9
1 ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని వారికి దయ్యాలన్నిటి మీదా అధికారం, బలప్రభావాలు ఇచ్చాడు. రోగాలు కుదిర్చే సామర్థ్యం ఇచ్చాడు. 2 దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపుతూ 3 “ప్రయాణం కోసం ఏమీ తీసుకువెళ్ళకండి – చేతికర్ర గానీ చేతిసంచి గానీ ఆహారం గానీ డబ్బు గానీ తీసుకువెళ్ళకండి. రెండు చొక్కాలు ఉంచుకోకండి. 4 మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తారో ఆ ఇంటిలోనే బస చేయండి, అక్కడనుంచీ బయలుదేరండి. 5 ఎవరైతే మిమ్ములను స్వీకరించరో మీరు ఆ గ్రామం విడిచి వెళ్ళేటప్పుడు వారికి వ్యతిరేకమైన సాక్ష్యంగా మీ పాద ధూళి దులిపివేయండి” అని వారితో చెప్పాడు.
6 అప్పుడు వారు బయలుదేరి గ్రామ గ్రామాలకు వెళ్తూ అంతటా శుభవార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ ఉన్నారు.
7 ఆయన చేస్తున్న వాటన్నిటిని గురించి రాష్ట్రాధికారి హేరోదు విన్నప్పుడు కలవరపడ్డాడు. ఎందుకంటే, బాప్తిసమిచ్చే యోహాను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేచాడని కొందరు అన్నారు. 8 మరి కొందరు ఏలీయా కనిపించాడన్నారు. మరి కొందరు ప్రాచీన ప్రవక్తలలో ఒకడు మళ్ళీ లేచాడన్నారు. 9 హేరోదు అన్నాడు “యోహాను తల నరికించాను గదా! మరి ఈ మనిషిని గురించి ఈ సంగతులు వింటున్నాను – ఇతడెవరు?” హేరోదు ఆయనను చూడడానికి ప్రయత్నించాడు.
10 యేసు రాయబారులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారిని వెంటబెట్టుకొని ఏకాంతంగా బేత్‌సయిదా అనే ఊరికి చెందిన నిర్జన స్థలానికి వెళ్ళాడు. 11 అయితే జన సమూహాలు అది తెలుసుకొని ఆయన వెంట వెళ్ళారు. ఆయన వారిని స్వీకరించి దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడాడు, బాగుపడవలసిన వారిని బాగు చేశాడు. 12 ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు తన పన్నెండుగురు శిష్యులు వచ్చి “మనం ఉన్నది నిర్జన స్థలం, ఈ జన సమూహం చుట్టుపట్ల గ్రామాలకూ పల్లెసీమకూ వెళ్ళి బస చేయడానికీ తినుబండారాలు చూచుకోవడానికీ వారిని పంపించండి” అని ఆయనతో అన్నారు.
13 అయితే ఆయన వారితో “మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు. అందుకు వారు “మేము వెళ్ళి ఈ ప్రజలందరికోసం భోజనం కొనకుండా ఉంటే మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు రెండు చేపలూ. మరేమీ లేదు.” అన్నారు.
14 అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు. ఆయన తన శిష్యులతో “వారిని గుంపులుగా ఒక్కొక్క గుంపులో యాభైమంది ప్రకారం కూర్చోబెట్టండి” అన్నాడు.
15 అలాగే వారు వారందరినీ కూర్చోబెట్టారు. 16 ఆయన ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలూ చేతపట్టుకొని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ వాటిని దీవించి విరిచి జన సమూహానికి వడ్డించడానికి శిష్యులకందించాడు. 17 అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే పన్నెండు గంపలు నిండాయి.
18 ఒక సారి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు. వారిని చూచి ఆయన “జన సమూహాలు నేనెవరినని చెప్పుకొంటున్నారు?” అనడిగాడు.
19 “బాప్తిసమిచ్చే యోహాను. ఏలీయావని అంటారు మరి కొందరు. మరి కొందరేమో ప్రాచీన ప్రవక్తలలో ఒకరు మళ్ళీ లేచారు అంటున్నారు” అని వారు జవాబిచ్చారు.
20 “మీరైతే నేనెవరినని చెప్పుకొంటున్నారు?” అని ఆయన వారినడిగాడు. “దేవుని అభిషిక్తుడివే!” అని పేతురు ఆయనకు సమాధానం చెప్పాడు.
21 ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని ఆయన వారిని ఖండితంగా హెచ్చరించి ఆదేశించాడు. 22 “మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవించి పెద్దల, ప్రధాన యాజుల, ధర్మశాస్త్రపండితుల నిరాకరణకు గురి అయి చంపబడి మూడో రోజున సజీవంగా లేపబడడం తప్పనిసరి” అన్నాడు.
23 ఆయన అందరితో ఇలా అన్నాడు: “ఎవరైనా సరే నా వెంట రావాలనుకొంటే తనను నిరాకరించుకొని ప్రతి రోజూ తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. 24 తన కోసం తన జీవాన్ని దక్కించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టు కొంటాడు. కానీ నా కోసం తన జీవాన్ని పోగొట్టుకొనేవాడు దానిని దక్కించుకొంటాడు. 25 ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని తననే పోగొట్టుకొంటే, లేదా నష్టపరచుకొంటే అతనికి లాభమేమిటి? 26 ఎవరైనా సరే నన్ను గురించీ నా మాటల గురించీ సిగ్గుపడుతూ ఉంటే, మానవపుత్రుడు తన మహిమతోనూ తన తండ్రి మహిమతోనూ పవిత్ర దేవదూతల మహిమతోనూ వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి సిగ్గుపడుతాడు. 27 మీతో నిజం చెపుతున్నాను, ఇక్కడ నిలుచున్నవారిలో కొంతమంది దేవుని రాజ్యాన్ని చూచేవరకు చనిపోరు.”
28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని సుమారు ఎనిమిది రోజుల తరువాత ఆయన పేతురునూ యోహానునూ యాకోబునూ వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. 29 ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖ కవళికలు మారాయి. ఆయన బట్టలు తెల్లనివై ధగధగ మెరిశాయి. 30 ఉన్నట్టుండి ఇద్దరు మనుషులు కనబడి ఆయనతో మాట్లాడారు. వారు మోషే, ఏలీయా. 31 వారు మహిమతో కనబడి జెరుసలంలో యేసు నెరవేర్చబోయే ఆయన మరణం విషయం మాట్లాడారు.
32 పేతురు, అతనితో ఉన్నవారు నిద్ర భారంతో ఉన్నారు. కానీ పూర్తిగా మేల్కొని ఆయన మహిమనూ ఆయన దగ్గర నిలుచున్న ఆ ఇద్దరు మనుషులనూ చూశారు. 33 ఆ ఇద్దరు యేసును విడిచి వెళ్లిపోతూ ఉంటే, పేతురు ఆయనతో ఇలా అన్నాడు: “నాయకా! మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలను వేయనియ్యి – ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు.” అతడు ఏమి చెపుతున్నాడో అతనికే తెలియదు.
34 అతడు ఈ మాటలు పలుకుతుండగానే ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. మేఘం అలా కమ్ముకొంటూ ఉంటే శిష్యులు భయపడ్డారు. 35 అప్పుడు మేఘంలో నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.” 36 ఆ స్వరం మాట్లాడిన తరువాత యేసు ఒక్కడే కనబడ్డాడు. వారు చూచినవాటిని గురించి మౌనం వహించి ఆ రోజుల్లో వాటిలో ఏది కూడా ఎవరికీ చెప్పలేదు.
37  మర్నాడు వారు పర్వతం దిగి వచ్చినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకెదురుగా వచ్చారు. 38 ఆకస్మికంగా జన సమూహంలో ఒక మనిషి కంఠమెత్తి “ఉపదేశకా! వచ్చి నా కొడుకును కటాక్షించండని తమరిని వేడుకొంటున్నాను. నాకు అతడొక్కడే కొడుకు. 39 అతణ్ణి ఒక ఆత్మ పూనుతుంది. ఉన్నట్టుండి అతడు పెడ బొబ్బలు పెడతాడు. అతడి నోటి వెంట నురుగు కారుతుంది. ఎందుకంటే అది అతణ్ణి విలవిలలాడిస్తుంది. అది అతణ్ణి నలగగొడుతూ చాలా కష్టంతో విడిచిపోతుంది. 40 దానిని వెళ్ళగొట్టండని తమరి శిష్యులను వేడుకొన్నాను గాని వారిచేత కాలేదు” అన్నాడు.
41 యేసు ఇలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని వక్ర తరమా! నేనెంతకాలం మీతో ఉండి మిమ్ములను సహించాలి! నీ కొడుకును ఇక్కడికి తీసుకురా.”
42 అబ్బాయి వస్తూ ఉండగానే ఆ పిశాచం అతణ్ణి క్రింద పడవేసి విలవిలలాడించింది. అయితే యేసు ఆ మలిన ఆత్మను మందలించి అబ్బాయిని బాగు చేసి తండ్రికి అప్పచెప్పాడు. 43 అందరూ దేవుని మహత్యానికి ఎంతో విస్మయమొందారు. యేసు చేస్తున్నదానంతటి విషయం ప్రజలంతా ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను చూచి 44 “ఈ మాటలు మీ చెవులలో దూరనివ్వండి – మానవ పుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరగబోతున్నది” అన్నాడు.
45 వారైతే ఆ మాట గ్రహించలేదు. అది వారికి అర్థం కాకుండా దాచబడి ఉంది. ఆ మాట గురించి ఆయనను అడగడానికి వారికి భయంగా ఉంది కూడా.
46 తమలో ఎవరు ప్రముఖుడో అని శిష్యుల మధ్య వివాదం పుట్టింది. 47 వారి హృదయాలోచన గ్రహించి యేసు ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ప్రక్కన నిలబెట్టి వారితో ఇలా అన్నాడు: 48 “ఈ చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు ఎవడైనా నన్ను పంపినవాణ్ణి స్వీకరిస్తున్నాడు. మీ అందరిలో అల్పుడెవడో అతడే ప్రముఖుడు!”
49 అందుకు యోహాను “నాయకా, నీ పేర ఎవరో ఒకడు దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనల్ని అనుసరించేవాడు కాడు గనుక అతణ్ణి ఆటంకపరిచాం” అన్నాడు.
50 అయితే యేసు అతనితో “అతణ్ణి ఆటంకపరచకండి. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షంవాడే” అన్నాడు.
51  యేసును పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గరపడింది. అప్పుడాయన జెరుసలం వెళ్ళడానికి మనసు దిటవు చేసుకొని తనకు ముందుగా దూతలను పంపాడు. 52 వారు బయలుదేరి ఆయన కోసం అంతా సిద్ధం చేయడానికి సమరయవారి గ్రామాలలో ఒకదానికి వెళ్ళారు. 53 కానీ ఆ గ్రామస్థులు ఆయనను స్వీకరించలేదు. ఎందుకంటే ఆయనకు జెరుసలం వెళ్ళాలని మనసు ఉంది.
54  అది చూచి ఆయన శిష్యులైన యాకోబు యోహానులు అన్నారు “ప్రభూ! ఏలీయా చేసినట్టు వీళ్ళను భస్మం చేసేలా మేము ఆజ్ఞ ఇచ్చి ఆకాశం నుంచి మంటలు రప్పించాలని నీ ఇష్టమా?” 55 ఆయన వారివైపు తిరిగి, వారిని మందలించాడు. “మీకు ఎలాంటి ఆత్మతో సంబంధం ఉన్నదో మీకు తెలియదు. 56 ఎందుకంటే, మానవ పుత్రుడు వచ్చినది మనుషుల ప్రాణాలను నాశనం చేయడానికి కాదుగాని వాటిని రక్షించడానికే” అన్నాడు. అప్పుడు వారు వేరే గ్రామానికి తరలి వెళ్ళారు.
57 వారు దారిన సాగిపోతూ ఉంటే ఎవరో ఒక మనిషి “ప్రభూ! మీరెక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటే వస్తాను” అన్నాడు.
58 అందుకు యేసు అతనితో “నక్కలకు గుంటలు ఉన్నాయి, గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి గానీ మానవపుత్రునికి తలవాల్చుకొనే స్థలం ఏదీ లేదు” అన్నాడు.
59 మరో మనిషితో “నా వెంట రా!” అన్నాడు. అతడైతే “ప్రభూ, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేంత వరకూ సెలవియ్యండి” అన్నాడు.
60 యేసు అతణ్ణి చూచి “చనిపోయినవారే చనిపోయిన తమ వారిని పాతిపెట్టనియ్యి. నీవైతే వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అన్నాడు.
61 మరొకడు ఇలా అన్నాడు: “ప్రభూ, నేను నీ వెంట వస్తాను గాని మొట్టమొదట వెళ్ళి నా ఇంట్లో వారికి వీడ్కోలు చెప్పనివ్వండి.”
62 అయితే యేసు అతనితో “నాగలి మీద చేయి పెట్టి వెనక్కు చూచేవాడెవడూ దేవుని రాజ్యానికి తగడు” అన్నాడు.