16
1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఆస్తిపరుడు ఒకని కోసం సేవాధికారి ఒకడు పని చేశాడు. అతడు ఆస్తిని దుబారా చేస్తున్నాడని ఫిర్యాదు ఆ ఆస్తిపరుడికి వచ్చింది. 2 ఆస్తిపరుడు అతణ్ణి పిలిచి అతనితో ‘నిన్ను గురించి నేను వింటున్న విషయం ఏమిటి? ఇకమీదట నీవు సేవాధికారిగా ఉండడానికి వీలులేదు. నీవు సేవాధికారిగా చేసిన పనిని గురించిన లెక్క నాకప్పగించు!’ అన్నాడు.
3 “సేవాధికారి లోలోపల ఇలా అనుకొన్నాడు: ‘నేను సేవాధికారిగా ఉండకుండా నా యజమాని చేస్తున్నాడు. ఏం చెయ్యను? తవ్వకం పని నాకు చేతకాదు. ముష్టి ఎత్తుకుందా మంటే సిగ్గు. 4 సేవాధికారిగా ఉండకుండా నన్ను తొలగించడం జరిగాక నలుగురూ నన్ను తమ ఇండ్లలోకి స్వీకరించేలా నేనేం చెయ్యాలో నాకు తెలుసు.’
5 “అప్పుడతడు తన యజమానికి బాకీ పడి ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచాడు. ‘నువ్వు నా యజమానికి ఎంత బాకీ ఉన్నావు!’ అని మొదటివాణ్ణి అడిగాడు. 6 ఆ మనిషి ‘మూడు వేల లీటర్ల నూనె’ అన్నాడు. ఇతడు అతడితో ‘త్వరగా నీ చీటి తీసుకొని వెయ్యిన్ని అయిదు వందల లీటర్లు అని రాసుకో!’ అన్నాడు. 7 మళ్ళీ మరొకణ్ణి చూచి ‘నువ్వెంత బాకీ ఉన్నావు?’ అనడిగాడు. ఆ మనిషి ‘నూరు మానికల గోధుమలు’ అన్నాడు. ఇతడు అతడితో ‘నీ చీటి తీసుకొని ఎనభై అని రాసుకో’ అన్నాడు.
8 “న్యాయం తప్పిన ఈ సేవాధికారి వివేకంతో వ్యవహరించినందుచేత అతని యజమాని అతణ్ణి ఆమోదించాడు. ఎందుకంటే, ఈ లోకం మనుషులు తమ లాంటివారి విషయాల్లో వెలుగుకు చెందిన మనుషులకంటే వివేకవంతులు. 9 మీరు అంతమైపోయిన తరువాత వారు మిమ్మల్ని శాశ్వత నివాసాల్లో స్వీకరించేలా అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండని మీతో చెపుతున్నాను.
10 “చిన్న చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. అత్యల్ప విషయంలో న్యాయం తప్పినవాడు పెద్ద విషయంలో కూడా న్యాయం తప్పినవాడవుతాడు. 11 అందుచేత అన్యాయమైన ధనం విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే ఇక మీకు నిజమైన సొత్తు ఎవరు అప్పగిస్తారు? 12 మరొకరి సొత్తు విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే మీ సొంతం అంటూ మీకెవరు ఇస్తారు? 13  ఇద్దరు యజమానులకు ఏ దాసుడూ సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్నచూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.”
14 డబ్బంటే మహా ప్రీతి ఉన్న పరిసయ్యులు కూడా ఈ విషయాలన్నీ విని ఆయనను గేలి చేస్తూ ఉన్నారు. 15  వారితో ఆయన ఇలా అన్నాడు: “మీరు మనుషుల దృష్టిలో న్యాయవంతులని అనిపించుకొనేవారు గానీ మీ హృదయాలు దేవునికి తెలుసు. మనుషులు గొప్పగా ఎంచేది దేవుని దృష్టిలో అసహ్యం. 16 బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకు ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి. అప్పటినుంచి దేవుని రాజ్యం గురించిన ఉపదేశాల ప్రకటన జరుగుతూ ఉంది. అందరూ ఈ రాజ్యంలో బలవంతంగా చొరబడు తున్నారు. 17 ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లయినా నశించడం కంటే భూమ్యాకాశాలు నశించడమే సులభం.
18  “తన భార్యకు విడాకులిచ్చి మరో స్త్రీని పెండ్లి చేసుకొనే వాడెవరైనా వ్యభిచరిస్తున్నాడు. విడాకులు తీసుకొన్న ఆమెను పెండ్లి చేసుకొన్న వాడెవడైనా వ్యభిచరిస్తున్నాడు.
19 “ధనవంతుడొకడు ఉండేవాడు. అతడు ఊదారంగు వస్త్రాలూ శ్రేష్ఠమైన బట్టలూ తొడుక్కొనేవాడు, రోజూ వైభవంగా హాయిగా బ్రతికేవాడు. 20 లాజరు అనే దరిద్రుడు కూడా ఉండేవాడు. అతనికి ఒళ్ళంతా కురుపులు. ఇతడు ఆ ధనవంతుని ఇంటి గుమ్మందగ్గర పడిగాపులు పడి ఉండేవాడు. 21 ధనవంతుని బల్లమీది నుంచి పడ్డ ముక్కలు తిందామని ఆశపడేవాడు. అంతే కాక, కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి కూడా.
22 “ఆ దరిద్రుడు చనిపోయాడు. అతణ్ణి దేవదూతలు అబ్రాహాము ప్రక్కకు తీసుకువెళ్ళారు. ధనవంతుడు కూడా చనిపోయాడు పూడ్చిపెట్టబడ్డాడు. 23 అతడు పాతాళంలో యాతనపడుతూ తలెత్తి చూస్తే దూరంగా అబ్రాహాము, అబ్రాహాము ప్రక్కన ఉన్న లాజరు కనబడ్డారు.
24 “అప్పుడు ధనవంతుడు ‘తండ్రి అబ్రాహాము! నా మీద జాలి చూపు! ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను! గనుక తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించు!’ అని మొరపెట్టి చెప్పాడు.
25 అందుకు అబ్రాహాము ‘కొడుకా, నీవు బ్రతికినన్నాళ్ళూ మంచివాటిని అనుభవించావు. లాజరైతే కష్టాలు అనుభవించాడు. అది జ్ఞాపకం చేసుకో! ఇప్పుడితడు ఓదార్పు పొందుతున్నాడు, నీవేమో అల్లాడిపోతున్నావు. 26 ఇవన్నీ కాక మరో విషయం – నీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడనుంచి మీ దగ్గరకు దాటిపోవాలనుకొనేవారికి సాధ్యం కాదు, అక్కడివారికి మా దగ్గరకు దాటిరావడం కూడా సాధ్యం కాదు’ అన్నాడు.
27 “అప్పుడతడు ‘అలాగైతే, తండ్రీ, అతణ్ణి మా నాన్న ఇంటికి పంపించమని నిన్ను వేడుకొంటున్నాను. ఎందుకంటే, నాకు అయిదుగురు సోదరులున్నారు. 28 వారు కూడా ఈ యాతన స్థలానికి రాకుండా చేయడానికి అతడు వారికి సాక్ష్యమివ్వగలడు’ అన్నాడు.
29 “గానీ, అబ్రాహాము అతనితో ‘వారికి మోషే, ప్రవక్తలు ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు.
30 “అతడు ‘అలా కాదు, తండ్రి అబ్రాహాము! చనిపోయినవారిలో నుంచి ఎవడైనా వారిదగ్గరికి వెళ్ళితే వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.
31 “అందుకు అబ్రాహాము అతనితో ‘మోషే మాట, ప్రవక్తల మాట వారు వినకపోతే చనిపోయినవారిలో నుంచి ఒకడు సజీవంగా లేచినా వారికి నమ్మకం కుదరదు అన్నాడు.’”