2
1 మూడో రోజున గలలీలోని కానాలో పెండ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. 2 యేసునూ ఆయన శిష్యులనూ కూడా పెండ్లికి పిలిచారు. 3 ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనతో “వారిదగ్గర ద్రాక్షరసం లేదు” అంది. 4 యేసు ఆమెతో “అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5 ఆయన తల్లి పనివారితో “మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. 6 అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కొక్కటీ సుమారు డెబ్భయి, లేదా నూరు లీటర్ల నీళ్ళు పట్టేది. అవి యూదుల శుద్ధి ఆచారం కోసం అక్కడ ఉంచారు. 7 యేసు వారితో “ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. 8 అప్పుడాయన వారితో “ఇప్పుడు ముంచి విందు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. 9 ద్రాక్షరసంగా మారిన ఆ నీరు ఎక్కడనుంచి వచ్చిందో ఆ నీళ్ళు తోడిన పనివారికి మాత్రమే తెలిసింది. విందు యజమానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి ఇలా అన్నాడు: 10 “ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం వడ్డిస్తారు. అతిథులు బాగా త్రాగాక రుచి తక్కువది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు.”
11 యేసు చేసిన సూచనకోసమైన అద్భుతాలలో ఈ మొదటిది గలలీలోని కానాలో చేసి తన మహాత్యం వ్యక్తపరిచాడు. ఆయన శిష్యులు ఆయనమీద నమ్మకం ఉంచారు.
12 ఆ తరువాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు, ఆయన శిష్యులు కపెర్‌నహూం వెళ్ళారు. వారు అక్కడ అనేక రోజులు ఉండిపోలేదు.
13 యూదుల పస్కా పండుగ దగ్గరపడింది. యేసు జెరుసలం వెళ్ళాడు.
14 దేవాలయంలో ఎద్దులనూ గొర్రెలనూ పావురాలనూ అమ్మేవారినీ కూర్చుని ఉన్న డబ్బు మారకందారులనూ ఆయన చూశాడు.
15 ఆయన త్రాళ్లతో కొరడా చేసి వాళ్ళందరినీ గొర్రెలతో ఎద్దులతోపాటు దేవాలయంనుంచి వెళ్లగొట్టాడు. డబ్బు మారకందారుల నాణేలు వెదజల్లివేశాడు. వాళ్ళ బల్లలు పడద్రోశాడు.
16 పావురాలు అమ్మేవారితో ఆయన “వీటిని బయటికి తీసుకువెళ్ళండి. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయకండి!” అన్నాడు.
17 “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేసింది” అని వ్రాసి ఉందని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.
18 అప్పుడు యూదులు జవాబిస్తూ ఆయనతో “నీవు ఈ క్రియలు చేస్తూ ఉన్నావే. సూచనగా ఏ అద్భుతం మాకు చూపుతావు?” అన్నారు.
19 “ఈ దేవాలయాన్ని నాశనం చేయండి, మూడు రోజులలో దీనిని లేపుతాను” అని యేసు వారికి బదులు చెప్పాడు.
20 అందుచేత యూదులు “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరేళ్ళు పట్టిందే. నీవు దాన్ని మూడు రోజులలో లేపుతావా?” అన్నారు.
21 అయితే ఆయన తన శరీరం అనే దేవాలయాన్ని ఉద్దేశించి అలా చెప్పాడు.
22  కనుక చనిపోయిన వారిలో నుంచి ఆయన సజీవంగా లేచిన తరువాత, ఆయన తమతో అలా చెప్పాడని ఆయన శిష్యులకు జ్ఞప్తికి వచ్చింది. యేసు చెప్పిన మాట, లేఖనం వారు నమ్మారు.
23  ఆయన పస్కా పండుగ సమయాన జెరుసలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సూచనకోసమైన అద్భుతాలు చూచి అనేకులు ఆయన పేరుమీద నమ్మకం ఉంచారు. 24 కానీ యేసు తనను వారి వశం చేసుకోలేదు. ఎందుకంటే అందరూ ఆయనకు తెలుసు. 25 మనిషిలో ఉన్నదంతా ఆయన తెలిసినవాడు గనుక మనిషిని గురించి ఎవరి సాక్ష్యమూ ఆయనకు అక్కర లేదు.