11
1 ఒకసారి ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ఆయనతో “ప్రభూ! ఎలా ప్రార్థన చేయాలో యోహాను తన శిష్యులకు నేర్పాడు. నీవు మాకు నేర్పు” అన్నాడు.
2 ఆయన వారితో అన్నాడు, “మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనండి: పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక! నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలోలాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక! 3 రోజువారి ఆహారం రోజు రోజు మాకు ప్రసాదించు. 4 మాకు రుణపడ్డ ప్రతి వ్యక్తినీ మేము కూడా క్షమిస్తున్నాం గనుక మా అపరాధాలను క్షమించు. మమ్ములను దుష్ ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గత నుంచి మమ్ములను రక్షించు.”
5 ఆయన వారితో ఇంకా అన్నాడు “మీలో ఎవరో ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. అతడు మధ్యరాత్రి అతనిదగ్గరకు వెళ్ళి ‘స్నేహితుడా! నాకు మూడు రొట్టెలు బదులివ్వు. 6 నా స్నేహితుడు ఒకడు ప్రయాణం మధ్యలో నాదగ్గరికి వచ్చాడు. అతడికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు’ అంటాడు అనుకోండి. 7 లోపల నుంచి అతడు ‘నన్ను తొందరపెట్టకు! తలుపు మూసి ఉంది. నేనూ నా పిల్లలూ మంచం మీద పడుకొన్నాం. నేను లేచి నీకివ్వలేను’ అంటాడు అనుకోండి. 8 నేను మీతో అంటున్నాను, అతడు తన స్నేహితుడు కావడంచేత ఇతడు లేచి ఇవ్వకపోయినా అతడు సిగ్గులేకుండా అడుగుతూ ఉంటే ఇతడు లేచి అతనికి కావలసినంత ఇస్తాడు.
9 “అందుచేత మీతో నేనంటున్నాను, దేవుణ్ణి అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, మీకు తెరవబడుతుంది. 10 అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరువబడుతుంది. 11 మీలో ఏ తండ్రినయినా కొడుకు రొట్టె కావాలని అడిగితే అతనికి రాయినిస్తాడా? చేప కావాలని అడిగితే చేపకు బదులుగా అతనికి పామునిస్తాడా? 12 గుడ్డు కావాలని అతడు అడిగితే అతనికి తేలునిస్తాడా?
13 “మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు మీ పరమ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా పవిత్రాత్మను ప్రసాదిస్తాడు గదా!”
14 ఒకప్పుడు ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అది మూగది. దయ్యం బయటికి వెళ్ళిపోయిన తరువాత మూగవాడు మాట్లాడాడు. అందుకా జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. 15 అయితే వారిలో కొందరు “దయ్యాల నాయకుడైన బయల్‌జెబూల్ సహాయంతోనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తున్నాడు” అన్నారు. 16 మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకంనుంచి ఆయన సూచనకోసం అద్భుతం చూపాలని చూశారు.
17 వారి ఆలోచనలు తెలుసుకొని ఆయన వారితో ఇలా అన్నాడు: “ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనమవుతుంది. ఇల్లు కూడా తనను తానే వ్యతిరేకించి చీలిపోతే కూలుతుంది. 18 ఒకవేళ సైతాను తననే వ్యతిరేకించి చీలిపోతే వాడి రాజ్యమెలా నిలుస్తుంది? బయల్‌జెబూబ్ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టివేస్తున్నానని నన్ను గురించి మీరంటున్నారు గదా. 19 ఒకవేళ నేను దయ్యాలను బయల్‌జెబూల్ సహాయంతో వెళ్ళగొట్టివేస్తున్నానంటే మీ కొడుకులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొట్టివేస్తున్నారు? అందుచేత మీ సంతానమే మీకు తీర్పరులవుతారు. 20 నేను దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టివేస్తూ ఉంటే, దేవుని రాజ్యం నిజంగా మీ మధ్యకు వచ్చిందన్నమాటే! 21 బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణానికి కావలి ఉంటే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. 22 కానీ అతడికంటే బలాఢ్యుడొకడు అతనిపైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొన్న ఆయుధాలన్నిటినీ ఇతడు లాగుకొని అతని సొత్తూ దోచుకొని పంచి ఇస్తాడు.
23 “నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు.
24 “మలిన పిశాచం మనిషిలో నుంచి బయటికి వచ్చినప్పుడు నీళ్ళు లేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతి కోసం వెదకుతూ ఉంటుంది. విశ్రాంతి ఏమీ దొరకక అది ‘నేను విడిచివచ్చిన నా ఇంటికి మళ్ళీ పోతాను’ అంటుంది. 25 అది వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, సర్దిపెట్టి ఉండడం చూస్తుంది. 26 అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డ ఆత్మలను ఏడింటిని వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం చేస్తాయి. అందుచేత ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి కంటే అధ్వాన్నంగా ఉంటుంది.”
27 ఆయన ఈ మాటలు చెపుతూ ఉన్నప్పుడు జన సమూహంలో ఒక స్త్రీ కంఠమెత్తి ఆయనతో “నిన్ను గర్భవాసాన మోసి నీకు స్తన్యం కుడిపిన తల్లి ధన్యజీవి!” అంది.
28 అందుకాయన “అవును, గానీ దేవుని వాక్కు విని దాని ఆచరించేవారే మరీ ధన్యులు” అన్నాడు.
29 జనులు గుంపులు గుంపులుగా సమకూడుతూ ఉంటే ఆయన ఇలా అన్నాడు: “ఈ తరం చెడ్డది. సూచక అద్భుతం కోసం చూస్తున్నది. కానీ యోనాప్రవక్త సూచన తప్ప ఇంకా ఏ సూచనా ఈ తరంవారికి చూపడం జరగదు. 30 యోనా నీనెవె నగరవాసులకు సూచనగా ఉన్నాడు. అలాగే మానవపుత్రుడు ఈ తరంవారికి సూచనగా ఉంటాడు.
31 “దక్షిణదేశం రాణి తీర్పు రోజున ఈ తరంవారితో నిలిచి వీరిమీద నేరం మోపుతుంది. ఎందుకంటే ఆమె సొలొమోను జ్ఞానవాక్కులు విందామని భూమి కొనలనుంచి వచ్చింది. అయితే సొలొమోను కంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు సుమా! 32 నీనెవె మనుషులు తీర్పురోజున ఈ తరంవారితో నిలిచి వీరిమీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటన చేసినప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. అయితే యోనాకంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు సుమా!
33 “దీపం వెలిగించి ఎవరూ దానిని మరుగున పెట్టరు, బుట్టక్రింద పెట్టరు. లోపలికి వచ్చేవారికి వెలుగు కనిపించేలా దీపస్తంభం మీద ఉంచుతారు గదా. 34 శరీరానికి దీపం కన్ను. గనుక మీ కన్ను మంచిదైతే మీ శరీరంనిండా వెలుగు ఉంటుంది. కన్ను చెడ్డదైతే మీ శరీరమంతా చీకటే. 35 కాబట్టి మీ లోపల ఉన్న వెలుగు చీకటిగా ఉండకుండా జాగ్రత్తగా చూచుకోండి! 36 మీ శరీరం నిండా వెలుగు ఉంటే, ఏ భాగంలోనూ చీకటి లేకపోతే, దీపం తన కాంతివల్ల మీకు వెలుగిచ్చినట్టే మీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.”
37  ఆయన మాట్లాడిన సమయంలో పరిసయ్యుడు ఒకడు తన ఇంటికి భోజనానికి రమ్మంటూ ఆయనను పిలిచాడు. ఆయన లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. 38 భోజనానికి ముందు ఆయన కడుక్కోకపోవడం చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు.
39 ప్రభువు అతనితో ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యులైన మీరు గిన్నె, పళ్ళెం బయటవైపు శుభ్రం చేస్తారు గాని మీ అంతరంగంనిండా దోపిడీ, దుర్మార్గం ఉన్నాయి. 40 తెలివితక్కువ వారలారా! బయటిది చేసినవాడు లోపలిది కూడా చేయలేదా! 41 మీకు ఉన్నవాటిని దానధర్మాలు చేయండి. అప్పుడు అన్నీ మీకు శుభ్రంగా ఉంటాయి.
42 “అయ్యో పరిసయ్యులారా! మీకు శిక్ష తప్పదు! పుదీనా, సదాప, అన్ని రకాల ఆకు కూరలలో పదో భాగం దేవునికి చెల్లిస్తారు గానీ న్యాయం, దేవుని ప్రేమ వదలివేస్తూ ఉన్నారు. మీరు వాటిని చేసి ఉండాలి, వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి.
43 “అయ్యో పరిసయ్యులారా! మీకు శిక్ష తప్పదు! సమాజకేంద్రాలలో అగ్రస్థానాలూ, సంతవీధుల్లో వందనాలు అందుకోవడమూ మీకు చాలా ఇష్టం. 44  అయ్యో, ధర్మశాస్త్రపండితులూ, పరిసయ్యులూ! మీరు కపట భక్తులు. మీకు శిక్ష తప్పదు! మీరు పైకి కనబడని సమాధుల్లాగా ఉన్నారు. తెలియక మనుషులు వాటిమీద నడుస్తున్నారు.”
45 అప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసులలో ఒకడు ఆయనకు జవాబిస్తూ “ఉపదేశకా, ఈ సంగతులు అనడంలో మమ్మల్ని కూడా నిందిస్తున్నావు!” అన్నాడు.
46 అందుకాయన అన్నాడు “అయ్యో, ధర్మశాస్త్ర విద్వాంసులారా! మీకు కూడా శిక్ష తప్పదు! మీరు మనుషుల మీద మోయడానికి కష్టతరమైన బరువులు మోపుతారు. మీరైతే ఒక్క వ్రేలితోనైనా ఆ బరువులు తాకరు.
47 “అయ్యో, మీకు శిక్ష తప్పదు! మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. వారి సమాధులు మీరు కట్టిస్తున్నారు. 48 నిజంగా మీరు మీ పూర్వీకులు చేసినదానికి సమ్మతిస్తున్నారని ఇలా సాక్ష్యమిస్తున్నారు. వారిని చంపినదేమో వారు, వారి సమాధులు కట్టించేదేమో మీరు. 49 అందుచేత దేవుని జ్ఞానం చెప్పినదేమంటే, నేను వారి దగ్గరకు ప్రవక్తలనూ రాయబారులనూ పంపుతాను. వారిలో కొందరిని చంపుతారు. కొందరిని హింసిస్తారు. 50 ఈ విధంగా, లోకానికి పునాది వేయబడ్డప్పటినుంచీ ప్రవక్తలందరి రక్తపాతం విషయం ఈ తరంవారు జవాబుదారులవుతారు. 51 అంటే, హేబెలు రక్తం మొదలుకొని, బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైపోయిన జెకర్యా రక్తం వరకు, వారందరి రక్తపాతం విషయం ఈ తరంవారు జవాబుదారులవుతారని మీతో రూఢిగా చెపుతున్నాను. 52 అయ్యో, ధర్మశాస్త్ర విద్వాంసులారా! మీకు శిక్ష తప్పదు! జ్ఞానానికి తాళం చెవి మీరు కొట్టేశారు. మీరు లోపల ప్రవేశించలేదు, ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు!”
53 ఆయన వారితో ఈ విషయాలు చెప్పినప్పుడు ధర్మశాస్త్రవిద్వాంసులూ పరిసయ్యులూ ఆయనను ఎంతో తీవ్రంగా పీడిస్తూ ఆయనను రెచ్చగొట్టాలని అనేక సంగతులను గురించి ఆయనను ప్రశ్నించడం ఆరంభించారు. 54 ఆయనమీద నేరం మోపాలని కుట్ర పన్ని ఆయన చెప్పిన మాటల్లో ఆయనను చిక్కించడానికి చూస్తూ ఉన్నారు.