6
1 ఆ తరువాత యేసు గలలీ సరస్సు (ఇది తిబెరియ సరస్సు) దాటి అవతలికి వెళ్ళాడు. 2 రోగులకు ఆయన చేసిన సూచన కోసమైన అద్భుతాలు చూచి చాలామంది ఆయన వెంట వచ్చారు. 3 అక్కడ యేసు ఒక కొండెక్కి తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. 4 పస్కా అనే యూదుల పండుగ దగ్గర పడింది. 5 యేసు తలెత్తి పెద్ద గుంపు తనవైపుకు రావడం చూచి ఫిలిప్పుతో ఇలా అన్నాడు: “వీరు తినడానికి రొట్టెలు మనం ఎక్కడ కొనాలి?” 6 అతణ్ణి పరీక్షించడానికి ఆయన అలా అన్నాడు – తాను ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు.
7  ఫిలిప్పు “వీళ్ళలో ఒక్కొక్కరికి కొంచెం దొరకాలన్నా రెండు వందల దేనారాల రొట్టెలు కూడా ఏమీ చాలవు” అని ఆయనకు జవాబిచ్చాడు.
8 ఆయన శిష్యులలో ఒకడు – సీమోను పేతురు సోదరుడు అంద్రెయ – యేసుతో ఇలా అన్నాడు: 9 “ఇక్కడ ఓ అబ్బాయి ఉన్నాడు. వాని దగ్గర అయిదు యవల రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి. అయితే ఇంతమందికి అదేపాటిది?”
10 “ప్రజలను కూర్చోబెట్టండి” అని యేసు అన్నాడు. ఆ చోట పచ్చిక విస్తారంగా ఉంది గనుక పురుషులు కూర్చున్నారు. వారి సంఖ్య సుమారు అయిదు వేలు. 11 అప్పుడు యేసు ఆ రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు, శిష్యులకు పంచి ఇచ్చాడు. శిష్యులు కూర్చుని ఉన్నవారికి వడ్డించారు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంతమట్టుకు వడ్డించారు. 12 వారు కడుపారా తిన్న తరువాత ఆయన తన శిష్యులతో “మిగిలిన ముక్కలు ఎత్తండి – ఏమీ నష్టం కాకూడదు” అన్నాడు. 13 అలాగే వారు వాటిని ఎత్తారు, ఆ అయిదు యవల రొట్టెలు ప్రజలు తినగా మిగిలిన ముక్కలతో పన్నెండు గంపలు నింపారు.
14 యేసు చేసిన అద్భుతమైన ఈ సూచన చూచి ప్రజలు “నిజంగా, లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే!” అన్నారు.
15 వారు వచ్చి తనను రాజుగా చేయడానికి బలవంతంగా తీసుకుపోతారని యేసుకు తెలుసు, కనుక ఆయన మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళాడు.
16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సరస్సు ఒడ్డుకు వెళ్ళి 17 పడవ ఎక్కి అవతల ఉన్న కపెర్‌నహూంకు దాటిపోసాగారు. అంతలో చీకటి పడింది. యేసు వారిదగ్గరికి ఇంకా రాలేదు. 18 అప్పుడు పెద్ద గాలి వీస్తూ ఉండడంచేత సరస్సు అల్లకల్లోలం కాసాగింది. 19 వారు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం తెడ్లతో పడవ నడిపిన తరువాత యేసు సరస్సు మీద నడుస్తూ పడవకు దగ్గరగా రావడం చూశారు. వారికి భయం వేసింది. 20 అయితే ఆయన వారితో “నేనే, భయపడకండి!” అన్నాడు.
21 అప్పుడు ఆయనను పడవలో చేర్చుకోవడం వారికి ఇష్టం అయింది. వెంటనే పడవ వారు వెళ్ళిపోతున్న స్థలం చేరింది.
22 మరుసటి రోజున సరస్సు అవతల నిలిచి ఉన్న ప్రజలకు ఈ విషయం తెలిసింది: ఆయన శిష్యులు ఎక్కిన పడవ తప్ప మరొకటి అక్కడ లేదు, యేసు తన శిష్యులతో కూడా ఆ పడవ ఎక్కలేదు. శిష్యులు మాత్రమే వెళ్ళిపోయారు. 23 అప్పుడు వేరే పడవలు తిబెరియ నుంచి వచ్చాయి. యేసు కృతజ్ఞత అర్పించిన తరువాత వారు తిన్న స్థలం దగ్గరికి అవి వచ్చాయి. 24 ఆ గుంపుకు యేసు గానీ ఆయన శిష్యులు గానీ అక్కడ కనబడకపోవడం చేత వారా పడవలెక్కి యేసును వెదకుతూ కపెర్‌నహూం వచ్చారు. 25 సరస్సు అవతల ఆయన కనబడ్డప్పుడు వారు ఆయనను “గురువర్యా! మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు?” అని అడిగారు.
26 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు నన్ను ఎందుకు వెదుకుతున్నారంటే, సూచనకోసమైన అద్భుతాలు చూచినందుకు కాదు గానీ మీరు కడుపారా ఆ రొట్టెలు తిన్నందుకే. 27 చెడిపోయే ఆహారం కోసం కష్టపడకండి. శాశ్వత జీవానికి నిలిచి ఉండే ఆహారంకోసం కష్టపడండి. ఇది మానవ పుత్రుడు మీకు ప్రసాదిస్తాడు. ఎందుకంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు.”
28 అందుకు వారు ఆయనను “దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి?” అని అడిగారు.
29 “దేవుని క్రియ అంటే ఆయన పంపినవాణ్ణి మీరు నమ్మడమే” అని యేసు వారికి బదులు చెప్పాడు.
30  అందుచేత వారు ఆయనతో ఇలా అన్నారు: “అలాంటప్పుడు మేము చూచి మిమ్మల్ని నమ్మడానికి మీరు సూచనగా ఏ అద్భుతం చేస్తారు? ఏ క్రియ జరిగిస్తారు? 31 మన పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నారు. ‘ఆయన ఆకాశంనుంచి వారికి ఆహారం ప్రసాదించాడు’ అని రాసి ఉంది గదా.”
32 అందుకు యేసు “మీకు ఖచ్చితంగా చెపుతున్నాను, ఆకాశంనుంచి మీకు ఆహారమిచ్చినది మోషే కాదు గానీ నా తండ్రి పరలోకంనుంచి నిజమైన ఆహారం మీకిస్తున్నాడు. 33 దేవుడు ఇచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు. 34  కనుక వారు ఆయనతో “ప్రభూ! ఆ ఆహారం మాకు ఎప్పటికీ ఇస్తూ ఉండండి” అన్నారు.
35 యేసు వారికిలా చెప్పాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఆకలి ఎన్నడూ కాదు, నా మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దాహం ఎన్నడూ కాదు. 36 అయినా మీరు నన్ను చూచి కూడా నమ్మలేదని మీతో చెప్పాను.
37 “తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేనెన్నడూ బయటికి త్రోసివేయను. 38  నన్ను పంపినవాని సంకల్పం నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగివచ్చాను గాని నా సొంత సంకల్పం నెరవేర్చడానికి కాదు. 39 నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. 40 నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”
41 తాను పరలోకంనుంచి దిగివచ్చిన ఆహారాన్ని అన్నందుకు ఆయనను గురించి యూదులు సణుక్కొన్నారు. 42  “ఈ యేసు యోసేపు కొడుకు గదా. అతని తల్లిదండ్రులు మనకు తెలిసినవారే గదా. ఇప్పుడితడు ‘నేను పరలోకంనుంచి దిగివచ్చాను’ అంటాడేమిటి!” అన్నారు.
43 యేసు వారికిలా బదులు చెప్పాడు: “మీలో మీరు సణుక్కోకండి. 44  నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించనిదే ఎవరూ నా దగ్గరకు రాలేరు. వారిని చివరి రోజున సజీవంగా లేపుతాను. 45  ‘వారందరికీ దేవుడు ఉపదేశిస్తాడు’ అని ప్రవక్తల లేఖనంలో వ్రాసి ఉంది. అందుచేత తండ్రివల్ల విని నేర్చుకొనే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తారు. 46  దేవుని నుంచి వచ్చినవాడు తప్ప ఇంకెవరూ తండ్రిని చూడలేదు. ఆయన తండ్రిని చూశాడు. 47 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నామీద నమ్మకముంచినవారికి శాశ్వత జీవం ఉంది. 48 జీవాహారాన్ని నేనే. 49 ఎడారిలో మీ పూర్వీకులు మన్నా తిని కూడా చనిపోయారు. 50 కానీ ఈ ఆహారం తిన్నవారు చావరు. పరలోకం నుంచి ఈ ఆహారం దిగివచ్చిన కారణం అదే. 51 పరలోకంనుంచి దిగివచ్చిన సజీవమైన ఆహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే శాశ్వతంగా జీవిస్తారు. లోకానికి జీవంకోసం నేను ఇవ్వబోయే ఆహారం నా శరీరమే!”
52 అప్పుడు యూదులు “ఈ మనిషి తన శరీరాన్ని తినడానికి మనకు ఎట్లా ఇవ్వగలడు?” అంటూ ఒకరితో ఒకరు వాదించుకొన్నారు.
53 కనుక యేసు వారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు మానవ పుత్రుని శరీరం తినకపోతే, ఆయన రక్తం త్రాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. 54 నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడెవడైనా శాశ్వత జీవం గలవాడు. చివరి రోజున నేను అతణ్ణి లేపుతాను. 55 నా శరీరం నిజంగా ఆహారం, నా రక్తం నిజంగా పానీయం. 56 నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు. నేను అతనిలో ఉంటాను. 57 జీవం గల తండ్రి నన్ను ఎలా పంపాడో, నేను తండ్రి మూలంగా ఎలా జీవిస్తూ ఉన్నానో అలాగే నన్ను తిన్నవాడు నామూలంగా జీవిస్తూ ఉంటాడు. 58 పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే! మీ పూర్వీకులు మన్నా తిని చనిపోయినట్టు కాదు – ఈ ఆహారం తిన్నవాడు ఎప్పటికీ జీవిస్తాడు.
59 ఆయన కపెర్‌నహూంలో ఉపదేశిస్తూ సమాజ కేంద్రంలో ఆ మాటలు చెప్పాడు. 60 ఆయన శిష్యులలో చాలమంది అది విని “ఈ మాట కఠినమైనది. ఇది ఎవరు వినగలరు?” అన్నారు.
61 తన శిష్యులు దానిని గురించి సణుగుకొంటూ ఉన్న సంగతి యేసుకు తెలుసు. కనుక ఆయన వారితో ఇలా అన్నాడు: “మీకు ఇది అభ్యంతరమా? 62  అయితే మానవ పుత్రుడు మునుపున్న చోటికి పైకి వెళ్ళడం మీరు చూస్తే మీకెలా ఉంటుందో! 63 జీవమిచ్చేది దేవుని ఆత్మ మాత్రమే. శరీరం ప్రయోజనమేమీ లేనిది. మీతో నేను చెప్పే మాటలు ఆత్మ సంబంధమైనవి, జీవం ఇచ్చేవి. 64  కానీ మీలో కొందరు నమ్మడం లేదు.” నమ్మనివారెవరో తనను శత్రువులకు పట్టి ఇచ్చేవాడెవడో మొదటి నుంచి యేసుకు తెలుసు. 65 ఆయన ఇంకా అన్నాడు “తండ్రి వారిని అనుగ్రహించనిదే ఎవరూ నా దగ్గరకు రాలేరని నేను చెప్పినది అందుకే.”
66 అప్పటినుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కు తగ్గి ఆయనతో మరెన్నడూ తిరగలేదు.
67 అప్పుడు యేసు తన పన్నెండుమందితో “మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా?” అన్నాడు.
68 సీమోను పేతురు ఆయనకు ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మేము ఎవరిదగ్గరికి వెళ్తాం? నీవు శాశ్వత జీవ వాక్కులు గలవాడవు. 69 అంతేకాక, అభిషిక్తుడవూ సజీవుడైన దేవుని కుమారుడవూ నీవే అని మేము నమ్ముతూ తెలుసుకొన్నాం.”
70 “పన్నెండుగురైన మిమ్ములను ఎన్నుకొన్నాను గదా. మీలో ఒకడు పిశాచం” అని యేసు వారికి బదులు చెప్పాడు. 71 ఆయన సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదాను గురించి చెప్పాడు. ఎందుకంటే అతడు పన్నెండుగురిలో ఒకడై ఉండి, ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వబోయేవాడు.