2
1 ✽ఆ రోజుల్లో లోకమంతటా జనాభాలెక్కలు రాయాలని సీజర్ అగస్టస్ ఆజ్ఞ జారీ చేశాడు. 2 సిరియా దేశానికి కురేనియన్ అధిపతి అయి ఉన్న కాలంలో జనాభాలెక్కలు రాయడం ఇదే మొదటి సారి. 3 అందరూ ఆ లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి ఎవరి గ్రామాలకు వారు వెళ్ళిపోయారు.4 ✽ యోసేపు దావీదు వంశానికీ గోత్రానికీ చెందినవాడు గనుక గలలీలోని నజరేతు గ్రామంనుంచి యూదయలో బేత్‌లెహేం అనే దావీదు గ్రామానికి మరియతోపాటు పేర్లు రాయించుకోవడానికి అతడు వెళ్ళాడు. 5 ✝మరియ అతనికి ప్రధానం చేయబడ్డ భార్య. ఆమె గర్భవతి. 6 వారక్కడ ఉన్నప్పుడు ఆమెకు నెలలు నిండి కనే సమయం వచ్చింది. 7 ✽ఆమె తొలిచూలు కుమారుణ్ణి కన్నది. ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం లేదు.
8 ✽ఆ ప్రాంతంలో గొర్రెల కాపరులు కొందరు పొలాల్లో ఉంటూ రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. 9 ✽ఉన్నట్టుండి ప్రభు దేవదూత వారి ఎదుటే నిలిచాడు, ప్రభు మహిమాప్రకాశం వారి చుట్టూ మెరిసింది. వారు అధికంగా హడలిపోయారు.
10 ✽అయితే దేవదూత అన్నాడు, “భయపడకండి! ఇదిగో వినండి, ప్రజలందరికోసమూ మహానందకరమైన శుభవార్త మీకు తెచ్చాను. 11 ✽ ✽ఈ రోజే దావీదు గ్రామంలో ముక్తిప్రదాత మీకోసం జన్మించాడు. ఈయన ప్రభువు, అభిషిక్తుడు. 12 మీకు ఇదే ఆనవాలు: ఆ శిశువుకు పొత్తిగుడ్డలు చుట్టి ఉండడం, పశువుల తొట్టిలో ఆయన పడుకొని ఉండడం మీరు కనుగొంటారు.”
13 ✽హఠాత్తుగా పరలోక సేన సమూహం ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి స్తుతిస్తూ 14 ✽“సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ! భూమిమీద శాంతి! మనుషులపట్ల మంచి సంకల్పం!” అన్నారు.
15 దేవదూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కాపరులు “జరిగినది ప్రభువు మనకు తెలిపాడు గదా. రండ్రా! బేత్‌లెహేం వెళ్ళి చూద్దాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
16 వారు త్వరగా వెళ్ళి మరియనూ యోసేపునూ తొట్టిలో పడుకొని ఉన్న శిశువునూ చూశారు. 17 ✽వారు చూచిన తరువాత ఆ శిశువును గురించి తమతో చెప్పబడినదంతా తెలియజేశారు. 18 కాపరులు తమతో చెప్పినవి విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.
19 ✽అయితే మరియ తన హృదయంలో ఈ మాటలన్నీ భద్రం చేసుకొని తలపోసుకొంటూ ఉంది. 20 ✽గొర్రెల కాపరులు చూచిందీ విన్నదంతా తమతో చెప్పబడినట్టే ఉంది గనుక ఆ సంగతులన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయారు.
21 శిశువును సున్నతి✽ చేయడానికి ఎనిమిది రోజులు పూర్తి అయినప్పుడు ఆయనకు యేసు అని నామకరణం చేశారు. గర్భంలో ఆయన పడకముందే దేవదూత✽ పెట్టిన పేరు ఇదే. 22 ✝మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు శుద్ధీకరణ దినాలు గడిచిన తరువాత యోసేపు, మరియ బలి అర్పించడానికీ ఆయనను ప్రభు సన్నిధానంలోకి తేవడానికీ జెరుసలం తీసుకువెళ్ళారు. 23 ✝ఇది ప్రభు ధర్మశాస్త్రంలో రాసి ఉన్న ప్రకారమే. ఏమంటే, ప్రతి తొలిచూలు మగపిల్లవాణ్ణి ప్రభువుకు పవిత్రుడు అనాలి. 24 ✽వారి బలి ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ మాట ప్రకారం “రెండు గువ్వలు గానీ రెండు పావురం పిల్లలు గానీ”.
25 ✽జెరుసలంలో సుమెయోను అనే మనిషి ఉండేవాడు. ఈ మనిషి న్యాయవంతుడు, భక్తిపరుడు, ఇస్రాయేల్‌కు ఆదరణ కలిగేదెప్పుడా అని చూస్తూ ఉండేవాడు. పవిత్రాత్మ✽ అతనిమీద ఉన్నాడు. 26 అతడు ప్రభు అభిషిక్తుణ్ణి చూచేంతవరకు చనిపోడని పవిత్రాత్మ అతనికి వెల్లడి చేశాడు. 27 ✽ఆ ఆత్మ మూలంగా అతడు దేవాలయంలో ప్రవేశించాడు. ధర్మశాస్త్రం పద్ధతి ప్రకారం ఆయనకు జరిగించాలని అప్పుడే తల్లిదండ్రులు శిశువైన యేసును లోపలికి తీసుకువచ్చారు. 28 సుమెయోను ఆయనను చేతులలోకి తీసుకొని దేవుణ్ణి కీర్తిస్తూ ఇలా అన్నాడు:
29 ✽“ప్రభూ! నీ మాట ప్రకారం నీ దాసుడైన నన్ను ఇప్పుడు శాంతితో పోనివ్వు. 30,31 ✽ఎందుకంటే, అన్ని జనాల ఎదుట నీవు సిద్ధం చేసిన ముక్తిని కండ్లారా చూశాను. 32 ✽అది ఇతర ప్రజలకు సత్యాన్ని వెల్లడి చేసే వెలుగు, నీ ప్రజలైన ఇస్రాయేల్‌కు మహిమ.”
33 ✽ఆయనను గురించి చెప్పిన సంగతులు విని ఆయన తల్లీ, యోసేపూ ఆశ్చర్యపడ్డారు. 34 ✽సుమెయోను వారిని దీవించి ఆయన తల్లి మరియతో అన్నాడు “ఇదిగో విను, ఈ శిశువు ఇశ్రాయేల్‌లో అనేకులు పడడం, లేవడంకోసం నియామకమైనవాడు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడబోయే సూచనగా ఉంటాడు. 35 ✽(అంతేగాక, నీ అంతరంగంలోకి ఖడ్గం ఒకటి దూసుకు పోతుంది!) ఉద్దేశమేమంటే అనేకుల హృదయాలోచనలు బయట పడాలని.”
36 ✽దేవుని మూలంగా పలికే స్త్రీ ఒకతె ఉండేది. ఆమె పేరు అన్నా. ఆమె ఆషేరు గోత్రికురాలు, ఫనూయేలు కూతురు. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె కన్య అయి పెళ్ళయి ఏడేళ్ళు భర్తతో కాపురం చేసిన తరువాత, 37 ✽ఈ స్త్రీ ఎనభై నాలుగు సంవత్సరాల వయస్సు వరకు విధవరాలుగా ఉండిపోయింది. ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాసముంటూ✽ ప్రార్థనలు చేస్తూ రాత్రింబగళ్ళూ సేవ చేస్తూ ఉంది. 38 ✽ఆ సమయంలోనే ఆమె వారి దగ్గరకు వచ్చి ప్రభువుకు కృతజ్ఞత✽ అర్పించింది. తరువాత, జెరుసలం విముక్తి✽ కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ శిశువును గురించి మాట్లాడుతూ వచ్చింది.
39 ✽ యోసేపు, మరియ ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం సమస్తం తీర్చిన తరువాత గలలీలోని స్వగ్రామమైన నజరేతుకు తిరిగి వెళ్ళారు. 40 ✽ ఆ శిశువు పెరుగుతూ ఆత్మలో బలం పొందుతూ ఉన్నాడు. జ్ఞానంతో నిండిపోయాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
41 ప్రతి ఏటా పస్కా✽పండుగ సమయంలో ఆయన తల్లిదండ్రులు జెరుసలంకు వెళ్ళేవారు. 42 ✝ఆయనకు పన్నెండేళ్ళయినప్పుడు పండుగ అలవాటు ప్రకారం జెరుసలంకు వెళ్ళారు. 43 ఆ రోజులు గడిపిన తరువాత వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే బాలుడైన యేసు జెరుసలంలోనే ఉండిపోయాడు. ఈ సంగతి యోసేపుకు, ఆయన తల్లికి తెలియదు. 44 ప్రయాణికుల గుంపులో ఉన్నాడని అనుకొన్నారు. అయితే రోజంతా ప్రయాణం చేసిన తరువాత వారు ఆయనకోసం చుట్టాలలో, మిత్రులలో వెదికారు. 45 ఆయన కనబడకపోవడంతో వారు వెదకుతూ తిరిగి జెరుసలం వచ్చారు. 46 ✽మూడు రోజుల తరువాత దేవాలయంలో ఆయనను కనుక్కొన్నారు. ఆయన ఉపదేశకుల మధ్య కూర్చుని ఉండి వారు చెప్పేది వింటూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 47 ✽ఆయన చెపుతున్నది విన్నవారంతా ఆయన వివేకానికి ఆయన ఇచ్చే జవాబులకూ విస్మయం చెందారు.
48 ✽ఆయనను చూచి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. “కుమారా! మా పట్ల నువ్వెందుకిలా వ్యవహరించావు? ఇదిగో, నీ తండ్రీ, నేనూ ఆతురతతో నీ కోసం గాలిస్తూ ఉన్నాం” అని ఆయన తల్లి ఆయనతో అంది.
49 ✽వారితో ఆయన “నా కోసం మీరెందుకు వెదకుతూ ఉన్నారు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు.
50 ✽అయితే ఆయన తమతో చెపుతున్నదేమిటో వారికి అర్థం కాలేదు. 51 అప్పుడు ఆయన వారితో✽ కూడా బయలుదేరి నజరేతు వెళ్ళాడు. అక్కడ వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకొంది. 52 ✽ యేసు జ్ఞానంలోను శారీరకంగాను వృద్ధి చెందుతూ ఉన్నాడు. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు.