15
1  ఉదయం కాగానే ప్రధాన యాజులు పెద్దలతో, ధర్మశాస్త్ర పండితులతో, యూద సమాలోచన సభవారందరితో పాటు సమాలోచన జరిపారు. అప్పుడు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమన్ అధిపతి పిలాతుకు అప్పగించారు.
2 పిలాతు “నీవు యూదుల రాజువా?” అని ఆయన నడిగాడు. “నీవన్నట్టే” అని ఆయన అతడికి జవాబిచ్చాడు.
3 ప్రధాన యాజులు ఆయనమీద అనేక నేరాలు మోపారు. అయితే ఆయన జవాబేమి చెప్పలేదు. 4 కనుక పిలాతు మరో సారి ఆయనను ప్రశ్నిస్తూ “నీవేం జవాబు చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలిస్తున్నారో చూడు!” అన్నాడు.
5 అయితే యేసు ఇంకా ఏమీ సమాధానం చెప్పలేదు గనుక పిలాతుకు ఆశ్చర్యం వేసింది. 6 ఆ పండుగలో వారు తనను కోరిన ఒక ఖైదీని విడుదల చేయడం అతడికి అలవాటు. 7 బరబ్బ అనేవాడు తన తోటి తిరుగుబాటుదారులతో కూడా ఖైదులో ఉన్నాడు. ఆ తిరుగుబాటులో వారు హత్య చేశారు.
8 జనసమూహం కేకలు పెట్టి ఎప్పటిలాగా తమ కోరిక ప్రకారం చేయాలని పిలాతును అడిగారు. 9 వారికి పిలాతు జవాబిస్తూ “నేనీ యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అన్నాడు. 10 ఎందుకంటే, ప్రధాన యాజులు అసూయ కారణంగా ఆయనను తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. 11 అయితే యేసుకు బదులు బరబ్బను విడుదల చేయాలని కోరవలసిందిగా ప్రధాన యాజులు జన సమూహాన్ని పురికొలిపారు.
12 మరోసారి పిలాతు జవాబిస్తూ వారితో “అలాగైతే మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే యేసును నేనేం చేయాలని కోరుతున్నారు?” అన్నాడు.
13 వారు మళ్ళీ కేక వేస్తూ “అతణ్ణి సిలువ వేయండి!” అన్నారు.
14 వారితో పిలాతు “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు?” అన్నాడు. వారు “అతణ్ణి సిలువ వేయండి!” అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టారు.
15 అప్పుడు పిలాతు జన సమూహాన్ని మెప్పించాలని వారికోసం బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించిన తరువాత సిలువ వేయడానికి అప్పగించాడు. 16 సైనికులు ఆయనను అధిపతి భవనంలోకి తీసుకువెళ్ళి తక్కిన సైనికుల గుంపునంతా అక్కడికి పిలిచారు. 17 వారాయనకు ఊదారంగు అంగీ తొడిగారు. ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. 18 “యూదుల రాజా! శుభం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. 19 రెల్లుకర్రతో ఆయన తలమీద కొట్టారు, ఆయనమీద ఉమ్మివేశారు, మోకరించి ఆయనకు నమస్కరించారు. 20 ఈ విధంగా వారు ఆయనను వెక్కిరించిన తరువాత ఊదారంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయడానికి బయటికి తీసుకువెళ్ళారు.
21 అప్పుడు పల్లెసీమ నుంచి కురేనే ప్రాంతీయుడైన సీమోను ఆ త్రోవలో నడిచి వస్తూ ఉన్నాడు (అతడు అలెగ్జాండర్, రూఫస్‌ల తండ్రి). సైనికులు బలవంతాన యేసు సిలువను అతనిచేత మోయించారు. 22 వారాయనను గొల్గొతా అనే స్థలానికి తీసుకువచ్చారు. గొల్గొతా అంటే కపాల స్థలం అని తర్జుమా. 23 అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు.
24 వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలకోసం ఏ బట్ట ఎవడికి కావాలో నిర్ణయించడానికి చీట్లు వేసి వాటిని పంచుకొన్నారు. 25 ఆయనను సిలువ వేసినది ఉదయం తొమ్మిది గంటలకు. 26 “యూదుల రాజు” అని ఆయనమీద మోపిన నేరం రాసి పైగా ఉంచారు. 27 ఆయనతో కూడా ఇద్దరు దోపిడీ దొంగలను, ఒకణ్ణి ఆయన కుడి వైపున, మరొకణ్ణి ఎడమ వైపున సిలువ వేశారు. 28 అప్పుడు ఈ లేఖనం నెరవేరింది: “ఆయనను అక్రమకారులలో ఒకడిగా ఎంచడం జరిగింది.”
29 ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ ఆయనను దూషిస్తూ “ఓహో! దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టేవాడా! 30 నిన్ను నీవే రక్షించుకో! సిలువనుంచి దిగిరా!” అన్నారు.
31 అలాగే ప్రధాన యాజులు ధర్మశాస్త్ర పండితులతోపాటు ఆయనను వెక్కిరిస్తూ “ఇతడు ఇతరుల్ని రక్షించాడు, తనను రక్షించుకోలేడు! 32 ఈ ‘అభిషిక్తుడు’, ఈ ‘ఇస్రాయేల్ రాజు’ ఇప్పుడు సిలువ దిగిరావాలి. అది చూచి నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
ఆయనతోపాటు సిలువ వేయబడ్డవారు కూడా ఆయనను నిందించారు.
33 మధ్యాహ్నం పన్నెండు గంటలయినప్పుడు మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. 34 మూడు గంటలప్పుడు యేసు “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు “నా దేవా! నా దేవా! నా చేయి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.
35 దగ్గరలో నిలుచున్నవారిలో కొంతమంది అది విని “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 36 వారిలో ఒకడు పరుగెత్తుకొంటూ వెళ్ళి స్పంజీని పులిసిపోయిన ద్రాక్షరసంతో నింపి రెల్లుకర్రకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించాడు “ఆయన్ను విడిచిపెట్టండి. ఏలీయా ఇతణ్ణి కిందికి దింపడానికి వస్తాడో రాడో చూద్దాం” అన్నాడు.
37 యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
38 అప్పుడు దేవాలయం తెర పైనుంచి క్రిందికి రెండుగా చినగడం జరిగింది.
39 యేసుకు ఎదురుగా రోమన్ సేన శతాధిపతి నిలిచి ఉండి, ఆయన ఈ విధంగా కేకవేసి ప్రాణం విడిచాడని చూచి “నిజంగా ఈ మనిషి దేవుని కుమారుడు!” అన్నాడు.
40 స్త్రీలు కొందరు కూడా దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియ, “చిన్న” యాకోబుకూ యోసేకూ తల్లి అయిన మరియ, సలోమి ఉన్నారు. 41 యేసు గలలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను అనుసరిస్తూ ఆయనకు సేవ చేసేవారు. ఆయన వెంట జెరుసలంకు వచ్చిన ఇంకా అనేకమంది స్త్రీలు కూడా ఉన్నారు.
42 అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. 43 అప్పటికి సాయంకాలం అయింది గనుక అరిమతయి గ్రామం వాడైన యోసేపు వచ్చి ధైర్యం తెచ్చుకొని పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. ఈ యోసేపు యూద సమాలోచన సభలో గౌరవనీయుడైన సభ్యుడూ దేవుని రాజ్యంకోసం ఎదురు చూస్తున్నవాడూ.
44 ఇంతకు ముందే ఆయన చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి ఆయన అప్పటికే చనిపోయాడా అని అతణ్ణి అడిగాడు. 45 ఆయన చనిపోయాడని శతాధిపతివల్ల తెలుసుకొని ఆయన దేహాన్ని యోసేపుకు ఇప్పించాడు.
46 యోసేపు సన్నని నారబట్ట కొని యేసును క్రిందకు దింపి ఆ బట్టతో చుట్టాడు. రాతిలో తొలిపించబడ్డ సమాధిలో ఆయనను పెట్టాడు. సమాధి ద్వారానికి రాయి దొర్లించాడు.
47 ఆయనను పెట్టిన చోటును మగ్దలేనే మరియ, యోసే తల్లి అయిన మరియ చూశారు.