5
1 ఒక సారి ఆయన గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు, జన సమూహం దేవుని వాక్కు వినడానికి ఆయన మీద పడుతూ ఉన్నారు. 2 అప్పుడు సరస్సు దరిన రెండు పడవలు ఆయనకు కనిపించాయి. చేపలు పట్టేవారు పడవలలోనుంచి దిగి వలలు కడుగుతూ ఉన్నారు. 3 ఆయన ఆ పడవలలో ఒకదానినెక్కాడు. ఆ పడవ సీమోనుది. ఒడ్డునుంచి కొద్ది దూరం త్రోయమని ఆయన అతణ్ణి అడిగాడు. అప్పుడాయన పడవలో కూర్చుని జన సమూహానికి ఉపదేశమిచ్చాడు.
4 మాట్లాడడం ముగించినప్పుడు ఆయన సీమోనును చూచి “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.
5 సీమోను జవాబిస్తూ “నాయకా, రాత్రంతా మేము శ్రమించాం గాని, చేపలు ఏమీ పడలేదు. అయినా నీ మాటనుబట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
6 వారు అలా చేసినప్పుడు ఎన్నో చేపలు పడ్డాయి, వారి వల తెగిపోబోయింది. 7 అందుచేత మరో పడవలో ఉన్న వారి పాలివారు వచ్చి సహాయం చేయాలని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా నింపారు. పడవలు మునిగిపోసాగాయి.
8 అది చూచి సీమోను పేతురు యేసు మోకాళ్ళముందు పడి “ప్రభూ! నన్ను విడిచివెళ్ళు! నేను పాపాత్ముణ్ణి” అన్నాడు. 9 ఎందుకంటే అతడూ అతనితో ఉన్నవారంతా తాము పట్టిన చేపల మొత్తం చూచి ఎంతో ఆశ్చర్య పడిపోయారు. 10 సీమోనుతో పాలివారైన యాకోబు, యోహాను (జెబెదయి కొడుకులు) కూడా అలాగే ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు యేసు సీమోనుతో “భయపడకు! ఇప్పటినుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. 11 వారు పడవలు ఒడ్డుకు చేర్చి అంతా విడిచిపెట్టి ఆయనను అనుసరించారు.
12 ఆయన ఒకానొక గ్రామంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక మనిషి వచ్చాడు. అతనికి ఒళ్ళంతా కుష్ఠు. యేసును చూడగానే అతడు సాష్టాంగపడి “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ ఆయనను బ్రతిమాలు కొన్నాడు.
13 ఆయన చేయి చాపి అతనిమీద ఉంచి “నాకిష్టమే. శుద్ధంగా ఉండు!” అన్నాడు. వెంటనే అతని కుష్ఠు పోయింది.
14 ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు నీ శుద్ధికోసం మోషే విధించినదాన్ని అర్పించు” అని అతనికి ఆదేశించాడు.
15 కానీ దానినిబట్టి ఆయనను గురించిన కబురు ఇంకా ఎక్కువగా వ్యాపించింది. అందుచేత ఆయన ఉపదేశం వినడానికీ రోగాలు బాగు చేయించుకోవడానికీ పెద్ద జన సమూహాలు సమకూడాయి. 16 అయితే ఆయన తరచుగా నిర్జన స్థలాలకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు.
17 ఒక రోజున ఆయన ఉపదేశమిస్తూ ఉన్నాడు. రోగాలు బాగు చేసే ప్రభు శక్తి అక్కడ ఉంది. గలలీలోని ప్రతి గ్రామం నుంచీ యూదయ, జెరుసలంనుంచీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్ర బోధకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. 18 హఠాత్తుగా కొందరు మనుషులు పక్షవాత రోగిని పడకమీద తీసుకు వచ్చారు. అతణ్ణి ఇంటి లోపలికి తెచ్చి యేసు ముందు ఉంచాలని చూశారు. 19 అయితే ఆ జనసమూహం ఉండడంవల్ల అతణ్ణి లోపలికి తేవడానికి మరో మార్గం చూడలేక వారు ఇంటి కప్పుమీదికెక్కారు. పెంకులు తీసి అతణ్ణి పడకతోపాటు వారి మధ్యకు యేసు ముందే దింపారు.
20 యేసు వారి విశ్వాసం చూచి అతనితో “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
21 ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఇలా తలపోయడం మొదలుపెట్టారు: “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు క్షమించగల వారెవరు?”
22 వారి తలంపులు తెలిసి యేసు వారితో “మీ హృదయాలలో ఇలా ఆలోచించడం ఎందుకు? 23 ఏది సులభం? – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా? 24 అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. అప్పుడు ఆయన పక్షవాత రోగితో “నీతో నేనంటున్నాను, లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
25 వెంటనే అతడు వారి ఎదుటే లేచి నిలబడ్డాడు. తాను పడుకొన్న పరుపెత్తుకొని దేవుణ్ణి కీర్తిస్తూ తన సొంత ఇంటికి వెళ్ళాడు. 26 అందరూ విస్మయమొంది “ఈవేళ వింత విషయాలు చూశాం” అంటూ దేవుణ్ణి కీర్తించి భయంతో నిండిపోయారు.
27  ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి సుంకం వసూలు స్థానంలో కూర్చుని ఉన్న సుంకం వాడొకణ్ణి చూశాడు. అతని పేరు లేవీ. ఆయన అతనితో “నా వెంట రా!” అన్నాడు. 28 అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు.
29 లేవీ తన సొంత ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. అనేకమంది సుంకంవారూ వేరేవారూ వారితో కూడా భోజనానికి కూర్చుని ఉన్నారు.
30 అది చూచి పరిసయ్యులూ వారి ధర్మశాస్త్ర పండితులూ “మీరు సుంకంవారితోను పాపులతోను కలిసి తింటున్నారేమిటి?” అని ఆయన శిష్యులమీద సణుక్కొన్నారు.
31 వారికి జవాబిస్తూ యేసు “ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు గాని జబ్బు చేసినవారికే. 32 పశ్చాత్తాప పడేందుకు పాపులనే పిలవడానికి నేను వచ్చాను గాని న్యాయవంతులను కాదు” అన్నాడు.
33 వారాయనతో “యోహాను శిష్యులు ఎందుకు తరచుగా ఉపవాసముంటారు? ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలా చేస్తారు. మీ శిష్యులైతే అన్నపానాలు పుచ్చుకొంటూ ఉన్నారు” అన్నాడు.
34 వారికి యేసు ఇలా చెప్పాడు: “పెళ్ళికుమారుడు తమతో ఉన్నంతకాలం మీరు అతని ఇంటివారిచేత ఉపవాసం చేయించగలరా? 35 అయితే పెళ్ళికుమారుణ్ణి వారి దగ్గరనుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. ఆ రోజులలో వారు ఉపవాసముంటారు.”
36 ఆయన వారికి ఉదాహరణ కూడా చెప్పాడు – “ఎవరూ కొత్త బట్ట పాత బట్టకు మాసిక వేయరు. ఒకవేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసివస్తుంది, మాసిక పాత బట్టకు కలవదు కూడా. 37 ఎవరూ కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోయరు. పోస్తే కొత్త ద్రాక్షరసంవల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. ద్రాక్షరసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి. 38 కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలోనే పోయాలి. అప్పుడు రెండూ పాడు కాకుండా ఉంటాయి. 39 మరో విషయం – పాత ద్రాక్షరసం త్రాగిన వెంటనే కొత్త ద్రాక్షరసం ఎవరూ కోరరు. పాతదే బాగుంది అంటారు.”