3
1 ✽తిబెరియస్ సీజర్ పరిపాలించిన పదహేనో సంవత్సరంలో దేవుని వాక్కు జెకర్యా కుమారుడైన యోహానుకు ఎడారిలో వచ్చింది. అప్పుడు పొంతి పిలాతు యూదయకు అధిపతి. హేరోదు గలలీ రాష్ట్రాధికారి. అతడి తోబుట్టువు ఫిలిప్పు ఇటూరియకూ త్రికోనీతస్‌కూ రాష్ట్రాధికారి. లూసానియస్ అబిలేనే రాష్ట్రాధికారి. 2 ✽అన్నా, కయప అనేవారు ప్రముఖ యాజులుగా ఉన్నారు.3 ✝✽అప్పుడు యోహాను వచ్చి పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసం యొర్దాను నది ప్రాంత మంతటా ప్రకటిస్తూ ఉన్నాడు. 4 యెషయాప్రవక్త వాక్కుల గ్రంథంలో వ్రాసి ఉన్నట్టే ఇది జరిగింది. అదేమంటే, “ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది. ప్రభువుకోసం దారి సిద్ధం చేయండి! ఆయనకోసం త్రోవలు తిన్ననివి చేయండి! 5 ✝ప్రతి లోయనూ ఎత్తు చేయాలి, ప్రతి పర్వతాన్నీ కొండనూ అణచాలి. వంకర దారులు తిన్ననివి కావాలి! గరుకు బాటలు నున్ననివి కావాలి! 6 అప్పుడు శరీరం ఉన్నవారంతా దేవుని విముక్తిని చూస్తారు.”
7 యోహానుచేత బాప్తిసం పొందడానికి వచ్చిన జనసమూహంతో అతడు ఇలా అన్నాడు: “ఓ సర్ప వంశమా! రాబోయే దేవుని ఆగ్రహం తప్పించుకోండని మిమ్మల్ని హెచ్చరించినదెవరు? 8 కాబట్టి పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు చెప్పుకోకండి! నేను మీతో చెపుతున్నాను, దేవుడు ఈ రాళ్ళు అబ్రాహాము సంతానమయ్యేలా చేయగలడు. 9 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది.”
10 ✽ప్రజానీకం అతణ్ణి చూచి “అలాగైతే మేమేం చెయ్యాలి?” అని అడిగారు.
11 అతడు వారికిలా జవాబిచ్చాడు: “రెండు చొక్కాలున్న వాడు చొక్కా లేనివానికి ఒకటి ఇవ్వాలి. ఆహారమున్నవాడు కూడా అలాగే చేయాలి.”
12 సుంకంవారు కొందరు కూడా బాప్తిసం పొందడానికి వచ్చారు. “ఉపదేశకా, మేమేం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు.
13 వారితో అతడు “మీకు నియమించిన దానికంటే ఎక్కువ పన్నులు వసూలు చేయకండి” అన్నాడు.
14 సైనికులు కొందరు కూడా అతణ్ణి అడిగారు “మేమేం చెయ్యాలి?” వారితో అతడు అన్నాడు “ఎవరినీ దౌర్జన్యం చెయ్యకండి. అన్యాయంగా ఎవరిమీద నేరం మోపకండి. మీ జీతంతో తృప్తిపడండి.”
15 ✝ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. యోహాను అభిషిక్తుడై✽ ఉన్నాడో కాడో అని అందరూ అతని గురించి లోలోపల ఆలోచించుకొంటూ ఉన్నారు. 16 వారందరికీ యోహాను ఇచ్చిన జవాబిది: “నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నిజమే. గానీ నాకంటే బలప్రభావాలున్నవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పవిత్రాత్మలోనూ మంటల్లోనూ మీకు బాప్తిసమిస్తాడు. 17 తూర్పార పట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేస్తాడు, గోధుమలను తన గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”
18 ✽అతడింకా అనేక ఇతర ప్రోత్సాహవాక్కులతో ప్రజలకు ప్రకటించాడు.
19 ✝తరువాత రాష్ట్రాధికారి అయిన హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతడి తోబుట్టువు ఫిలిప్పు భార్య అయిన హేరోదియ విషయం యోహాను అతణ్ణి మందలించాడు. 20 అప్పుడు హేరోదు ఆ చెడు పనులన్నిటితో మరో దాన్ని కలిపాడు - యోహానును ఖైదులో వేయించాడు.
21 ప్రజలంతా బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ✽ ఉన్నప్పుడు ఆకాశం తెరచుకొంది. 22 పవిత్రాత్మ పావురం రూపంలో ఆయనమీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశంనుంచి ఒక స్వరం వినిపించింది: “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం.”
23 యేసు తన సేవ మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు సుమారు ముప్ఫయి సంవత్సరాలు. ఆయన హేలీ కుమారుడైన యోసేపు✽ కుమారుడని ఎంచబడ్డాడు.
24-38 ✽దేవుని కుమారుడు ఆదాము✽. ఆదాము కుమారుడు షేతు. షేతు కుమారుడు ఎనోషు. ఎనోషు కుమారుడు కేయినాను. కేయినాను కుమారుడు మహలయేల్. మహలయేల్ కుమారుడు యెరెదు. యెరెదు కుమారుడు హనోకు. హనోకు కుమారుడు మెతూషెల. మెతూషెల కుమారుడు లెమెకు. లెమెకు కుమారుడు నోవహు. నోవహు కుమారుడు షేము. షేము కుమారుడు అర్పక్షదు. అర్పక్షదు కుమారుడు కేయినాను. కేయినాను కుమారుడు షేలహు. షేలహు కుమారుడు హెబెరు. హెబెరు కుమారుడు పెలెగు. పెలెగు కుమారుడు రయూ. రయూ కుమారుడు సెరూగు. సెరూగు కుమారుడు నాహోరు. నాహోరు కుమారుడు తెరహు. తెరహు కుమారుడు అబ్రాహాము. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కుమారుడు యూదా. యూదా కుమారుడు పెరెసు. పెరెసు కుమారుడు ఎస్రోం. ఎస్రోం కుమారుడు అరామ్. అరామ్ కుమారుడు అమ్మినాదాబ్. అమ్మినాదాబ్ కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు. దావీదు కుమారుడు నాతాను. నాతాను కుమారుడు మత్తతా. మత్తతా కుమారుడు మెన్నా. మెన్నా కుమారుడు మెలెయూ. మెలెయూ కుమారుడు ఎల్యాకీమ్. ఎల్యాకీమ్ కుమారుడు యోనామ్. యోనామ్ కుమారుడు యోసేపు. యోసేపు కుమారుడు యూదా. యూదా కుమారుడు షిమ్యోను. షిమ్యోను కుమారుడు లేవీ. లేవీ కుమారుడు మత్తతు. మత్తతు కుమారుడు యోరీమ్. యోరీమ్ కుమారుడు ఎలీయెజరు. ఎలీయెజరు కుమారుడు యెహోషువ. యెహోషువ కుమారుడు ఏర్. ఏర్ కుమారుడు ఎల్మదామ్. ఎల్మదామ్ కుమారుడు కోసామ్. కోసామ్ కుమారుడు అద్ది. అద్ది కుమారుడు మెల్కీ. మెల్కీ కుమారుడు నేరి. నేరి కుమారుడు షయల్‌తీయేల్. షయల్‌తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్. జెరుబ్బాబెల్ కుమారుడు రేసా. రేసా కుమారుడు యోహన్న. యోహన్న కుమారుడు యోదా. యోదా కుమారుడు యోశేఖు. యోశేఖు కుమారుడు సిమియ. సిమియ కుమారుడు మత్తతీయ. మత్తతీయ కుమారుడు మయతు. మయతు కుమారుడు నగ్గయి. నగ్గయి కుమారుడు ఎస్లి. ఎస్లి కుమారుడు నాహోమ్. నాహోమ్ కుమారుడు ఆమోసు. ఆమోసు కుమారుడు మత్తతీయ. మత్తతీయ కుమారుడు యోసేపు. యోసేపు కుమారుడు యన్న. యన్న కుమారుడు మెల్కీ. మెల్కీ కుమారుడు లేవీ. లేవీ కుమారుడు మత్తతు. మత్తతు కుమారుడు హేలీ. హేలీ కుమారుడు యోసేపు.