22
1 పొంగని రొట్టెల పండుగ దగ్గర పడింది. దానిని ‘పస్కా’ అని అంటారు. 2 అప్పుడు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ప్రజలకు భయపడి యేసును ఎలా చంపించాలా అని చూస్తున్నారు.
3  అప్పుడు సైతాను ఇస్కరియోతు అనే ఇంటిపేరున్న యూదాలో చొరబడ్డాడు. అతడు పన్నెండుమంది శిష్యుల లెక్కలో చేరిన ఒకడు. 4 అతడు ప్రధాన యాజుల దగ్గరికీ దేవాలయం కావలి అధికారుల దగ్గరికీ వెళ్ళి, యేసును వారికెలా పట్టి ఇవ్వాలా అని వారితో మాట్లాడాడు. 5 వారు సంతోషించి అతనికి కొంత డబ్బు ఇస్తామని సమ్మతించారు. 6 అతడు మాట ఇచ్చి జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి పట్టి ఇవ్వడానికి అనువైన సమయంకోసం చూస్తూ ఉన్నాడు.
7 పొంగని రొట్టెల పండుగ రోజు, పస్కా గొర్రెపిల్లను వధించవలసిన ఆ రోజు వచ్చింది. 8 యేసు పేతురునూ యోహానునూ పంపుతూ “మీరు వెళ్ళి మనం తినడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు.
9 వారు “మేమెక్కడ సిద్ధం చేయమంటారు?” అని ఆయననడిగారు.
10 ఆయన వారితో అన్నాడు, “చూడండి, మీరు నగరంలో ప్రవేశించినప్పుడు మీకెదురుగా ఒక మనిషి నీళ్ళ కుండ మోసుకువస్తూ ఉంటాడు. అతడు ప్రవేశించే ఇంట్లోకి అతనివెంట వెళ్ళండి. ఆ ఇంటి యజమానిని చూచి ఇలా చెప్పండి: 11 ‘నేను నా శిష్యులతో కూడా పస్కాను తినడానికి అతిథిశాల ఎక్కడని గురువు మీతో అంటున్నాడు.’ 12 అతడు సామానున్న పెద్ద మేడగది మీకు చూపుతాడు. అక్కడే ఏర్పాట్లు చేయండి.”
13 వారు వెళ్ళి తమతో ఆయన చెప్పినట్టే అది చూశారు, పస్కాను సిద్ధం చేశారు.
14 ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన పన్నెండు మంది రాయబారులతోపాటు కూర్చున్నాడు. 15 అప్పుడు ఆయన వారితో “నా బాధలకు ముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని మనఃపూర్వకంగా ఆశించాను. 16 ఎందుకంటే, అది దేవుని రాజ్యంలో నెరవేరేవరకూ నేను మళ్ళీ దానిని తిననని మీతో చెపుతున్నాను” అన్నాడు.
17 అప్పుడాయన ఆ పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించిన తరువాత “దీనిని తీసుకొని దీనిలోది మీలో పంచుకోండి. 18 దేవుని రాజ్యం వచ్చేంతవరకూ నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెపుతున్నాను” అన్నాడు.
19 అప్పుడాయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత అర్పించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి “ఇది మీకోసం ధారదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేయండి” అన్నాడు.
20 అలాగే, భోజనం తరువాత ఆ పాత్రను తీసుకొని ఇలా అన్నాడు: “ఈ పాత్ర మీకోసం చిందే నా రక్తంమూలమైన క్రొత్త ఒడంబడిక. 21 అయితే ఇదిగో వినండి, నన్ను శత్రువులకు పట్టి ఇచ్చేవాని చేయి నా చేతితో కూడా ఈ బల్లమీద ఉంది. 22 దేవుని నిర్ణయం ప్రకారమే మానవ పుత్రుడు తప్పక పోతాడు గాని అయ్యో! ఎవడైతే ఆయనను పట్టి ఇస్తాడో ఆ మనిషికి శిక్ష తప్పదు!
23 తమలో ఆ పనికి ఒడికట్టేవాడెవడో అని వారు తమలో తాము ప్రశ్నించుకోసాగారు.
24 తమలో ఎవడు ప్రముఖుడుగా ఎంచబడాలో అని కూడా వారి మధ్య జగడం పుట్టింది. 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇతర ప్రజల రాజులు వారిమీద ప్రభుత్వం చేస్తారు, వారిమీద అధికారం చెలాయించే వారిని ‘ఉపకారులు’ అంటారు. 26 మీరు మాత్రం అలా కాదు. మీలో ప్రముఖుడు అందరిలో చిన్నవానిలాగా ఉండాలి, నాయకుడు సేవకునిలాగా ఉండాలి. 27 ఎవరు ప్రముఖుడు – భోజనానికి కూర్చునేవాడా? ఊడిగం చేసేవాడా? భోజనానికి కూర్చునేవాడే గదా? అయినా మీ మధ్య నేను ఊడిగం చేసేవానిలాగా ఉన్నాను. 28 నాకు వచ్చిన విషమ పరీక్షలలో నాతో నిలిచి ఉన్నవారు మీరే! 29 నా తండ్రి నాకు రాజ్యం ప్రసాదించాడు. 30 అలాగే మీరు నా రాజ్యంలో నా బల్ల దగ్గర అన్నపానాలు పుచ్చుకొంటూ ఉండాలనీ సింహాసనాల మీద కూర్చుని ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తూ ఉండాలనీ మీకూ నేను రాజ్యం ప్రసాదిస్తున్నాను.”
31 ప్రభువు ఇంకా అన్నాడు, “సీమోనూ, సీమోనూ, ఇదిగో విను. సైతాను మిమ్ములను గోధుమలలాగా జల్లించాలని మిమ్ములను కోరాడు. 32 కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు.”
33 ఆయనతో పేతురు “ప్రభూ, నీతోకూడా ఖైదుకు గానీ మరణానికి గానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను!” అన్నాడు.
34 ఆయన “పేతురూ, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పేవరకు నేడు కోడి కూయదని నీతో చెపుతున్నాను” అన్నాడు.
35 అప్పుడాయన వారితో “నేను మిమ్ములను సంచి, జోలె, చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకేమైనా కొరత అయిందా?” అన్నాడు. వారు “కాలేదు” అన్నారు.
36 అప్పుడాయన వారితో ఇలా అన్నాడు: “ఇప్పుడైతే సంచి, జోలె ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. 37 ఎందుకంటే, నేను మీతో చెప్పేదేమంటే, వ్రాసి ఉన్న ఈ లేఖనం ఇంకా నా విషయంలో నెరవేరడం తప్పనిసరి – ‘ఆయనను అక్రమకారులలో ఒకడని ఎంచడం జరిగింది.’ అవును, నన్ను గురించిన విషయాలు పూర్తి అవుతాయి.”
38 వారు “ప్రభూ, చూడు, ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో “చాలు” అన్నాడు.
39 అప్పుడాయన బయటికి వచ్చి ఎప్పటిలాగా ఆలీవ్ కొండకు వెళ్ళాడు. ఆయనవెంట శిష్యులు వెళ్ళారు. 40 ఆ స్థలం చేరుకొన్నప్పుడు ఆయన వారితో “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.
41 అప్పుడు వారి దగ్గరనుంచి రాతివేత దూరం వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేశాడు, 42 “తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నె నానుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరనియ్యి” అన్నాడు.
43 అప్పుడు పరలోకంనుంచి వచ్చిన దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. 44 ఆయన యాతనపడుతూ మరీ తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన చెమట పెద్ద రక్త బిందువులలాగా అయి నేలమీద పడింది.
45 ఆయన ప్రార్థన చేసి లేచి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూచి 46 ఆయన వారితో “మీరెందుకు నిద్రపోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా లేచి ప్రార్థన చేయండి” అన్నాడు.
47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే జనసమూహం, వారిముందు పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా నడిచి రావడం కనిపించింది. అతడు యేసును ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు. 48 “యూదా, ముద్దు పెట్టుకోవడం మూలంగా మానవ పుత్రుణ్ణి శత్రువులకు పట్టి ఇస్తున్నావా?” అని యేసు అతనితో అన్నాడు.
49 జరగబోతున్నది గ్రహించి ఆయన చుట్టూ ఉన్నవారు “ప్రభూ! వీరిని కత్తితో కొట్టుదామంటావా?” అనడిగారు.
50 వారిలో ఒకడు ప్రముఖయాజి దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి నరికివేశాడు. 51 అయితే యేసు ఆగండి, ఇది కూడా జరగనియ్యి!” అని చెప్పి అతని చెవిని తాకి అతణ్ణి బాగు చేశాడు.
52 అప్పుడు యేసు తన దగ్గరకు వచ్చిన ప్రధాన యాజులతో, దేవాలయం కావలి అధికారులతో, పెద్దలతో నేను దోపిడీ దొంగ అయినట్టు మీరు కత్తులూ కటారులతో వచ్చారేమిటి? 53 ప్రతి రోజూ నేను మీతో కూడా దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, అంధకార ప్రభావం.”
54 వారాయనను పట్టుకొని ప్రముఖ యాజి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. పేతురు ఎడంగా ఆయన వెంట వెళ్ళాడు. 55 కొందరు నడి ముంగిట చలి మంట వేసుకొని కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వారిలో కూర్చున్నాడు. 56 అతడు ఆ మంటలదగ్గర కూర్చుని ఉంటే ఒక పనిపిల్లకు కనబడ్డాడు. అతణ్ణి తేరిచూస్తూ ఆమె “ఆ మనిషి కూడా ఆయనతో ఉన్నాడు!” అంది.
57 అతడు ఆయనను కాదన్నాడు. “అమ్మాయి, ఆయననెరగను!” అన్నాడు.
58 కాసేపటికి మరొకడు అతణ్ణి చూచి “నువ్వు కూడా వారిలో ఒకడివి!” అన్నాడు. అందుకు పేతురు “నేను కానయ్యా!” అన్నాడు.
59 సుమారు గంటసేపయిన తరువాత మరొకడు “నిజంగా ఈ మనిషి అతనితో కూడా ఉన్నాడు. వీడూ గలలీ మనిషే గదా!” అని గట్టిగా చెప్పాడు.
60 అందుకు పేతురు “నువ్వు చెప్పేదేమిటో నాకేం తెలియదయ్యా!” అన్నాడు. అతడింకా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది. 61 అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురువైపు సూటిగా చూశాడు. కోడి కూసేవరకు నీవు నన్నెరగనని ముమ్మారు చెపుతావని ప్రభువు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు. 62 అప్పుడతడు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో భోరున ఏడ్చాడు.
63  యేసును నిర్భందించినవారు ఆయనను వెక్కిరించారు, కొట్టారు. 64 ఆయన ముఖం కప్పి దానిమీద దెబ్బకొట్టి “నిన్ను కొట్టినదెవరు? ప్రవక్తగా చెప్పు” అని ఆయన నడిగారు. 65 ఆయనకు వ్యతిరేకంగా ఇంకా అనేక దూషణ మాటలు పలికారు.
66 ఉదయం కాగానే ప్రజల పెద్దలు – అంటే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ కలిసి ఆయనను తమ సభ కూడిన చోటికి తీసుకువెళ్ళారు. 67 అక్కడ “నీవు అభిషిక్తుడివైతే అది మాతో చెప్పు!” అన్నారు. వారితో ఆయన ఇలా అన్నాడు: “ఒకవేళ నేను మీకు అలా చెప్పినా మీరు నమ్మరు. 68 నేను మిమ్ములను ఏదైనా అడిగితే నాకు మీరేమీ జవాబు చెప్పరు, నన్ను విడుదల చేయరు. 69 అయితే ఇకమీదట మానవపుత్రుడు బలప్రభావాలున్న దేవుని కుడివైపు కూర్చుని ఉంటాడు.”
70 అందుకు వారంతా “అలాగైతే నీవు దేవుని కుమారుడివా!” అన్నారు. వారితో ఆయన “మీరన్నట్టే నేనే ఆయనను” అన్నాడు.
71 అందుకు వారు “మనకిక సాక్ష్యంతో ఏం పని? ఇతడి నోటి మాట మనమే విన్నాం గదా!”