14
1 ఒక విశ్రాంతి దినాన ఇలా జరిగింది: ఆయన పరిసయ్యులలో ప్రముఖుడొకడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు. 2 అక్కడ ఆయనకు ఎదురుగానే వాపు రోగం ఉన్న మనిషి ఉన్నాడు. 3 యేసు “విశ్రాంతి దినాన రోగులను బాగు చేయడం న్యాయ సమ్మతమా?” అని ధర్మశాస్త్ర విద్వాంసులనూ పరిసయ్యులనూ చూచి అన్నాడు.
4 వారు ఊరుకొన్నారు. అప్పుడాయన అతణ్ణి చేరదీసి బాగు చేశాడు, వెళ్ళనిచ్చాడు. 5 అప్పుడు ఆయన “విశ్రాంతి దినాన మీలో ఎవరు తన గాడిదయినా, ఎద్దయినా గుంటలో పడితే వెంటనే దానిని బయటికి లాగరు?” అని వారినడిగాడు. 6 ఆయనకు వారు ఆ సంగతుల గురించి ఏమీ జవాబు చెప్పలేకపోయారు.
7 అక్కడ ఆహ్వానం అందినవారు అగ్ర స్థానాలను ఎన్నుకోవడం గమనించి ఆయన వారికి ఒక ఉదాహరణ చెపుతూ 8 “పెండ్లి విందుకు నిన్ను ఎవరైనా పిలిస్తే అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ అతడు నీకంటే ఘనుణ్ణి పిలిచి ఉండవచ్చునేమో. 9 అలాంటప్పుడు నిన్నూ అతణ్ణీ పిలిచినవాడు నీ దగ్గరకు వచ్చి ‘మీరు వీరికి ఈ చోటు ఇవ్వండి’ అంటాడేమో. అప్పుడు నీవు చిన్నబోయి చివరి స్థానంలో కూర్చోవడం ఆరంభిస్తావు. 10 గనుక నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి నీతో ‘స్నేహితుడా! ఆ పై స్థానానికి వెళ్ళండి’ అనవచ్చు. అప్పుడు నీతోకూడా కూర్చుని ఉన్న వారి సమక్షంలో నీకు గౌరవం కలుగుతుంది. 11 తనను గొప్ప చేసుకొనేవారిని తగ్గించడం, తనను తగ్గించుకొనేవారిని గొప్ప చేయడం జరుగుతుంది” అని వారితో అన్నాడు.
12 అప్పుడాయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు: “నీవు పగలు గానీ రాత్రి గానీ విందు చేసేటప్పుడు నీ మిత్రులనూ అన్నదమ్ములనూ చుట్టాలనూ ఆస్తిపరులైన పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే, వారు నిన్ను బదులుకు బదులు పిలవవచ్చు, దానితో నీకు ప్రతిఫలం కలుగుతుంది. 13 అయితే నీవు విందు చేసేటప్పుడు బీదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. 14 నీకు ప్రతిఫలమివ్వడానికి వారిచేత కాదు గనుక నీకు దీవెన వస్తుంది. చనిపోయిన న్యాయవంతులు సజీవంగా లేచేటప్పుడు నీకు ప్రతిఫలం కలుగుతుంది.”
15 ఆయనతోపాటు భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఒకడు ఆ మాటలు విని “దేవుని రాజ్యంలో రొట్టె తినబోయే వ్యక్తి ధన్యజీవి!” అన్నాడు.
16 అతనితో ఆయన ఇలా చెప్పాడు: “ఒక మనిషి గొప్ప విందు ఏర్పాటు చేసి అనేకులను పిలిచాడు. 17 విందుకు వేళయినప్పుడు ‘ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది, రండి’ అని ఆహ్వానం అందిన వారితో చెప్పడానికి తన దాసుణ్ణి పంపాడు.
18 “అయితే వారంతా ఏకమనస్సుతో సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటివాడు అతనితో ‘నేనొక పొలం కొన్నాను. వెళ్ళి దాన్ని చూచుకోవాలి. నన్ను క్షమించాలని నీకు మనవి చేస్తున్నాను’ అన్నాడు.
19 “మరొకడు ‘నేను అయిదు జతల ఎద్దుల్ని కొన్నాను, వెళ్ళి వాటిని పరీక్ష చేస్తాను. నన్ను క్షమించాలని నీకు మనవి చేస్తున్నాను’ అన్నాడు.
20 “మరొకడు ‘నేను పెళ్ళి చేసుకొన్నాను గనుక రాలేను’ అన్నాడు.
21 “అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ విషయాలు తన యజమానితో చెప్పాడు. ఆ ఇంటి యజమానికి కోపం వచ్చింది. తన దాసునితో ఇలా అన్నాడు: ‘నీవు త్వరగా నగర వీధుల్లోకీ సందుల్లోకీ వెళ్ళి బీదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ ఇక్కడికి తీసుకురా!’
22 “తరువాత ఆ దాసుడు ‘యజమానీ, తమరు ఆజ్ఞాపించినట్టే అయింది గాని ఇంకా స్థలం ఉందండి’ అన్నాడు.
23 “అప్పుడు దాసునితో యజమాని ‘నా ఇల్లు నిండాలి గనుక రహదారుల్లోకీ కంచెల పొడుగునా వెళ్ళి అక్కడివారిని బలవంతాన తీసుకురా! 24 నీతో అంటున్నాను, ముందు పిలుపు అందుకొన్నవారిలో ఎవరూ నా విందు భోజనం రుచిచూడరు!’ అన్నాడు.”
25 పెద్ద జన సమూహాలు ఆయనతోకూడా వస్తూ ఉన్నారు. ఆయన వారివైపు తిరిగి, ఇలా అన్నాడు: 26 “నా దగ్గరకు వచ్చేవాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనూ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే నా శిష్యుడు కాలేడు. 27 తన సిలువ మోసుకొంటూ నా వెంట రానివాడెవడూ నా శిష్యుడు కాలేడు.
28 “మీలో ఎవడైనా ఒక గోపురం కట్టాలని ఉంటే దాన్ని ముగించడానికి తన దగ్గర కావలసినది ఉందో లేదో ముందుగానే కూర్చుని లెక్కలు చూచుకోడా? 29 ఒకవేళ అలా చేయకపోతే పునాది వేసిన తరువాత గోపురం పూర్తి చేయలేకపోతాడేమో. అలాంటప్పుడు అదిచూచినవారంతా అతణ్ణి వేళాకోళం చేస్తూ 30 ‘ఈ మనిషికట్టడం మొదలు పెట్టాడు గానీ దాన్ని ముగించలేకపొయ్యాడు’ అంటారు.
31 “ఒక రాజు మరో రాజు మీదికి యుద్ధానికి వెళ్ళబోతూ ఉంటే, ఇరవై వేల సైన్యంతో తనమీదికి వస్తున్న ఆ రాజును ఎదిరించడానికి తనకున్న పది వేల సైన్యం సరిపోతుందో లేదో ముందుగానే కూర్చుని ఆలోచన చేయడా? 32 సరిపోదూ అంటే ఆ రాజు ఇంకా చాలా దూరంగా ఉండగానే ఇతడు సంధి రాయబారం పంపి శాంతి కావాలని వినతి చేస్తాడు గదా. 33 ఆ విధంగానే మీలో తనకున్నదంతా వదులుకోని వాడెవడైనా సరే నా శిష్యుడు కాలేడు.
34  “ఉప్పు మంచిదే గాని ఒకవేళ ఉప్పు దాని రుచి కోల్పోతే దానికి రుచి మళ్ళీ దేనివల్ల కలుగుతుంది? 35 అది పొలానికి గానీ ఎరువుకు గానీ పనికి రాదు. మనుషులు దాన్ని అవతల పారవేస్తారు. వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక!”