లూకా శుభవార్త
1
1 మహా ఘనులైన తియొఫిలస్! మా మధ్య నెరవేరిన సంగతులు మొదటి నుంచి కళ్ళారా చూచి దేవుని వాక్కు విషయమై సేవ చేసేవారు వాటిని మనకు అందించారు. 2 వారి ఉపదేశాలనే అనుసరించి వాటిని వరుసగా ఒక వృత్తాంతం రూపొందించడానికి అనేకులు పూనుకొన్నారు. 3 అందుచేత మొదటి నుంచి అన్నిటినీ జాగ్రత్తగా పరిశోధించి పూర్తిగా గ్రహించిన నేను కూడా నీకోసం వాటిని గురించి క్రమబద్ధంగా రాయడం మంచిదని నాకు తోచింది. 4 నీకు అందిన ఉపదేశంలోని అసలు సత్యం నీవు తెలుసుకోవాలని నా ఉద్దేశం.
5 యూదయ రాజైన హేరోదు రోజుల్లో జెకర్యా అనే యాజి ఉండేవాడు. అతడు అబీయా శాఖకు చెందినవాడు. అతని భార్య అహరోను వంశికురాలు. ఆమె పేరు ఎలీసబెతు. 6 దేవుని దృష్టిలో వీరిద్దరూ న్యాయవంతులూ నిందకు చోటివ్వకుండా ప్రభువిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం, న్యాయ నిర్ణయాలన్నిటి ప్రకారం నడుచుకొనేవారు. 7  ఎలీసబెతు గొడ్రాలు గనుక వారికి సంతానం కలగలేదు. అంతేగాక, ఇద్దరూ వయసు మళ్ళిన ముసలివారు.
8 ఒకసారి జెకర్యా తన శాఖ క్రమం ప్రకారం దేవుని ఎదుట యాజిగా సేవ చేస్తూ ఉన్నప్పుడు, 9 యాజి ధర్మం ప్రకారం ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి చీట్లు వేసినప్పుడు అతనికి వంతు వచ్చింది. 10 ధూప సమర్పణ సమయంలో ప్రజానీకమంతా బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 11 అప్పుడు ప్రభు దేవదూత ఒకడు ధూపవేదిక కుడివైపున నిలుచుండి అతనికి కనబడ్డాడు. 12 జెకర్యా అతణ్ణి చూచి కంగారుపడి భయాక్రాంతుడు అయ్యాడు.
13 అయితే దేవదూత అతనితో ఇలా అన్నాడు: “జెకర్యా! భయపడకు! నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని నామకరణం చేస్తావు. 14 నీవు సంతోషిస్తావు. ఉల్లాసంతో ఉప్పొంగిపోతావు. అతని పుట్టుక కారణంగా అనేకులకు ఆనందం కలుగుతుంది. 15 ఎందుకంటే, అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడు అవుతాడు. ద్రాక్షరసం గానీ మద్యం గానీ త్రాగడు. తల్లి గర్భాన పుట్టినప్పటినుంచీ అతడు దేవుని పవిత్రాత్మతో నిండి ఉంటాడు. 16 ఇస్రాయేల్ ప్రజలలో అనేకులను వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు. 17 తండ్రుల హృదయాలను తమ సంతానం వైపుకు, అవిధేయులను న్యాయవంతుల జ్ఞానానికి త్రిప్పడానికీ తద్వారా ప్రభువుకోసం తయారైన జనాన్ని సిద్ధం చేయడానికీ అతడు ఏలీయా మనసుతో బలప్రభావాలతో ప్రభువుకంటే ముందుగా వస్తాడు.”
18 దేవదూతతో జెకర్యా “నేనిది ఎలా తెలుసుకుంటాను? నేను ముసలివాణ్ణే. నా భార్య కూడా వయసు మళ్ళింది” అన్నాడు.
19 దేవదూత అతనికి జవాబిస్తూ “నేను దేవుని సన్నిధిలో నిలిచే గబ్రియేలును. నీతో మాట్లాడడానికీ ఈ శుభవార్త నీకు తెలపడానికీ పంపబడ్డాను. 20 ఇదిగో విను. నా మాటలు తగిన కాలంలో నెరవేరుతాయి గానీ నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే వరకు నీవు మాట్లాడలేక మౌనంగా ఉంటావు!” అన్నాడు.
21 ఈలోగా జెకర్యా కోసం జనం బయట ఎదురుచూస్తూ ఉన్నారు. దేవాలయంలో అతడు అంత సేపు నిలిచి ఉండడ మెందుకో అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. 22 అతడు బయటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయాడు గనుక దేవాలయంలో అతనికి దర్శనం కనబడిందని వారు గ్రహించారు. అతడు సైగలు చేస్తూ మూగవాడుగా ఉండిపోయాడు.
23 అతని సేవ రోజులయిపోయినప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. 24 ఆ రోజుల తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది, అయిదు నెలలపాటు ఆమె ఇతరులకు కనిపించకుండా ఉండిపోయింది. 25 “మనుషుల మధ్య నా అవమానాన్ని ప్రభువు తీసేశాడు, ఈ రోజుల్లో నన్ను దయతో చూచి ఈ విధంగా నాపట్ల వ్యవహరించాడు” అంది.
26 ఆమెకు ఆరో నెల అయినప్పుడు దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను గలలీలో నజరేతు అనే గ్రామానికి, 27 ఒక కన్య దగ్గరకు పంపాడు. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో పెళ్ళి నిశ్చయమైంది. యోసేపు దావీదు వంశికుడు. ఆ కన్య పేరు మరియ. 28 దేవదూత లోపలికి వచ్చి “శుభం! నీవు దయ పొందినదానివి! ప్రభువు నీకు తోడై ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలవు” అన్నాడు.
29 అయితే ఆమె ఆయనను చూచినప్పుడు ఆ మాటలకు చాలా కంగారుపడి ఈ అభివందనం ఏమిటో అని తలపోసింది.
30 అప్పుడు దేవదూత ఆమెతో ఇలా అన్నాడు: “మరియా, భయపడకు. దేవుని దయ నీకు లభించింది. 31 ఇదిగో విను. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఆయనకు యేసు అని నామకరణం చేస్తావు. 32 ఆయన గొప్పవాడై ఉంటాడు. ఆయనను సర్వాతీతుని కుమారుడు అనడం జరుగుతుంది. ప్రభువైన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనం ఆయనకిస్తాడు. 33 ఆయన యాకోబు వంశాన్ని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు.”
34 దేవదూతను మరియ “నేను ఏ పురుషుణ్ణి ఎరగను – ఇదెలా జరుగుతుంది?” అని అడిగింది.
35  దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు: “పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు. సర్వాతీతుని బలప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది. 36 ఇదిగో విను. మీ చుట్టం ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భంతో ఉంది, కొడుకును కనబోతుంది. గొడ్రాలనబడ్డ ఆమెకు ఇది ఆరో నెల. 37 దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు.”
38 అందుకు మరియ “ఇదిగో ప్రభు చరణదాసిని. మీ మాట ప్రకారమే నాపట్ల జరగనివ్వండి” అంది. అప్పుడు దేవదూత ఆమె దగ్గరనుంచి వెళ్ళిపోయాడు.
39 ఆ రోజుల్లో మరియ లేచి యూదా కొండసీమలో ఉన్న ఒక గ్రామానికి త్వరగా వెళ్ళి 40 జెకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలీసబెతుకు అభినందనం చేసింది. 41 మరియ అభినందనం ఆమెకు వినబడడంతోనే ఎలీసబెతు గర్భంలోని శిశువు గంతులు వేశాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండుకొంది.
42  అప్పుడు ఎలీసబెతు బిగ్గరగా ఇలా అంది: “స్త్రీలలో నీవు దీవెన పొందిన దానివి! నీ గర్భ ఫలం ధన్యుడు! 43 నా ప్రభువును కనబోయే తల్లి నా దగ్గరకు రావడం నాకెలా జరిగినట్టు? 44 ఇదిగో విను, నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. 45 ప్రభువు తనతో చెప్పిన సంగతులు నెరవేరుతాయి, గనుక నమ్మిన ఈమె ధన్యురాలు!”
46 అప్పుడు మరియ అంది “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తూ ఉంది. 47 నా విముక్తి ప్రదాత అయిన దేవునిలో నా ఆత్మ ఆనందిస్తూ ఉంది. 48 ఎందుకంటే, ఆయన తన చరణదాసి దీన స్థితిని దయతో చూశాడు. ఇప్పటినుంచి అన్ని తరాల జనులు నన్ను ధన్యురాలంటారు. 49 ఎందుకంటే అమిత శక్తివంతుడు నాకు గొప్ప మేళ్ళు చేశాడు. ఆయన పేరు పవిత్రం. 50 తానంటే భయభక్తులున్నవారి మీద ఆయన కరుణ తరతరాలకు ఉంటుంది. 51 ఆయన తన చేతితో బలప్రభావాలను ప్రదర్శించాడు. తమ హృదయాల ఆలోచనల్లో గర్వపడే వారిని ఆయన చెదరగొట్టివేశాడు. 52 పరిపాలకులను వారి సింహాసనాలమీద నుంచి పడలాగివేశాడు. దీన స్థితిలో ఉన్నవారిని హెచ్చించాడు. 53 ఆకలితో ఉన్నవారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచాడు, ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాడు. 54 మన పూర్వీకులతో తాను చెప్పినట్టే అబ్రాహాముపట్లా అబ్రాహాము సంతానంపట్లా శాశ్వతంగా కరుణ చూపడం జ్ఞాపకముంచుకొని 55 తనకు సేవ చేసే ఇస్రాయేల్‌కు సహాయం చేశాడు.”
56 ఎలీసబెతు దగ్గర సుమారు మూడు నెలలుండి మరియ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. 57 ఎలీసబెతు ప్రసవ కాలం వచ్చినప్పుడు కొడుకును కన్నది. 58 ప్రభువు ఆమెమీద గొప్ప జాలి చూపాడని విని ఆమె ఇరుగుపొరుగువారూ చుట్టాలూ ఆమెతో కూడా సంతోషించారు. 59 ఈ చిన్న పిల్లవానికి ఎనిమిదో రోజున సున్నతి చేయడానికి వారు వచ్చారు. జెకర్యా అని అతడి తండ్రి పేరే పెట్టబోయారు 60 గానీ అతడి తల్లి “అలా కాదు. అతడికి యోహాను అని పెట్టాలి” అంది.
61 వారు ఆమెతో “ఈ పేరు మీ చుట్టాలలో ఎవరికీ లేదు గదా!” అన్నారు. 62 అప్పుడు తండ్రి పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలనుకొన్నాడో అని సైగ చేసి అతణ్ణి అడిగారు. 63 అతడు పలక తేవాలని సూచించి దానిమీద “అతడి పేరు యోహాను!” అని రాశాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. 64 వెంటనే జెకర్యా నోరు తెరచుకొంది, నాలుకసడలింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడసాగాడు. 65 వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరినీ భయం ఆవరించింది. యూదయ కొండ సీమ అంతటా ఈ మాటలను గురించి చెప్పుకోవడం జరిగింది. 66 విన్నవారంతా వాటిని హృదయంలో ఉంచుకొని “ఈ అబ్బాయి ఎలాంటివాడవుతాడో!” అన్నారు. ప్రభు హస్తం అతడికి తోడై ఉంది.
67  అతడి తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నిండుకొని ప్రవక్తగా ఇలా పలికాడు: 68 “ఇస్రాయేల్ ప్రభువైన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక! ఆయన తన జనాన్ని సందర్శించి విమోచించాడు. 69 తన సేవకుడైన దావీదు వంశంలో మనకోసం రక్షణ శృంగాన్ని లేవనెత్తాడు. 70 కాలాలారంభం నుంచి ఆయన తన పవిత్ర ప్రవక్తల నోట పలికించినట్టే 71 మన శత్రువుల బారినుంచీ మనలను ద్వేషించేవారందరి చేతినుంచీ మనకు రక్షణ కలగాలని 72 మన పూర్వీకులకు వాగ్దానం చేసిన కరుణ చూపేందుకూ తన పవిత్రమైన ఒడంబడిక జ్ఞాపకముంచుకొనేందుకూ ఈ విధంగా చేశాడు. 73 ఇది మన పూర్వీకుడైన అబ్రాహాముకు చేసిన ప్రమాణం. 74 దాని ప్రకారం మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది 75 బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేయాలని ఆయన ఉద్దేశం.
76 “చిన్నవాడా, నిన్ను సర్వాతీతుని ప్రవక్త అంటారు. ఎందుకంటే, నువ్వు ప్రభువుకు ముందుగా వెళ్తూ ఆయన త్రోవలను సిద్ధపరుస్తావు. 77 ఆయన ప్రజలకు పాపక్షమాపణ కలగడం వల్ల వారికి విముక్తిని గురించిన జ్ఞానం నీద్వారా తెలిసిపోతుంది. 78 ఇది మన దేవుని మహా వాత్సల్యం వల్లే జరిగేది. దానితో పైనుంచి ఉదయకాంతి మనల్ని సందర్శించింది. 79  చీకటిలో, చావునీడలో కూర్చుని ఉన్న వారిమీద ఈ కాంతి ప్రకాశించాలనీ మన పాదాలను శాంతి మార్గంలోకి నడిపించాలనీ ఇందులో దేవుని ఉద్దేశం.
80 ఆ బాలుడు పెరుగుతూ ఆధ్యాత్మిక బలం పొందుతూ వచ్చాడు. అతడు ఇస్రాయేల్ ప్రజలకు కనబడేవరకూ ఎడారి ప్రదేశాలలో ఉండిపోయాడు.