18
1  మనుషులు నిరుత్సాహపడకుండా నిత్యమూ ప్రార్థన చేస్తూ ఉండాలని వారికి నేర్పడానికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: 2 “ఒక పట్టణంలో న్యాయాధిపతి ఒకడుండేవాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. 3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె అతని దగ్గరకు వస్తూ ‘నా ప్రత్యర్థి విషయంలో నాకు న్యాయం జరిగించండి’ అని అడుగుతూ ఉండేది.
4 “కొంత కాలం అతడు అలా చేయడానికి ఇష్టపడలేదు. గాని తరువాత అతడు 5 ‘ఈ విధవరాలు నన్ను విసిగిస్తూ ఉంది గనుక దేవుడంటే నాకు భయం లేకపోయినా మనుషులంటే లెక్క లేకపోయినా ఈమెకు న్యాయం జరిగిస్తాను. లేకపోతే అదే పనిగా వస్తూ నా ప్రాణం తోడేస్తుంది’ అనుకొన్నాడు.”
6 ప్రభువు ఇంకా అన్నాడు “న్యాయం లేని ఆ న్యాయాధిపతి చెప్పినది మీ చెవుల్లో పడనివ్వండి. 7 మరి, దేవుడు తాను ఎన్నుకొన్న తన వారి విషయంలో దీర్ఘ సహనం చూపుతూ, వారు తనకు రాత్రింబగళ్ళు మొరపెట్టుకొంటూ ఉంటే ఆయన వారి కోసం న్యాయం జరిగించడా? 8 వారికోసం ఆయన త్వరగా న్యాయం జరిగిస్తాడని మీతో చెపుతున్నాను. అయినా మానవ పుత్రుడు వచ్చేటప్పుడు విశ్వాసం అనేది భూమిమీద ఆయనకు వాస్తవంగా కనిపిస్తుందా?”
9  తామే న్యాయవంతులని తమలో నమ్మకం ఉంచుకొంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: 10 “ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకంవాడు.
11 “పరిసయ్యుడు నిలుచుండి తనతో ఇలా ప్రార్థించాడు: ‘దేవా, ఇతరులు వంచకులూ అన్యాయస్థులూ వ్యభిచారులూ ఈ సుంకంవాడిలాంటివారూ. నేను వారివంటి వాణ్ణి కాను గనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. 12 నేను వారానికి రెండు సార్లు ఉపవాసముంటాను, నా రాబడి అంతట్లో పదో భాగం చెల్లిస్తూ వున్నాను.’
13 “ఆ సుంకంవాడైతే దూరంగా నిలుచుండి ఆకాశంవైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాడు. గుండెలు బాదుకొంటూ ‘దేవా! నేను పాపినే. నన్ను కరుణించు!’ అన్నాడు.
14 “న్యాయవంతుడని లెక్కలో చేరి అలా ఇంటికి వెళ్ళినది ఇతడే గాని ఆ మొదటి మనిషి కాదని మీతో చెపుతున్నాను. ఎందుకంటే, తనను గొప్ప చేసుకొనే ప్రతి ఒక్కరినీ తగ్గించడం, తనను తగ్గించుకొనేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.”
15 వారు పసి పాపల మీద ఆయన చేతులుంచాలని వారిని ఆయనదగ్గరకు తెచ్చారు. అది చూచి శిష్యులు వారిని మందలించారు. 16 అయితే యేసు వారిని దగ్గరకు పిలుచుకొని “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆటంకపరచవద్దు. ఇలాంటివారిదే దేవుని రాజ్యం. 17 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివారెవరైనా సరే అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు.
18 అధికారి ఒకడు ఆయనను చూచి “మంచి ఉపదేశకా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయననడిగాడు.
19 అతనితో యేసు అన్నాడు “నన్ను మంచివాడంటూ సంబోధిస్తున్నావెందుకని? దేవుడు ఒక్కడే మంచివాడు, ఇంకెవరూ కాదు. 20 ఆజ్ఞలు నీకు తెలుసు – ‘వ్యభిచారం చేయకూడదు,’ ‘హత్య చేయకూడదు’, ‘దొంగతనం చేయకూడదు’, ‘అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు’, ‘తల్లిదండ్రులను గౌరవించాలి.’”
21 అతడు “చిన్నప్పటినుంచే వీటన్నిటినీ పాటిస్తూ ఉన్నాను” అన్నాడు.
22 ఆ మాటలు విని యేసు అతనితో “నీకు ఇంకా ఒకటి కొదువగా ఉంది. నీకున్నదంతా అమ్మి బీదలకు పంచి ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సొమ్ము ఉంటుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.
23 అతనికి చాలా ఆస్తి ఉంది గనుక ఇది వినగానే ఎంతో నొచ్చుకొన్నాడు. 24 అతడు ఎంతో నొచ్చుకొన్నాడని చూచి యేసు “ధనధాన్యాలున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టతరం! 25 ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో గుండా వెళ్ళడమే సులభం!” అన్నాడు.
26 అది విన్నవారు “అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు?” అన్నారు.
27 అందుకాయన “మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే!” అన్నాడు.
28 అప్పుడు పేతురు “ఇదిగో, మేము సమస్తాన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు.
29 ఆయన వారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఎవరైనా సరే దేవుని రాజ్యంకోసం ఇంటిని గానీ భార్యను గానీ అన్నదమ్ములను గానీ తల్లిదండ్రులను గానీ పిల్లలను గానీ విడిచిపెడితే 30 ఆ వ్యక్తికి తప్పక ఇహంలో ఎన్నో రెట్లు కలుగుతుంది, వచ్చే యుగంలో శాశ్వత జీవం ఉంటుంది.”
31 ఆయన తన పన్నెండుమందిని ప్రక్కకు తీసుకువెళ్ళి వారితో “ఇదిగో వినండి, మనం జెరుసలం వెళ్ళిపోతున్నాం. మానవపుత్రుణ్ణి గురించి ప్రవక్తలచేత వ్రాసి ఉన్నవన్నీ నెరవేరుతాయి. 32 ఎలాగంటే ఆయనను యూదేతర ప్రజల చేతికి పట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆయన వేళాకోళానికీ అవమానానికీ గురి అవుతాడు. వారాయన మీద ఉమ్మివేస్తారు. 33 ఆయనను కొరడా దెబ్బలు కొడతారు, చంపుతారు. మూడో రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు” అన్నాడు.
34 వారైతే ఈ విషయాలలో ఒక్కటి కూడా గ్రహించలేదు. ఆ వాక్కు వారికి రహస్యంగా ఉంది. ఆయన చెప్పినది వారికేమీ అర్థం కాలేదు.
35 ఆయన యెరికో దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు దారి ప్రక్కన గుడ్డివాడు కూర్చుని బిచ్చమడుక్కొంటూ ఉన్నాడు. 36 జన సమూహం అటువైపు వెళ్ళిపోతున్న చప్పుడు విని “ఏమిటి ఇదంతా?” అని అడిగాడు.
37 నజరేతువాడైన యేసు అటువైపు వెళ్తున్నాడని ఎవరో అతనికి తెలిపారు. 38 అప్పుడతడు “యేసూ! దావీదు కుమారా! నామీద దయ చూపండి!” అని కేకలు వేశాడు.
39 ముందు నడుస్తున్నవారు ఊరుకోమంటూ అతణ్ణి గద్దించారు. అయితే అతడు మరీ ఎక్కువగా “దావీదు కుమారా! నా మీద దయ చూపండి!” అని కేకలు పెట్టాడు.
40 యేసు ఆగి అతణ్ణి తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశించాడు. అతడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన 41 “నీ కోసం నేనేమి చేయాలని కోరుతున్నావు?” అని అతణ్ణి అడిగాడు.
అతడు “ప్రభూ, నేను చూపు పొందాలని కోరుతున్నాను” అన్నాడు.
42 యేసు అతనితో “చూపు పొందు! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు.
43 వెంటనే అతడు చూపు పొందాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన వెంట వచ్చాడు. అది చూచి ప్రజలంతా దేవుణ్ణి స్తుతించారు.