8
1 ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ గ్రామ గ్రామానికి వెళ్తూ దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్త బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనతోపాటు ఉన్నది తన పన్నెండుగురు శిష్యులూ, 2 పిశాచాలు పట్టినప్పుడు, లేదా జబ్బు చేసినప్పుడు ఆయనచేత బాగుపడ్డ స్త్రీలు కొందరూ. వీరెవరంటే, మగ్దలేనే అనబడ్డ మరియ (ఆమెలో నుంచి ఏడు దయ్యాలు వెళ్ళిపోయాయి), 3 హేరోదు గృహ నిర్వాహకుడైన కుజా భార్య యోహన్న, సుసాన్నా మొదలైనవారు అనేకమంది. వీరు తమ ఆస్తిలోనుంచి ఆయనకు సహాయం చేసేవారు.
4  ఒకప్పుడు పెద్ద జనసమూహం సమకూడితే, ప్రజలు ప్రతి పట్టణంనుంచీ ఆయన దగ్గరకు వస్తూ ఉంటే, ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: 5 “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. అవి కాళ్ళక్రింద త్రొక్కబడ్డాయి. గాలిలో ఎగిరే పక్షులు వాటిని మ్రింగివేశాయి. 6 మరి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. లోపల తడిలేదు గనుక మొలిచిన వెంటనే అవి ఎండిపోయాయి. 7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల మధ్య పడ్డాయి. ముండ్ల తుప్పలు వీటితోపాటు పెరిగి వాటిని అణిచివేశాయి. 8 మరి కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఇవి మొలిచి పెరిగి నూరు రెట్లు పంట పండాయి.”
ఇలా చెప్పి ఆయన “వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!” అని బిగ్గరగా అన్నాడు.
9 ఆయన శిష్యులు “ఈ ఉదాహరణకు అర్థం ఏమిటి?” అని ఆయననడిగారు.
10 అందుకాయన అన్నాడు, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకోవడం మీకు ఇవ్వబడినది గాని ఇతరులకు ఉదాహరణలలో ఉపదేశిస్తున్నాను. కారణం ఏమంటే, వారు చూస్తూ ఉన్నా చూడకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. 11 ఈ ఉదాహరణ భావమిది: విత్తనమంటే దేవుని వాక్కు. 12 దారిప్రక్కన ఉన్నవారంటే వాక్కు వినేవారు గానీ అపనింద పిశాచం వచ్చి వారి హృదయంలోనుంచి వాక్కు తీసివేస్తాడు. వారు నమ్మకుండా పాపవిముక్తి పొందకుండా చేయాలని వాడి ఉద్దేశం. 13 రాతి నేల మీద ఉన్నవారంటే వాక్కు విని సంతోషంతో అంగీకరించేవారు. కానీ వీరిలో వేరులు లేకపోవడంచేత కొద్ది కాలమే నమ్ముతారు. విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. 14 ముళ్ళ తుప్పలలో పడ్డ విత్తనాలు అంటే వాక్కు వినేవారు గాని తమ దారిన సాగుతూ ఉంటే జీవితంలో చీకుచింతలతో, సంపదలతో, సుఖభోగాలతో అణగారిపోయేవారు. వీరి ఫలం ఏదీ పరిపక్వం చెందదు. 15 మంచి నేలలో పడ్డ విత్తనాలంటే హితమైన మంచి హృదయం కలిగి వాక్కు విని నిలుపుకొని ఓర్పు కలిగి ఫలించేవారు.
16  “ఎవడూ దీపం వెలిగించి దానిమీద పాత్రతో కప్పడు లేదా, దానిని మంచం క్రింద పెట్టడు. లోపలికి వచ్చేవారికి వెలుగు కనిపించేలా దానిని దీప స్తంభంమీద ఉంచుతాడు. 17 దాచి ఉంచినది ఏదీ తేటతెల్లంకాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలిసిపోకుండా ఉండదు. 18 గనుక మీరెలా వింటున్నారో బాగా చూచుకోండి. ఎందుకంటే, కలిగిన వ్యక్తికి ఇంకా ఇవ్వడమూ, లేని వ్యక్తి నుంచి ఉన్నదని కనిపించేది కూడా తీసివేయడమూ జరుగుతుంది.”
19 ఆయనను చూడడానికి ఆయన తల్లి, తమ్ముళ్ళు వచ్చారు. జనసమూహాన్ని బట్టి ఆయన దగ్గరకు రాలేక ఉన్నారు. 20 “మిమ్ములను చూడాలని మీ తల్లి, మీ తమ్ముళ్ళు బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు.
21  అందుకాయన జవాబిస్తూ వారితో “దేవుని వాక్కు విని దాని ప్రకారం చేసేవారే నా తల్లి, నా తమ్ముళ్ళు” అన్నాడు.
22 ఒకానొక రోజున ఆయన తన శిష్యులతోపాటు పడవ ఎక్కి వారితో “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. వారు పడవ సరస్సులోకి త్రోసి బయలుదేరారు. 23 వారు పడవ నడుపుతూ ఉన్నప్పుడు ఆయన నిద్రపోయాడు. ఇంతలో సరస్సుమీదికి తుఫాను వచ్చింది. వారు ఉన్న పడవ నీళ్ళతో నిండిపోతూ ఉంది. వారు అపాయంలో చిక్కుకొన్నారు. 24 కనుక ఆయనదగ్గరకు వచ్చి ఆయనను మేల్కొలిపి “నాయకా! నాయకా! నశించిపోతున్నాం!” అన్నారు. ఆయన లేచి గాలినీ ఉప్పెననూ మందలించాడు. అవి నిమ్మళమయ్యాయి. అంతా ప్రశాంతమైపోయింది.
25 అప్పుడాయన వారితో “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు.
వారు భయపడుతూ ఎంతో ఆశ్చర్యపోతూ “ఈయన గాలికీ నీళ్ళకూ ఆజ్ఞ జారీ చేస్తే అవి లోబడుతున్నాయే! ఈయన ఎవరో!” అని ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు.
26 వారు పడవ నడుపుతూ గలలీకి ఎదురుగా ఉన్న గడారీన్‌వారి ప్రాంతం చేరారు. 27 ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ గ్రామానికి చెందినవాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. అతడు చాలా కాలంపాటు దయ్యాలు పట్టినవాడు. అతడు బట్టలు తొడుక్కోకుండా, ఏ ఇంటిపట్టున ఉండకుండా సమాధులలోనే నివసించేవాడు.
28 యేసును చూచి అతడు కేక పెట్టి ఆయన ముందు సాగిలపడి “యేసూ! సర్వాతీతుడైన దేవుని కుమారా! నా జోలి నీకెందుకు? నన్ను వేధించకని నిన్ను వేడుకొంటున్నాను!” అని అరిచాడు.
29 ఎందుకంటే ఆయన “ఈ మనిషిలోనుంచి బయటికి రా!” అని ఆ మలిన పిశాచానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ పిశాచం అతణ్ణి తరచుగా పట్టేది. అక్కడివారు అతణ్ణి గొలుసులతో, కాలి సంకెళ్ళతో కట్టి కాపలా కాచినా అతడు బంధకాలు తెంపి ఆ దయ్యంచేత నిర్జన ప్రదేశాలకు తీసుకుపోబడ్డాడు.
30 యేసు “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. అతడు “సేన” అన్నాడు. ఎందుకంటే అతనిలో చొరబడినది అనేక పిశాచాలు. 31 అవి తమను అగాధంలోకి పోవడానికి ఆజ్ఞాపించవద్దని ఆయనను ప్రాధేయపడ్డాయి. 32 అక్కడ కొండమీద ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. వాటిలో ప్రవేశించడానికి తమకు సెలవిమ్మని పిశాచాలు ఆయనను ప్రాధేయపడ్డాయి. ఆయన వాటికి సెలవిచ్చాడు. 33 ఆ దయ్యాలు ఆ మనిషిలోనుంచి బయటికి వచ్చి ఆ పందులలో చొరబడ్డాయి. అప్పుడా పందుల మంద నిటారమైన ఆ స్థలంమీదనుంచి వేగంగా పరుగెత్తుతూ సరసులో పడి మునిగి చచ్చాయి.
34 పందులు మేపేవారు జరిగినది చూచి పారిపోయి ఆ సంగతి ఊరిలో, ఆ పల్లెసీమలో చెప్పారు. 35 జరిగినది ఏమిటో చూద్దామని అక్కడివారు వచ్చారు. యేసు దగ్గరకు చేరినప్పుడు, దయ్యాలు వదలిపోయిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనఃస్థిమితంతో యేసు పాదాలదగ్గర కూర్చుని ఉండడం చూశారు. వారికి భయం వేసింది. 36 జరిగినది చూచినవారు దయ్యాలు పట్టినవాడు ఎలా ఆరోగ్యం పొందాడో వారికి తెలియజేశారు. 37 అప్పుడు తమ దగ్గరనుంచి వెళ్ళిపొమ్మని గడారీన్‌వారి ప్రాంతీయులంతా ఆయనను కోరారు. ఎందుకంటే వారినెంతో భయం ఆవరించింది.
ఆయన పడవ ఎక్కి బయలుదేరాడు. 38 ఆయనతో ఉండనిమ్మని దయ్యాలు వదలిపోయినవాడు ఆయనను వేడుకొన్నాడు గాని యేసు అతణ్ణి పంపివేస్తూ 39 “నీవు నీ సొంత ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెంత గొప్ప క్రియలు చేశాడో తెలియజెయ్యి” అన్నాడు. అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో ఊరంతటా చెప్పాడు.
40 అవతలి ఒడ్డున జనసమూహం యేసు కోసం చూస్తూ ఉన్నారు గనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను సంతోషంతో స్వీకరించారు. 41 అప్పుడు యూద సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసు పాదాల దగ్గర సాగిలపడి తన ఇంటికి రమ్మని ఆయనను ప్రాధేయపడ్డాడు. 42 ఎందుకంటే అతని ఒకే ఒక కూతురు సుమారు పన్నెండేళ్ళ బాలిక చావు బ్రతుకులలో ఉంది. ఆయన వెళ్తూ ఉంటే జనసమూహాలు ఆయనమీద విరగబడుతూ ఉన్నారు.
43 పన్నెండేళ్ళనుంచి రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తన బ్రతుకుదెరువంతా వైద్యుల దగ్గర ఖర్చు చేసింది గాని వారిలో ఎవరిచేత స్వస్థత పొందలేకపోయింది. 44 ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచు తాకింది. వెంటనే ఆమెకు రుతుస్రావం ఆగిపోయింది.
45 “నన్ను తాకినదెవరు?” అని యేసు అడిగాడు.
అందరూ తాము కాదు అన్నారు.
పేతురు, అతనితో ఉన్నవారు “నాయకా! ఈ జనసమూహాలు కిక్కిరిసి నీమీద పడుతూ ఉన్నారు గదా! అయినా నీవు ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావు.”
46 అయితే యేసు అన్నాడు “ఎవరో నన్ను తాకారు. నాలో నుంచి ప్రభావం బయలుదేరిందని నాకు తెలిసింది.”
47 తాను దాగి ఉండలేనని గ్రహించి ఆ స్త్రీ వణకుతూ వచ్చి ఆయన ముందు సాగిల పడింది. తానెందుకు యేసును తాకినదీ, తన వ్యాధి ఎలా వెంటనే పూర్తిగా నయమైనదీ ప్రజలందరి ఎదుట ఆయనకు చెప్పింది.
48 అప్పుడాయన ఆమెతో “కుమారీ, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. శాంతితో వెళ్ళు” అన్నాడు.
49 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటినుంచి ఒకడు వచ్చి “మీ కూతురు చనిపోయింది. ఉపదేశకుణ్ణి తొందర పెట్టకండి” అన్నాడు.
50 అది విని యేసు అతనితో “భయపడకు! నమ్మకం మాత్రం ఉంచు. అప్పుడామె బాగుపడుతుంది” అని జవాబిచ్చాడు.
51 ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పేతురునూ యాకోబునూ యోహానునూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప ఎవరినీ లోపలికి రానివ్వలేదు. 52 అమ్మాయిని గురించి అక్కడివారంతా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు. ఆయన “ఏడవకండి. ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. 53 ఆమె చనిపోయిందని తెలిసి వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు.
54 అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “చిన్నపిల్లా! లే!” అన్నాడు. 55 ఆమెకు తన ఆత్మ తిరిగి వచ్చి ఆమె వెంటనే లేచింది. ఆమెకు తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు. 56 ఆమె తల్లిదండ్రులకు ఎంతో విస్మయం కలిగింది. కానీ జరిగినది ఎవరికీ చెప్పకండని ఆయన వారిని ఆదేశించాడు.