6
1 ✝మొదటి విశ్రాంతి దినం తరువాత, ఆ రెండో విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో పడి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు తెంపి నలుచుకొని తింటూ ఉన్నారు. 2 పరిసయ్యులు కొందరు వారితో “విశ్రాంతి దినాన చేయకూడని పని మీరు చేస్తున్నారేమిటి!” అన్నారు.3 యేసు వారికిలా జవాబిచ్చాడు: “దావీదు, అతనితో ఉన్నవారు ఆకలితో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో అదికూడా మీరు చదవలేదా? 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించాడు, సన్నిధి రొట్టెలు తీసుకొని తిని తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు. ఆ రొట్టెలు యాజులు తప్ప మరెవరూ తినకూడదు.” 5 వారితో ఇంకా చెప్పాడు, “మానవ పుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువు.”
6 మరో విశ్రాంతి దినాన కూడా ఆయన యూద సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశమిచ్చాడు. అక్కడ కుడి చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. 7 ఆయన విశ్రాంతి దినాన ఎవరినైనా బాగు చేస్తాడేమో అని ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయనను చూస్తూ ఉన్నారు. ఎలాగైనా ఆయనమీద నేరం మోపాలని వారి ఉద్దేశం.
8 ✝వారి తలంపులు తెలిసి ఆయన ఎండిపోయిన చేయి ఉన్నమనిషితో “లేచి మధ్యలో నిలబడు!” అన్నాడు. కనుక అతడు లేచి నిలబడ్డాడు. 9 ✝అప్పుడు యేసు వారితో “మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. విశ్రాంతి దినాన మంచి చేయడం, కీడు చేయడం, ప్రాణాన్ని దక్కించడం, నాశనం చేయడం ఏది ధర్మం?” అన్నాడు.
10 ఆయన వారందరివైపు కలయ చూచి ఆ మనిషితో “నీ చేయి చాపు!” అన్నాడు. అతడు ఆ విధంగా చేయగానే అతడి చేయి మరో దానిలాగా పూర్తిగా నయమయింది. 11 ✽ వారైతే వెర్రి కోపంతో నిండిపోయి యేసును ఏమి చెయ్యాలా అని తమలో తాము మాట్లాడుకొన్నారు.
12 ✝✽ఆ రోజుల్లో ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడంలో రాత్రంతా గడిపాడు. 13 ఉదయమై నప్పుడు తన శిష్యులను దగ్గరికి పిలిచి వారిలో పన్నెండుగురిని ఎన్నుకొని వారికి రాయబారులు అని పేరు పెట్టాడు. 14 వీరెవరంటే, సీమోను (యేసు అతనికి పేతురు అనే పేరు కూడా పెట్టాడు), అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్‌తొలొమయి, 15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, “తీవ్రవాది” అని పిలవబడ్డ సీమోను, 16 ✽యాకోబు కుమారుడు యూదా, ద్రోహి అయ్యే ఇస్కరియోతు యూదా.
17 ✝యేసు వారితోపాటు కొండ దిగివచ్చి సమతల భూమిమీద నిలబడ్డాడు. అక్కడ ఆయన శిష్యుల గుంపు ఉంది. యూదయ అంతటినుంచీ జెరుసలంనుంచీ తూరు సీదోనుల తీరంనుంచీ వచ్చిన ప్రజలనేకులు పెద్ద సమూహంగా కూడా ఉన్నారు. ఆయన ఉపదేశం వినడానికీ తమ రోగాలను మాన్పించుకోవడానికి వీరు వచ్చారు. 18 మలిన పిశాచాలచేత బాధలు అనుభవించినవారు కూడా ఉన్నారు. వారికి పూర్తిగా నయమైంది. 19 ✝ఆయనలోనుంచి ప్రభావం బయలువెడలి అందరినీ బాగు చేస్తూ ఉంది, గనుక ప్రజానీకం ఆయనను తాకడానికి ప్రయత్నించారు.
20 ✽✽అప్పుడాయన తలెత్తి తన శిష్యులవైపు చూస్తూ ఇలా అన్నాడు: “దరిద్రులారా, మీరు ధన్యులు! దేవుని రాజ్యం మీది.
21 ✽“ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు! మీకు తృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఏడుస్తున్నవారలారా, మీరు ధన్యులు! మీరు నవ్వుతారు.
22 “మానవ పుత్రుని✽ కారణంగా మనుషులు మిమ్ముల్ని ద్వేషించి వెలివేసి దూషించి మీ పేరు చెడ్డదని విసర్జించే టప్పుడు మీరు ధన్యులు! 23 ఆ రోజున ఆనందిస్తూ గంతులు వేయండి! ఎందుకని? పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు ఆ ప్రకారమే చేశారు.
24 ✽“అయ్యో, ధనవంతులారా! మీకు బాధ తప్పదు! మీ ఆదరణ ఇంతకుముందే పొంది ఉన్నారు.
25 “ఇప్పుడు కడుపు నిండినవారలారా, అయ్యో! మీకు బాధ తప్పదు! మీరు ఆకలిగొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వారలారా, అయ్యో! మీకు బాధ తప్పదు! మీరు దుఃఖిస్తారు, ఏడుస్తారు.
26 “మనుషులంతా మిమ్ములను పొగడుతూ ఉంటే, అయ్యో, మీకు బాధ తప్పదు! వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్తలను✽ ఆ ప్రకారమే చేశారు.
27 ✝“ఇప్పుడు వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే, మీ పగవారిని ప్రేమతో చూడండి. మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి. 28 మిమ్ములను శపించేవారిని దీవించండి, దూషణతో మీపట్ల వ్యవహరించే వారికోసం ప్రార్థించండి. 29 ✝మిమ్ములను ఒక చెంపపై కొట్టేవాడికి రెండో చెంప కూడా త్రిప్పండి. మీ పై చొక్కాను తీసుకుపోబోయేవాణ్ణి మీ అంగీని కూడా తీసుకుపోబోయినా ఆటంకపరచకండి.
30 “మిమ్మల్ని అడిగిన ప్రతి ఒక్కరికీ ఇవ్వండి. మీ సొత్తు తీసుకుపోయిన వ్యక్తిని చూచి దాన్ని ఇవ్వమని అడగకండి. 31 ✝మనుషులు మీకు ఎలా చేయాలని కోరుతారో మీరు అలాగే వారికి చేయండి.
32 ✝“మిమ్ములను ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే మీకు రావలసిన అభిమానమేమిటి? పాపాత్ములు కూడా తమను ప్రేమించేవారిని ప్రేమిస్తారు గదా. 33 మీకు మంచి చేసేవారికే మంచి చేస్తే మీకు రావలసిన అభిమానమేమిటి? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు. 34 అప్పు మళ్ళీ తీరుస్తారనుకొన్నవారికే అప్పిస్తే మీకు రావలసిన అభిమానమేమిటి? పాపాత్ములు కూడా అప్పిచ్చినదంతా మళ్ళీ వసూలు చేసుకోవచ్చునని పాపాత్ములకు అప్పిస్తారు గదా. 35 మీరైతే మీ పగవారిని ప్రేమతో చూడండి, వారికి మంచి చేయండి, మళ్ళీ కలుగుతుందని ఆశించకుండా అప్పివ్వండి. అప్పుడు మీకు గొప్ప బహుమతి దొరుకుతుంది. మీరు సర్వాతీతుని సంతానమై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేనివారిపట్లా దుర్మార్గులపట్లా దయ చూపుతాడు గదా! 36 ✝కాబట్టి మీ పరమ తండ్రి జాలిచూపేవాడై ఉన్నట్టే మీరూ జాలిచూపేవారై ఉండండి.
37 ✝“ఇతరులకు తీర్పు తీర్చకండి. అప్పుడు మీకూ తీర్పు జరగదు. నేరారోపణ చేయకండి, అప్పుడు మీమీద నేరారోపణ జరగదు. క్షమించండి, అప్పుడు మీకూ క్షమాపణ దొరుకుతుంది.
38 ✽“ఇవ్వండి, అప్పుడు మీకూ ఇవ్వడం జరుగుతుంది. మంచి కొలత – గట్టిగా అదిమి కుదించి పొర్లిపోయేంత కొలత మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలత ఉపయోగిస్తారో ఆ కొలతే మీకూ ఉపయోగించడం జరుగుతుంది.”
39 ✝ఆయన ఒక ఉదాహరణ కూడా వారితో చెప్పాడు – “గుడ్డివాడు మరో గుడ్డివాణ్ణి నడిపించగలడా? ఇద్దరూ గోతిలో పడరా? 40 ✝శిష్యుడు అతని గురువుకంటే అధికుడు కాడు, గానీ ప్రతి ఒక్కడూ పూర్తిగా సంసిద్ధుడయినప్పుడు గురువులాగా ఉంటాడు.
41 ✝“మీ కంటిలో దూలం గమనించుకోకుండా మీ సోదరుని కంటిలో నలుసుకోసం తేరి చూడడం ఎందుకు? 42 మీ కంటిలో దూలం చూడకుండా, ‘సోదరుడా, మీ కంటిలో ఉన్న నలుసు నన్ను తీసివేయనియ్యండి’ అని మీ సోదరునితో ఎలా అనగలుగుతారు? కపట భక్తుడా, ముందుగా నీ కంటిలో నుంచి దూలం తీసివేసుకో. అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి తేటగా చూస్తావు.
43 ✝“మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. అలాగే పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 44 ప్రతి చెట్టు ఎలాంటిదో దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముళ్ళపొదలలో అంజూర పండ్లు, కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. 45 ✝మంచి మనిషి తన హృదయంలో పోగై ఉన్న మంచివాటిలో నుంచి మంచివి బయటికి తెస్తాడు. చెడు మనిషి తనలో పోగై ఉన్న చెడువాటిలోనుంచి చెడ్డవి బయటికి తెస్తాడు. హృదయం నిండా ఏది ఉంటే అదే తన నోరు మాట్లాడుతుంది.
46 ✽ “మీరు నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలుస్తూ నేను చెప్పినట్టు చేయకపోవడమెందుకని? 47 ✝నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసే వాడెవడైనా ఎలాంటివాడో మీకు తెలుపుతాను. 48 లోతుగా త్రవ్వి బండమీద పునాది వేసి ఇల్లు కట్టుకొన్న మనిషిలాగా ఉన్నాడు. వరదలు వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టింది, గానీ ఇంటిని కదిలించలేకపోయింది. ఎందుకంటే ఆ ఇల్లు బండమీద కట్టినది. 49 అయితే నేను చెప్పినది విని ఆ ప్రకారం చేయనివాడు పునాది లేకుండా నేలమీద ఇల్లు కట్టుకొన్న మనిషిలాంటివాడు. ఆ ఇంటిమీద ప్రవాహం వడిగా కొట్టిన వెంటనే అది కూలిపోయింది. ఆ ఇంటి నాశనం పెద్దది.”