21
1 ఆయన తలెత్తి ధనవంతులు కానుక పెట్టెలో తమ కానుకలు వేయడం చూశాడు. 2 ఒక బీద విధవరాలు అందులో రెండు పైసలు వేయడం కూడా చూశాడు. 3 అప్పుడాయన “మీతో నిజం చెపుతున్నాను, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. 4 ఎలాగంటే వారంతా దేవునికి తమ కలిమిలో నుంచి కానుకలు వేశారు గాని ఈమె తన లేమిలో నుంచి తన బ్రతుకుదెరువంతా వేసింది” అన్నాడు.
5  దేవాలయం అందమైన రాళ్ళతో, కానుకలతో అలంకరించబడ్డ సంగతిని గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన 6 “మీరు వీటిని చూస్తున్నారే. రాయిమీద మరో రాయి నిలవకుండా అన్నిటినీ పడద్రోసే రోజు వస్తుంది” అన్నాడు.
7 “ఉపదేశకా, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరగబోయేముందు ఏ సూచన కలుగుతుంది?” అని వారాయనను అడిగారు.
8 అందుకాయన “మీరు మోసానికి గురి అయి తప్పుదారి పట్టకుండా చూచుకోండి. ఎందుకంటే, అనేకులు నా పేర వచ్చి ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. కాబట్టి మీరు వారిని అనుసరించకండి.
9 “యుద్ధాలను, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడకండి. మొదట అవి తప్పక జరగాలి గాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.
10 అప్పుడాయన వారితో ఇంకా అన్నాడు: “జనంమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయి. 11 అక్కడక్కడ గొప్ప భూకంపాలూ, కరవులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ మహా సూచనలూ కనిపిస్తాయి.
12 “అయితే ఇవన్నీ జరగకముందే వారు మిమ్ములను పట్టుకొంటారు, హింసిస్తారు. సమాజ కేంద్రాలకూ చెరసాలలకూ అప్పగిస్తారు. నా పేరుకోసం రాజుల ఎదుటికీ ప్రాంతీయాధికారుల ఎదుటికీ మిమ్ములను తీసుకుపోవడం జరుగుతుంది. 13 దానివల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. 14 మీరు ‘ఏ ఏ జవాబులు చెప్పాలో’ అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసును దిటవు చేసుకోండి. 15 ఎందుకంటే, మీ విరోధులంతా ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ నోట్లో మాటలూ నేను మీకిస్తాను. 16 తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ చుట్టాలూ మిత్రులూ కూడా మిమ్ములను శత్రువులకు పట్టి ఇస్తారు. మీలో కొందరిని చంపివేస్తారు. 17 నా పేరు కారణంగా అందరు మిమ్ములను ద్వేషిస్తారు. 18 కానీ నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. 19 మీ ఓర్పు చేత మీ ప్రాణాలను స్వాధీనంలో ఉంచుకోండి.
20  “జెరుసలం చుట్టూరా సైన్యాలు ముట్టడించడం మీరు చూచేటప్పుడు దాని వినాశ కాలం దగ్గరపడిందని తెలుసుకోండి. 21 అప్పుడు యూదయ ప్రాంతంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. నగరంలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవాలి. పల్లెసీమలో ఉన్నవారు దానిలోకి వెళ్లకూడదు. 22 ఎందుకంటే అవి దేవుని న్యాయ దండన రోజులు. వ్రాసివున్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. 23 అయ్యో! ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకూ బాలింతలకూ ఎంతో కష్టం కలుగుతుంది! ఎందుకంటే ఈ దేశంలో చాలా దురవస్థ సంభవిస్తుంది, ఈ ప్రజలమీదికి ఆగ్రహం వస్తుంది. 24 వారు కత్తిపాలై కూలుతారు. చెరపట్టబడి అన్ని జనాలలోకీ వెళ్తారు. యూదేతర ప్రజల కాలాలు పూర్తి అయ్యేవరకు యూదేతర ప్రజలు జెరుసలంను కాళ్ళక్రింద త్రొక్కుతారు.
25 “సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు ఉంటాయి. భూమి మీద సముద్రం, దాని అలలు ఘోషిస్తూ ఉంటే ప్రజలకు వేదన, కలవరం కలుగుతాయి. 26 ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి. అందువల్ల లోకంమీదికి రాబోతున్న వాటిని గురించి ఎదురు చూస్తూ మనుషులు భయంతో మూర్ఛపోతారు. 27 అప్పుడు మానవపుత్రుడు మేఘాలలో బలప్రభావాలతోనూ మహా మహిమతోను రావడం వారు చూస్తారు. 28  అయితే ఈ సంగతులు జరగనారంభించి నప్పుడు మీ తలలెత్తి పైకి చూడండి – మీ విముక్తి సమీపిస్తూ ఉంటుంది.”
29 అప్పుడాయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు: “అంజూర చెట్టునూ చెట్లన్నిటినీ చూడండి. 30 అవి చిగురు పెట్టగానే వసంతకాలం దగ్గరపడిందని మీ అంతట మీరే తెలుసుకొంటారు గదా! 31 అలాగే, ఈ సంగతులు జరుగుతూ ఉండడం మీరు చూచినప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి. 32 మీతో ఖచ్చితంగా అంటున్నాను. ఇవన్నీ జరిగేవరకు ఈ జాతి ఏ మాత్రమూ గతించదు. 33 ఆకాశం, భూమి గతిస్తాయి గానీ నా మాటలు ఎన్నటికీ గతించవు.
34 “త్రాగి తందనాలాడడం, మత్తుగా ఉండడంవల్ల, ఇహలోక చింతలవల్ల మీ హృదయాలు బరువెక్కిపోకుండా, ఆ రోజు ఆకస్మికంగా మీమీదికి రాకుండా జాగ్రత్తగా ఉండండి. 35 అది భూతలమంతటి మీద నివసించేవారందరిమీదికి ఉరిలాగా వస్తుంది. 36 జరగబోయే వాటన్నిటిలోనుంచి మీరు తప్పించుకొని మానవపుత్రుని ఎదుట నిలబడడానికి తగినవారుగా ఎంచబడేలా ఎప్పుడూ మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి.”
37 ప్రతి రోజూ పగలు ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు, సాయంత్రమైనప్పుడు ఆలీవ్ కొండమీదికి వెళ్ళి రాత్రి గడిపేవాడు. 38 ఆయన ఉపదేశం వినడానికి ప్రజలంతా ప్రొద్దున పెందలకడే దేవాలయానికి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.