17
1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఆటంకాలు రాకపోవడం అసాధ్యం గాని అవి ఎవరివల్ల వస్తాయో అయ్యో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. 2 ఈ చిన్న బిడ్డల్లో ఒకరికి ఆ వ్యక్తి ఆటంకం కలిగించి ఉండడంకంటే మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయబడడమే అతనికి మేలు!
3 “మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. అతడు పశ్చాత్తాపపడితే అతణ్ణి క్షమించండి. 4 ఒకవేళ అతడు మీకు వ్యతిరేకంగా ఒక్క రోజునే ఏడు సార్లు అపరాధం చేసి ఒక్క రోజునే ఏడు సార్లు మీ దగ్గరకు వచ్చి ‘పశ్చాత్తాపపడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
5 ప్రభు రాయబారులు ఆయనతో “మా నమ్మకాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు.
6 అందుకు ప్రభువు అన్నాడు, “మీకు ఆవ గింజంత నమ్మకం ఉంటే, ఈ మారేడు చెట్టును చూచి ‘నీవు వేరులతో కూడా పెళ్ళగించబడి సముద్రంలో నాటుకుపో’ అంటే అది మీకు లోబడుతుంది. 7 మీలో ఎవరికైనా దాసుడున్నాడు అనుకోండి. అతడు పొలం దున్నుతున్నాడు, లేదా, గొర్రెలు మేపుతున్నాడు. అతడు పొలంనుంచి వచ్చినప్పుడు ఆ యజమాని ‘వెంటనే వచ్చి భోజనానికి కూర్చో!’ అంటాడా? 8 దానికి బదులుగా ‘నా కోసం భోజనం సిద్ధం చెయ్యి. నడుము కట్టి నాకు అన్నపానాలు వడ్డించిన తరువాత నీవు తిని తాగుదువు గాని’ అంటాడు గదా! 9 అతడిచ్చిన ఆజ్ఞలు దాసుడు నెరవేర్చినందుచేత దాసునికి కృతజ్ఞత చెప్తాడా? చెప్తాడని అనుకోను. 10 అలాగే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు నెరవేర్చిన తరువాత ‘మేము పనికిమాలిన దాసులం, చేయవలసినదే చేశాం అంతే’ అనాలి.”
11 ఆయన జెరుసలం ప్రయాణమైపోతూ సమరయ, గలలీ సరిహద్దులో సాగిపోతూ ఉన్నాడు. 12 ఒక గ్రామంలో ఆయన ప్రవేశిస్తూ ఉంటే కుష్ఠురోగమున్న పదిమంది పురుషులు ఎదురుగా వస్తున్నారు. 13 వారు దూరాన నిలుస్తూ కంఠమెత్తి ‘యేసూ! నాయకా! మామీద జాలి చూపు!’ అన్నారు.
14 వారిని చూచి ఆయన వారితో “మీరు వెళ్ళి యాజులకు కనబడండి” అన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉండగానే వారు శుద్ధమయ్యారు. 15 వారిలో ఒకడు తన రోగం పూర్తిగా నయం కావడం చూచి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ వెనక్కు తిరిగి వచ్చాడు. 16 యేసు పాదాలదగ్గర సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయ దేశస్థుడు.
17 అందుకు యేసు అన్నాడు “శుద్ధం అయిన వారు పదిమంది గదా! తక్కిన తొమ్మిదిమంది ఎక్కడ? 18 తిరిగి వచ్చి దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడకపోవడమేమిటి?” 19 అప్పుడు అతనితో “లేచి నీ దారిన వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు.
20 ఒక సారి పరిసయ్యులు “దేవుని రాజ్యమెప్పుడు వస్తుంది?” అని ఆయనను అడిగినప్పుడు ఆయన వారికి జవాబిస్తూ “దేవుని రాజ్యం కండ్లకు కనిపించే విధంగా రాదు. 21 ‘ఇదిగో, ఇక్కడ’ లేదా, ‘అదిగో, అక్కడ!’ అని మనుషులు అనరు. ఎందుకంటే, ఇదిగో దేవుని రాజ్యం ఇప్పుడే మీ మధ్య ఉంది!” అన్నాడు.
22 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “మానవ పుత్రుని రోజులలో ఒక దానిని చూడాలని మీరు ఎంతో ఆశించే కాలం వస్తుంది గాని ఆ రోజును చూడరు. 23 అప్పుడు మనుషులు మీతో ‘అదిగో అక్కడ!’ లేదా, ‘ఇదిగో ఇక్కడ!’ అంటారు. మీరు వెళ్ళకూడదు, వారిని అనుసరించకూడదు. 24 ఆకాశంలో మెరుపు ఒకవైపు మెరిసి మరో వైపుకు ఎలా ప్రకాశిస్తుందో అలాగే మానవ పుత్రుడు తన రాకడ రోజున ఉంటాడు. 25 అయితే ముందుగా ఆయన అనేక బాధలు అనుభవించి ఈ తరంవారి నిరాకరణకు గురి కావడం తప్పనిసరి.
26 “మానవ పుత్రుని రోజులలో నోవహు రోజులలోలాగే ఉంటుంది. 27 అప్పుడు ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు. నోవహు ఓడలోకి వెళ్ళేరోజు వరకూ అలా జరుగుతూ ఉంది. అప్పుడు జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది.”
28 “లోత్ రోజులలో ఉన్నట్టు కూడా ఉంటుంది. అప్పుడు వారు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ నాటుతూ కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. 29 కానీ సొదొమ నుంచి లోత్ వెళ్ళిపోయిన రోజునే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి అందరినీ నాశనం చేశాయి.”
30 “మానవ పుత్రుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా అలాగే ఉంటుంది. 31 ఆ రోజున ఇంటి డాబామీద ఉన్న వ్యక్తి తన సామానులు ఇంట్లో ఉంటే వాటిని తీసుకువెళ్ళడానికి దిగి రాకూడదు. అలాగే పొలంలో ఉన్న వ్యక్తి తిరిగి రాకూడదు.
32  లోత్ భార్య సంగతి జ్ఞాపకముంచుకోండి. 33 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టు కొంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని కాపాడుకొంటాడు. 34 మీతో నేను చెప్పేదేమంటే, ఆ రాత్రి ఇద్దరు ఒకే పడకమీద ఉంటారు. ఒకరిని తీసుకువెళ్ళడం, మరొకరిని విడిచిపెట్టడం జరుగుతుంది. 35 ఇద్దరు స్త్రీలు కలిసి విసురుతూ ఉంటారు ఒకతెను తీసుకువెళ్ళడం, మరొకతెను విడిచిపెట్టడం జరుగుతుంది. 36 ఇద్దరు ఒకే పొలంలో ఉంటారు. ఒకరిని తీసుకువెళ్ళడం, మరొకరిని విడిచిపెట్టడం జరుగుతుంది.”
37 అందుకు శిష్యులు ఆయనతో అన్నారు, “ఎక్కడ, ప్రభూ?” ఆయన “ఎక్కడ శవం ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి” అని వారితో చెప్పాడు.