5
1 ఆ తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు జెరుసలం వెళ్ళాడు. 2 జెరుసలంలో ‘గొర్రెల ద్వారం’ దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బెతెస్థ. దానికి అయిదు మంటపాలు ఉన్నాయి. 3 వాటిలో రోగులూ గుడ్డివారూ కుంటివారూ కాళ్ళు చేతులు ఊచబారిపోయినవారూ గుంపులుగా పడి ఉన్నారు. వారు నీళ్ళ కదలికకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4 ఎందుకంటే, ఒకానొక సమయంలో ఒక దేవదూత కోనేటిలోకి దిగివచ్చి నీళ్ళు కదలించిన తరువాత మొట్టమొదట నీళ్ళలో దిగిన రోగి – ఎలాంటి రోగంతో ఉన్నా – పూర్తిగా నయం కావడం జరిగేది. 5 అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్బలత ముప్ఫయి ఎనిమిదేళ్ళ నుంచి ఉంది. 6 అతడు అక్కడ పడి ఉండడం యేసు చూశాడు. అతడు చాలా కాలంనుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయనకు తెలుసు.
“నీకు బాగుపడాలని ఇష్టం ఉందా?” అని ఆయన అతణ్ణి అడిగాడు.
7 ఆ రోగి ఆయనతో ఇలా బదులు చెప్పాడు: “అయ్యా, నీళ్ళను కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దించడానికి నాకెవరూ లేరు గనుక నేను వచ్చేంతలోనే ఇంకెవరో నాకంటే ముందుగా దిగుతారు.”
8 యేసు అతనితో “లేచి నీ పడక ఎత్తుకొని నడువు” అన్నాడు.
9 వెంటనే ఆ మనిషి బాగుపడి తన పడక ఎత్తుకొని నడవసాగాడు. 10 ఆ రోజు విశ్రాంతి దినం గనుక యూదులు బాగుపడిన ఆ మనిషితో “ఇది విశ్రాంతి దినం. నువ్వు నీ పడక మోయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం” అన్నారు.
11 అందుకు అతడు “నన్ను బాగు చేసినవాడు ‘నీ పడక ఎత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.
12 “నీ పడక ఎత్తుకొని నడవమని నీతో చెప్పినదెవరు?” అని వాళ్ళు అతణ్ణి అడిగారు.
13 ఆయన ఎవరో బాగుపడినవానికి తెలియదు. ఎందుకంటే, అక్కడ ఉన్న పెద్ద గుంపులోనుంచి యేసు తప్పుకొన్నాడు.
14 తరువాత యేసు అతణ్ణి దేవాలయంలో చూచి అతనితో “ఇదిగో విను, నీవు బాగయ్యావు. మునుపటి కంటే ఎక్కువ కీడు నీ మీదికి రాకుండా ఇకనుంచి అపరాధం చేయకు” అన్నాడు.
15 ఆ మనిషి వెళ్ళి తనను బాగు చేసినవాడు యేసు అని యూదులకు తెలియజేశాడు.
16 యేసు విశ్రాంతి దినాన ఈ పనులు చేసినందుచేత యూదులు ఆయనను హింసించారు, చంపడానికి చూశారు. 17 అయితే యేసు వారికిలా బదులు చెప్పాడు: “ఇప్పటి వరకు నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేనూ పని చేస్తూ ఉన్నాను.”
18 ఈ కారణంచేత యూదులు ఆయనను చంపడానికి మరి ఎక్కువగా కోరారు – ఆయన విశ్రాంతి దినాచారాలు మీరడం మాత్రమే గాక, దేవుణ్ణి తన తండ్రి అంటూ తనను దేవునితో సమానుడుగా చేసుకొన్నాడు.
19 అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. 20  కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. 21 తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని బ్రతికిస్తాడు. 22 తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చే అధికారమంతా కుమారునికి అప్పగించాడు. 23 అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
24 “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
25 “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. 26 ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. 27 ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
28 “ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. 29 వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు. 30 నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినే ప్రకారం తీర్పు తీరుస్తాను. నన్ను పంపినవారి ఇష్టప్రకారమే చేయాలని కోరుతూ ఉన్నాను గాని నా ఇష్టప్రకారం కాదు గనుక నేను తీర్చే తీర్పు న్యాయమైనది.
31 “నా విషయం నేనే సాక్ష్యం చెప్పుకొంటే నా సాక్ష్యం నిజమైనది కాదు. 32 నా విషయం సాక్ష్యం చెప్పేవాడు ఇంకొకడు ఉన్నాడు. నా విషయం ఆయన చెప్పే సాక్ష్యం నిజమని నాకు తెలుసు.
33 “మీరు యోహాను దగ్గరకు మనుషులను పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. 34 అయినా, మనుషుల సాక్ష్యం నేను చేకూర్చుకోను గాని మీకు పాపవిముక్తి కలగాలని నేను ఈ మాటలు చెపుతున్నాను. 35 అతడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్న దీపం. అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి మీరు ఇష్టపడ్డారు.
36 “కానీ యోహాను సాక్ష్యాన్ని మించిన సాక్ష్యం నాకు ఉంది. నెరవేర్చడానికి తండ్రి నాకిచ్చిన పనులు – నేను చేస్తూ ఉన్న పనులే – తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. 37  ఇది గాక, నన్ను పంపిన తండ్రి తానే నా విషయం సాక్ష్యమిచ్చి ఉన్నాడు. ఆయన స్వరం మీరెన్నడూ వినలేదు. ఆయన స్వరూపాన్ని చూడలేదు. 38 మీలో ఆయన వాక్కు నిలిచి ఉండడం లేదు. ఎందుకంటే, ఆయన పంపినవాణ్ణి మీరు నమ్మడం లేదు. 39 మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు. వాటి మూలంగా మీకు శాశ్వత జీవం ఉందని మీ ఆలోచన. అవి నా విషయమే సాక్ష్యం చెపుతూ ఉన్నాయి. 40 అయినా మీకు జీవం కలిగేలా నా దగ్గరకు రావడానికి మీకు ఇష్టం లేదు.
41 “మనుషులు ఇచ్చే ఘనత నేను స్వీకరించను. 42 మీరు నాకు తెలుసు – మీలో దేవుని ప్రేమ లేదు. 43 నేను నా తండ్రి పేర వచ్చాను, మీరు నన్ను స్వీకరించడం లేదు. వేరొకడు తన పేరునే వస్తే వాణ్ణి మీరు స్వీకరిస్తారు.
44 “మీరు ఒకరిచేత ఒకరు ఘనత స్వీకరిస్తూ, ఒకే ఒక దేవునినుంచి వచ్చే ఘనత వెదకకుండా ఉంటే నన్ను ఎలా నమ్ముతారు? 45 తండ్రిదగ్గర మీమీద నేరం మోపుతానని తలంచకండి. మీరు మోషేమీద నమ్మకం ఉంచుతున్నారు. మీమీద నేరం మోపేవాడు అతడే. 46 ఎందుకంటే, మోషే నన్ను గురించి వ్రాశాడు. మీరు అతని మాటలు నమ్మితే నన్ను కూడా నమ్ముతారు. 47 అతడు వ్రాసినది మీరు నమ్మకపోతే నా మాటలు ఎలా నమ్ముతారు?”