10
1 ✽“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ద్వారంగుండా రాక వేరే విధంగా ఎక్కి వచ్చేవాడు దొంగ, దోపిడీగాడు. 2 ✽ద్వారంగుండా లోపలికి వచ్చేవాడు గొర్రెల కాపరి. 3 ✽ ద్వారపాలకుడు ఆయనకు తలుపు తెరుస్తాడు. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు, బయటికి నడిపిస్తాడు. 4 ✽తన సొంత గొర్రెలను బయటికి తెచ్చినప్పుడు తాను వాటికి ముందు నడుస్తాడు. ఆ గొర్రెలకు ఆయన స్వరం తెలుసు గనుక అవి ఆయన వెంట వెళ్తాయి. 5 పరాయివారి✽ స్వరం వాటికి తెలియదు గనుక పరాయివాని వెంట వెళ్ళనే వెళ్ళవు. అసలు, అతని దగ్గర నుంచి పారిపోతాయి.”6 ✽ఈ ఉదాహరణ యేసు వారితో చెప్పాడు గాని తమతో ఆయన చెప్పినవేవో వారికి అర్థం కాలేదు. 7 అందుచేత యేసు వారితో మళ్ళీ ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గొర్రెలకు నేనే ద్వారాన్ని✽. 8 నాకు ముందుగా✽ వచ్చినవారంతా దొంగలు, దోపిడీదారులు. గొర్రెలు వారి మాట వినలేదు. 9 నేను ద్వారాన్ని. నాద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ✽ లభిస్తుంది. అతడు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ మేత కనుక్కొంటాడు. 10 దొంగ✽ వచ్చే కారణం దొంగతనం, హత్య, నాశనం చేయడానికే. మనుషులకు జీవం కలగాలనీ అది సమృద్ధిగా కలగాలనీ నేను వచ్చాను. 11 ✽నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకోసం తన ప్రాణం ధారపోస్తాడు. 12 జీతగాడు✽ కాపరి కాడు. గొర్రెలు అతనివి కావు గనుక తోడేలు✽ రావడం చూశాడంటే గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వాటిని పట్టుకొంటుంది, చెదరగొట్టివేస్తుంది. 13 జీతగాడు జీతగాడే గనుక పారిపోతాడు – గొర్రెల క్షేమం అంటే అతనికేమి పట్టదు.
14 ✽“నేను మంచి కాపరిని. నాకు నా గొర్రెలు తెలుసు, నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15 తండ్రికి నేను తెలుసు. అలాగే నాకు తండ్రి తెలుసు. నా గొర్రెలకోసం నా ప్రాణం ధారపోస్తాను. 16 ✽ఈ దొడ్డిలో లేని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఒకే మంద ఉంటుంది, ఒకే కాపరి✽ ఉంటాడు. 17 ✽నా ప్రాణం మళ్ళీ తీసుకొనేలా దానిని ధారపోస్తాను, గనుక నేనంటే నా తండ్రికి ప్రేమ. 18 ✽నా నుంచి నా ప్రాణం ఎవరూ తీయరు. నా అంతట నేనే దానిని ధారపోస్తాను. దానిని ధారపోయడానికీ దానిని మళ్ళీ తీసుకోవడానికీ నాకు అధికారం ఉంది. నా తండ్రి నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు.”
19 ✝ఆ మాటల కారణంగా యూదులలో మళ్ళీ విభేదం పుట్టింది. 20 ✽ వారిలో చాలామంది ఇలా అన్నారు: “అతడు దయ్యం పట్టినవాడు, పిచ్చివాడు. అతడు మాట్లాడితే మీరు ఎందుకు వింటున్నారు?” 21 ✽మరి కొందరైతే “అతడివి దయ్యం పట్టినవాడి మాటలు కావు. దయ్యం గుడ్డివాళ్ళ కండ్లు తెరవగలదా ఏమిటి?” అన్నారు.
22 ✽అప్పుడు జెరుసలంలో ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. 23 అది చలికాలం. యేసు దేవాలయంలో ఉన్న ‘సొలొమోను మంటపం’లో నడుస్తున్నాడు. 24 యూదులు ఆయన చుట్టూ పోగై ఆయనతో “ఎంతవరకు మమ్మల్ని ఇలా అనుమానంలో ఉంచుతావు? నీవే అభిషిక్తుడివి✽ గనుక అయితే మాకు తేటగా చెప్పు!” అన్నారు.
25 ✽యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీకు చెప్పాను గానీ మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేర నేను చేస్తూ ఉన్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. 26 ✝అయితే మీరు నమ్మడం లేదు. ఎందుకంటే నేను మీతో చెప్పినట్టే మీరు నా గొర్రెలు కారు. 27 ✽నా గొర్రెలు నా స్వరం వింటారు. వారు నాకు తెలుసు. వారు నన్ను అనుసరిస్తారు. 28 నేను వారికి శాశ్వత జీవం✽ ఇస్తూ ఉన్నాను. వారు ఎన్నడూ నశించరు✽. వారిని నా చేతిలో నుంచి✽ ఎవరూ ఎత్తుకుపోరు. 29 ✽వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి చేతిలోనుంచి వారిని ఎవరూ ఎత్తుకుపోలేరు. 30 ✽నేను, నా తండ్రి ఒకటే.”
31 ✝యూదులు మళ్ళీ ఆయన మీద రువ్వడానికి రాళ్ళు చేతపట్టుకొన్నారు. 32 ✽అయితే యేసు “నా తండ్రి నుంచి అనేక మంచి పనులు నేను మీకు చూపాను. ఆ పనుల్లో దేని కారణంగా మీరు నామీద రాళ్ళు రువ్వుతున్నట్టు?” అని వారికి బదులు చెప్పాడు.
33 “మంచి పనికి కాదు గానీ దేవదూషణకే మేము నీ మీద రాళ్ళు రువ్వుతాం. నీవు మనిషివే అయినా నిన్ను దేవుడుగా చేసుకుంటున్నందుకే” అని యూదులు ఆయనకు బదులు చెప్పారు.
34 ✽ యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీ ధర్మశాస్త్రంలో ‘మీరు దేవుళ్ళని నేను గదా చెప్పాను’ అని వ్రాసి ఉంది గదా. 35 ✽లేఖనం అర్థ రహితం కానే కాదు. దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వచ్చిందో ఆయన వారిని దేవుళ్ళు అన్నాడూ అంటే, 36 ✽తండ్రి ప్రత్యేకించి లోకానికి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని చెప్పినందుచేత ‘నీవు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా? 37 ✽నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి. 38 అవి నేను చేస్తూ ఉంటే, నన్ను నమ్మకపోయినా తండ్రి నాలో ఉన్నాడనీ నేను తండ్రిలో ఉన్నాననీ మీరు తెలుసుకొని నమ్మేలా ఆ క్రియలే నమ్మండి.”
39 ✽మరోసారి వారు ఆయనను పట్టుకోవడానికి చూశారు గానీ ఆయన వారి చేతికి చిక్కకుండా వెళ్ళాడు. 40 ✽ అప్పుడాయన యొర్దాను అవతలికి, యోహాను మొట్టమొదట బాప్తిసం ఇచ్చిన స్థలానికి తిరిగి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు.
41 చాలామంది ఆయన దగ్గరికి వచ్చి “యోహాను అద్భుతమైన సూచన ఏదీ చేయలేదు గాని ఈయన విషయం అతడు చెప్పినదంతా✽ నిజమే” అని చెప్పుకొన్నారు. 42 ✽అక్కడ చాలామంది ఆయనమీద నమ్మకం ఉంచారు.