లాజరు ఈమె సోదరుడు. 3 అందుచేత అక్కచెల్లెండ్లు యేసుకు ఇలా కబురంపారు: “ప్రభూ! నీవు ప్రేమతో చూచే వాడికి జబ్బు చేసింది.”
4 అది విని యేసు “ఆ రోగం రావడం మరణం కోసం కాదు గాని దాని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమకోసమే వచ్చింది” అన్నాడు.
5 యేసుకు మార్త, ఆమె సోదరి, లాజరు అంటే ప్రేమ. 6 అతడు జబ్బుగా ఉన్నాడని విని కూడా ఆయన ఉన్న చోట ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు. 7 ఆ తరువాత ఆయన శిష్యులతో అన్నాడు “యూదయకు తిరిగి వెళ్దాం, పదండి.”
8 శిష్యులు “గురువర్యా, ఇటీవలే యూదులు నీమీద రాళ్ళు రువ్వాలని చూశారు! తిరిగి అక్కడికి వెళ్తావా?” అని ఆయనతో అన్నారు.
9 యేసు ఇలా జవాబిచ్చాడు: “పగటికి ఉన్నవి పన్నెండు గంటలు గదా. ఎవరైనా పగటివేళ నడిస్తే అతనికి ఈ లోకం వెలుగు కనిపిస్తుంది గనుక తడబడడం అంటూ ఉండదు. 10 కానీ రాత్రివేళ నడిచేవాడిలో వెలుగు లేకపోవడంచేత తడబడుతాడు.”
11 ఇలా చెప్పిన తరువాత ఆయన “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి మేల్కొలపడానికి వెళ్తాను” అని వారితో చెప్పాడు.
12 అందుకు శిష్యులు “ప్రభూ! అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడుతాడు” అన్నారు.
13 యేసు అతని మృతిని గురించి అలా చెప్పాడు గాని సహజమైన నిద్ర వల్ల కలిగే విశ్రాంతిని గురించి ఆయన చెప్పాడని వారనుకొన్నారు. 14 కనుక యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు:
“లాజరు చనిపోయాడు. 15 నేను అక్కడ లేనందుచేత సంతోషిస్తూ ఉన్నాను. ఈ సంతోషం మీ మేలు విషయమే. అంటే మీకు నమ్మకం కుదరాలని నా ఉద్దేశం. అతనిదగ్గరకు వెళ్దాం, పదండి.” 16 అప్పుడు తోమా (అతణ్ణి ‘దిదుమ’ అని కూడా అంటారు) సాటి శిష్యులతో అన్నాడు “ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం.”
17 యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు. 18 బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. 19 కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు. 20 యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది. 21 మార్త యేసుతో ఇలా అంది:
“ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. 22 ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
23 యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
24 “చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
25  అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26  బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
27 ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
28 ఇలా చెప్పి ఆమె వెళ్ళి తన సోదరి మరియను పిలిచి రహస్యంగా “గురువుగారు వచ్చి నిన్ను పిలుస్తున్నారు” అంది. 29 ఆమె ఆ మాట విని గబాలున లేచి ఆయన దగ్గరికి తరలివెళ్ళింది. 30 యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్త తనకు ఎదురు వచ్చిన స్థలంలోనే ఉన్నాడు. 31 ఇంటిలో మరియతో కూడా ఉన్న యూదులు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. మరియ గబాలున లేచి బయటికి వెళ్ళడం చూచినప్పుడు ఆమె సమాధి దగ్గర ఏడ్వడానికి వెళ్తుందని చెప్పి ఆమె వెంట వెళ్ళారు. 32  యేసు ఉన్న స్థలానికి మరియ చేరి ఆయనను చూచి ఆయన పాదాలదగ్గర సాగిలపడి “ప్రభూ! ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు” అంది.
33 ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడ్వడం యేసు చూచి ఆందోళన చెంది ఆత్మలో పరితపిస్తూ ఇలా అన్నాడు: 34 “అతణ్ణి మీరెక్కడ ఉంచారు?” వారు “ప్రభూ, వచ్చి చూడండి” అని ఆయనతో అన్నారు.
35 యేసు కన్నీళ్ళు విడిచాడు. 36 అందువల్ల యూదులు “ఇదిగో అతడంటే ఈయనకు ఎంత ప్రేమో చూశారా!” అని చెప్పుకొన్నారు.
37  అయితే వారిలో కొంతమంది “ఆ గుడ్డివాడి కండ్లు తెరిచిన ఈ మనిషి లాజరు చావకుండా చేయలేక పోయేవాడా?” అన్నారు.
38 మళ్ళీ తనలో పరితపిస్తూ యేసు సమాధి దగ్గరికి వచ్చాడు. అది గుహ. దానిమీద బండ ఉంది. 39 యేసు “బండ తీసివేయండి” అన్నాడు. చనిపోయినవాని సోదరి మార్త “ప్రభూ, అతడు నాలుగు రోజులు నిర్జీవంగా ఉన్నాడు, గనుక కంపుకొడుతుంది” అని ఆయనతో చెప్పింది.
40  యేసు “నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో అనలేదా?” అని ఆమెతో అన్నాడు.
41 అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ! నా ప్రార్థన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 42 నీవు ఎప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను.”
43 ఇలా చెప్పి ఆయన “లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.
44 చనిపోయినవాడు బయటికి వచ్చాడు. సమాధి కట్లు అతని కాళ్ళకూ చేతులకూ కట్టి ఉన్నాయి. అతని ముఖానికి రుమాలు చుట్టివేసి ఉంది. యేసు వారితో “ఆ కట్లు విప్పి అతణ్ణి వెళ్ళనియ్యండి” అన్నాడు.
45 ఈ కారణంగా, మరియ దగ్గరికి వచ్చిన యూదులలో అనేకులు ఆయన చేసినవి చూచి ఆయనమీద నమ్మకం ఉంచారు.
46 కానీ వారిలో మరి కొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసు చేసినది వారికి తెలియజేశారు. 47 కనుక ప్రధాన యాజులూ పరిసయ్యులూ సమాలోచన సభను సమకూర్చారు. అప్పుడు వారు ఇలా చెప్పుకొన్నారు:
“ఈ మనిషి అనేక సూచకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు గానీ మనం ఏం చేయాలి? 48 మనం ఇలాగే అతణ్ణి చేయనిస్తే అందరూ అతణ్ణి నమ్ముతారు. అప్పుడు రోమ్ వాళ్ళు వచ్చి మన స్థలాన్నీ దేశాన్నీ పూర్తిగా స్వాధీనం చేసుకొంటారు.”
49 వారిలో ఒకడు కయప. అతడు ఆ సంవత్సరం ప్రముఖ యాజి. అతడు వారితో అన్నాడు “మీకేమీ తెలీదు. 50 సర్వజాతి నాశనం కాకుండా ప్రజలకోసం ఒకే మనిషి చావడం మనకు మేలని మీరు ఆలోచించరు.”
51 ఈ మాట తనంతట తానే చెప్పలేదు గానీ ఆ సంవత్సరం అతడు ప్రముఖ యాజి అయి ఉండి యేసు ఆ ప్రజకోసం చనిపోతాడని భవిష్యద్వాక్కు పలికాడు. 52 ఆ ప్రజకోసమే కాదు గాని బయట చెదరి ఉన్న దేవుని పిల్లలందరినీ ఆయన ఒకటిగా సమకూరుస్తాడని కూడా భవిష్యద్వాక్కు పలికాడు. 53 అందుచేత ఆ రోజునుంచి ఆయనను చంపడానికి వారు కుట్ర పన్నుతూ వచ్చారు. 54 కాబట్టి యేసు అప్పటినుంచి యూదులలో బహిరంగంగా సంచరించలేదు గాని అక్కడనుంచి ఎడారి దగ్గర ఉన్న ప్రాంతానికి, ఎఫ్రాయిం అనే ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ తన శిష్యులతోకూడా ఆగాడు. 55 యూదుల పస్కా పండుగ దగ్గర పడింది గనుక పస్కా పండుగకు మునుపు తమను శుద్ధి చేసుకోవడానికి చాలామంది పల్లెటూళ్ళనుంచి జెరుసలం వెళ్ళారు. 56 వారు యేసును వెతుకుతూ దేవాలయంలో నిలుచుండి ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఆయన పండుగకు రానే రాడా? ఏమనుకొంటున్నారు?” 57 అయితే ప్రధాన యాజులూ పరిసయ్యులూ ఆయనను పట్టుకోవాలని ఆయన ఎక్కడ ఉన్నది తెలిసినవారెవరైనా తమకు తెలియజేయాలని ఆజ్ఞ జారీ చేశారు.