16
1 ✝✽విశ్రాంతి దినం తరువాత మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహాన్ని అభిషేకించుదామని సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2 ఆదివారం నాడు వారు తెల్లవారు జామున ప్రొద్దు పొడవడంతోనే సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు. 3 “మనకోసం ఎవరు సమాధి ద్వారంనుంచి ఆ రాయి దొర్లించివేస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 4 అప్పుడు తలెత్తి చూస్తే ఆ రాయి – అది చాలా పెద్దది – దొర్లించి ఉండడం వారికి కనిపించింది. 5 ✽వారు సమాధిలోకి వెళ్ళినప్పుడు తెల్లని అంగీ తొడుక్కొన్న యువకుడొకడు కుడి వైపున కూర్చుని ఉండడం వారు చూచి నిర్ఘాంతపోయారు.6 అతడు వారితో ఇలా అన్నాడు: “నిర్ఘాంతపోకండి! మీరు వెదుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన సజీవంగా లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఇదిగో, వారు ఆయనను పెట్టిన స్థలం! 7 ✽వెళ్ళి ఆయన శిష్యులతో – పేతురుతో కూడా – ఇలా చెప్పండి: మీకంటే ముందుగా ఆయన గలలీకి వెళ్ళబోతున్నాడు. ఆయన మీతో చెప్పినట్టే అక్కడ మీరాయనను చూస్తారు.”
8 ✽వారు త్వరగా బయటికి వెళ్ళి సమాధినుంచి పారిపోయారు. ఎందుకంటే వారికి వణుకు, విస్మయం పట్టుకొన్నాయి. వారు భయం కారణంగా ఎవరితో ఏమీ చెప్పలేదు.
9 ✽✝ఆదివారం నాడు యేసు పెందలకడే సజీవంగా లేచిన తరువాత మగ్దలేనే మరియకు మొట్టమొదట కనబడ్డాడు. అంతకుముందు ఆయన ఆమెలోనుంచి ఏడు దయ్యాలను వెళ్ళగొట్టాడు. 10 మునుపు ఆయనతో ఉండేవారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి యేసు లేచిన సంగతి వారికి తెలియజేసింది. 11 ✽ఆయన సజీవుడనీ ఆమెకు కనబడ్డాడనీ విని వారు నమ్మలేదు.
12 ఆ తరువాత వారిలో ఇద్దరు పల్లెసీమలో నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన మరో రూపంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. 13 వారు వెళ్ళి తక్కినవారికి ఆ సంగతి తెలిపారు. కానీ వీరి మాట కూడా వారు నమ్మలేదు.
14 ✽ఆ తరువాత పదకొండుమంది శిష్యులు భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన వారికి కనిపించాడు. తాను సజీవంగా లేచిన తరువాత తనను చూచినవారి మాట నమ్మకపోయినందు చేత వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం కారణంగా వారిని మందలించాడు.
15 ✽తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు: “మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టంలోని ప్రతి వ్యక్తికీ శుభవార్త ప్రకటించండి. 16 ✽దానిని నమ్మి బాప్తిసం పొందే వ్యక్తికి✽ పాపవిముక్తి దొరుకుతుంది. నమ్మని వ్యక్తికి శిక్షావిధి కలుగుతుంది. 17 ✽ఈ సూచనలు నమ్మినవారి వెంట వస్తాయి: నా పేర దయ్యాలను వెళ్ళగొట్టివేస్తారు, క్రొత్త భాషలు మాట్లాడుతారు. 18 పాములను పైకెత్తుతారు. ఒక వేళ వారు ప్రాణాంతక పానీయమేదైనా త్రాగితే వారికి ఎలాంటి హానీ కలగదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు రోగులు బాగుపడుతారు.”