4
1 యేసు యోహానుకంటే ఎక్కువమందిని శిష్యులుగా చేసుకొన్నట్టు, వారికి బాప్తిసం ఇస్తున్నట్టు పరిసయ్యులకు✽ వినవచ్చింది. ఈ సంగతి ప్రభువుకు తెలిసింది. 2 (యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు – ఆయన శిష్యులే ఇస్తూ ఉండేవారు.) 3 ✽అప్పుడు ఆయన యూదయను విడిచి గలలీకి తిరిగి వెళ్ళాడు.4 ✽ఆయన సమరయ మీదుగా వెళ్ళవలసివచ్చింది. 5 ✝సమరయలో సుకారు అనే ఊరికి ఆయన వచ్చాడు. అది యాకోబు తన కొడుకైన యోసేపుకు ఇచ్చిన భూమిదగ్గర ఉంది. 6 ✽యాకోబు బావి అక్కడ ఉంది. కనుక యేసు ప్రయాణంవల్ల అలసి అలాగే బావి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలయింది.
7 ✽సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆమెతో యేసు “నాకు త్రాగడానికి నీళ్ళివ్వు” అన్నాడు. 8 ఎందుకంటే, ఆయన శిష్యులు భోజన పదార్థాలు కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు.
9 ✽“నేను సమరయ స్త్రీని. మీరు యూదులై ఉండి తాగడానికి నీళ్ళిమ్మని నన్ను అడుగుతారేమిటి?” అని ఆ సమరయ స్త్రీ ఆయనతో అంది. (యూదులు సమరయ దేశస్థులతో సహవాసమేమీ చేయరు.)
10 ✽యేసు ఆమెతో ఇలా సమాధానం చెప్పాడు: “నీకు దేవుని కృపావరం తెలిసి ఉంటే, త్రాగడానికి నీళ్ళిమ్మని నిన్ను అడిగినది ఎవరో అది కూడా తెలిసి ఉంటే, ఆయనను అడిగి ఉండేదానివే. ఆయన నీకు జీవ జలం ఇచ్చి ఉండేవాడు.”
11 ✽ఆ స్త్రీ ఆయనతో “అయ్యా, ఈ బావి లోతైనది. చేదుకోవడానికి మీ దగ్గర ఏమీ లేదు. మీకు ఆ జీవజలం ఎక్కడ దొరుకుతుంది? 12 మన పూర్వీకుడు యాకోబు ఈ బావి మాకిచ్చాడు. తాను తన పశువులు, తన కొడుకులు ఈ నీళ్ళు తాగారు. ఆయనకంటే మీరు గొప్పవారా?” అంది.
13 ✽యేసు జవాబిస్తూ “ఈ నీళ్ళు త్రాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం అవుతుంది. 14 గానీ నేను ఇచ్చే నీళ్ళు త్రాగే ఎవరికైనా మరెన్నడూ దాహం కాదు✽. నేను వారికిచ్చే నీళ్ళు వారిలో ఉండి శాశ్వత జీవితానికి ఊరుతూ ఉండే ఊట అవుతుంది” అని ఆమెతో అన్నాడు.
15 ✽“అయ్యా, నాకు దప్పిక కాకుండా, చేదుకోవడానికి ఇక్కడికి రాకుండా ఆ నీళ్ళు నాకివ్వండి” అని ఆ స్త్రీ ఆయనతో అంది.
16 ✽ఆయన ఆమెతో “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని ఇక్కడికి రా!” అన్నాడు.
17 “నాకు భర్త లేడు” అని ఆమె జవాబిచ్చింది.
యేసు ఆమెతో ఇలా అన్నాడు: “‘నాకు భర్త లేడు’ అని నీవు చెప్పినది సరిగానే ఉంది. 18 నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. దాని గురించి నిజం చెప్పావు.”
19 ✽అప్పుడా స్త్రీ ఆయనతో “అయ్యా, మీరు ప్రవక్తలని గ్రహిస్తున్నాను. 20 ✽మా పూర్వీకులు ఈ కొండ మీద ఆరాధించేవారు, గానీ ఆరాధన చేయవలసిన స్థలం జెరుసలంలోనే ఉందని మీరు అంటారు✽” అంది.
21 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా, నన్ను నమ్ము. ఒక కాలం వస్తూ ఉంది. అప్పుడు ఈ కొండ మీద గానీ జెరుసలంలో గానీ పరమ తండ్రిని మీరు ఆరాధించరు. 22 మీరు ఆరాధించేది మీకే తెలియదు. మేము ఆరాధించేది మాకు తెలుసు. విముక్తి యూదులలోనుంచే వస్తుంది✽. 23 నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో తండ్రిని ఆరాధించే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. అలాంటి వారు తనను ఆరాధించాలని తండ్రి వారిని వెదకుతూ ఉన్నాడు. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలో సత్యంలో ఆరాధించాలి.”
25 ఆ స్త్రీ ఆయనతో ఇలా అంది: “అభిషిక్తుడు✽ వస్తాడని నాకు తెలుసు. ఆయనను ‘క్రీస్తు’ అంటారు. ఆయన వచ్చేటప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడు.”
26 ✽“నీతో మాట్లాడుతున్న నేను ఆయనను” అని యేసు ఆమెతో అన్నాడు.
27 ✽ఇంతలో ఆయన శిష్యులు వచ్చారు. ఒక స్త్రీతో ఆయన మాట్లాడడం చూచి వారు ఆశ్చర్యపడ్డారు. అయితే “నీకేం కావాలి” అని గానీ “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గానీ ఎవడూ అడగలేదు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అక్కడి మనుషులతో ఇలా అంది:
29 ✽“నేను చేసినవన్నీ ఓ మనిషి నాకు చెప్పాడు. రండి, ఆయనను చూడండి. ఆయన అభిషిక్తుడు కాడా?”
30 ✽వారు ఊరినుంచి బయలుదేరి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.
31 ఈలోగా ఆయన శిష్యులు “గురువర్యా, తినండి” అని ఆయనను కోరారు.
32 ✽అందుకాయన వారితో “తినడానికి మీకు తెలియని ఆహారం నాకు ఉంది” అన్నాడు.
33 కనుక శిష్యులు “ఈయనకు తినడానికి ఎవరైనా ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని ఒకనితో ఒకడు చెప్పు కొన్నారు.
34 ✽యేసు వారితో “నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చి ఆయన పని ముగించడమే నా ఆహారం! 35 ✽ఇంకా నాలుగు నెలల తరువాత కోతకాలం వస్తుందని మీరు అంటారు గదా. ఇదిగో వినండి, నేను మీతో అంటున్నాను, మీ తలలెత్తి పొలాలను చూడండి. ఇప్పటికే అవి తెల్లబారి కోతకు తయారయ్యాయి. 36 ✽విత్తనాలు వేసేవాడూ పంట కోసేవాడు కలిసి సంతోషించాలని ఇప్పుడే కోసేవాడు జీతం పుచ్చుకొంటున్నాడు. శాశ్వత జీవం కోసం ఫలం సమకూర్చు కొంటున్నాడు. 37 విత్తనాలు చల్లేవాడొకడు, కోసేవాడు ఇంకొకడు అనే మాట ఈ విషయంలో నిజమే. 38 మీరు కష్టపడనిదాని పంట కోయడానికి నేను మిమ్ములను పంపాను. ఇతరులు కష్టపడ్డారు. వారి కష్ట ఫలితంలో మీరు ప్రవేశించారు” అన్నాడు.
39 ✽“నేను చేసినవన్నీ ఆయన నాకు చెప్పాడ”ని ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యం కారణంగా ఆ ఊరిలో సమరయవారు అనేకులు ఆయనమీద నమ్మకం పెట్టారు. 40 అందుచేత ఆ సమరయవారు ఆయనదగ్గరకు వచ్చినప్పుడు తమ దగ్గర ఉండాలని ఆయనకు విన్నవించుకొన్నారు గనుక రెండు రోజులు ఆయన అక్కడ ఉండిపోయాడు. 41 ఆయన మాటల కారణంగా ఇంకా అనేకులు ఆయన్ను నమ్ముకొన్నారు. 42 ✽వారు ఆ స్త్రీతో “మేమిప్పుడు నమ్మడం నీవు చెప్పిన దాన్నిబట్టి కాదు. మా మట్టుకు విన్నాం, ఆయన నిజంగా అభిషిక్తుడు, లోకరక్షకుడని తెలుసుకొన్నాం” అన్నారు.
43 ఆ రెండు రోజుల తరువాత ఆయన అక్కడనుంచి గలలీకి వెళ్ళిపోయాడు. 44 ✝స్వదేశంలో ప్రవక్తకు గౌరవం ఉండదు అని యేసు తానే సాక్ష్యం చెప్పాడు. 45 ✽ఆయన గలలీకి వచ్చినప్పుడు గలతీ ప్రజలు ఆయనను స్వీకరించారు. ఎందుకంటే, జెరుసలంలో పస్కా పండుగ సమయంలో ఆయన చేసినవన్నీ వారు చూశారు. వారు కూడా ఆ పండుగకు వెళ్ళారు.
46 ✝మరో సారి ఆయన గలలీలోని కానాకు వచ్చాడు. ఆయన అక్కడే నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు. అక్కడ ఒక రాజ్యాధికారి ఉండేవాడు. కపెర్‌నహూంలో అతని కొడుకుకు జబ్బు చేసింది. 47 ✽యేసు యూదయనుంచి గలలీకి వచ్చాడని విన్నప్పుడు ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు, తన కొడుకును బాగు చేయడానికి రావాలని మనవి చేసుకొన్నాడు. ఎందుకంటే అతని కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు.
48 యేసు అతనితో “మీరు సూచనలూ అద్భుతాలూ చూడకపోతే ఎంత మాత్రమూ నమ్మరు” అన్నాడు.
49 ✽రాజ్యాధికారి ఆయనతో “స్వామీ, నా కొడుకు చనిపోకముందు రండి” అన్నాడు.
50 ✽యేసు అతనితో “నీ దారిన వెళ్ళు! నీ కొడుకు బ్రతుకుతాడు” అన్నాడు. తనతో యేసు చెప్పిన మాట నమ్మి ఆ మనిషి తన దారినవెళ్ళాడు.
51 ✽అతడు వెళ్ళిపోతూ ఉండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కొడుకు బ్రతికాడని చెప్పారు. 52 అతడు బాగుపడడం మొదలైనప్పుడు ఎన్ని గంటలైందని వారిని అడిగాడు. వారు అతనితో “నిన్న ఒంటి గంటకు అతని జ్వరం పోయింది” అన్నారు.
53 “నీ కొడుకు బ్రతుకుతాడు” అని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రికి తెలుసు, గనుక అతడూ అతని ఇంటివారంతా యేసును నమ్ముకొన్నారు✽.
54 యూదయనుంచి గలలీకి వచ్చి యేసు చేసిన అద్భుతమైన సూచనల✽లో ఇది రెండోది.