9
1 ఆయన దారిన వెళ్తూ ఉన్నప్పుడు పుట్టు గుడ్డివాడు ఒకడు ఆయనకు కనబడ్డాడు. 2 ఆయన శిష్యులు “గురువర్యా! ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు అపరాధం చేశారు? ఇతడా, ఇతడి తల్లిదండ్రులా?” అని ఆయననడిగారు. 3 యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతడు లేదా ఇతని తల్లిదండ్రులు అపరాధం చేసినందుకు కాదు, గానీ దేవుని క్రియలు ఇతని మూలంగా వెల్లడి కావాలని. 4  పగలు ఉన్నంతవరకూ నన్ను పంపినవాని క్రియలు నేను చేస్తూ ఉండాలి. రాత్రి వస్తూ ఉంది. అప్పుడు ఏ మనిషీ పని చేయలేడు. 5 లోకంలో ఉన్నంతవరకూ నేను లోకానికి వెలుగును.” 6 ఈ విధంగా చెప్పి ఆయన నేలపై ఉమ్మివేసి దానితో బురద చేసి గుడ్డివాని కండ్లకు ఆ బురద పూశాడు, 7 “వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కో!” అని అతనితో అన్నాడు. (సిలోయం అంటే పంపబడిన వాడని తర్జుమా.) అతడు వెళ్ళి కడుక్కొని చూస్తూ తిరిగి వచ్చాడు.
8 అందుచేత ఇరుగుపొరుగువారు, మునుపు అతడు గుడ్డివాడని చూచినవారు “వీడు మునుపు కూచుని బిచ్చమడుక్కొనేవాడు కాడా?” అని అడిగారు.
9 కొంతమంది “అవును వాడే”, మరి కొంతమంది “వాణ్ణి పోలినవాడే” అన్నారు. అతడు “నేనే అతణ్ణి” అని చెపుతూ వచ్చాడు.
10 అందుచేత వారు “నీ కండ్లు తెరవబడినదెలా?” అని అతణ్ణి అడిగారు.
11 అతడు “యేసు అనే మనిషి బురద చేసి నా కండ్లకు పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. అలాగే వెళ్ళి కడుక్కొన్నాను, చూపు వచ్చింది” అని బదులు చెప్పాడు.
12 “అతడు ఎక్కడున్నాడు?” అని వారు అతణ్ణి అడిగినప్పుడు అతడు “నాకు తెలీదు” అన్నాడు.
13 మునుపు గుడ్డివాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. 14 యేసు బురద చేసి అతని కండ్లు తెరిచిన రోజు విశ్రాంతి దినం. 15 కనుక పరిసయ్యులు కూడా అతనికెలా చూపు వచ్చిందని మళ్ళీ అతణ్ణి అడిగారు.
వారితో అతడు “ఆయన బురద నా కండ్లకు రాశాడు. నేను కడుక్కొన్నాను. ఇప్పుడు చూస్తూ ఉన్నాను” అన్నాడు.
16 కనుక పరిసయ్యులలో కొంతమంది “ఆ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాడు. ఎందుకంటే అతడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు” అన్నారు. మరి కొందరైతే “పాపాత్ముడైన మనిషి ఇలాంటి సూచకమైన అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఇలా వారి మధ్య భేదం ఉంది. 17 అందుచేత వారు మళ్ళీ ఆ గుడ్డివాణ్ణి ప్రశ్నించారు – “అతడు నీ కండ్లు తెరచినందుకు అతడి విషయం నీవేం అంటావు?” అతడు “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18 అతడు మునుపు గుడ్డివాడనీ చూపు పొందాడనీ యూదులు అతని విషయం మొట్టమొదట నమ్మలేదు గనుక చూపు వచ్చినవాని తల్లిదండ్రులను పిలిచి 19 “మీ కొడుకు గుడ్డివాడుగా పుట్టాడంటారు. వీడు మీ కొడుకా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడు?” అని వారిని అడిగారు.
20 అందుకు అతని తల్లిదండ్రులు వారికిలా జవాబిచ్చారు: “ఇతడు మా కొడుకనీ గుడ్డివాడుగా పుట్టాడనీ మాకు తెలుసు. 21 గానీ ఇతడు ఇప్పుడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడో మాకు తెలియదు. అతడి కండ్లు తెరచినది ఎవరో అది కూడా మాకు తెలియదు. ఇతడు వయసు వచ్చినవాడు. ఇతణ్ణే అడగండి. తన సంగతి తానే చెప్పుకొంటాడు.”
22 అతని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకంటే, యేసు అభిషిక్తుడని ఎవరైనా సరే ఒప్పుకొంటే వారిని సమాజ కేంద్రంనుంచి వెలివేయడం జరుగుతుందని ఇంతకుముందే యూదులు నిర్ణయించారు. 23 ఈ కారణంచేతే అతని తల్లిదండ్రులు “ఇతడు వయసు వచ్చినవాడు, ఇతణ్ణే అడగండి” అన్నారు.
24 కనుక మునుపు గుడ్డివాడుగా ఉన్నవాణ్ణి వారు రెండో సారి పిలిచి అతనితో “దేవునికి మహిమ కలిగించు! ఆ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు” అన్నారు. 25 అందుకతడు జవాబిస్తూ “పాపాత్ముడో కాడో నాకు తెలీదు. ఒకటే నాకు తెలుసు. మునుపు గుడ్డివాణ్ణి, ఇప్పుడైతే చూస్తూ ఉన్నాను.”
26 అందుకు వారు “అతడు నీకు ఏం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని అతణ్ణి మళ్ళీ అడిగారు.
27 అతడు “అప్పుడే మీతో చెప్పాను గాని మీరు చెవిని పెట్టలేదు. ఎందుకు మళ్ళీ వినాలని ఉన్నారు? ఆయన శిష్యులు కావడానికి మీకు కూడా ఇష్టం ఉందా?” అని వారికి జవాబిచ్చాడు.
28 అప్పుడు వారు అతణ్ణి దూషించి అన్నారు “అతడి శిష్యుడివి నీవే. మేము మోషే శిష్యులం. 29 మోషేతో దేవుడు మాట్లాడాడని మాకు తెలుసు. ఈ మనిషైతే ఎక్కడనుంచి వచ్చాడో తెలీదు.”
30 అతడు వారికిలా జవాబిచ్చాడు: “ఓహో! ఇది వింతగా ఉందే! ఆయన నా కండ్లు తెరిచినా ఆయన ఎక్కడనుంచి వచ్చాడో మీకు తెలియదు! 31 దేవుడు పాపాత్ముల ప్రార్థనలు వినడని మనకు తెలుసు! ఎవడైనా దేవుని భక్తుడై ఆయన ఇష్టప్రకారం చేసేవాడి ప్రార్థనలే దేవుడు వింటాడు. 32 పుట్టు గుడ్డివాడి కండ్లు ఎవరైనా తెరిచిన విషయం లోకం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి ఎన్నడూ వినబడలేదు. 33 ఈ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాకపోతే ఏమీ చేయలేడు, అంతే.
34 ఇది అతనికి వారు చెప్పిన జవాబు: “నీవు పుట్టుకతోనే కేవలం పాపివి. మాకు ఉపదేశం చేస్తావేమిటి!” అప్పుడు వారు అతణ్ణి వెలివేశారు.
35  వారతణ్ణి వెలివేశారని విని యేసు అతణ్ణి కనుక్కొని “దేవుని కుమారుని మీద నీకు నమ్మకం ఉందా?” అని అడిగాడు. 36 అతడు “స్వామీ, ఆయన మీద నేను నమ్మకం ఉంచాలంటే ఆయన ఎవరండి?” అని అడిగాడు. 37  యేసు అతనితో అన్నాడు “నీవు ఆయనను చూశావు. నీతో మాట్లాడుతూ ఉన్నవాడు ఆయనే.” 38 అతడు “నేను నమ్ముతూ ఉన్నాను, స్వామీ!” అంటూ ఆయనను ఆరాధించాడు.
39 యేసు “చూడనివారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు జరగాలని నేను లోకంలోకి వచ్చాను” అన్నాడు.
40 ఆయనదగ్గర ఉన్న కొందరు పరిసయ్యులు ఆ మాటలు విని “మేము కూడా గుడ్డివాళ్ళమా?” అని ఆయననడిగారు.
41 యేసు వారితో “మీరు గుడ్డివారై ఉంటే మీకు పాపం ఉండేది కాదు గాని ‘చూస్తూ ఉన్నాం’ అని మీరిప్పుడు అంటున్నారు, గనుక మీ పాపం నిలిచి ఉంది” అన్నాడు.