యోహాను శుభవార్త
1
1 ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడే. 2 ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. 3  సమస్తమూ ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు.
4 ఆయనలో జీవం ఉంది. ఈ జీవం మనుషులకు వెలుగు. 5 ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది గానీ చీకటి దానిని గ్రహించలేదు.
6 దేవుడు పంపిన మనిషి ఒకడు ఉన్నాడు. అతని పేరు యోహాను. 7 అతని మూలంగా అందరికీ నమ్మకం కుదరాలని ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి అతడు సాక్షిగా వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
9 ఆ వెలుగు లోకంలోకి వస్తూ ప్రతి ఒక్కరినీ వెలిగించే వాస్తవమైన వెలుగు. 10 ఆ వెలుగుగా ఉన్న ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయనమూలంగా కలిగిందే. అయినా లోకం ఆయనను గుర్తించలేదు. 11 ఆయన తన సొంతదాని దగ్గరికి వచ్చాడు గానీ తన స్వజనం ఆయనను స్వీకరించలేదు. 12 అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు. 13 వీరు రక్తంవల్ల గానీ శరీరేచ్ఛవల్ల గానీ మానవ సంకల్పంవల్ల గానీ కాక, దేవుని వల్లే పుట్టినవారు.
14 “వాక్కు” శరీరి అయ్యాడు. ఆయన కృపతో సత్యంతో నిండినవాడై కొంతకాలం మనమధ్య ఉన్నాడు. మేము ఆయన మహాత్యం చూశాం. ఆ మహాత్యం తండ్రి ఒకే ఒక కుమారుని దానిలాంటిది.
15  యోహాను ఆయనను గురించి సాక్ష్యం చెపుతూ ఇలా బిగ్గరగా అన్నాడు: “నా తరువాత వచ్చేవాడు నాకు మునుపు ఉన్నవాడు గనుక ఆయన నన్ను మించినవాడని నేను చెప్పినవాడు ఈయనే.”
16 మేమందరమూ ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందాం. 17 ఎందుకంటే, ధర్మశాస్త్రం మోషేద్వారా ఇవ్వడం జరిగింది; కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా కలిగాయి. 18 ఎవరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఒకే ఒక దేవుని కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నాడు. ఆయన దేవుణ్ణి వెల్లడి చేశాడు.
19 “మీరెవరు?” అని అడగడానికి యూదులు జెరుసలం నుంచి యాజులనూ లేవీగోత్రికులనూ యోహానుదగ్గరికి పంపారు. అప్పుడతడు చెప్పిన సాక్ష్యమిదే: 20 “అభిషిక్తుణ్ణి కాను” అని ఒప్పుకొన్నాడు. అలా ఒప్పుకోవడానికి నిరాకరించలేదు.
21 “అలాగైతే మీరు ఎవరు? ఏలీయా?” అని వారు అతణ్ణి అడిగారు.
అతడు “కాను” అన్నాడు.
“మీరు ఆ ప్రవక్తా?” అని వారు అడిగారు.
“కాను” అని జవాబిచ్చాడు.
22 “మీరు ఎవరైనట్టు? మమ్మల్ని పంపినవారికి మేము జవాబివ్వాలి. మీ గురించి ఏమని చెప్పుకొంటున్నారు?” అని వారు అతనితో అన్నారు.
23  అతడు “యెషయాప్రవక్త చెప్పినట్టు, ప్రభువుకోసం మార్గం తిన్ననిది చేయండి అంటూ అరణ్యంలో ఘోషిస్తూ ఉన్న ఒకని స్వరాన్ని నేను” అన్నాడు.
24 వారిని పంపినది పరిసయ్యులు. 25 వారతణ్ణి ఇలా అడిగారు: “మీరు అభిషిక్తుడు గానీ ఏలీయా గానీ ఆ ప్రవక్త గానీ కాకపోతే ఎందుకు బాప్తిసం ఇస్తున్నారు?”
26 యోహాను “నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను గాని మీరెరుగనివాడొకడు మీ మధ్య నిలుచున్నాడు. 27 నా తరువాత వచ్చేవాడు ఆయనే. ఆయన నన్ను మించినవాడు. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను తగను” అని వారితో బదులు చెప్పాడు.
28 ఇది యొర్దాను నదికి అవతల ఉన్న బేతబరలో జరిగింది. యోహాను అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు.
29 మరుసటి రోజున యేసు తనవైపు రావడం చూచి యోహాను “ఇడుగో, లోక పాపాన్ని మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్ల! 30 ఈయనను ఉద్దేశించే నేను ఈ మాట చెప్పాను: నా తరువాత ఒక మనిషి వస్తాడు. ఆయన నాకు మునుపు ఉన్నవాడు గనుక నన్ను మించినవాడు. 31 నేను ఆయనను గుర్తుపట్టలేదు గానీ ఆయన ఇస్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షం కావాలని నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను” అన్నాడు.
32  యోహాను ఇలా సాక్ష్యం చెప్పాడు: “పరలోకంలో నుంచి దేవుని ఆత్మ పావురంలాగా దిగిరావడం, ఆయన మీద నిలిచి ఉండడం నేను చూశాను. 33 నేనాయనను గుర్తుపట్టలేదు గాని నీళ్ళలో బాప్తిసం ఇమ్మని నన్ను పంపినవాడు నాతో ఇలా అన్నాడు: ఎవరిమీద ఆత్మ దిగివచ్చి నిలిచి ఉండడం నీవు చూస్తావో ఆయనే పవిత్రాత్మలో బాప్తిసం ఇస్తాడు. 34 దానిని నేను చూశాను. ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాను.”
35 మరుసటి రోజు యోహాను, అతని శిష్యులలో ఇద్దరు మళ్ళీ అక్కడ నిలుచున్నారు. 36 ఆ దారిన నడుస్తూ ఉన్న యేసును చూచి అతడు “ఇడుగో, దేవుని గొర్రెపిల్ల!” అన్నాడు.
37 అతడు చెప్పినది ఆ ఇద్దరు శిష్యులు విని యేసును అనుసరించారు. 38 యేసు వెనక్కు తిరిగి, వారు తనను అనుసరించడం చూచి “మీరు దేనిని వెతుకుతున్నారు?” అని వారినడిగాడు.
వారు “రబ్బీ! మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు. (రబ్బీ అంటే బోధకుడని తర్జుమా).
39 “వచ్చి చూడండి” అని ఆయన వారితో అన్నాడు గనుక వారు వెళ్ళి ఆయన ఉన్న స్థలం చూశారు. అప్పటికి సుమారు నాలుగు గంటలైంది గనుక వారు ఆ రోజు ఆయనతో ఉండిపోయారు.
40 యోహాను చెప్పినది విని యేసువెంట వెళ్ళిన ఆ ఇద్దరిలో ఒకడు అంద్రెయ. అతడు సీమోను పేతురుకు తోబుట్టువు. 41 అతడు మొట్టమొదట తన తోబుట్టువు సీమోనును కనుక్కొని అతనితో “మేము అభిషిక్తుణ్ణి చూశాం!” అన్నాడు. (అభిషిక్తుడు అంటే క్రీస్తు అని తర్జుమా.) 42 అతణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చాడు. యేసు అతణ్ణి చూచి “నీవు యోనా కుమారుడైన సీమోనువు. నిన్ను ‘కేఫా’ అంటారు” అన్నాడు (కేఫా అంటే రాయి అని తర్జుమా).
43 మరుసటి రోజు యేసు గలలీకి వెళ్ళాలని ఉండి ఫిలిప్పును చూచి “నా వెంట రా” అన్నాడు. 44 ఫిలిప్పు బేత్‌సయిదా వాడు. అది అంద్రెయ, పేతురుల గ్రామం.
45 ఫిలిప్పు నతనియేలును కనుక్కొని “ధర్మ శాస్త్రంలో మోషే, ప్రవక్తలు కూడా ఎవరిని గురించి రాశారో ఆయనను చూశాం. ఆయన యోసేపు కుమారుడైన యేసు. ఆయన నజరేతు గ్రామంవాడు” అన్నాడు.
46 అందుకు నతనియేలు “నజరేతునుంచి మంచిది ఏదైనా రాగలదా?” అని అతనితో అన్నాడు.
ఫిలిప్పు అతనితో “వచ్చి చూడు” అన్నాడు.
47 తన దగ్గరకు నతనియేలు రావడం చూచి యేసు అతణ్ణి గురించి “ఇడుగో, అసలైన ఇస్రాయేల్‌వాడు! అతనిలో కపటమేమీ లేదు” అన్నాడు.
48 “నేను మీకు ఎలా తెలుసు?” అని నతనియేలు ఆయనను అడిగాడు.
యేసు అతనితో జవాబిస్తూ “ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరచెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూశాను” అన్నాడు.
49 “గురువర్యా! మీరు దేవుని కుమారులే! ఇస్రాయేల్ రాజే!” అని నతనియేలు ఆయనకు బదులు చెప్పాడు.
50 “నిన్ను అంజూరచెట్టు క్రింద చూశానని నేను నీతో చెప్పినందుచేత నమ్ముతున్నావా? వీటికి మించిన వాటిని చూస్తావు” అని యేసు అతనికి జవాబు చెప్పాడు. 51 ఆయన ఇంకా అన్నాడు, “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇకమీదట ఆకాశం తెరుచుకోవడమూ దేవదూతలు మానవ పుత్రుని మీదుగా ఎక్కిపోవడమూ దిగిరావడమూ మీరు చూస్తారు.”