3
1 పరిసయ్యులలో నీకొదేము అనే పేరు గల మనిషి ఉన్నాడు. అతడు యూదులకు ఒక అధికారి. 2 ఈ మనిషి రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు దేవుని దగ్గరనుంచి వచ్చిన ఉపదేశకులని మాకు తెలుసు. ఎందుకంటే దేవుని తోడ్పాటు ఉంటేనే తప్ప మీరు చేసే సూచకమైన అద్భుతాలు ఎవరూ చేయలేరు.”
3 అందుకు యేసు జవాబిస్తూ “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని అతనితో చెప్పాడు.
4 నీకొదేము ఆయనతో “ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.
5 యేసు ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఒకడు నీళ్ళమూలంగా, దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. 6 శరీరం మూలంగా పుట్టినది శరీరం. దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. 7 మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. 8 గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది గాని అది ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. దేవుని ఆత్మమూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”
9 “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము ఆయనకు చెప్పిన జవాబు.
10 యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “మీరు ఇస్రాయేల్ ప్రజలకు ఉపదేశకులై ఉండి కూడా ఈ విషయాలు గ్రహించరా? 11 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మాకు తెలిసినవే చెపుతాం, చూచినవాటిని గురించే సాక్ష్యం చెపుతాం. మా సాక్ష్యం మీరు అంగీకరించడం లేదు. 12 నేను ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు చెపితే ఎలా నమ్ముతారు? 13 పరలోకంనుంచి వచ్చినవాడు, అంటే పరలోకంలో ఉన్న మానవ పుత్రుడు తప్ప ఇంకెవరూ పరలోకానికి ఎక్కలేదు.
14 “ఎడారిలో మోషే కంచు పామును పైకెత్తినట్టే మానవపుత్రుణ్ణి పైకెత్తడం తప్పనిసరి. 15 ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.
16 “దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
17  “తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకంలోకి పంపాడు గాని లోకానికి శిక్ష విధించడానికి కాదు. 18  ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు. 19 ఆ శిక్షావిధికి కారణం ఇదే – వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే, వెలుగు కాదు. 20 దుర్మార్గత చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికీ వెలుగు అంటే గిట్టదు. తన పనులు బయటపడుతాయేమో అని అలాంటివాడు వెలుగు దగ్గరికి రాడు. 21 గానీ సత్యాన్ని అనుసరించి చేసేవాడు తన పనులు దేవుని మూలంగా జరిగాయని వెల్లడి అయ్యేలా వెలుగు దగ్గరికి వస్తాడు.”
22 ఆ తరువాత యేసు, ఆయన శిష్యులు యూదయ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆయన వారితో కొంత కాలం గడుపుతూ బాప్తిసం ఇప్పిస్తూ ఉన్నాడు. 23 సాలీము దగ్గర ఉన్న ఐనోనులో చాలా నీళ్ళు ఉన్నాయి గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ప్రజలు అక్కడికి వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు. 24 యోహానును ఇంకా చెరసాలలో వేయడం జరగలేదు. 25 యోహాను శిష్యులకూ యూదులకూ మధ్య శుద్ధి ఆచారాల గురించిన వివాదం పుట్టింది. 26 వారు యోహాను దగ్గరికి వచ్చి “గురువర్యా! మునుపు యొర్దాను అవతల నీతో ఉన్నవాడు – నీవు సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తిఇప్పుడు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు” అన్నారు.
27 యోహాను ఇలా సమాధానం చెప్పాడు: “పరలోకం నుంచి ఇవ్వడం జరిగితే తప్ప ఏ మనిషికీ ఏమీ లభించదు. 28 నేను క్రీస్తును కాననీ ఆయనకు ముందుగా పంపబడ్డవాణ్ణనీ నేను చెప్పినట్టు మీరే సాక్షులు. 29 పెండ్లి కుమారునికే పెండ్లి కుమార్తె ఉంటుంది. అయితే పెండ్లి కుమారుని స్నేహితుడు నిలబడి పెండ్లి కుమారుని స్వరం విన్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి అధికంగా సంతోషిస్తాడు. అలాగే నా సంతోషం సంపూర్ణం అయింది. 30 ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.
31 “పైనుంచి వచ్చినవాడు అందరికీ పైవాడే. భూమినుంచి వచ్చినవాడు భూమికి చెందినవాడు, భూమి నుంచి వచ్చినట్టు మాట్లాడుతాడు. పరలోకం నుంచి వచ్చినవాడు అందరికీ పైగా ఉన్నాడు. 32 ఆయన చూచినవాటిని, విన్నవాటిని గురించి సాక్ష్యం చెప్తాడు గానీ ఆయన సాక్ష్యం ఎవరూ అంగీకరించడం లేదు. 33 ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు తద్వారా దేవుడు సత్యవంతుడని రూఢి చేస్తున్నాడు. 34  దేవుడు పంపిన ఆయన దేవుని వాక్కులు పలుకుతాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు పరిమితంగా ఆత్మను ఇచ్చేవాడు కాడు. 35 కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు, సమస్తమూ ఆయన చేతికి అప్పచెప్పాడు. 36 కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది.”