4
1 ✝యేసు పవిత్రాత్మతో నిండినవాడై యొర్దానునుంచి తిరిగి వచ్చాడు. అప్పుడా ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. 2 ✽అక్కడ నలభై రోజులపాటు అపనింద పిశాచంచేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. ఆ నలభై రోజులూ ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.3 అప్పుడు అపనింద పిశాచం ఆయనతో అన్నాడు “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అయిపొమ్మని ఆజ్ఞాపించు!”
4 యేసు “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్కు వల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది” అని వాడికి జవాబిచ్చాడు.
5 అపనింద పిశాచం ఆయనను ఎత్తయిన పర్వతం మీదికి తీసుకువెళ్ళి క్షణంలో ఆయనకు భూలోక రాజ్యాలన్నీ చూపించాడు. 6 ✽“ఈ రాజ్యాధికారమంతా, ఈ రాజ్యాల వైభవమంతా నీకిస్తాను. అదంతా నాకప్పగించబడింది. అది ఎవరికివ్వాలని నేను ఇష్టపడతానో వారికిస్తాను. 7 అందుచేత నీవు నన్ను పూజిస్తే అదంతా నీదవుతుంది” అని అపనింద పిశాచం ఆయనతో చెప్పాడు.
8 అందుకు యేసు “సైతానూ! నా వెనక్కు పో! ఇలా వ్రాసి ఉంది: నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే సేవ చేయాలి” అని వాడికి జవాబిచ్చాడు.
9 వాడు ఆయనను జెరుసలంకు తీసుకువెళ్ళి దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు. “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడనుంచి క్రిందికి దూకేసెయ్యి! 10 ఇలా రాసి ఉంది గదా – ఆయన నిన్ను కాపాడాలని నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 11 వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొంటారు” అని ఆయనతో అన్నాడు.
12 యేసు వాడికిలా జవాబిచ్చాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని చెప్పబడి ఉన్నది.”
13 ✽అపనింద పిశాచం ప్రతి విషమ పరీక్ష పెట్టడం ముగించి మరో అవకాశం చిక్కేవరకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. 14 ✽అప్పుడు యేసు దేవుని ఆత్మ బలప్రభావాలతో గలలీకి తిరిగి వెళ్ళాడు. ఆయనను గురించిన కబురు ఆ ప్రాంతమంతటా ప్రాకిపోయింది. 15 ✝ఆయన వారి సమాజ కేంద్రాలలో✽ ఉపదేశమిచ్చాడు. అందరూ ఆయనను కీర్తించారు.
16 అప్పుడాయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన✽ యూద సమాజ కేంద్రానికి వెళ్ళాడు, లేఖనం చదవడానికి నిలబడ్డాడు. 17 యెషయాప్రవక్త గ్రంథం✽ ఆయనకు వారందించారు. ఆయన గ్రంథం భాగాన్ని విప్పి ఈ మాటలు వ్రాసి ఉన్న స్థలాన్ని చూశాడు: 18 ✽ “ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు శుభవార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. గుండె పగిలినవారిని బాగు చేయడానికీ, ఖైదీలకు విడుదల, గుడ్డివారికి చూపు కలుగుతుందని ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు. బాధితులను విడిపించడానికీ 19 ప్రభు అనుగ్రహ సంవత్సరం చాటించడానికీ నన్ను పంపాడు.”
20 ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ కేంద్రంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూస్తూ ఉన్నారు. 21 ✽అప్పుడాయన వారితో “ఈ రోజే మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నాడు.
22 ✽అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం చెప్పుకొన్నారు, ఆయన నోటనుంచి వెలువడ్డ దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కుమారుడు గదూ?” అని చెప్పుకొన్నారు.
23 ✽వారితో ఆయన అన్నాడు “మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్‌నహూంలో ఏ కార్యకలాపాలు చేశావని మేము విన్నామో అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు.”
24 ✝ఆయన ఇంకా అన్నాడు, “మీతో ఖచ్చితంగా అంటున్నాను – ఏ ప్రవక్తనూ తన స్వస్థలం స్వీకరించదు. 25 ✝సత్యమే మీతో చెపుతున్నాను. ఏలీయాప్రవక్త రోజుల్లో ఇస్రాయేల్‌లో అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. అయినా, మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరవు వచ్చినప్పుడు 26 వారిలో ఎవరి దగ్గరకూ ఏలీయా పంపబడలేదు. అతణ్ణి దేవుడు పంపినది సీదోను ప్రాంతంలోని సారెపతులో ఉన్న విధవరాలి దగ్గరికే. 27 ✽ ఎలీషాప్రవక్త కాలంలో ఇస్రాయేల్‌లో అనేకమంది కుష్ఠురోగులు ఉన్నారు గాని వారిలో ఎవరూ స్వస్థత పొందలేదు. సిరియా దేశస్థుడైన నయమాను ఒక్కడే స్వస్థత పొందాడు.”
28 ✽ఈ సంగతులు విని సమాజకేంద్రంలో ఉన్న వారంతా ఆగ్రహంతో నిండిపోయారు. 29 ✽వారు లేచి నిలబడి ఆయనను గ్రామం బయటికి త్రోసుకువెళ్ళారు. వారి గ్రామం కొండపై కట్టబడింది. నిటారుగా ఉన్న స్థలంనుంచి ఆయనను తలక్రిందుగా పడద్రోయాలని దాని అంచుకు తీసుకు పోయారు. 30 ✽అయితే ఆయన వారి మధ్యనుంచి దాటి తన దారిన వెళ్ళిపోయాడు.
31 ✝అప్పుడాయన కపెర్‌నహూం వెళ్ళాడు. అది గలలీలో ఒక పట్టణం. విశ్రాంతి దినాల్లో ఆయన ప్రజలకు ఉపదేశమిచ్చాడు. 32 ఆయన ఉపదేశానికి వారెంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ఆయన ఉపదేశం అధికారంతో ఉంది. 33 అప్పుడా సమాజ కేంద్రంలో మలిన దయ్యం ఆత్మ పట్టినవాడొకడు ఉన్నాడు. అతడు గొంతెత్తి ఇలా అరిచాడు: 34 “మమ్మల్ని విడిచిపెట్టు నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!”
35 యేసు ఆ దయ్యాన్ని మందలిస్తూ “ఊరుకో! అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు. అప్పుడు దయ్యం ఆ మనిషిని వారిమధ్య పడద్రోసినా అతడికి హాని ఏమీ చేయకుండా అతడిలోనుంచి బయటికి వచ్చింది.
36 అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. “ఏమిటీ ఉపదేశం! ఇతడు మలిన పిశాచాలకు అధికారంతో బలప్రభావాలతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో బయటికి వస్తున్నాయి!” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 37 అప్పుడు ఆయనను గురించి కబుర్లు ఆ ప్రాంతం చుట్టుప్రక్కల అంతటా వ్యాపించాయి.
38 ✽ ఆయన లేచి నిలబడి సమాజకేంద్రంనుంచి వెళ్ళి సీమోను ఇంట్లో ప్రవేశించాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమె విషయం వారాయనను వేడుకొన్నారు. 39 ఆయన ఆమె దగ్గర నిలిచి జ్వరాన్ని మందలించగా అది ఆమె నుంచి పోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
40 ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు అందరు ఆయా రకాల రోగాలతో ఉన్న తమ వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. వారిలో ప్రతి ఒక్కరిమీదా ఆయన చేతులుంచి వారిని బాగు చేశాడు. 41 ✝అనేకులలోనుంచి దయ్యాలు బయటికి వస్తూ “నీవు అభిషిక్తుడివి! దేవుని కుమారుడివి!” అని కేక పెట్టాయి. ఆయన అభిషిక్తుడు అని దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
42 ✝ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి నిర్జన స్థలానికి వెళ్ళాడు. జన సమూహం ఆయనను వెదకుతూ ఆయన దగ్గరకు చేరి తమను విడిచివెళ్ళకుండా ఆయనను ఆపివేయబోయారు. 43 కానీ ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇతర గ్రామాలలో కూడా నేను దేవుని రాజ్యాన్ని✽ ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు నన్ను పంపినది దీని కోసం.”
44 ఆయన గలలీ సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ వచ్చాడు.