20
1 ఆ రోజుల్లో ఒక దినం ఆయన దేవాలయంలో ప్రజలకు ఉపదేశిస్తూ శుభవార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఎదురు పడి, 2 “నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ అధికారం నీకిచ్చినవాడెవడు? మాతో చెప్పు” అని ఆయననడిగారు.
3 ఆయన “నేనూ మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. 4 యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి పరలోకం నుంచా? మనుషుల నుంచా? నాతో చెప్పండి!” అని వారికి జవాబిచ్చాడు.
5 వారు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు: “ఒకవేళ, పరలోకం నుంచి అని మనం చెపితే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతణ్ణి నమ్మలేదు?’ అంటాడు గదా! 6 అది మనుషుల నుంచి అని చెపితే జనమంతా మనమీద రాళ్ళు విసిరి వేస్తారు. యోహాను ఒక ప్రవక్త అని వారు స్థిరంగా నమ్ముతున్నారు గదా.” 7 కనుక, అది ఎక్కడనుంచో తమకు తెలియదని వారు జవాబిచ్చారు.
8 వారితో యేసు “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.
9 అప్పుడాయన ప్రజలకు ఈ ఉదాహరణ చెప్పసాగాడు: “ఒక మనిషి ద్రాక్షతోట నాటి దానిని రైతులకు కౌలుకిచ్చి దూర దేశంలో చాలా కాలం అక్కడికి ప్రయాణమై పోయాడు. 10 కోత కాలం వచ్చినప్పుడు వారు ఆ ద్రాక్ష పంటలో కొంత తనకివ్వాలని ఆ రైతుల దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు. కానీ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. 11 మరోసారి అతడు మరో దాసుణ్ణి పంపాడు. అతణ్ణి కూడా వారు కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేశారు. 12 మూడో సారి అతడు దాసుణ్ణి పంపాడు. వారతణ్ణి గాయపరచి బయటికి త్రోసివేశారు.
13 “అప్పుడు ద్రాక్షతోట సొంతదారుడు ‘నేనేం చెయ్యను? నా ప్రియ కుమారుణ్ణి పంపుతాను. బహుశా వారాయనను చూస్తే గౌరవిస్తారు’ అన్నాడు. 14 కానీ అతణ్ణి చూచి రైతులు ‘వారసుడు ఇతడే! వారసత్వం మనది అయ్యేలా అతణ్ణి చంపుదాం రండి’ అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకొన్నారు. 15 అప్పుడు వారతణ్ణి ద్రాక్షతోట వెలుపలికి గెంటివేసి చంపారు.
“అందుచేత ద్రాక్షతోట యజమాని వారినేమి చేస్తాడు? 16 అతడు వచ్చి ఆ రైతులను ధ్వంసం చేసి ద్రాక్షతోటను వేరేవారి చేతికిస్తాడు.” అది విని వారు “అలా ఎన్నడూ కాకూడదు!” అన్నారు.
17 ఆయన వారివైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు: “అలాగైతే రాసి ఉన్న ఈ విషయానికి అర్థం ఏమిటి – ‘కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’? 18 ఈ రాయిమీద పడే వారెవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరిమీద పడుతుందో ఆ వ్యక్తిని చూర్ణం చేస్తుంది.”
19 ఆయన తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ చెప్పాడని గ్రహించి ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ఆ సమయంలోనే ఆయనను పట్టుకోవాలని చూశారు గాని ప్రజలకు భయపడ్డారు. 20 కనుక వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు, న్యాయవంతులుగా నటించిన గూఢచారులను ఆయన దగ్గరకు పంపారు. ఆయన మాటలను పట్టి ఆయనను రోమన్‌ అధిపతి అధికారానికీ ప్రభావానికీ అప్పగించాలని వారి ఉద్దేశం.
21 వారాయనను ఇలా అడిగారు: “ఉపదేశకా! మీరు చెప్పేదీ ఉపదేశించేదీ సరిగానే ఉందనీ ఎవరి పక్షమూ వహించకుండా దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టే ఉపదేశిస్తారనీ మాకు తెలుసు. 22 సీజర్‌కు మనం సుంకం చెల్లించడం న్యాయమా? కాదా?”
23 ఆయన వారి కపటాన్ని పసికట్టి “నన్నెందుకు శోధిస్తున్నారు? 24 దేనారం నాకు చూపెట్టండి. దీనిమీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారితో అన్నాడు.
వారు “సీజర్‌వి” అని జవాబిచ్చారు.
25 ఆయన వారితో “కాబట్టి సీజర్‌వి సీజర్‌కూ దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.
26 ప్రజల సముఖంలో ఆయన మాటలలో వారు తప్పుపట్టలేక ఆయన చెప్పిన జవాబుకు అధికంగా ఆశ్చర్యపడి ఊరుకొన్నారు.
27 అప్పుడు సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు. (వీరు చనిపోయినవారు సజీవంగా లేవరని చెప్పేవారు.)
28 వారాయనను ఇలా ప్రశ్నించారు: “ఉపదేశకా, మోషే మనకోసం రాసినది ఇది – భార్య బతికి ఉన్నప్పుడు ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసుకొని అతడికి సంతతిని కలిగించాలి. 29 ఏడుగురు అన్నదమ్ములుండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా చనిపోయాడు. 30 అలాగే రెండోవాడు ఆమెను భార్యగా స్వీకరించి సంతానం లేకుండా చనిపోయాడు, 31 తరువాత మూడోవాడు ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అలాగే ఆ ఏడుగురూ చేసుకొన్నారు, సంతానం లేకుండా చనిపోయారు. 32 చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. 33 అందుచేత, చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు ఆమె వారిలో ఎవరి భార్య అవుతుంది? ఆమె ఆ ఏడుగురికీ భార్యగా ఉంది గదా?”
34 యేసు వారికి జవాబిస్తూ అన్నాడు “ఇహలోకం మనుషులు పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ ఉన్నారు. 35 కాని వచ్చే యుగానికీ చనిపోయినవారిలో పునర్జీవితానికీ తగినవారి లెక్కలో చేరినవారు పెండ్లి చేసుకోరు, పెండ్లి కియ్యరు. 36 వారు చనిపోయి బ్రతికినవారు, దేవుని కుమారులు. వారు దేవదూతలలాగా ఉండి అప్పటినుంచి ఎన్నడూ చనిపోలేరు.
37 “చనిపోయినవారు సజీవంగా లేస్తారని మోషే కూడా పొదను గురించిన భాగంలో సూచించాడు. ఎలాగంటే, అతడు ప్రభువును ‘అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు’ అని పిలిచాడు. 38 ఆయన చనిపోయినవారి దేవుడు కాడు, జీవిస్తూ ఉన్నవారి దేవుడు. ఆయన దృష్టిలో అందరూ సజీవులు.”
39 ధర్మశాస్త్ర పండితులు కొందరు జవాబిస్తూ “ఉపదేశకా, బాగా చెప్పావు” అన్నారు. 40 అప్పటినుంచి వారు ఆయనను మరే ప్రశ్నా అడగడానికి తెగించలేదు.
41 అప్పుడాయన వారితో ఇలా అన్నాడు: “అభిషిక్తుడు దావీదు కుమారుడు అని వారెలా అనగలరు? 42 ఆ దావీదే కీర్తనల గ్రంథంలో అన్నదేమంటే, ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు – 43 నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచేవరకు నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు. 44 దావీదు ఆయనను ‘ప్రభువు’ అంటున్నాడు. అలాగైతే ఆయన అతనికెలా కుమారుడవుతాడు?”
45 ఆ జనులంతా వింటూ ఉండగానే ఆయన తన శిష్యులతో అన్నాడు 46 “ధర్మశాస్త్ర పండితుల విషయం జాగ్రత్త! పొడుగాటి అంగీలు తొడుక్కొని తిరగడం వారికిష్టం. సంత వీధులలో వందనాలు అందుకోవడం, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు, విందులలో ముఖ్య స్థలాలు వారికి ప్రీతి. 47 విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగివేసేవారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేసేవారు కూడా వీరే. వారికి మరీ కఠినమైన శిక్ష కలుగుతుంది.”