7
1 ✽ ఆ తరువాత యేసు గలలీలో సంచారం చేస్తూ ఉన్నాడు. యూదులు తనను చంపడానికి చూస్తూ ఉండడంచేత ఆయనకు యూదయలో సంచారం చేయడం ఇష్టం లేకపోయింది. 2 ✽ అయితే యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడ్డప్పుడు 3 ✽ఆయన తమ్ముళ్ళు ఆయనతో ఇలా అన్నారు: “నువ్వు చేస్తూ ఉన్న పనులు నీ శిష్యులు చూచేట్టు ఇక్కడనుండి యూదయకు వెళ్ళిపో. 4 ఎవడైనా బహిరంగంగా ప్రసిద్ధికెక్కాలంటే రహస్యంగా పనులు జరిగించడు. నువ్వు ఈ పనులు చేస్తూ ఉంటే నిన్ను నువ్వు లోకానికి కనపరచుకో!” 5 ఎందుకంటే, ఆయన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన మీద నమ్మకం ఉంచలేదు.6 ✽అందుచేత యేసు వారికిలా చెప్పాడు: “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధమే. 7 ✽లోకం మిమ్ములను ద్వేషించడం అసాధ్యం. కానీ నేను దాని క్రియలు చెడ్డవని దానిని గురించి సాక్ష్యం చెపుతూ ఉన్నాను, గనుక దానికి నా మీద ద్వేషం ఉంది. 8 మీరు ఈ పండుగకు వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్తి కాలేదు గనుక ఇప్పుడే ఈ పండుగకు వెళ్ళను.”
9 ఆయన వారికిలా చెప్పిన తరువాత గలలీలో ఉండిపోయాడు. 10 ✽ఆయన తమ్ముళ్ళు పండుగకు వెళ్ళిన తరువాతే ఆయన కూడా వెళ్ళాడు – బహిరంగంగా కాదు గాని రహస్యంగా. 11 ✽ఆ పండుగలో యూదులు “ఆయనెక్కడ ఉన్నాడు?” అని అడుగుతూ ఆయనను వెతుకుతూ ఉన్నారు. 12 ✽ప్రజలలో ఆయనను గురించి చాలా సణుగుడు ఉంది. కొంతమంది “ఆయన మంచివాడు” అన్నారు, మరి కొందరు “కాదు. ప్రజల్ని మోసగించి తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు” అన్నారు. 13 ✽అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు.
14 ✽పండుగ రోజుల మధ్య యేసు దేవాలయానికి వెళ్ళి ఉపదేశం చేయసాగాడు. 15 ✽ “విద్యాభ్యాసం లేని ఈ మనిషికి పాండిత్యం ఎక్కడిది?” అంటూ యూదులు చాలా ఆశ్చర్యపడ్డారు.
16 ✽యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “నేను చేసే ఉపదేశం నాది కాదు గాని నన్ను పంపినవానిది. 17 ✽దేవుని ఇష్టప్రకారం చేయడానికి ఎవరైనా ఇష్టపడితే ఈ ఉపదేశం ఆయనదో, లేక నా అంతట నేనే చెపుతున్నానో తెలుసుకొంటారు.
18 ✽“తనంతట తానే మాట్లాడేవాడు సొంత గౌరవం చేకూరాలని చూస్తూ ఉంటాడు, గాని తనను పంపినవానికే గౌరవం చేకూరాలని చూచేవాడు సత్యవంతుడు. ఆయనలో అన్యాయం ఏమీ లేదు. 19 ✽మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు గదా. అయినా మీలో ఎవరూ ధర్మశాస్త్రం ఆచరణలో పెట్టడం లేదు. మీరెందుకు నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు?”
20 ✽“దయ్యం పట్టినవాడివి నీవు. నిన్ను చంపడానికి ఎవరు చూస్తున్నారు?” అని ఆ ప్రజలు జవాబిచ్చారు. 21 ✽ యేసు వారికి ఇలా బదులు చెప్పాడు: “నేను ఒక క్రియ చేసినందుకు మీరంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. 22 మోషే మీకు సున్నతి అనే సంస్కారం నియమించాడు. అది మోషే నుంచి వచ్చినది కాదు గాని పూర్వీకుల ద్వారా కలిగింది. మీరు విశ్రాంతి దినాన ఒక మనిషికి సున్నతి జరిగిస్తారు. 23 మోషే ధర్మశాస్త్రం మీరకూడదని విశ్రాంతి దినాన ఒక మనిషి సున్నతి పొందితే విశ్రాంతి దినాన నేను ఒక మనిషిని పూర్తిగా బాగు చేసినందుకు మీరు నా మీద కోపపడుతున్నారేమిటి? 24 ✽బయటికి కనిపించేదాన్ని బట్టి నిర్ణయానికి రాకండి. న్యాయ సమ్మతంగా నిర్ణయం చేసుకోండి.”
25 ✽అప్పుడు జెరుసలం వారిలో కొందరు ఇలా చెప్పుకొన్నారు: “వాళ్ళు చంపాలని చూస్తున్నవాడు ఈయనే గదా! 26 ఇడుగో! ఆయన బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు గాని వాళ్ళు ఆయనను ఏమీ అనరు! ఈయన నిజంగా అభిషిక్తుడు అని అధికారులకు తెలిసిపోయిందా ఏమిటి? 27 కానీ ఈ మనిషి ఎక్కడివాడో మనకు తెలుసు. అభిషిక్తుడు వచ్చేటప్పుడు ఆయన ఎక్కడనుంచి వస్తాడో ఎవరికీ తెలీదు.”
28 ✽అందుచేత యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “నేను మీకు తెలుసు, నేనెక్కడినుంచి వచ్చానో అది కూడా మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయనను మీరెరుగరు. 29 నేనైతే ఆయనను ఎరుగుదును. నేను వచ్చినది ఆయన దగ్గరనుంచే. నన్ను పంపినది ఆయనే.”
30 ✽అందుచేత వాళ్ళు ఆయనను పట్టుకోవడానికి చూశారు గానీ ఆయన సమయం ఇంకా రాకపోవడం వల్ల ఆయన ఎవరి చేతికీ చిక్కలేదు. 31 ప్రజలలో అనేకులు ఆయనమీద నమ్మకం ఉంచారు, “అభిషిక్తుడు వచ్చేటప్పుడు ఈయనకంటే ఎక్కువ సూచకమైన అద్భుతాలు✽ చేస్తాడా?” అన్నారు. 32 ఆయనను గురించి ఈ విషయాలు ప్రజల గుంపు గుసగుసలాడడం పరిసయ్యులు✽ విన్నారు గనుక ప్రధాన యాజులూ పరిసయ్యులూ ఆయనను పట్టుకోవడానికి భటులను పంపారు.
33 ✽యేసు వారితో “ఇంకా కొద్ది కాలమే నేను మీతో ఉంటాను. తరువాత నన్ను పంపినవాని దగ్గరికి వెళ్ళిపోతాను. 34 ✽మీరు నన్ను వెదుకుతారు గాని నన్ను కనుక్కోరు. నేనెక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరు” అన్నాడు.
35 ✽అందుకు యూదులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “మనం ఇతణ్ణి కనుక్కోకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలని ఉద్దేశిస్తున్నాడు? గ్రీస్ దేశస్థుల మధ్య చెదరిపోయిన యూదుల దగ్గరికి వెళ్ళి గ్రీస్‌వారికి ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడా ఏమిటి? 36 ‘మీరు నన్ను వెతుకుతారు గాని నన్ను కనుక్కోరు. నేనెక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరు’ అని అతడు చెప్పిన మాట ఏమిటి?”
37 ✽ ఆ పండుగలో చివరి రోజున – ఆ మహా దినాన యేసు నిలబడి బిగ్గరగా ఇలా చెప్పాడు: “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. 38 నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి అంతరంగంలో నుంచి జీవ జల నదులు పారుతాయి. ఇది లేఖనాలు✽ చెప్పిన ప్రకారమే.”
39 ✽ ఆయనమీద నమ్మకం ఉంచుతున్నవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఆ మాట చెప్పాడు. అప్పటికి యేసు ఇంకా మహిమాస్థితి✽ పొందలేదు గనుక పవిత్రాత్మను అనుగ్రహించడం ఇంకా జరుగలేదు.
40 ✝ఆ మాటలు విని జనసమూహంలో అనేకులు “నిజంగా ఈయనే ఆ ప్రవక్త” అన్నారు. 41 మరి కొందరు “ఈయనే అభిషిక్తుడు✽” అన్నారు. మరి కొంతమంది “కానీ అభిషిక్తుడు గలలీలోనుంచి రాడు గదా! 42 ✽అభిషిక్తుడు దావీదు సంతానంలో నుంచి వస్తాడనీ దావీదు ఉండిన బేత్‌లెహేం గ్రామం నుండి వస్తాడనీ లేఖనం చెప్పలేదా?” అన్నారు. 43 ✽ఈ విధంగా ప్రజలలో ఆయనను గురించి విభేదం పుట్టింది. 44 వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని కోరారు గాని ఆయన ఎవరి చేతికీ చిక్కలేదు.
45 ✽ఆ భటులు ప్రధాన యాజుల దగ్గరికీ పరిసయ్యుల దగ్గరికీ వచ్చినప్పుడు వీరు “అతణ్ణి మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు. 46 భటులు “ఈ మనిషి మాట్లాడే విధంగా ఏ మనిషీ ఎన్నడూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.
47 ✽అందుకు పరిసయ్యులు వారికి ఇలా బదులు చెప్పారు: “మీరు కూడా మోసపోయారా ఏమిటి? 48 ✽అధికారులలో గానీ పరిసయ్యులలో గానీ ఎవరూ అతణ్ణి నమ్మలేదు గదా. 49 ✽అయితే ధర్మశాస్త్రం తెలియని ఈ మూకమీద శాపం ఉందన్నమాట!”
50 ✽రాత్రివేళ ఆయన దగ్గరకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు వారితో 51 ✽“ఒక మనిషి ప్రతివాదం విని ఆయన చేసేది ఏమిటో తెలుసుకోకముందే మన ధర్మశాస్త్రం ఆయనకు తీర్పు తీర్చదు గదా!” అన్నాడు.
52 వారు “నువ్వు కూడా గలలీవాడివా? లేఖనాలను విచారించి చూడు – గలలీలో ప్రవక్త ఎవ్వడూ బయలు దేరలేదు” అని అతనికి బదులు చెప్పారు. 53 ✽అప్పుడు ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.