8
1 అయితే యేసు ఆలీవ్‌కొండకు వెళ్ళాడు. 2 ప్రొద్దున పెందలకడ ఆయన దేవాలయంలోకి తిరిగి వచ్చాడు. ఆయన దగ్గరికి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకువచ్చారు. ఆమె వ్యభిచార క్రియలో పట్టుబడింది. వారు ఆమెను మధ్యలో నిలబెట్టి 4 ఆయనతో ఇలా అన్నారు: “ఉపదేశకా! ఈ స్త్రీ వ్యభిచార క్రియలో ఉండగానే పట్టుబడింది. 5 ధర్మశాస్త్రంలో మోషే ఇలాంటి స్త్రీలను రాళ్ళు రువ్వి చంపాలని మనకాజ్ఞ ఇచ్చాడు. అయితే మీరేమంటారు?”
6 ఆయనమీద నేరం మోపడానికి కారణం కనుక్కోవాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. అయితే యేసు తాను ఆలకించనట్టు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు. 7 వారు పట్టు విడువకుండా ఆయనను అడుగుతూ వచ్చారు గనుక ఆయన లేచి “మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు” అన్నాడు. 8 అప్పుడాయన మళ్ళీ వంగి నేలమీద వ్రాశాడు.
9 ఆ మాటలు విన్నవారు తమ అంతర్వాణి మందలింపుకు గురి అయి – మొదట పెద్దలు నుండి చివరివాడి వరకు – ఒకరి తరువాత ఒకరు బయటికి వెళ్ళారు. చివరికి మధ్య నిలబడి ఉన్న ఆ స్త్రీతో మిగిలినది యేసు ఒక్కడే.
10 యేసు లేచి ఆ స్త్రీ తప్ప మరెవరినీ చూడకుండా “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ? ఎవరూ నీకు శిక్ష విధించలేదా?” అని అడిగాడు. 11  ఆమె “లేదు ప్రభూ” అంది. యేసు “నేనూ నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి అపరాధం చేయకుండా ఉండు” అన్నాడు.
12 తరువాత యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును. నన్ను అనుసరిస్తూ ఉన్నవారు చీకటిలో నడవరు గాని వారికి జీవ కాంతి ఉంటుంది.”
13 అందుచేత పరిసయ్యులు “నీ విషయం నీవే సాక్ష్యం చెప్పుకొంటూ ఉన్నావు. నీ సాక్ష్యం నిజం కాదు” అని ఆయనతో అన్నారు.
14 యేసు వారికిలా జవాబు చెప్పాడు: “నా విషయం నేను సాక్ష్యం చెప్పుకొన్నా నా సాక్ష్యం నిజమే. ఎందుకంటే, నేను వచ్చినది ఎక్కడనుంచో, వెళ్ళేది ఎక్కడికో నాకు తెలుసు. అయితే నేను ఎక్కడనుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్ళిపోతానో మీకు తెలియదు. 15 మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేనెవరికీ తీర్పు తీర్చడం లేదు. 16 ఒక వేళ నేను తీర్పు తీర్చినా నా తీర్పు నిజమైనది. ఎందుకంటే అందులో నేను ఒంటరిగా లేను. నేనూ నన్ను పంపిన తండ్రీ ఉన్నాం. 17  ఇద్దరు మనుషుల సాక్ష్యం నమ్మతగినదని మీ ధర్మశాస్త్రంలో కూడా వ్రాసి ఉంది. 18 నా విషయం నేను సాక్ష్యం చెపుతున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా నా విషయం సాక్ష్యం చెపుతున్నాడు.”
19  అందుకు వారు “నీ తండ్రి ఎక్కడున్నాడు?” అని ఆయననడిగారు.
యేసు “మీరు నన్ను ఎరుగరు, నా తండ్రిని కూడా ఎరుగరు. ఒకవేళ నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉండేవారు” అని జవాబిచ్చాడు.
20 దేవాలయంలో కానుకలు ఉంచే స్థలంలో ఆయన ఉపదేశం చేస్తూ ఆ మాటలు చెప్పాడు. అయితే ఆయన గడియ ఇంకా రాకపోవడం చేత ఆయనను ఎవరూ పట్టుకోలేదు. 21  గనుక ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు:
“నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను వెతుకుతారు గాని మీ పాపాలలోనే చనిపోతారు. నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.”
22  అందుకు యూదులు “ఇతడు ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి? ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు’ అని ఇతడు చెప్పడం అందుకేనా?” అని చెప్పుకొన్నారు.
23 ఆయన “మీరు క్రిందివారు, నేను పైనుంచి వచ్చినవాణ్ణి. మీరు ఈ లోకానికి చెందినవారు, నేను ఈ లోకానికి చెందేవాణ్ణి కాను. 24 అందుచేత మీరు మీ పాపాలలో చనిపోతారని చెప్పాను. నేను ‘ఉన్నవాడను’ అని నమ్మకపోయారా, మీరు మీ పాపాలలోనే చనిపోతారు” అని వారితో అన్నాడు.
25 అందుకు వారు “నీవెవరివి?” అని ఆయననడిగారు. యేసు వారితో అన్నాడు “మొదటినుంచి నేనెవరినని చెపుతున్నానో ఆయననే నేను. 26 మీ విషయం చెప్పడానికీ విమర్శించడానికీ ఇంకా అనేక సంగతులున్నాయి. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన చెప్పగా నేను విన్న సంగతులే లోకానికి చెపుతూ ఉన్నాను.”
27 దేవుడైన తండ్రిని గురించి ఆయన తమతో చెపుతున్నాడని వారు గ్రహించలేదు.
28 కనుక యేసు వారితో “మీరు మానవపుత్రుణ్ణి పైకెత్తేటప్పుడు నేను ‘ఉన్నవాడను’ అని మీరు గ్రహిస్తారు. నా అంతట నేనే ఏమీ చేయడం లేదనీ తండ్రి నాకు నేర్పిన విషయాలే చెపుతున్నాననీ కూడా గ్రహిస్తారు. 29 నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. ఆయనకు ఇష్టమైనవే నేనెప్పుడూ చేస్తూ ఉన్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు” అన్నాడు.
30 ఈ మాటలు చెపుతూ ఉండగానే ఆయనమీద చాలామంది నమ్మకం ఉంచారు.
31 అందుచేత, తనను నమ్మిన యూదులతో యేసు ఇలా అన్నాడు: “మీరు నా వాక్కులో నిలిచి ఉంటే నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు. 32 అప్పుడు మీరు సత్యం గ్రహిస్తారు, సత్యం మీకు విడుదల కలిగిస్తుంది.”
33  అయితే వారు “మేము అబ్రాహాము సంతానం. మేమెప్పుడు ఎవరికీ బానిసలం కాము. మాకు విడుదల కలుగుతుందని అంటావేం?” అని ఆయనకు జవాబు చెప్పారు.
34 యేసు వారికిలా బదులు చెప్పాడు: “పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిస అని మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. 35 బానిస యజమాని ఇంట్లో ఎల్లప్పుడూ ఉండడు గానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లో ఉంటాడు. 36 కనుక కుమారుడు మిమ్ములను విడుదల చేస్తేనే మీరు నిజంగా విడుదల పొందినవారై ఉంటారు. 37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. కానీ నా మాటలకు మీలో చోటు లేదు గనుక నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. 38 నా తండ్రి దగ్గర చూచిన విషయాలే చెపుతూ ఉన్నాను. మీ తండ్రి దగ్గర చూచిన విషయాలు మీరూ చేస్తున్నారు.”
39 అందుకు వారు ఆయనకు “అబ్రాహాము మా తండ్రి” అన్నారు.
యేసు “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము క్రియలు చేస్తారు. 40 అయితే దేవుడు చెప్పగా నేను విన్న సత్యం మీకు చెప్పిన మనిషినయిన నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు. అబ్రాహాము ఇలా చేయలేదే! 41 మీరు మీ తండ్రి క్రియలే చేస్తూ ఉన్నారు” అని వారితో చెప్పాడు.
ఆయనతో వారు “మేము వ్యభిచారం మూలంగా పుట్టలేదు. మాకు తండ్రి ఒక్కడే. ఆయన దేవుడే” అన్నారు.
42 యేసు వారితో అన్నాడు “దేవుడే గనుక మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమతో చూచేవారే. ఎందుకంటే, నేను దేవుని దగ్గరనుంచి బయలుదేరి వచ్చాను. నా అంతట నేనే రాలేదు. ఆయన నన్ను పంపాడు. 43 నేను చెప్పేది మీరు ఎందుకు గ్రహించరు? నా మాట వినలేకపోవడమే దానికి కారణం. 44  మీరు మీ తండ్రి అపనింద పిశాచానికి చెందినవారు. మీ తండ్రి ఇచ్ఛల ప్రకారం జరిగించాలని కోరుతూ ఉన్నారు. మొదటినుంచి వాడు హంతకుడు, సత్యంలో నిలవనివాడు. సత్యం వాడిలో బొత్తిగా లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి. వాడు అబద్ధం చెప్పినప్పుడెల్లా వాడి సొంత స్వభావంలోనుంచి చెపుతాడు. 45 నేనైతే సత్యం చెప్పినందుచేతే మీరు నన్ను నమ్మడం లేదు. 46 నేను దోషినని మీలో ఎవరు నిరూపించగలరు? నేను మీకు సత్యం చెపుతూ ఉంటే నన్ను నమ్మరేమిటి? 47 దేవునికి చెందినవాడు దేవుని మాటలు వింటాడు. మీరు దేవునికి చెందినవారు కారు. అందుచేతే మీరు వాటిని వినడం లేదు.”
48 యూదులు ఆయనకు “నీవు సమరయ దేశస్థుడివి, దయ్యం పట్టినవాడివి అని మేము చెప్పేది సరిగానే ఉంది గదా!” అని జవాబిచ్చారు.
49 యేసు “దయ్యం పట్టినవాణ్ణి కాను, నా తండ్రిని గౌరవించేవాణ్ణే. మీరైతే నన్ను అవమానానికి గురి చేస్తున్నారు. 50 నాకు గౌరవం చేకూరాలని నేను వెతకడం లేదు. వెతికేవాడు, తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. 51  మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట ఆచరించేవాడెవడైనా ఎన్నడూ మరణం చూడడు” అని సమాధానం చెప్పాడు.
52 యూదులు “నీవు దయ్యం పట్టినవాడివని మాకిప్పుడు తెలుసు. అబ్రాహాము చనిపోయాడు, ప్రవక్తలూ చనిపోయారు. నీవైతే ‘నా మాట ఆచరించేవాడెవడైనా ఎన్నడూ మరణం రుచి చూడడని చెపుతున్నావు. 53 చనిపోయిన మా తండ్రి అబ్రాహాము కంటే గొప్పవాడివా నీవు? ప్రవక్తలు కూడా చనిపోయారు. ఇంతకూ నీవు ఎవరివైనట్టు చెప్పుకొంటున్నావు?” అని ఆయనతో అన్నారు.
54 యేసు ఇలా బదులు చెప్పాడు: “నాకు నేనే ఘనత కలిగించుకొంటే నా ఘనత వట్టిది. నాకు ఘనత కలిగించేవాడు నా తండ్రి. ఆయనను ఉద్దేశించి మీరు ‘మా దేవుడు’ అంటారు. 55  కానీ ఆయనను మీరెరుగరు. నేనాయనను ఎరుగుదును. ఆయననెరగనని నేను చెపితే మీలాగే అబద్ధం చెప్పేవాణ్ణే అవుతాను. నేనాయనను ఎరుగుదును, ఆయన మాట ఆచరిస్తూ ఉన్నాను. 56 నా రోజు చూడడం మీ తండ్రి అబ్రాహాముకు ఆనందం. అతడు అది చూచి సంతోషించాడు.”
57 అందుకు యూదులు ఆయనతో “నీకింకా యాభైయేళ్ళయినా లేవే! నీవు అబ్రాహామును చూశావా?” అన్నారు.
58 యేసు “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, అబ్రాహాము ఉండే ముందే నేను ‘ఉన్నవాడను’” అని వారికి చెప్పాడు.
59  అందుచేత వారు ఆయనమీద రువ్వడానికి రాళ్ళు ఎత్తారు గాని యేసు తనను మరుగు చేసుకొని వారి మధ్య గుండా దాటుతూ దేవాలయం నుంచి బయటికి వెళ్ళాడు.