23
1 ✝అప్పుడు వారి గుంపంతా లేచి ఆయనను పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు. 2 ✽ “ఈ మనిషి ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. సీజర్‌కు పన్ను చెల్లించకూడదని అంటున్నాడు, తానే క్రీస్తును ఒక రాజును అంటున్నాడు. ఇదంతా మేము కనిపెట్టాం” అంటూ వారు ఆయనమీద నేరాలు మోపసాగారు.3 ✝పిలాతు “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. “నీవన్నట్టే” అని ఆయన అతనికి జవాబిచ్చాడు.
4 ✽పిలాతు ప్రధాన యాజులతో, ఆ సమూహంతో “ఈ మనిషిలో నాకెలాంటి దోషమూ కనిపించడం లేదు” అన్నాడు.
5 అయితే వారు మరీ తీవ్రతరంగా నొక్కి చెపుతూ “ఇతడు గలలీ మొదలుకొని ఈ స్థలం వరకు, యూదయ అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు!” అన్నారు.
6 ✽గలలీ అనే మాట విని పిలాతు “ఈ మనిషి గలలీవాడా?” అని అడిగాడు. 7 ✽హేరోదు అధికార పరిధికి యేసు చెందినవాడని తెలుసుకొన్న వెంటనే పిలాతు ఆయనను హేరోదు దగ్గరకు పంపాడు. ఆ రోజుల్లో హేరోదు జెరుసలంలోనే ఉన్నాడు.
8 ✽ హేరోదు యేసును చూచి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే చాలా కాలంనుంచి ఆయనను గురించి అనేక సంగతులు వింటూ ఆయనను చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని ఆశిస్తూ ఉన్నాడు కూడా. 9 అతడు ఆయనను అనేక మాటలతో ప్రశ్నించాడు గాని ఆయన అతనికేమీ జవాబు చెప్పలేదు. 10 ✽ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడ నిలుచుండి ఆయనమీద తీవ్రంగా నేరాలు మోపుతూ ఉన్నారు. 11 ✽ తరువాత హేరోదు, అతని సైనికులు ఆయనను ధిక్కరించి వెక్కిరించి ఆయనకు శోభాయమాన వస్త్రాన్ని తొడిగించి మళ్ళీ పిలాతు దగ్గరకు పంపారు. 12 ✽ఆ రోజే హేరోదు, పిలాతు ఒకనికొకడు స్నేహితులయ్యారు. అంతకు ముందు వారి మధ్య వైరం ఉంది.
13 ✝అప్పుడు పిలాతు ప్రధాన యాజులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు: 14 “ప్రజలను తప్పుదారి పట్టించే వాడంటూ మీరీ మనిషిని నా దగ్గరికి తీసుకువచ్చారు. ఇదిగో వినండి, మీ ఎదుటే నేను అతణ్ణి విమర్శించాను గాని అతనిమీద మీరు మోపిన నేరాల విషయంలో ఏ దోషమూ ఈ మనిషిలో నాకు కనబడలేదు. 15 హేరోదుకు కూడా కనబడలేదు. నేను మిమ్మల్ని మళ్ళీ అతడి దగ్గరకు పంపాను గదా! చూడండి, ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదు. 16 ✽అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను.”
17 ఆ పండుగ సమయంలో అతడు వారికి ఎవరైనా ఒకడిని విడుదల చేయడం తప్పనిసరి.
18 ✝అయితే వారంతా ఏకగ్రీవంగా “ఈ మనిషి ప్రాణాన్ని తీసెయ్యండి. మాకు బరబ్బను విడుదల చేయండి!” అని అరిచారు. 19 ఈ బరబ్బ ఆ నగరంలో తిరుగుబాటు జరిగించినందుచేత, హత్య చేసినందుచేత ఖైదుపాలయిన వాడు.
20 యేసును విడుదల చేద్దామని ఆశించి పిలాతు వారితో మరో సారి మాట్లాడాడు. 21 వారైతే “ఇతణ్ణి సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
22 అతడు మూడో సారి వారితో “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు? మరణశిక్షకు కారణమేమీ ఇతడిలో నాకు కనబడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.
23 ✽వారైతే పట్టుబట్టి బిగ్గరగా కంఠమెత్తి ఆయనను సిలువ వేయాలని కోరారు. చివరికి ఈ మనుష్యుల, ప్రధాన యాజుల కంఠధ్వనులే నెగ్గాయి. 24 వారు అడిగినట్టే జరగాలని పిలాతు తీర్పు చెప్పాడు. 25 వారు కోరినవాణ్ణి – తిరుగుబాటు, హత్య కారణంగా ఖైదుపాలయిన ఆ మనిషిని – వారికి విడుదల చేశాడు, యేసును వారికిష్టం వచ్చినట్టే చేయడానికి వారికప్పగించాడు.
26 ✝వారాయనను తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెసీమనుంచి వస్తున్న కురేనే ప్రాంతీయుడైన సీమోనును పట్టుకొన్నారు. యేసువెంట సిలువను మోయడానికి దానిని అతనిమీద పెట్టారు. 27 పెద్ద జనసమూహం ఆయన వెంట వచ్చారు. వారిలో కొందరు స్త్రీలు ఉన్నారు. వీరు ఆయన విషయం గుండెలు బాదుకొంటూ రోదనం చేస్తూ ఉన్నారు కూడా.
28 యేసు వారివైపు తిరిగి “జెరుసలం కూతుళ్ళారా! నా కోసం ఏడవకండి – మీకోసం, మీ పిల్లలకోసం ఏడ్వండి! 29 ✽ఎందుకంటే, ‘గొడ్రాళ్ళు ధన్యులు! ఎన్నడూ కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం!’ అని జనం చెప్పుకొనే రోజులు వస్తాయి. 30 ✽అప్పుడు వారు పర్వతాలతో ‘మా మీద పడండి!’ కొండలతో ‘మమ్మల్ని మరుగు చేయండి!’ అని చెప్పనారంభిస్తారు. 31 ✽వారు పచ్చని చెట్టు ఉన్న సమయంలో ఇలా చేస్తే ఎండిన దాని సమయంలో ఏమి జరుగుతుందో?” అన్నాడు.
32 ✝నేరస్థులను ఇద్దరిని కూడా ఆయనతోపాటు చంపడానికి తెచ్చారు.
33 ✽ వారు కల్వరి అనే స్థలానికి వచ్చినప్పుడు వారాయనను అక్కడ సిలువ వేశారు. ఆ నేరస్థులను కూడా ఒకణ్ణి ఆయన కుడివైపున, మరొకణ్ణి ఎడమ వైపున సిలువ వేశారు.
34 ✽అప్పుడు యేసు “తండ్రీ! వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు” అన్నాడు. వారు ఆయన బట్టలకోసం చీట్లు వేసి పంచుకొన్నారు. 35 ✝ప్రజలు అక్కడ నిలుచుండి చూస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్న అధికారులైతే ఆయనను అపహాస్యం చేస్తూ “ఇతడు ఇతరుల్ని రక్షించాడు. దేవుడు ఎన్నుకొన్న✽ అభిషిక్తుడు ఇతడే అయితే తనను తాను రక్షించుకోవాలి!” అన్నారు.
36 ✝సైనికులు కూడా ఆయనను వెక్కిరించారు. ఆయన దగ్గరకు వచ్చి పులిసిపోయిన ద్రాక్షరసం ఆయనకు ఇవ్వబోతూ 37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అన్నారు.
38 ✝“ఇతడు యూదుల రాజు” అని వ్రాసి ఆయనకు పైగా ఉంచారు. ఈ వ్రాత గ్రీక్, లాటిన్, హీబ్రూ అక్షరాలలో ఉంది.
39 ✽వ్రేలాడుతున్న నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ “నువ్వు అభిషిక్తుడివైతే నిన్ను నీవే రక్షించుకో! మమ్మల్ని కూడా రక్షించు!” అన్నాడు.
40 ✽అయితే రెండో నేరస్థుడు అతణ్ణి చీవాట్లు పెట్టి ఇలా జవాబిస్తూ అన్నాడు: “నువ్వూ ఇదే శిక్షావిధికింద ఉన్నావుగా. దేవుడంటే నీకేం భయం లేదా? 41 మనకు ఈ శిక్ష న్యాయమే. మనం చేసినవాటికి తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నాం. కానీ ఈ మనిషి ఏ తప్పిదమూ చేయలేదు.”
42 ✽అప్పుడతడు యేసుతో “ప్రభూ, మీరు మీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి” అన్నాడు.
43 అతనితో యేసు “నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఈ రోజే నీవు నాతో కూడా పరమానంద నివాసం✽లో ఉంటావు” అన్నాడు.
44 సుమారు మధ్యాహ్నం కావచ్చినప్పుడు మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. 45 ✽సూర్యమండలం అంధకారమయం అయింది, దేవాలయం తెర రెండుగా చింపబడింది.
46 ✝అప్పుడు యేసు బిగ్గరగా కేక వేసి “తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను” అన్నాడు. అలా చెప్పి ప్రాణం విడిచాడు.
47 ✽ జరిగినది చూచి శతాధిపతి “ఈ మనిషి నిజంగా న్యాయవంతుడు” అంటూ దేవుణ్ణి కీర్తించాడు.
48 ✝చూడడానికి పోగైన జనసమూహమంతా జరిగినది చూచి గుండెలు బాదుకొంటూ తిరిగి వెళ్ళిపోయారు. 49 ✝ఆయనతో పరిచయమున్న వారంతా, గలలీనుంచి ఆయనవెంట వచ్చిన స్త్రీలు కూడా, దూరంగా నిలుచుండి జరిగినవి చూస్తూ ఉన్నారు.
50 ✝యూద సమాలోచన సభలో యోసేపు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు మంచివాడు, న్యాయవంతుడు. 51 అతడు ఆ సభ వారు చేసిన నిర్ణయానికీ క్రియకూ ఒప్పుకోలేదు. అతడు యూదుల గ్రామాలలో ఒకటైన అరిమతయి నివాసి, దేవుని రాజ్యంకోసం ఎదురు చూస్తున్నవాడు. 52 ఈ మనిషి పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. 53 సిలువమీద నుంచి దానిని క్రిందకు దింపి సన్నని నారబట్టతో చుట్టాడు, తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు. దానిలో అంతకు ముందు ఎవరూ ఉంచబడలేదు. 54 అది పండుగకు సిద్ధపడే దినం. విశ్రాంతి దినం మొదలు కాబోతూ వుంది. 55 గలలీనుంచి ఆయనతోకూడా వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్ళి సమాధిని చూశారు, ఆయన దేహాన్ని దానిలో ఎలా ఉంచాడో గమనించారు. 56 ✝అప్పుడు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యాలూ పరిమళ తైలాలూ సిద్ధం చేసి దేవుని ఆజ్ఞ✽ ప్రకారం విశ్రాంతి దినాన విశ్రమించారు.