13
1 ఆ సమయంలో అక్కడున్న కొందరు ఆయనతో ఒక సంగతి చెప్పారు. ఏమిటంటే, పిలాతు✽ గలలీ ప్రజలలో కొందరి రక్తాన్ని వారి బలులతో కలిపాడు. 2 ✽యేసు వారికిలా జవాబిచ్చాడు: “ఈ గలలీవారికి ఇలాంటివి పట్టినందుచేత గలలీ ప్రజలందరిలో వారే ఎక్కువ ఘోరమైన పాపిష్టివారని మీరనుకొంటున్నారా? 3 కారని మీతో చెపుతున్నాను. పశ్చాత్తాపపడకపొయ్యారా, మీరూ ఇలాగే నాశనమైపోతారు. 4 ✽సిలోయం గోపురం వారిమీద కూలినప్పుడు చనిపోయిన ఆ పద్ధెనిమిదిమంది జెరుసలం నివాసులందరిలో ఎక్కువ ఘోరమైన పాపిష్టివారని మీరను కొంటున్నారా? 5 కారని మీతో చెపుతున్నాను. పశ్చాత్తాప పడకపొయ్యారా, మీరూ అలాగే నాశనమైపోతారు.”6 ✽✽అప్పుడాయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక మనిషికి తన ద్రాక్షతోటలో నాటి ఉన్న అంజూర చెట్టు ఒకటి ఉంది. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చాడు. అయితే ఒక్క పండు కూడా కనబడలేదు. 7 ✽అప్పుడు ద్రాక్షతోటమాలితో ‘ఇదిగో, ఈ అంజూర చెట్టుపండ్లు వెదకడానికి మూడేళ్ళ నుంచి వస్తున్నాను గాని ఒక్కటి కూడా కనబడలేదు. ఈ చెట్టువల్ల ఈ భూమికి దుర్వినియోగం ఎందుకు? దీనిని నరికివెయ్యి!’ అన్నాడు. 8 ✽అయితే తోటమాలి అతనితో ‘ఈ సంవత్సరం కూడా దీనిని ఉండనివ్వండయ్యా! దీని పాదు తవ్వి ఎరువు వేస్తాను. 9 అది కాయలు కాస్తే సరే. లేదా, ఆ తరువాత మీరు దీనిని నరికేసెయ్యవచ్చు’ అన్నాడు.”
10 ఒక విశ్రాంతి దినా✽న ఆయన ఒక సమాజ కేంద్రం✽లో ఉపదేశిస్తూ ఉన్నాడు. 11 ✽పద్ధెనిమిది ఏళ్ళనుంచి ఒక పిశాచం వల్ల కలిగిన జబ్బుతో ఉన్న స్త్రీ ఒకతె అక్కడ ఉంది. నడుము వంగిపోయి ఆమె ఎంతమాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది.
12 యేసు ఆమెను చూచి దగ్గరకు పిలిచాడు, ఆమెతో “అమ్మా, నీ రోగంనుంచి నీకు విడుదల కలిగింది!” అన్నాడు. 13 ✝ఆమెమీద చేతులుంచగానే ఆమె తిన్నని వెన్నెముక గలిగి, దేవుణ్ణి స్తుతించసాగింది.
14 ✝విశ్రాంతి దినాన యేసు రోగిని బాగు చేసినందుచేత సమాజ కేంద్రం అధికారి కోపంతో మండిపడి జన సమూహంతో “పని చేయడానికి వారంలో ఆరు రోజులున్నాయి గదా! ఆ రోజుల్లో వచ్చి మీ రోగాలు బాగు చేయించుకోండి గాని విశ్రాంతి దినాన కాదు” అన్నాడు.
15 ✽అందుకు జవాబిస్తూ ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “కపట భక్తుడా! విశ్రాంతి దినాన మీలో ప్రతి ఒక్కడూ ఎద్దును గానీ గాడిదను గానీ విప్పి కొట్టంనుంచి నీళ్ళకు తోలుకు పోతారు గదా! 16 ✽పద్ధెనిమిది ఏళ్ళపాటు సైతాను✽ బంధించిన ఈ స్త్రీ, అబ్రాహాము వంశికురాలైన ఈ స్త్రీ ఆ బంధకం నుంచి విశ్రాంతి దినాన విడిపించబడకూడదా ఏమిటి?”
17 ఆయన అలా అన్నప్పుడు ఆయన వ్యతిరేకులు అవమానం పాలయ్యారు✽ గాని జనమంతా ఆయన చేస్తున్న ఘన కార్యాలన్నిటికీ సంతోషించారు.
18 ✝అప్పుడాయన “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దేనితో దానిని పోలుస్తాను? 19 ఒక మనిషి ఆవ గింజను తీసుకొని తన తోటలో నాటాడు. అది పెరిగి పెద్ద చెట్టయింది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలమీద గూళ్ళు కట్టుకొన్నాయి. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంది” అన్నాడు.
20 ఆయన ఇంకా అన్నాడు “నేను దేనితో దేవుని రాజ్యాన్ని పోల్చాలి? 21 ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచి పెట్టింది. దానిలో అంతటా పొంగజేసే పదార్థం వ్యాపించింది. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంది.”
22 ఆయన జెరుసలం ప్రయాణం చేస్తూ గ్రామాల గుండా పట్టణాల గుండా సాగిపోతూ ఉపదేశిస్తూ ఉన్నాడు. 23 ✽ఎవరో ఒకడు ఆయనను చూచి “ప్రభూ, పాపవిముక్తి పొందేవారు కొద్దిమందేనా?” అని అడిగాడు.
24 ✽ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చేయండి✽. అనేకులు ప్రవేశించజూస్తారు గాని అది వారిచేత కాబోదని మీతో చెపుతున్నాను. 25 ✽ఇంటి యజమాని లేచి ఒక్కసారిగా తలుపు మూసివేసిన తరువాత మీరు బయట నిలుచుండి తలుపు తట్టడం ఆరంభిస్తూ ‘ప్రభూ! ప్రభూ! మాకు తలుపు తెరవండి’ అంటారు. అప్పుడాయన మీకు జవాబిస్తూ ‘మీరెక్కడివారో మిమ్ములను నేనెరుగను’ అంటాడు. 26 ✽అప్పుడు మీరు ‘మేము మీ సముఖంలోనే అన్నపానాలు పుచ్చుకొన్నాం గదా! మీరు మా వీధుల్లో ఉపదేశించారు గదా!’ అనడం ఆరంభిస్తారు. 27 ✝అయితే ఆయన ‘నేను మీతో అంటున్నాను గదా, మీరెక్కడివారో మిమ్ములను నేనెరుగను. అన్యాయమైన కార్యాలు చేసేవారలారా మీరంతా నా దగ్గరనుంచి వెళ్ళిపోండి!’ అంటాడు.
28 ✝“అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలంతా దేవుని రాజ్యంలో ఉండడం, మిమ్ములను బయటికి త్రోసివేయడం మీరు చూచినప్పుడు అక్కడ ఏడ్పూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 29 తూర్పు పడమరల నుంచీ ఉత్తర దక్షిణాలనుంచీ మనుషులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు. 30 ఇదిగో వినండి, చివరి వారిలో కొందరు మొదటివారవుతారు. మొదటివారిలో కొందరు చివరి వారవుతారు.”
31 ✽ ఆ రోజునే పరిసయ్యులు కొందరు వచ్చి ఆయనతో “హేరోదు నిన్ను చంపాలని కోరుతున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో!” అన్నారు.
32 ✽అయితే ఆయన వారితో అన్నాడు “వెళ్ళి ఆ గుంటనక్కతో ఈ విధంగా చెప్పండి – ఈరోజు, రేపు నేను దయ్యాలను వెళ్ళగొట్టివేస్తాను, రోగులను బాగు చేస్తాను. మూడో రోజున నా గమ్యం సంపూర్తిగా చేరుతాను. 33 ✽అయినా ఈరోజు, రేపు, ఎల్లుండి నేను ప్రయాణం కొనసాగించాలి, ఎందుకంటే, జెరుసలం బయట ప్రవక్త హతం కావడం కుదరదు!”
34 ✝“ఓ జెరుసలం! జెరుసలం! ప్రవక్తలను వధిస్తూ నీ దగ్గరకు పంపినవారిని రాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్న నగరమా! కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొన్నట్టే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నో సార్లు ఇష్టపడ్డాను. నీవైతే ఇష్టపడలేదు. 35 ఇదిగో విను! ఇప్పుడు నీ పాడు ఇంటిని నీకే విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. నీతో నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే, నీవు ‘ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి!’ అని చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవు!”