24
1 ఆదివారం నాడు తెల్లవారు జామున తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వారు, మరి కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు. 2 సమాధిముందు నుంచి ఆ రాయి దొర్లించి ఉండడం వారికి కనిపించింది. 3 అయితే వారు సమాధిలోకి వెళ్ళి చూచినప్పుడు ప్రభువైన యేసు శరీరం కనబడలేదు. 4 దీన్ని గురించి వారు అధికంగా కలవరపడుతూ ఉంటే హఠాత్తుగా ధగధగ మెరిసిపోతున్న వస్త్రాలు తొడుక్కొన్న ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలబడ్డారు. 5 ఆ స్త్రీలు భయపడి నేల వైపు తమ ముఖాలు వంచుకొన్నారు. అయితే ఆ వ్యక్తులు “సజీవుణ్ణి చనిపోయినవారిమధ్య ఎందుకు వెదకుతున్నారు? 6 ఆయన ఇక్కడ లేడు. సజీవంగా లేచాడు. ఆయన ఇంకా గలలీలో ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకోండి. 7  ఏమంటే, మానవ పుత్రుణ్ణి పాపిష్టి మనుషుల చేతికి అప్పగించడం, సిలువ వేయడం, ఆయన మూడో రోజున మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి” అని వారితో చెప్పారు.
8 అప్పుడు ఆయన మాటలు వారికి జ్ఞప్తికి వచ్చాయి. 9 వారు సమాధినుంచి తిరిగి వెళ్ళి పదకొండుమంది శిష్యులకూ తక్కినవారందరికీ ఇదంతా తెలియజేశారు. 10 ఈ విధంగా క్రీస్తు రాయబారులకు ఈ సంగతులు చెప్పినది ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ, వారితోకూడా ఉన్న ఇతర స్త్రీలు. 11 అయితే వారి మాటలు వీరికి తెలివితక్కువ కబుర్లలాగా అనిపించాయి గనుక వీరు వారిని నమ్మలేదు. 12 అయితే పేతురు లేచి సమాధిదగ్గరకు పరుగెత్తి వెళ్ళి వంగి చూశాడు.సన్నని నారబట్ట మాత్రం విడిగా ఉండడం అతనికి కనబడింది. జరిగినదానికి ఆశ్చర్యపడుతూ అతడు వెళ్ళి పోయాడు.
13 ఆ రోజే శిష్యులలో ఇద్దరు ఎమ్మాయస్ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. అది జెరుసలంకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 14 జరిగిన సంగతులన్నిటిని గురించీ వారు మాట్లాడుకొంటూ ఉన్నారు. 15 అలా మాట్లాడుకొంటూ, చర్చించుకొంటూ ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. 16 అయితే వారి కండ్లు మూతలు పడ్డట్లయింది గనుక వారాయనను గుర్తుపట్టలేదు.
17 “మీరు దుఃఖంతో నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొంటున్న సంగతి ఏమిటి?” అని ఆయన వారినడిగాడు. 18 వారిలో క్లెయొపా అనే ఒకడు ఆయనతో “జెరుసలంలో కాపురమున్న కొత్త వ్యక్తి మీరు ఒక్కరేనా? ఈ రోజుల్లో అక్కడ జరిగిన సంగతులు మీకు తెలియదా?” అన్నాడు.
19 ఆయన “ఏమి సంగతులని?” అని వారితో అన్నాడు. వారు ఆయనతో ఇలా అన్నారు: “నజరేతువాడైన యేసు సంగతులే! ఆయన దేవుని దృష్టిలోను ప్రజలందరి దృష్టిలోనూ మాటలలో, పనులలో బలప్రభావాలు ఉన్న ప్రవక్త. 20 ప్రముఖ యాజులూ మన అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారు. 21 ఇస్రాయేల్ ప్రజలకు విముక్తి కలిగించబోయేవాడు ఆయనే అని మేము ఆశతో ఎదురు చూశాం. అంతేకాదు, ఇదంతా జరిగి ఇప్పటికి మూడో రోజు. 22 ఈవేళ మా గుంపులో కొందరు స్త్రీలు మాకు విస్మయం కలిగించారు. ఉదయాన పెందలకడే వారు సమాధి దగ్గరికి వెళ్లి చూస్తే ఆయన శరీరం వారికి కనిపించలేదు. 23 వారు వచ్చి దేవదూతలు తమకు కనబడి ఆయన బతికి ఉన్నట్టు తమతో చెప్పారన్నారు. 24 మా తోటివారిలో కొందరు సమాధికి వెళ్ళి చూచినప్పుడు అంతా ఆ స్త్రీలు చెప్పినట్లే ఉంది. ఆయనను మాత్రం వారు చూడలేదు.”
25 అందుకాయన వారితో అన్నాడు మీరు తెలివి తక్కువవారు! ప్రవక్తలు చెప్పినదంతా నమ్మడంలో మంద మతులు! 26 ఆ బాధలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం క్రీస్తుకు తప్పనిసరే గదా!”
27  అప్పుడు మోషే, ప్రవక్తలందరూ వ్రాసినవాటితో మొదలుపెట్టి లేఖనాలన్నిటిలో తనను గురించిన విషయాలు ఆయన వారికి వివరించాడు.
28 వారు వెళ్తున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా ముందుకు వెళ్ళబోయాడు. 29 అయితే వారు “సాయంకాలం కావచ్చింది. పొద్దు కుంకుతూ ఉంది. మాతో ఉండిపోండి” అంటూ ఆయనను బలవంతం చేశారు. అందుచేత వారితో ఉండడానికి లోపలికి వెళ్ళాడు. 30 వారితో కూడా ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె తీసుకొని దాన్ని దీవించి విరిచి వారికి అందించాడు. 31 వెంటనే వారి కండ్లు తెరుచుకొన్నాయి. వారాయనను గుర్తుపట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా అంతర్ధానమయ్యాడు.
32 అప్పుడు “తోవలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలు తేటపరుస్తూ ఉంటే మన గుండెలు దహించుకు పోతున్నట్లు అనిపించలేదా!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
33 ఆ ఘడియలోనే వారు లేచి జెరుసలం తిరిగి వెళ్ళారు. అక్కడ వారికి కనిపించినదేమంటే, ఆ పదకొండు మంది శిష్యులూ వారితో ఉన్నవారూ గుమికూడి 34 “ప్రభువు వాస్తవంగా లేచాడు, సీమోనుకు కనబడ్డాడు!” అని చెప్పుకొంటున్నారు. 35 అది విని వారు దారిన జరిగిన సంగతులూ ఆయన రొట్టె విరిచినప్పుడు ఆయన తమకు తెలిసిపోయిన సంగతి కూడా తెలిపారు.
36  వారీ సంగతులు చెపుతూ ఉండగానే యేసే వారిమధ్య నిలబడి “మీకు శాంతి!” అని వారితో అన్నాడు.
37  ఏదో ఆత్మ తమకు కనబడిందనుకొంటూ వారు హడలిపోయి భయాక్రాంతులయ్యారు.
38 అప్పుడాయన వారితో “మీకెందుకు ఈ కంగారు? మీ హృదయాలలో సందేహాలు ఎందుకు పుట్టాయి? 39 నేనే గదా. నా చేతులూ పాదాలూ చూడండి. నన్ను తాకి చూడండి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలూ మాంసమూ ఒక ఆత్మకు ఉండవు” అన్నాడు. 40 ఈ మాటలు చెప్పి తన చేతులూ పాదాలూ వారికి చూపెట్టాడు.
41  ఆనందం కారణంగా వారింకా నమ్మలేక ఆశ్చర్యపడుతూ ఉంటే ఆయన “తినడానికి ఇక్కడ ఏమైనా ఉందా?” అని వారినడిగాడు. 42 కాల్చిన చేప ముక్కనూ కొంత తేనెపట్టునూ వారాయనకు అందించారు. 43 ఆయన వాటిని తీసుకొని వారి కండ్లెదుటే తిన్నాడు.
44 అప్పుడాయన వారితో “మీ దగ్గర ఇంకా ఉన్నప్పుడు నేను ఈ మాటలు మీతో చెప్పాను: మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసి ఉన్న విషయాలన్నీ నెరవేరడం తప్పనిసరి” అన్నాడు.
45 వారు లేఖనాలు గ్రహించగలిగేలా వారి మనసులను తెరిచాడు. 46 అప్పుడాయన “ఇలా రాసి ఉంది – ఇలా జరగడం తప్పనిసరి: అభిషిక్తుడు బాధలు అనుభవించి చనిపోయినవారిలో నుంచి మూడో రోజున సజీవంగా లేవవలసిందే. 47 జెరుసలం మొదలుకొని జనాలన్నిటికి ఆయన పేర పశ్చాత్తాపం, పాపక్షమాపణ ప్రకటించడం జరగాలి. 48  మీరు ఈ విషయాలకు సాక్షులు. 49 ఇదిగో వినండి, నా తండ్రి వాగ్దానం మీమీదికి పంపబోతున్నాను. పైనుంచి బలప్రభావాలు మిమ్ములను ఆవరించేంతవరకు జెరుసలం నగరంలోనే ఉండిపోండి” అని వారితో అన్నాడు.
50 అప్పుడాయన బేతనీ వరకు వారిని తీసుకువెళ్ళి తన చేతులెత్తి వారిని దీవించాడు. 51 వారిని దీవిస్తూ ఉండగానే వారిలోనుంచి ఆయనను పరలోకానికి తీసుకు వెళ్ళడం జరిగింది. 52 వారాయనను ఆరాధించి మహానందంతో జెరుసలం తిరిగి వెళ్ళారు. 53 దేవాలయంలో ఎప్పుడూ ఉండిపోయి దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ వచ్చారు. తథాస్తు.