7
1 ✝తన మాటలన్నీ ప్రజలకు వినిపించడం ముగించిన తరువాత ఆయన కపెర్‌నహూంలో ప్రవేశించాడు. 2 అక్కడ రోమన్ సైన్యంలోని శతాధిపతి దాసుడొకడు జబ్బుపడి చావుబ్రతుకులలో ఉన్నాడు. అతడంటే యజమానికి చాలా ఇష్టం. 3 ✽యేసును గురించి విని శతాధిపతి యూదుల పెద్దలను కొందరిని ఆయన దగ్గరకు పంపి, ఆయన వచ్చి తన దాసుణ్ణి బాగు చేయమని వారిద్వారా విన్నవించుకొన్నాడు.4 ✽వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను మనసారా వేడుకొంటూ “మీరు మేలు చేయవలసింది. ఈ వ్యక్తి యోగ్యుడు. 5 మన ప్రజలంటే అతనికి ప్రేమ. మా సమాజ కేంద్రం✽ కట్టించినది ఇతడే” అన్నారు.
6 యేసు వారితోకూడా వెళ్ళి శతాధిపతి ఇంటికి ఎక్కువ దూరం లేనప్పుడు అతడు స్నేహితులను కొందరిని ఆయన దగ్గరకు పంపి వారిచేత ఆయనతో ఇలా చెప్పించాడు: “స్వామీ, శ్రమ తీసుకోకండి. మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. 7 మీ దగ్గరికి రావడానికి కూడా యోగ్యుణ్ణని నేననుకోలేదు. మీరు మాట మాత్రం అనండి. అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయమవుతుంది. 8 నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతిక్రింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఈ పని చెయ్యి’ అంటే చేస్తాడు.”
9 ఈ మాటలు విని యేసు ఆ మనిషి విషయం ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వస్తున్న జన సమూహం వైపు తిరిగి, “మీతో నేను చెప్పేదేమిటంటే ఇస్రాయేల్ ప్రజల్లో, ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు” అన్నాడు.
10 పంపబడ్డవారు ఇంటికి తిరిగి వచ్చి జబ్బుపడ్డ ఆ దాసుడు ఆరోగ్యంగా ఉండడం చూశారు.
11 ✽మరుసటి రోజున ఆయన నాయీను అనే ఊరికి వెళ్ళాడు. ఆయనతోకూడా ఆయన శిష్యులలో అనేకులూ పెద్ద జన సమూహమూ వెళ్ళారు. 12 ఆయన ఊరి ద్వారం దగ్గరకు చేరినప్పుడే కొందరు చనిపోయినవాణ్ణి మోసుకువస్తూ ఉన్నారు. చనిపోయినవాడు తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె విధవరాలు. ఆమెతో కూడా గ్రామస్థులు పెద్దగుంపుగా వస్తూ ఉన్నారు. 13 ✝ఆమెను చూచి ప్రభువుకు జాలి వేసింది. ఆమెతో “ఏడవకమ్మా!” అన్నాడు. 14 పాడెదగ్గరకు వెళ్ళి దానిని తాకాడు. దానిని మోస్తున్నవారు ఆగారు. అప్పుడాయన “అబ్బాయీ! నీతో నేనంటున్నాను, లే!” అన్నాడు.
15 ✽చనిపోయినవాడు కూర్చుని మాట్లాడసాగాడు. యేసు అతణ్ణి తల్లికి అప్పచెప్పాడు. 16 ✽ అందరూ భయాక్రాంతులై “మన మధ్య గొప్ప ప్రవక్త బయలుదేరాడు. దేవుడు తన జనాన్ని సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. 17 యేసును గురించిన ఈ కబురు యూదయ అంతటా చుట్టుపట్ల ఉన్న ప్రాంతమంతటా వ్యాపించింది.
18 ✽ యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు. 19 యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి యేసుదగ్గరకు పంపుతూ ఇలా అడగమని ఆదేశించాడు: “రావలసినవాడివి నీవేనా? మేము వేరొకరికోసం ఎదురు చూడాలా?”
20 ఆ మనుషులు ఆయనదగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “బాప్తిసమిచ్చే యోహాను మీ దగ్గరికి మమ్మల్ని పంపి ‘రావలసినవాడివి నీవేనా? మేము వేరొకరికోసం ఎదురు చూడాలా?’ అని అడగమన్నాడు.”
21 ఆ ఘడియలోనే ఆయన రోగులనూ బాధితులనూ పిశాచాలు పట్టినవారినీ అనేకమందిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారనేకులకు చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు. 22 యేసు యోహాను దగ్గరనుంచి వచ్చిన వారికిలా సమాధానం చెప్పాడు: “తిరిగి వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి. గుడ్డివారికి చూపు వస్తూ ఉంది. కుంటివారు నడుస్తూ ఉన్నారు. కుష్ఠురోగులు శుద్ధమవుతూ ఉన్నారు. చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారు సజీవంగా లేపబడుతున్నారు. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది. 23 నా విషయంలో అభ్యంతరం లేనివాడు ధన్యజీవి.”
24 యోహాను పంపినవారు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను విషయం జన సమూహంతో ఇలా మాట్లాడసాగాడు: “ఏమి చూద్దామని మీరు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా? 25 అది కాకపోతే ఏమి చూద్దామని వెళ్ళారు? సన్నని వస్త్రాలు తొడుక్కున్న మనిషినా? సుఖభోగాలలో బ్రతుకుతూ శ్రేష్ఠ వస్త్రాలు తొడుక్కొనేవారు రాజ భవనాలలో ఉంటారు గదా. 26 అయితే ఏమి చూద్దామని మీరు వెళ్ళారు? ప్రవక్తనా? అవును. అతడు ప్రవక్తే! ఆ మాటకు వస్తే ప్రవక్తకంటే కూడా గొప్పవాడని మీతో చెపుతున్నాను. 27 ఇతణ్ణి గురించే ఈ మాటలు వ్రాసి ఉన్నాయి. ‘ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ దారిని సిద్ధం చేస్తాడు.’
28 “మీతో నేను చెప్పేదేమంటే, స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే మహనీయుడైన ప్రవక్త లేడు. అయినా, దేవుని రాజ్యంలో అందరిలో అల్పుడు అతనికంటే గొప్పవాడే!”
29 ✽అది విని ప్రజలంతా – సుంకంవారు కూడా – దేవుడు న్యాయవంతుడని అంగీకరించారు. ఎందుకంటే అంతకు ముందు యోహాను ఇచ్చిన బాప్తిసం వారు పొందారు. 30 కానీ పరిసయ్యులూ ధర్మశాస్త్రవేత్తలూ యోహానుచేత బాప్తిసం పొందలేదు, గనుక తమను గురించిన దేవుని సంకల్పం నిరాకరించారు.
31 ప్రభువు అన్నాడు “నేనీ తరం మనుషులను ఎలాంటివారితో పోల్చాలి? వారు ఎవరిని పోలి ఉన్నారు? 32 వారు ఇలా ఉన్నారు: చిన్న పిల్లలు సంతవీధిలో కూర్చుని ఒకడితో ఒకడు కేకలు వేసి ఇలా చెప్పుకొంటారు: ‘మీకు పిల్లనగ్రోవి ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ఏడ్పు పాట పాడాం గాని మీరు ఏడ్వలేదు.’ 33 ఎందుకంటే, యోహాను వచ్చి రొట్టె తినలేదు. ద్రాక్షరసం త్రాగలేదు. అతనికి దయ్యం పట్టిందని మీరంటున్నారు. 34 మానవ పుత్రుడు వచ్చి అన్నపానాలు పుచ్చుకొంటూ ఉన్నాడు. మీరు నన్ను ‘ఇడుగో, తిండిబోతూ, త్రాగుబోతూ, సుంకంవారికీ పాపులకూ మిత్రుడూ!’ అంటున్నారు. 35 అయితే జ్ఞానం దాని పిల్లలందరినిబట్టే జ్ఞానమని లెక్కలోకి వస్తుంది.”
36 ✽పరిసయ్యులలో✽ ఒకడు ఆయనను తన ఇంట్లో భోజనానికి ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. 37 ✽ఆయన ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్న సంగతి తెలిసి ఆ ఊరిలో పాపంలో బ్రతికిన స్త్రీ ఒకతె చలువరాతి బుడ్డితో అత్తరు అక్కడికి తీసుకువచ్చింది. 38 ✽వెనుకవైపు యేసు పాదాలదగ్గర నిలుచుండి ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్ళు ఆయన పాదాలు తడపసాగాయి. ఆమె తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ముద్దు పెట్టుకొని వాటికి ఆ అత్తరు పూసింది.
39 ✽ఆయనను ఆహ్వానించిన పరిసయ్యుడు అదంతా చూచి లోలోపల ఇలా అనుకొన్నాడు: “ఒకవేళ ఈ మనిషి ప్రవక్త అయితే తనను ముట్టుకొన్నది ఎవరో, ఎలాంటిదో తెలుసుకొని ఉండేవాడే. ఈమె పాపంలో బ్రతికేది.”
40 అతని తలంపుకు జవాబిస్తూ యేసు అతనితో “సీమోనూ! నీతో ఒక మాట చెప్పాలి” అన్నాడు. అతడు “ఉపదేశకా, చెప్పండి!” అన్నాడు.
41 యేసు అన్నాడు “అప్పిచ్చేవాడొకడు ఇద్దరికి అప్పు పెట్టాడు. వారిలో ఒకడు అయిదు వందల వెండి నాణేలు బాకీ ఉన్నాడు, మరొకడు యాభై వెండి నాణేలు బాకీ ఉన్నాడు. 42 అప్పు తీర్చడానికి వారిదగ్గర ఏమీ లేకపోయింది గనుక అతడు వారిద్దరినీ క్షమించాడు. అందుచేత అతడంటే ఆ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అభిమానం?”
43 “అతడు ఎవడిని ఎక్కువ క్షమించాడో అతడే అని నాకు తోస్తున్నది” అని సీమోను జవాబిచ్చాడు.
ఆయన అతనితో “నీ నిర్ణయం సరిగానే ఉంది” అన్నాడు. 44 ✽అప్పుడా స్త్రీవైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు: “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంటికి వచ్చాను గానీ కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్ళివ్వలేదు. ఈమె అయితే తన కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. 45 నీవు నన్ను ముద్దుపెట్టుకోలేదు గానీ నేను లోపలికి వచ్చినప్పటినుంచి ఈమె నా పాదాలను ముద్దుపెట్టుకోవడం మానలేదు. 46 నీవు నూనెతో నా తల అంటలేదు గానీ ఈమె నా పాదాలను అత్తరుతో అంటింది.
47 ✽“అందుచేత నీతో నేను చెప్పేదేమంటే, ఈమె అనేక పాపాలకు క్షమాపణ దొరికింది. ఎందుకంటే, ఈమె ప్రేమ అధికమే. కానీ కొద్ది విషయంలో క్షమాపణ పొందిన వ్యక్తికి కొద్ది ప్రేమ మాత్రమే ఉంటుంది.”
48 ✝అప్పుడు యేసు ఆమెతో “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
49 అయితే ఆయనతో భోజనానికి కూర్చుని ఉన్నవారు “పాపాలు క్షమించే ఈయన ఎవరు?” అని లోలోపల అనుకోసాగారు.
50 ✽ఆయన ఆ స్త్రీతో “నీ నమ్మకం నీకు పాపవిముక్తి కలిగించింది. శాంతితో వెళ్ళు” అన్నాడు.