21
1 ఆ తరువాత తిబెరియ సరస్సు ఒడ్డున యేసు తనను తన శిష్యులకు మరోసారి ప్రత్యక్షం చేసుకొన్నాడు. ప్రత్యక్షమైన విధం ఏమంటే, 2 సీమోను పేతురు, దిదుమ అనే పేరు ఉన్న తోమా, గలలీలోని కానావాడైన నతనియేలు, జబదయి కొడుకులు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు అంతా పోగయ్యారు.
3 సీమోను పేతురు వారితో “చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తాను” అన్నాడు. వారు “మేము నీతో కూడా వస్తాం” అన్నారు. వెంటనే వారు వెళ్ళి పడవ ఎక్కారు. ఆ రాత్రి వారు పట్టినది ఏమీ లేదు. 4 ప్రొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డున నిలుచున్నాడు గాని ఆయన యేసని శిష్యులు గుర్తుపట్టలేదు.
5 కనుక యేసు “అబ్బాయిలూ! తినడానికి మీదగ్గర ఏమైనా ఉందా?” అని వారితో అన్నాడు. “లేదండి” అని వారు ఆయనకు బదులు చెప్పారు.
6 అప్పుడాయన “పడవ కుడిప్రక్క వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని వారితో చెప్పాడు. వారలా వల వేసినప్పుడు బోలెడన్ని చేపలు పడడం చేత వల లాగలేక పోయారు.
7 అందుచేత యేసు ప్రేమించిన ఆ శిష్యుడు “ఆయన ప్రభువే!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే, మునుపు తీసివేసిన తన పై బట్ట వేసుకొని సరస్సులో దూకాడు. ఒడ్డు అక్కడికి చాలా దూరంలో లేదు – సుమారు రెండు వందల మూరల దూరం. 8 కనుక తక్కిన శిష్యులు చేపలున్న వల లాక్కొంటూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9 ఒడ్డుకు చేరగానే అక్కడ నిప్పు, దానిమీద చేపలూ రొట్టెలూ వారికి కనిపించాయి.
10 యేసు “ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్నిటిని ఇటు తీసుకురండి” అని వారితో అన్నాడు. 11 సీమోను పేతురు పడవ ఎక్కి వల ఒడ్డుకు లాగాడు. వల పెద్ద చేపలతో నిండి ఉంది – మొత్తం నూట యాభై మూడు చేపలు. ఇన్ని ఉన్నా వల పిగలలేదు.
12 యేసు “వచ్చి భోం చేయండి అని వారితో అన్నాడు. ఆయన ప్రభువని శిష్యులకు తెలుసు గనుక “మీరెవరు?” అని ఆయనను అడగడానికి ఎవరూ తెగించలేదు. 13 యేసు వచ్చి రొట్టెలు చేతపట్టుకొని వారికి పంచి ఇచ్చాడు, అలాగే చేపలు కూడా ఇచ్చాడు. 14 చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచిన తరువాత యేసు తన శిష్యులకు కనుపరచుకోవడం ఇది మూడో సారి.
15  వారు భోజనం చేసిన తరువాత సీమోను పేతురుతో యేసు ఇలా అన్నాడు: “యోనా కొడుకైన సీమోనూ! నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అతడు “అవును, ప్రభూ! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని ఆయనతో చెప్పాడు. ఆయన అతనితో “నా గొర్రెపిల్లలను మేపు” అన్నాడు. 16 మళ్ళీ ఆయన “యోనా కొడుకైన సీమోనూ! నీవు నన్ను ప్రేమిస్తున్నావా?” అని రెండో సారి అతనితో అన్నాడు. అతడు “అవును, ప్రభూ! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని ఆయనతో చెప్పాడు. ఆయన అతనితో “నా గొర్రెలకు కాపరిగా ఉండు అన్నాడు. 17 ఆయన అతనితో మూడో సారి ఇలా అన్నాడు: “యోనా కొడుకైన సీమోనూ! నీవు నన్ను ప్రేమిస్తున్నావా?” “నీవు నన్ను ప్రేమిస్తున్నావా?” అని మూడో సారి తనతో చెప్పినందుచేత పేతురు నొచ్చుకొని ఆయనతో “ప్రభూ! అంతా నీకు తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలిసే ఉంది” అన్నాడు. యేసు అతనితో ఇలా అన్నాడు: “నా గొర్రెలను మేపు. 18 నేను నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నీ యువప్రాయంలో నీ నడుము నీవే బిగించుకొని నీ ఇష్టప్రకారం తిరిగేవాడవు. కానీ, ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము బిగించి నీకు ఇష్టం కాని స్థలానికి నిన్ను తీసుకుపోతాడు.” 19 అతడు ఎలాంటి చావుకు గురి అయి దేవునికి మహిమ కలిగిస్తాడో దానిని సూచించడానికి ఆయన ఆ మాటలు చెప్పాడు. ఆయన అలా చెప్పి “నన్ను అనుసరిస్తూ ఉండు” అని అతనితో అన్నాడు.
20 పేతురు వెనక్కు తిరిగి, యేసు ప్రేమించిన ఆ శిష్యుడు తమ వెంట రావడం చూశాడు. పస్కా భోజన సమయంలో యేసు ఛాతీని ఆనుకొని “ప్రభూ, నిన్ను ఎవడు పట్టి ఇస్తాడు?” అని పలికినవాడు ఇతడే. 21 అతణ్ణి చూచి పేతురు యేసుతో “ప్రభూ, ఇతని సంగతి ఏమిటి?” అన్నాడు.
22 యేసు “నేను తిరిగి వచ్చేంతవరకు అతడు ఉండిపోవడం నాకిష్టమైతే అది నీకేమిటి? నీ మట్టుకు నీవు నన్ను అనుసరిస్తూ ఉండు” అని అతనితో చెప్పాడు.
23 అందుచేత ఆ శిష్యుడు చనిపోడనే మాట సోదరులలో ప్రాకిపోయింది. అయినా అతడు చనిపోడని యేసు అతనితో చెప్పలేదు గానీ “నేను తిరిగి వచ్చేంతవరకు అతడు ఉండిపోవడం నాకిష్టమైతే అది నీకేమిటి?” అన్నాడు. 24  ఈ సంగతులను గురించి సాక్ష్యం చెపుతున్నది, వాటిని వ్రాసినది ఆ శిష్యుడే. అతని సాక్ష్యం సత్యమని మాకు తెలుసు.
25 యేసు చేసిన ఇతర కార్యకలాపాలు అనేకం. ఒకవేళ వాటిలో ప్రతిదానినీ వివరంగా వ్రాస్తే, వ్రాసిన పుస్తకాలను పెట్టడానికి ఈ లోకమే చాలదనుకొంటాను. తథాస్తు.