10
1 ✽ఆ తరువాత ప్రభువు డెబ్భయిమంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికీ స్థలానికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందు పంపాడు. 2 ✝వారితో ఇలా అన్నాడు: “కోత చాలా ఎక్కువ. పనివారే తక్కువ, గనుక కోత యజమానిని కోతకు పనివారిని పంపమని వేడుకోండి. 3 ✝ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యలోకి గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతున్నాను. మీరు వెళ్ళండి. 4 ✽ బొక్కసం గానీ సంచి గానీ చెప్పులు గానీ తీసుకువెళ్ళకండి. దారిన ఎవరినీ పలకరించకండి.5 ✝“ఏ ఇంట్లో అయినా ప్రవేశించినప్పుడు ‘ఈ ఇంటికి శాంతి ప్రాప్తిస్తుంది గాక!’ అనండి. 6 శాంతిప్రియుడు ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీదికి వస్తుంది. లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది. 7 ఆ ఇంట్లోనే ఉండి, వారు మీకు పెట్టే అన్నపానాలేవైనా పుచ్చుకోండి. పనివాడు జీతానికి యోగ్యుడే గదా. ఇంటినుంచి ఇంటికి మారకండి.
8 “మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే వారు మిమ్ములను స్వీకరిస్తే వారేది మీకు వడ్డిస్తే అది తినండి. 9 అక్కడి రోగులను బాగు చేసి వారితో ‘దేవుని రాజ్యం✽ మీదగ్గరకు వచ్చింది’ అని చెప్పండి. 10 ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళిన తరువాత వారు మిమ్ములను స్వీకరించకపోతే ఆ ఊరి వీధులలోకి వెళ్ళి ఇలా అనండి: 11 ‘మాకు అంటుకొన్న మీ ఊరి దుమ్ము మీకు వ్యతిరేకమైన సాక్ష్యంగా దులిపివేస్తున్నాం. అయితే దేవుని రాజ్యం మీ దగ్గరకు సమీపించిందని తెలుసుకోండి.’ 12 ✽మీతో నేను చెప్పేదేమిటంటే, తీర్పు రోజున ఆ గ్రామానికి పట్టే గతికంటే సొదొమకు పట్టే గతే ఓర్చుకో తగినదవుతుంది.
13 ✝“అయ్యో కొరజీనూ! నీకు శిక్ష తప్పదు! అయ్యో బేత్‌సెయిదా! నీకు శిక్ష తప్పదు! మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో గనుక జరిగివుంటే, అక్కడి వారు చాలా కాలం క్రిందటే పశ్చాత్తాపపడి గోనెపట్టలు చుట్టుకొని నెత్తిన బూడిద పోసుకొని కూర్చునేవారు! 14 అయితే తీర్పులో మీకు పట్టే గతికంటే తూరు సీదోనుల గతే ఓర్చుకో తగినదవుతుంది! 15 కపెర్‌నహూం! ఆకాశం వరకూ హెచ్చిపోయిన నీవు మృత్యు లోకంలోకి తగ్గించబడుతావు!
16 ✝“మీ మాట వినేవారు నా మాట విన్నట్టే. మిమ్ములను నిరాకరించేవారు నన్ను నిరాకరిస్తున్నారు. నన్ను నిరాకరించే వారు నన్ను పంపినవాణ్ణి నిరాకరిస్తున్నారు.”
17 ✽ఆ డెబ్భయిమంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి “ప్రభూ! నీ పేరట దయ్యాలు సహా మాకు లొంగిపోతున్నాయి” అన్నారు.
18 ✽అందుకాయన “సైతాను మెరుపులాగా ఆకాశంనుంచి పడడం నేను చూశాను. 19 ✽ఇదిగో వినండి, పాములనూ తేళ్ళనూ మీ పాదాల క్రింద త్రొక్కడానికి శత్రు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. ఏదీ మీకు హాని చేయదు. 20 ✽అయినా పిశాచాలు మీకు లొంగిపోయినంత మాత్రాన సంతోషించకండి గాని మీ పేర్లు పరలోకంలో వ్రాసి ఉన్నందుచేత✽ సంతోషించండి” అని వారితో చెప్పాడు.
21 ✽ ఆ ఘడియలోనే పవిత్రాత్మలో ఆనందిస్తూ యేసు ఇలా అన్నాడు: “తండ్రీ! భూమ్యాకాశాల ప్రభూ! నీవు ఈ సంగతులు జ్ఞానులకూ తెలివైనవారికీ చూపకుండా దాచిపెట్టి వాటిని చిన్నపిల్లలకు వెల్లడి చేశావు. అవును, తండ్రీ, అలా చేయడం నీకు ఇష్టమైంది. అందుచేత నిన్ను స్తుతిస్తున్నాను.
22 “నా తండ్రి సమస్తమూ నాకు అప్ప చెప్పాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఎవరికీ తెలియదు. కుమారునికి తప్ప తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. కుమారుడు తండ్రిని ఎవరికి వెల్లడి చేయాలని ఇష్టపడుతాడో వారికి కూడా తెలుసు.”
23 ✝అప్పుడాయన శిష్యులవైపు తిరిగి, ఏకాంతంగా వారితో “మీరు చూస్తున్నవాటిని చూచే కండ్లు ధన్యమైనవి. 24 మీతో నేను చెప్పేదేమంటే, మీరు చూస్తున్నవాటిని చూడాలనీ, వింటున్నవాటిని వినాలనీ అనేకమంది ప్రవక్తలూ, రాజులూ ఆశించారు గాని చూడలేకపోయారు, వినలేక పోయారు” అన్నాడు.
25 ✽ఒకప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసుడొకడు లేచి ఆయనను పరీక్షిస్తూ “ఉపదేశకా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చేయాలి?” అని అడిగాడు.
26 ✽ఆయన అతనితో “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? నీవు దాన్ని చదవడం వల్ల నీకు తోచేది ఏమిటి?” అన్నాడు.
27 ✽అందుకు అతడు ఇలా జవాబిచ్చాడు: “హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బలమంతటితో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి; మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.”
28 ✽ఆయన అతనితో “సరిగ్గా చెప్పావు. అలాగే చేస్తూ ఉండు. అప్పుడు జీవిస్తావు” అన్నాడు.
29 ✽తాను న్యాయవంతుడై ఉన్నట్టు చూపుకోవాలని అతడు “అయితే నా పొరుగువాడు ఎవరు?” అని యేసును అడిగాడు.
30 ✽✽యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు: “ఒక మనిషి జెరుసలంనుంచి యెరికోకు ప్రయాణమైపోతూ దోపిడీదొంగల చేతికి చిక్కాడు. వారు అతని ఒంటిమీద బట్టలు ఒలుచుకొని అతణ్ణి గాయపరచి కొనప్రాణంతో అతణ్ణి విడిచి వెళ్ళిపోయారు. 31 ✽అదృష్టవశాత్తుగా ఒక యాజి ఆ దారిన వచ్చాడు. అతడు ఆ మనిషిని చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. 32 అలాగే లేవీగోత్రికుడొకడు కూడా ఆ చోటికి వచ్చి అతణ్ణి చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. 33 ✽అయితే సమరయ దేశస్థుడొకడు ప్రయాణంమీద ఉండి ఆ మనిషి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూచి జాలిపడ్డాడు, 34 దగ్గరకు వచ్చి అతని గాయాలకు నూనె, ద్రాక్షరసం పోసి కట్లు కట్టాడు, అతణ్ణి తన సొంత గాడిద మీద ఎక్కించుకొని సత్రానికి తీసుకువెళ్ళి బాగోగులు చూశాడు. 35 మరుసటి రోజు అతడు బయలు దేరబోతుండగా రెండు వెండి నాణేలు తీసి సత్రం మనిషికిచ్చి ‘ఇతడి బాగోగులు చూడండి. ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు మీకు చెల్లిస్తాను’ అన్నాడు.
36 ✽“నీకేమి తోస్తున్నది? – దోపిడీదొంగల చేతికి చిక్కిన మనిషికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడుగా ఉన్నారు?”
37 అతడు “అతనిపట్ల జాలి చూపినవాడే” అన్నాడు.
అతనితో యేసు “నీవు వెళ్ళి అలాగే చేస్తూ ఉండు” అన్నాడు.
38 ✽వారు ప్రయాణమైపోతూ ఉంటే ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఆమె ఆయనను తన ఇంట్లోకి సత్కరించింది. 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. మరియ యేసు పాదాలదగ్గర కూర్చుని ఉండి ఆయన వాక్కులు వింటూ ఉంది. 40 ✽ మార్త అయితే చాలా సేవను బట్టి తొందరపడుతూ ఆయన దగ్గరకు వచ్చి “ప్రభూ! నేను ఒక్కదాన్నే పని చేయడానికి నా సోదరి నన్ను విడిచిపెట్టి నందుకు మీకేం పట్టదా? నాకు సహాయం చేయమని ఆమెకు చెప్పండి!” అంది.
41 ✽అయితే యేసు ఆమెకు ఇలా జవాబిచ్చాడు: “మార్తా! మార్తా! నీవు అనేక సంగతులను గురించి బెంగపెట్టుకొని కంగారుపడుతున్నావు. 42 అయితే అవసరమైనది ఒక్కటే! మరియ ఎన్నుకొన్నది ఆ ఉత్తమమైనది. అది ఆమెనుంచి తీసివేయబడదు.”