12
1 ఇంతలో వేలకొలది జనులు పోగయి ఒకరినొకరు త్రొక్కుకొంటూ ఉన్నారు. ఆయన మొదట తన శిష్యులతో ఇలా మాట్లాడసాగాడు: “పరిసయ్యుల కపటం అనే పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్త! 2 కప్పిపెట్టినది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలుసుకోకుండా ఉండదు తప్పక తెలిసిపోతుంది. 3 చీకట్లో మీరు చెప్పినది ప్రతిది వెలుగులో వినబడుతుంది. లోపలి గదులలో చెవులలో మీరు చెప్పుకొన్నది ఇంటి కప్పుల మీద నుంచి ప్రకటించబడుతుంది.
4 “నా స్నేహితులారా, మీతో నేను చెప్పేదేమంటే శరీరాన్ని చంపేవారికి భయపడకండి. ఆ తరువాత వారు చేయగలిగేది ఏమీ లేదు. 5 మీరెవరికి భయపడాలో మీకు చెపుతాను – ఆయన చంపిన తరువాత నరకంలో పడవేయడానికి అధికారం గల వ్యక్తికే. ఆయనకే భయపడండి అని మీతో అంటున్నాను.”
6 “అయిదు పిచ్చుకలు రెండు చిన్న నాణాలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక పిచ్చుక కూడా దేవుని సన్నిధిలో మరవబడదు. 7 మీ తలవెండ్రుకలెన్నో లెక్క ఉంది. అందుచేత మీరేమీ భయపడకండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
8  “ఇంకొకటి మీతో నేనంటున్నాను, నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఎవరైనా ఒప్పుకొంటే అతణ్ణి మానవ పుత్రుడు దేవదూతల ఎదుట ఎరుగుదునని ఒప్పుకొంటాడు. 9 కానీ మనుషుల ఎదుట నన్ను ఎరగననే వాణ్ణి దేవదూతల ఎదుట నేనూ ఎరగనంటాను. 10 మానవ పుత్రునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట చెప్పితే దానిగురించి అతనికి క్షమాపణ ఉంటుంది. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసే వానికి క్షమాపణ ఉండదు.”
11 మనుషులు మిమ్ములను సమాజ కేంద్రాలకూ పరిపాలకుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ విచారణకోసం తీసుకు వెళ్ళేటప్పుడు మీరేమి చెప్పాలో ఏమి జవాబివ్వాలో అని బెంబేలుపడకండి. 12 ఎందుకంటే మీరేమి చెప్పాలో ఆ ఘడియలోనే పవిత్రాత్మ మీకు నేర్పుతాడు.”
13 గుంపులో ఎవరో ఒకడు ఆయనతో “ఉపదేశకా! వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నా భాగం పంచిపెట్టమని మా తోబుట్టువుకు చెప్పండి” అన్నాడు.
14 అందుకాయన అతనితో “అయ్యా, మీమీద నన్నెవరు తీర్పరిగా లేదా మధ్యవర్తిగా నియమించారు?” అన్నాడు. 15 ఆయన వారితో “అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి! ఒకరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు” అన్నాడు.
16 అప్పుడాయన వారికొక ఉదాహరణ చెప్పాడు: “ఆస్తిపరుడొకడి భూమి బాగా పండింది, 17 గనుక అతడిలా లోలోపల ఆలోచన చేశాడు: ‘నా పంట నిలవ చేయడానికి స్థలం లేదు. ఏం చెయ్యను? 18 ఇలా చేస్తాను – నా గిడ్డంగులు పడగొట్టి వీటికంటే పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యం, నా సరుకులు అన్నీ నిలవ చేస్తాను. 19 అప్పుడు నా ప్రాణంతో నేనంటాను, ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు మంచి వస్తువులు కూడబెట్టబడ్డాయి. సుఖంగా ఉండు. తిను, తాగు, సంబరపడు!’ అని. 20 అయితే అతనితో దేవుడు అన్నాడు ‘తెలివి తక్కువవాడా! ఈ రాత్రే నీ ప్రాణం అడగడం జరుగుతుంది. నీవు సిద్ధం చేసుకొన్నవి అప్పుడు ఎవరివవుతాయి?’ 21 దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తనకోసమే సొమ్ము కూడబెట్టే వ్యక్తి అలాంటివాడే.”
22 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏం తింటాం?’ అంటూ మీ బ్రతుకును గురించి బెంగపెట్టుకోకండి. ‘మాకు బట్టలు ఎట్లా?’ అనుకొంటూ శరీరాన్ని గురించి బెంగపెట్టుకోకండి. 23 తిండికంటే జీవితం ప్రధానం. బట్టలకంటే శరీరం ముఖ్యం. 24 కాకులను చూడండి. అవి నాటవు, కోత కోయవు. వాటికి గిడ్డంగులూ కొట్లూ లేవు. అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో విలువైనవారు గదా! 25 చింతపడడం వల్ల మీలో ఎవరు తన ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు? 26 అన్నిటిలో చిన్న విషయాలే మీరు చేయలేకపోతే తక్కిన విషయాలను గురించి మీకు వ్యాకులత ఎందుకు?
27 “పూలమొక్కలు ఎలా పెరుగుతున్నాయో చూడండి. అవి శ్రమపడవు, బట్టలు నేయవు. అయినా, తన వైభవమంతటితో సహా సొలొమోను తొడుగుకొన్న వస్త్రాలు ఈ పూలలో ఒక్కదానికున్నంత అందం గలవి కావని మీతో చెపుతున్నాను. 28 అల్ప విశ్వాసం గలవారులారా, ఈవేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలంగడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరీ నిశ్చయంగా మీకు వస్త్రాలిస్తాడు గదా. 29 అన్నపానాలెట్లా అంటూ వాటికోసం దేవులాడకండి, వ్యాకులత చెందకండి. 30 లోకజనాలు వీటికోసం దేవులాడుతారు. ఇవి మీకు అవసరమని మీ పరమ తండ్రికి తెలుసు. 31 దేవుని రాజ్యాన్ని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు చేకూరుతాయి.
32 “చిన్న మందా, భయంతో ఉండకు, తన రాజ్యాన్ని మీకు ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం. 33  మీకున్నదాన్ని అమ్మి దానధర్మాలు చేయండి. పరలోకంలో మీకు పాతగిలిపోని డబ్బు సంచులు తయారు చేసుకోండి. అయిపోకుండా ఉండే సొమ్ము సమకూర్చుకోండి. అక్కడ దొంగ ఎవడూ దగ్గరకు రాడు, చిమ్మటలు కొట్టవు. 34 మీ సొమ్ము ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
35 “మీ నడుము కట్టండి. మీ దీపాలు వెలుగుతూ ఉండేలా చూచుకోండి. 36 పెండ్లి నుంచి తిరిగి వచ్చే తమ యజమాని కోసం ఎదురుచూస్తున్న మనుషులలాగా మీరు ఉండండి. ఆయన వచ్చి తలుపు తట్టగానే వారు ఆయనకు తలుపు తీస్తారు. 37 యజమాని వచ్చి చూచినప్పుడు ఆ విధంగా ఎదురు చూస్తున్న దాసులు ధన్యులు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఆయన నడుము బిగించి వారిని భోజనానికి కూచోబెట్టి తానే వచ్చి వారికి వడ్డిస్తాడు. 38 యజమాని రెండో జామున వచ్చినా, మూడో జామున వచ్చినా ఏ దాసులైతే మెళకువగా ఉండడం ఆయన చూస్తాడో ఆ దాసులు ధన్యులు. 39 ఇది తెలుసుకోండి – దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళకువగా ఉంటాడు, తన ఇంటికి కన్నం వేయనియ్యడు. 40 మీరు అనుకోని గడియలో మానవ పుత్రుడు వస్తాడు, గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి.”
41 అప్పుడు పేతురు “ప్రభూ, నీవు ఈ ఉదాహరణ చెప్పినది మాకేనా, అందరికోసమా?” అని అడిగాడు.
42 ప్రభువు అన్నాడు: “యజమాని తన దాసులకు సరైన వేళకు ఆహారం పెట్టడానికి వారిమీద నియమించిన జ్ఞానం గల నమ్మకమైన నిర్వాహకుడు ఎవడు? 43 అతని యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు. 44 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, యజమాని అతణ్ణి తనకు ఉన్నదంతటి మీదా నియమిస్తాడు. 45 కానీ ఒకవేళ ఆ దాసుడు తన హృదయంలో ‘నా యజమాని ఇప్పుడే రాడు లే” అనుకొని దాస దాసీ జనాన్ని కొట్టడం, తిని త్రాగి మత్తిల్లడం ఆరంభిస్తే 46 ఆ దాసుడు ఎదురు చూడని రోజున, ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు, అతణ్ణి రెండు ముక్కలుగా కోసి నమ్మకం లేనివారితోపాటు అతనికి వంతు నియమిస్తాడు.
47 “తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా ఆయన ఇష్టప్రకారం జరిగించకుండా ఉండే దాసుడు అనేక దెబ్బలకు గురి అవుతాడు. 48 కానీ తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన దాసుడు కొద్ది దెబ్బలకే గురి అవుతాడు. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో ఆ వ్యక్తిదగ్గర ఎక్కువగా కోరడం, ఎవరికైతే ఎక్కువగా అప్పగించబడుతుందో ఆ వ్యక్తి దగ్గర ఎక్కువగా అడగడం జరుగుతుంది”.
49 “భూమిమీద మంట వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రవులుకొని ఉండాలని ఎంతగానో కోరుతున్నాను. 50 నేను పొందవలసిన బాప్తిసం ఉంది. అది నెరవేరేవరకూ నేనెంతో ఒత్తిడి అనుభవిస్తున్నాను. 51 భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చానని అనుకొంటున్నారా? శాంతి కాదు. దానికి బదులుగా చీలిక కలిగించడానికి వచ్చానని మీతో చెపుతున్నాను. 52 ఇప్పటి నుంచి ఒకే ఇంట్లో అయిదుగురు ఉంటే, విభేదం కలిగి ముగ్గురు ఇద్దరికి ప్రతికూలంగా, ఇద్దరు ముగ్గురికి ప్రతికూలంగా ఉంటారు. 53 తండ్రి కొడుకుకు ప్రతికూలంగా, కొడుకు తండ్రికి ప్రతికూలంగా, తల్లి కూతురుకు ప్రతికూలంగా, కూతురు తల్లికి ప్రతికూలంగా, అత్త కోడలికి ప్రతికూలంగా, కోడలు అత్తకు ప్రతికూలంగా విభేదం కలిగి ఉంటారు.
54 ఆయన జన సమూహాలతో ఇలా అన్నాడు: “పడమట నుంచి మబ్బు పైకి రావడం చూచినప్పుడెల్లా ‘వాన వస్తూ ఉంది’ అని వెంటనే మీరు చెప్పుకొంటారు. అలాగే జరుగుతుంది కూడా. 55 దక్షిణం గాలి వీస్తూ ఉండడం మీరు చూస్తే ‘వడగాడ్పు రాబోతుంది’ అంటారు. అలా జరుగుతుంది కూడా. 56 కపట భక్తులారా! భూమ్యాకాశాల ఉపస్థితిని చూచి గ్రహించగలరు గాని ఈ కాలాన్ని గ్రహించలేక పోతున్నారేమిటి?
57 “ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు నిర్ణయించుకోరు? 58 నీవు నీ ప్రత్యర్థితో పాటు అధికారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటే దారిలోనే అతనితో సఖ్యపడే ప్రయత్నం చెయ్యి. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరకు లాక్కుపోతాడు. న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. భటుడేమో నిన్ను ఖైదులో తోస్తాడు. 59 మీతో నేను చెపుతున్నాను, చివరి పైసాతో కూడా చెల్లించేంతవరకూ నీవు దానిలోనుంచి బయటికి రావు.”