14
1 రెండు రోజుల తరువాత పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ రాబోతూ ఉన్నాయి. అప్పుడు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా కపటంతో పట్టుకొని చంపాలా అని చూస్తూ ఉన్నారు. 2 అయితే “ప్రజలలో అల్లరి జరగవచ్చు, గనక పండుగలో పట్టుకోవద్దు” అని వారు చెప్పుకొన్నారు.
3 ఆయన బేతనీలో కుష్ఠురోగి సీమోను ఇంట్లో భోజన పంక్తిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమెదగ్గర చలవరాతి బుడ్డిలో చాలా విలువైన అచ్చ జటామాంసి అత్తరు ఉంది. ఆమె ఆ బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసింది. 4 అయితే అక్కడున్న కొందరికి చిరాకు కలిగింది. “ఈ అత్తరు నష్టం చేయడం ఎందుకు? 5 ఒకవేళ ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాలకంటే ఎక్కువగా వచ్చేవి. ఆ డబ్బు బీదలకిచ్చి ఉండవచ్చు గదా!” అని చెప్పుకొని ఆ స్త్రీని కసురుకొన్నారు.
6 అయితే యేసు “ఈమె జోలికి వెళ్ళకండి! ఈమెను ఎందుకు తొందర చేస్తున్నారు? ఈమె నాపట్ల మంచి పని చేసింది. 7 మీదగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు. మీకెప్పుడైనా ఇష్టం వస్తే వారికి మంచి చేయగలరు. నేనైతే మీదగ్గర ఎల్లప్పుడూ ఉండను. 8 ఈమె చేయగలిగినది చేసింది. భూస్థాపనకోసం నా శరీరాన్ని ముందుగానే వచ్చి అభిషేకించింది. 9 మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, సర్వలోకంలో ఈ శుభవార్త ప్రకటన జరిగే స్థలాలన్నిటిలో, ఈమె చేసినదాని గురించి చెప్పడం జరుగుతుంది. అది ఆమె విషయం జ్ఞాపకార్థంగా ఉంటుంది అన్నాడు.
10 పన్నెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆయనను వారికి పట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాన యాజుల దగ్గరికి వెళ్ళిపోయాడు. 11 అది విని వారు సంతోషించారు. అతడికి కొంత డబ్బిస్తామని కూడా మాట ఇచ్చారు. ఇక అతడు యేసును పట్టి ఇవ్వడానికి అనువైన సమయంకోసం చూస్తూ ఉన్నాడు.
12 పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున, పస్కా గొర్రెపిల్లను వధించే ఆ రోజున, యేసు శిష్యులు ఆయనను ఇలా అడిగారు: “నీవు పస్కాను తినడానికి మేము ఏ స్థలానికి వెళ్ళి సిద్ధం చేయాలని ఉన్నావు?”
13 ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ “నగరంలోకి వెళ్ళండి. అక్కడ మీకెదురుగా ఒకతను నీళ్ళకుండ మోసుకువస్తూ ఉంటాడు. అతని వెంట వెళ్ళండి. 14 అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే మీరు ఆ ఇంటి యజమానిని చూచి ఇలా చెప్పండి: ‘నేను నా శిష్యులతో కూడా పస్కాను తినడానికి అతిథి శాల ఎక్కడని గురువు అంటున్నాడు’. 15 అతడు పెద్ద మేడ గది మీకు చూపుతాడు. దానిలో సామాను అమర్చిపెట్టి సిద్ధంగా ఉంటుంది. అక్కడే మనకు ఏర్పాట్లు చేయండి.”
16 అలాగే శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళి తమతో ఆయన చెప్పినట్టే చూశారు, పస్కాను సిద్ధం చేశారు. 17 సాయంకాలం అయినప్పుడు ఆయన తన పన్నెండు మందితో పాటు అక్కడికి వచ్చాడు. 18 వారు కూర్చుని భోజనం చేస్తూ ఉంటే యేసు వారితో “మీతో ఖచ్చితంగా అంటున్నాను, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అన్నాడు.
19 వారికి దుఃఖం కలిగింది. “నేను కాదు గదా!” అని వారు ఒకడి తరువాత ఒకడు అన్నారు. మరొకడు “నేను కాదు గదా!” అన్నాడు.
20 ఆయన వారితో అతడు ఈ పన్నెండుమందిలో ఒకడు, నాతోకూడా పాత్రలో చేయి ముంచేవాడే! 21 ఎందుకంటే, మానవ పుత్రుణ్ణి గురించి వ్రాసి ఉన్న ప్రకారమే ఆయన చనిపోతాడు గాని అయ్యో, ఎవడైతే మానవపుత్రుణ్ణి శత్రువులకు పట్టి ఇస్తాడో ఆ మనిషికి శిక్ష తప్పదు! ఆ మనిషి పుట్టి ఉండకపోతే అతనికి బాగుండేది” అని చెప్పాడు.
22 వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని దీవించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం” అన్నాడు.
23 అప్పుడాయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించిన తరువాత వారికిచ్చాడు. పాత్రలోది వారందరూ త్రాగారు. 24 వారితో ఆయన “ఇది నా రక్తం. అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం. 25 మీతో ఖచ్చితంగా అంటున్నాను, దేవుని రాజ్యంలో ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగను” అన్నాడు.
26 వారు కీర్తన పాడిన తరువాత ఆలీవ్ కొండకు వెళ్ళారు.
27 అప్పుడు యేసు వారితో అన్నాడు, “ఈ రాత్రి నా కారణంగా మీరందరూ తొట్రుపడుతారు. ఎందుకంటే ఇలా వ్రాసివుంది: కాపరిని కొడతాను. గొర్రెలు చెదరిపోతాయి. 28 అయినా నేను సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలలీకి వెళ్ళిపోతాను.”
29 అయితే పేతురు ఆయనతో “అందరూ తొట్రుపడినా నేను తొట్రుపడను” అన్నాడు.
30 అప్పుడు యేసు “నీతో ఖచ్చితంగా అంటున్నాను, ఈ రోజునే, కోడి రెండు సార్లు కూసేముందు ఈ రాత్రే నన్నెరగనని మూడు సార్లు అంటావు” అని అతనితో అన్నాడు. 31 “నేను నీతో చావ వలసివచ్చినా నిన్ను ఎరగననను” అని అతడు మరీ గట్టిగా చెప్పాడు. వారంతా అలాగే అన్నారు.
32 వారు గెత్‌సేమనే అనే స్థలానికి చేరారు. అప్పుడు ఆయన తన శిష్యులతో “నేను ప్రార్థన చేస్తాను. ఈలోగా మీరిక్కడ కూర్చుని ఉండండి” అన్నాడు.
33 అప్పుడాయన పేతురునూ యాకోబునూ యోహానునూ తీసుకువెళ్ళి విస్మయం, కలత అనుభవించసాగాడు. 34 అప్పుడు వారితో “నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తూ ఉంది. మీరిక్కడ ఆగి మెళకువగా ఉండండి” అన్నాడు.
35 ఆయన ఇంకా కొద్ది దూరం వెళ్ళి నేలమీద సాగిలపడి సాధ్యమైతే ఆ ఘడియ తననుంచి తప్పిపోవాలని ప్రార్థన చేశాడు. 36 “తండ్రీ! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నానుంచి తొలగించు. అయినా నేను ఇష్టపడేది కాదు, నీవు ఇష్టపడేదే జరగనియ్యి అన్నాడు.
37 ఆయన వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూచి పేతురుతో “సీమోనూ, నిద్రపోతున్నావా? ఒక్క గంటసేపు కూడా మెళకువగా ఉండలేకపోయావా? 38 మీరు విషమ పరీక్షలో పడకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం దుర్బలం” అన్నాడు.
39 ఆయన మళ్ళీ వెళ్ళి మునుపు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. 40 తిరిగి వచ్చి వారు మళ్ళీ నిద్రపోతూ ఉండడం చూశాడు. ఎందుకంటే, వారి కండ్లు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకేమి జవాబివ్వాలో వారికి తోచలేదు.
41 మూడో సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు: “మీరింకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! ఆ ఘడియ వచ్చింది. ఇదిగో వినండి, మానవపుత్రుణ్ణి పాపుల చేతులకు పట్టి ఇవ్వడం జరుగుతున్నది. 42 లెండి, వెళ్దాం! ఇడుగో, నన్ను పట్టి ఇచ్చేవాడు దగ్గరలో ఉన్నాడు.”
43 వెంటనే, ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుమందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజుల, ధర్మశాస్త్ర పండితుల, పెద్దల దగ్గరనుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితోకూడా ఉంది. వారికి కత్తులూ కటార్లూ ఉన్నాయి. 44 ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెపుతూ “నేనెవరిని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రంగా తీసుకువెళ్ళండి” అన్నాడు.
45 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరకు వచ్చి “బోధకా! బోధకా!” అంటూ ఆయనను ముద్దు పెట్టుకొన్నాడు. 46 వారు ఆయనపైబడి చేతులతో పట్టుకొన్నారు. 47 అయితే ప్రక్కగా నిలుచున్నవారిలో ఒకడు తన ఖడ్గం దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు.
48 యేసు వారితో ఇలా అన్నాడు: “నేను దోపిడీ దొంగనయినట్టు మీరు కత్తులూ కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి? 49 ప్రతి రోజూ నేను దేవాలయంలో ఉపదేశిస్తూ మీ దగ్గరే ఉండేవాణ్ణి గదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. కానీ లేఖనాలు నెరవేరాలి.”
50 అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు. 51 నారబట్ట మాత్రమే తన నగ్న శరీరంమీద వేసుకొన్న ఒక యువకుడు యేసు వెంట వచ్చాడు. యువకులు అతణ్ణి పట్టుకొన్నారు. 52 కానీ అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి వారిదగ్గరనుంచి దిసమొలతో పారిపోయాడు.
53 వారు యేసును ప్రముఖ యాజి దగ్గరకు తీసుకువెళ్ళారు. అతడి దగ్గర ప్రధాన యాజులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ అందరూ సమకూడి ఉన్నారు. 54 పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖ యాజి ఇంటి ముంగిటిలోకి వచ్చాడు. భటులతో కూర్చుని మంట దగ్గర చలి కాచుకొంటూ ఉన్నాడు.
55 ప్రధాన యాజులూ యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణశిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యంకోసం చూస్తూ ఉన్నారు గాని అది దొరకలేదు. 56 అనేకులు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు గాని వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొందిక లేకుండా ఉన్నాయి.
57 అప్పుడు కొందరు నిలబడి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెపుతూ 58 “ఇతడు ‘చేతులతో చేసిన ఈ దేవాలయాన్ని నేను నాశనం చేసి మూడు రోజులలో చేతులతో కాకుండా మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం విన్నాం” అన్నారు. 59 గానీ ఇందులో కూడా వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొందిక లేకుండా ఉన్నాయి.
60 అప్పుడు ప్రముఖయాజి వారిమధ్య లేచి నిలబడి “నీవు జవాబేమీ చెప్పవా? ఈ మనుషులు నీకు వ్యతిరేకంగా చెపుతున్న సాక్ష్యమేమిటి?” అని యేసును అడిగాడు.
61 ఆయన ఊరుకొన్నాడు. జవాబేమీ చెప్పలేదు. మళ్ళీ ప్రముఖ యాజి ఆయనను ప్రశ్నించాడు, “నీవు దివ్యుడైన దేవుని కుమారుడివా? అభిషిక్తుడివా?”
62 అప్పుడు యేసు “నేనే ఆయనను. మానవపుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపున కూర్చుని ఉండడమూ ఆకాశ మేఘాలతో రావడమూ మీరు చూస్తారు.”
63 ప్రముఖ యాజి తన బట్టలు చింపుకొని “మనకిక సాక్షులతో ఏం పని? 64 ఈ దేవదూషణ మీరు విన్నారు గదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన చావుకు తగినవాడని వారంతా తీర్పు చెప్పారు. 65 అప్పుడు కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన కండ్లు కప్పి ఆయనను గుద్దసాగారు. “ప్రవక్తగా పలుకు!” అని ఆయనతో చెప్పారు. భటులు కూడా ఆయనను చేతులతో కొట్టారు.
66 ఈలోగా పేతురు క్రింద, ముంగిటిలో ఉన్నాడు. అప్పుడు ప్రముఖయాజి పనిపిల్లలలో ఒకతె వచ్చింది. 67 పేతురు చలి కాచుకొంటూ ఉండడం ఆమెకు కనబడితే అతణ్ణి చూస్తూ ఆమె “నీవు కూడా నజరేతువాడైన యేసుతో ఉన్నావు కదూ!” అంది.
68 అతడు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నువ్వు చెప్పేదేమిటో అర్థం కావడం లేదు!” అన్నాడు. అప్పుడతడు నడవలోకి వెళ్ళాడు. అప్పుడు కోడి కూసింది.
69 ఆ పిల్ల అతణ్ణి మళ్ళీ చూచి ప్రక్కన నిలుచున్నవారితో “ఇతడు వాళ్ళలో ఒకడు” అంది. 70 అతడు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి ప్రక్కన నిలుచున్నవారు మళ్ళీ పేతురుతో “నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే! నువ్వు గలలీవాడివే గదా! నీ మాట తీరు అది వెల్లడి చేస్తుంది” అన్నారు.
71 అయితే అతడు ఒట్లూ శాపనార్థాలూ పెట్టుకొంటూ “మీరు చెప్పే ఆ మనిషిని నేనెరగను” అన్నాడు.
72 అప్పుడు కోడి రెండో సారి కూసింది. “కోడి రెండు సార్లు కూసేముందే నన్నెరుగనని మూడు సార్లు అంటావు” అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు, దాన్ని గురించి తలపోస్తూ ఏడ్చాడు.