19
1 ✽ ఆయన యెరికోలో ప్రవేశించి దానిగుండా వెళ్తూ ఉన్నాడు. 2 అక్కడ జక్కయ్య అనే మనిషి ఉండేవాడు. అతడు ఒక ప్రధాన సుంకంవాడు✽, ఆస్తిపరుడు. 3 యేసు ఎవరో అని చూడడానికి ప్రయత్నించాడు గాని జన సమూహం కారణంగా చూడలేకపోయాడు. ఎందుకంటే అతడు పొట్టివాడు. 4 ✽కనుక ఎలాగైనా ఆయనను చూద్దామని ఆయన ఆ వైపే వస్తున్నాడని తెలిసి ముందుకు పరుగెత్తి మేడి చెట్టెక్కాడు.5 ✽యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తలెత్తి అతణ్ణి చూచి అతనితో “జక్యయ్యా! త్వరగా దిగిరా! ఈవేళ నేను నీ ఇంట్లో ఉండాలి!” అన్నాడు.
6 ✽అప్పుడే అతడు త్వరగా చెట్టు దిగి సంతోషంతో ఆయనను స్వీకరించాడు. 7 ✝ఇది చూచి జనమంతా “పాపి అయిన మనిషి ఇంటికి అతిథిగా వెళ్ళాడేమిటి ఈయన!” అంటూ గొణగసాగారు.
8 ✽అయితే జక్కయ్య నిలబడి ప్రభువుతో ఇలా అన్నాడు: “ఇదిగో, ప్రభూ, ఇప్పుడే నా ఆస్తిలో సగం బీదలకిచ్చేస్తాను. నేనెవరినైనా వంచించి ఏదైనా తీసుకొన్నానంటే ఆ వ్యక్తికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను✽.”
9 ✽అతనితో యేసు “ఈవేళ ఈ ఇంటికి పాపవిముక్తి వచ్చింది. ఎందుకంటే, ఇతడు కూడా అబ్రాహాము సంతతివాడు. 10 నశించినదానిని✽ వెదకి రక్షించడానికి మానవ పుత్రుడు✽ వచ్చాడు” అన్నాడు.
11 ✽వారు ఈ మాటలు వింటూ ఉంటే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన జెరుసలం దరిదాపులలో ఉన్నాడు, దేవుని రాజ్యం✽ వెంటనే కనిపిస్తుందని వారనుకొన్నారు.
12 ✽అందుచేత ఆయన ఇలా అన్నాడు: “గొప్ప వంశానికి చెందిన మనుషుడొకడు తనకోసం ఒక రాజ్యాన్ని స్వీకరించి తిరిగి రావడానికి దూర దేశానికి ప్రయాణం కట్టాడు. 13 మొదట తన దాసులను✽ పదిమందిని పిలిచి వారికి పది బంగారు నాణేలు ఇచ్చాడు. ‘నేను తిరిగి వచ్చేంతవరకు దీనితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.
14 ✽“అయితే అతని పౌరులకు అతడంటే ద్వేషం, గనుక ‘ఈ వ్యక్తి మామీద పరిపాలించడం మాకిష్టం లేదు’ అంటూ అతని వెనుక రాయబారం పంపారు.
15 ✽“అతడైతే ఆ రాజ్యాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. రాగానే, తాను డబ్బిచ్చిన దాసుల్లో ఒక్కొక్కరు వ్యాపారంవల్ల ఎంతెంత సంపాదించారో తెలుసుకొందామని వారిని తన దగ్గరకు పిలవమని ఆజ్ఞ జారీ చేశారు.
16 ✽“మొదటివాడు వచ్చి ‘యజమానీ, మీ నాణెం పది నాణేలు సంపాదించింది’ అన్నాడు.
17 ✽ “అందుకతడు ‘భళా, మంచి దాసుడా! చాలా చిన్న విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక పది నగరాలమీద అధికారిగా ఉండు’ అని అతనితో చెప్పాడు.
18 ✽“రెండో దాసుడు వచ్చి ‘యజమానీ, మీ నాణెం అయిదు నాణేలు సంపాదించింది’ అన్నాడు.
19 ✽“అతడు ‘నీవు అయిదు నగరాలమీద అధికారిగా ఉండు’ అని అతనితో కూడా చెప్పాడు.
20 ✝“అప్పుడు మరో దాసుడు వచ్చి ఇలా అన్నాడు: ‘యజమానీ, ఇదిగో మీ నాణెం. దీనిని గుడ్డలో కట్టి ఉంచాను. 21 ఎందుకంటే, మీరంటే నాకు భయం – మీరు కఠినులు, మీరు పెట్టనిది తీసుకొంటారు, వెదజల్లనిది కోస్తారు.’
22 ✽“అందుకతడు అతనితో ‘చెడ్డ దాసుడా! నీ సొంత నోటనుంచి వచ్చినదాని ప్రకారమే నీకు తీర్పు తీరుస్తాను. నేను కఠినుణ్ణనీ పెట్టనిది తీసుకుంటాను, వెదజల్లనిది కోస్తాను అనీ నీకు తెలుసు అంటున్నావు గదా? 23 అలాంటప్పుడు నీవు నా డబ్బు సాహుకారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా పెట్టి ఉంటే నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకొని ఉండేవాణ్ణే.’
24 “అప్పుడతడు దగ్గర నిలుచున్న వారితో ‘ఈ బంగారు నాణెం వీడిదగ్గర నుంచి తీసివేసి పది నాణేలు ఉన్నవాని చేతికివ్వండి’ అన్నాడు.
25 “అతనితో వారు ‘యజమానీ, అతనికి పది నాణేలు ఉన్నాయే!’ అన్నారు.
26 “అందుకతడు ‘మీతో నేనంటున్నాను, కలిగి ఉన్న ప్రతి వ్యక్తికీ ఇంకా ఇవ్వడం, లేని వ్యక్తినుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. 27 ✽మరో మాట – నేను తమమీద పరిపాలించడం ఇష్టం లేని నా పగవారిని ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుటే చంపండి.’”
28 ✝ఈ మాటలు చెప్పిన తరువాత యేసు జెరుసలం ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళ్ళాడు. 29 ఆయన ఆలీవ్ కొండమీద ఉన్న బేత్‌ఫగే, బేతనీ✽ సమీపించినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ 30 “మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిదపిల్ల ఒకటి మీకు కనబడుతుంది. దానిమీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకురండి. 31 ‘మీరెందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఎవరైనా మిమ్ములను అడిగితే, అతనితో ‘ఇది ప్రభువుకు అవసరం గనుక’ అనండి” అన్నాడు.
32 ✝ఆయన పంపినవారు వెళ్ళి చూచినప్పుడు ఆయన తమతో చెప్పినట్టే అది కనిపించింది. 33 వారు ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉంటే దాని స్వంతదారులు “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని వారినడిగారు.
34 అందుకు వారు “ఇది ప్రభువుకు అవసరం” అన్నారు. 35 అప్పుడా గాడిద పిల్లను యేసుదగ్గరకు తోలుకువచ్చి దానిమీద తమ పైబట్టలు వేసి దాని మీద యేసును కూర్చోబెట్టారు. 36 ఆయన వెళ్తూ ఉంటే కొందరు తమ పైబట్టలు దారి వెంట పరిచారు.
37 ఆలీవ్ కొండమీదనుంచి దారి దిగే స్థలం దగ్గరకు ఆయన చేరినప్పుడు, శిష్యుల గుంపంతా తాము చూచిన అద్భుతాలన్నిటిని గురించీ కంఠమెత్తి సంతోషంతో దేవుణ్ణి స్తుతించసాగారు, 38 ✝“ప్రభువు పేరట వస్తున్న రాజు ధన్యజీవి! పరలోకంలో శాంతి! ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.
39 ✝జన సమూహంలో పరిసయ్యులు కొందరు యేసుతో “ఉపదేశకా! నీ శిష్యులను చీవాట్లు పెట్టు!” అన్నారు.
40 ✽అందుకాయన “నేను మీతో చెప్పేదేమంటే, ఒక వేళ వీరు ఊరుకొంటే ఈ రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి!” అని వారికి జవాబిచ్చాడు.
41 ✽ఆయన జెరుసలం నగరానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని గురించి ఏడ్చాడు, 42 ✽“నీవు – నీవు సైతం – ఈ నీ రోజైనా నీ శాంతి కోసం కావలసినవి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! కానీ ఇప్పుడు నీ కండ్లకు అవి మరుగై ఉన్నాయి. 43 ✽ నీ పగవారు నీ చుట్టూ మట్టిదిబ్బ వేసి ముట్టడించి అన్ని ప్రక్కలా నిన్ను మూసివేసే రోజులు వస్తాయి. 44 వారు నిన్నూ నీ లోపల ఉన్న నీ పిల్లలనూ నేల మట్టం చేస్తారు. నీలో ఏ ఒక్క రాయిమీద మరో రాయి ఉండకుండా చేస్తారు. ఎందుకంటే ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నీవు తెలుసుకోలేదు” అన్నాడు.
45 ✝అప్పుడాయన దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మే వారితో కొనేవారితో 46 “నా ఆలయం ప్రార్థన ఆలయమని రాసి ఉంది. మీరైతే దానిని దోపిడీ దొంగల గుహగా చేశారు” అంటూ వారిని బయటికి వెళ్ళగొట్టసాగాడు.
47 ✝ప్రతి రోజూ ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు గాని ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ప్రజల నాయకులూ ఆయనను రూపుమాపడానికి చూశారు. 48 ✝అయితే ఏమి చేయాలో వారికి పాలుపోలేదు. ఎందుకంటే, జనమంతా ఆయనను విడవకుండా సావధానంగా ఆయన ఉపదేశం వింటూ ఉన్నారు.