15
1 ఆయన ఉపదేశం వినడానికి సుంకంవారూ పాపులూ అంతా ఆయనకు దగ్గరగా వచ్చారు. 2  అందుకు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ సణుగుతూ “ఈ మనిషి పాపులను దగ్గరకు చేర్చుకొంటాడు. వారితో కలిసి భోజనం చేస్తాడు” అన్నారు.
3 అందుచేత ఆయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు: 4 “మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఆ తొంభై తొమ్మిది గొర్రెలను నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టి, తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకూ వెదకడా? 5 అది కనబడ్డప్పుడు భుజాలమీద దానిని పెట్టుకొని సంతోషిస్తాడు. 6 అతడు ఇంటికి వచ్చినప్పుడు మిత్రులనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటాడు.
7 “అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.
8 “ఒకామెకు పది వెండి నాణేలు ఉండి, వాటిలో ఒక నాణెం పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంతవరకూ జాగ్రత్తగా వెదకదా? 9 అది కనబడ్డప్పుడు స్నేహితురాండ్రనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘నేను పోగొట్టుకొన్న నాణెం నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటుంది. 10 అలాగే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి దేవుని దూతల సముఖంలో ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.”
11 ఆయన ఇంకా అన్నాడు “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. 12 చిన్నవాడు తండ్రితో ‘నాన్నా, ఆస్తిలో నాకు వచ్చే భాగమివ్వు’ అన్నాడు. తండ్రి తన జీవనాధారం వారికి పంచి ఇచ్చాడు.
13 “కొన్నాళ్ళకు చిన్నవాడు తనకు ఉన్నదంతా కూడగట్టుకొని దూర దేశానికి ప్రయాణమైపోయాడు. అక్కడ విచ్చలవిడిగా తన ఆస్తిని దుబారా చేశాడు. 14 అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడు అక్కరలో పడసాగాడు. 15 అప్పుడు ఆ దేశ పౌరుడొకని దగ్గర చేరాడు. ఆ మనిషి పందులు మేపడానికి అతణ్ణి తన పొలాల్లోకి పంపాడు. 16 పందులు మేపే పొట్టుతో అతడు కడుపు నింపుకోవాలని ఆశించాడు, కాని అతనికి ఎవరూ ఏమీ పెట్టలేదు.
17 “అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇలా అనుకొన్నాడు: ‘మా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి మనుషులకు బోలెడంత ఆహారం ఉంటుందే. నేనైతే ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. 18 లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను; నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. 19 ఇకనుంచి నీ కొడుకును అనిపించుకోవడానికి తగను. నన్ను నీ కూలి మనుషులలో ఒకడిగా పెట్టుకో! అంటాను.’
20 “అప్పుడతడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
21 “అప్పుడా కొడుకు ‘నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకుననిపించుకోవడానికి తగను’ అని అతనితో అన్నాడు.
22 “అయితే తండ్రి తన దాసులను చూచి ‘అన్నిట్లో మంచి వస్త్రం తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని వ్రేలికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి. 23 కొవ్విన దూడను తెచ్చి వధించండి. తిందాం! సంబరపడదాం! 24 ఈ నా కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు! తప్పిపోయి దొరికాడు!’ అన్నాడు. అప్పుడు వారు సంబరపడసాగారు.
25 “ఇంతలో పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు వచ్చి ఇంటికి దగ్గరగా చేరినప్పుడు సంగీత నాదం, నాట్య ధ్వని అతనికి వినిపించాయి. 26 అతడొక దాసుణ్ణి పిలిచి ‘వాటి అర్థమేమిటో!’ అని అడిగాడు.
27 “ఆ దాసుడు అతనితో ‘మీ తమ్ముడు వచ్చాడండి. తన దగ్గరకు క్షేమంగా చేరినందుచేత మీ తండ్రి కొవ్విన దూడను వధించాడండి’ అన్నాడు.
28 పెద్ద కొడుక్కు కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. కాబట్టి అతని తండ్రి బయటికి వచ్చి రమ్మని వేడుకొన్నాడు. 29 కానీ తండ్రికి అతడు ‘చూడు, ఇన్ని ఏళ్ళపాటు నీకు చాకిరి చేస్తూ వచ్చాను. నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదు. అయినా నేను నా స్నేహితులతో సంబరపడేట్టు నీవు విందుకోసం మేకపిల్లనైనా ఎన్నడూ నాకివ్వలేదు. 30 అయితే నీ జీవనాధారం వేశ్యలతో తినేసిన ఈ నీ కొడుకు రాగానే వాడికి కొవ్విన దూడను వధించావే!’ అని జవాబిచ్చాడు.
31 “అందుకు తండ్రి అతనితో ‘అబ్బాయి! నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే. 32 అయితే ఈ నీ తమ్ముడు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు. అందుచేత మనం సంబరపడి సంతోషించడం న్యాయమే!’” అన్నాడు.