13
1 ఆయన దేవాలయంలో నుంచి వస్తూ ఉంటే ఆయన శిష్యులలో ఒకడు “గురువర్యా! ఇవిగో, ఎలాంటి రాళ్ళు కట్టడాలు ఇక్కడ ఉన్నాయి!”
2 యేసు అతడితో “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు గదా! ఇక్కడ పడద్రోయబడకుండా ఏ రాయి మరో రాయిమీద నిలవదు” అంటూ జవాబిచ్చాడు.
3 ఆయన దేవాలయానికి ఎదురుగా ఆలీవ్ కొండమీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు: 4 “అవి ఎప్పుడు జరుగుతాయి? అవన్నీ నెరవేరబోయే ముందు ఏ సూచన కలుగుతుంది? మాతో చెప్పు.”
5 అందుకు యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “మిమ్ములను ఎవరైనా మోసగించి తప్పుదారి పట్టించకుండా చూచుకోండి. 6 అనేకులు నా పేర వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలామందిని మోసగించి తప్పుదారి పట్టిస్తారు.
7 “మీరు యుద్ధ వార్తలూ యుద్ధ వదంతులూ వింటారు. అప్పుడు కంగారుపడకండి. అవి తప్పక జరగాలి గాని అంతం అప్పుడే రాదు. 8 జనంమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. కరువులు, అల్లరులు కూడా కలుగుతాయి. ఇవి ప్రథమ ప్రసవ వేదనల్లాంటివి మాత్రమే.
9 “మీరు జాగ్రత్తగా ఉండండి! ఎందుకంటే, వారు మిమ్ములను ఆలోచన సభలకు పట్టి ఇస్తారు. సమాజ కేంద్రాలలో మిమ్ములను కొట్టడం జరుగుతుంది. నాకోసం వారికి సాక్ష్యంగా మీరు ప్రాంతీయాధికారుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 10 అంతానికి ముందుగా శుభవార్త అన్ని జనాలకూ ప్రకటించడం జరగాలి. 11 వారు మిమ్ములను పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు ఏమి చెప్పాలా అని ముందుగా బెంబేలు పడకండి, పూర్వాలోచన చేయకండి. ఆ సమయంలో మీకు ఏ మాటలు ఇవ్వబడుతాయో అవే అనండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు గాని దేవుని పవిత్రాత్మే.
12 “సోదరుడు సోదరుణ్ణీ, తండ్రి తన సంతానాన్నీ మరణానికి పట్టి ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని చంపిస్తారు. 13 నా పేరు కారణంగా అందరూ మిమ్ములను ద్వేషిస్తారు. అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది.
14  “అయితే దానియేలుప్రవక్త చెప్పిన అసహ్యమైన వినాశకారి నిలబడకూడని స్థలంలో నిలుచుండడం మీరు చూచేటప్పుడు (చదివేవారు గ్రహిస్తారు గాక!) యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. 15 మిద్దెమీద ఉన్న వ్యక్తి తన ఇంటి నుంచి వస్తువేదైనా తీసుకువెళ్ళడానికి దిగి ఇంట్లో ప్రవేశించ కూడదు. 16 పొలంలో ఉన్న వ్యక్తి పైవస్త్రం తీసుకువెళ్ళడానికి వెనక్కు తిరగకూడదు. 17 అయ్యో! ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకూ బాలింతలకూ ఎంతో కష్టం కలుగుతుంది! 18 మీరు పారిపోయేది చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. 19 ఎందుకంటే, ఆ రోజుల్లో బాధ వస్తుంది. అలాంటిది దేవుడు సృష్టిని సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఆ తరువాత మరెన్నటికీ రాదు. 20 ప్రభువు ఆ రోజులను తక్కువ చేయకపోతే శరీరం ఉన్న ఎవరూ తప్పించుకొనేవారు కాదు. కానీ ఎన్నికైనవారి కోసం, అంటే తాను ఎన్నుకొన్నవారి కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేశాడు.
21 ఆ కాలంలో ఎవరైనా మీతో ‘ఇడుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఇడుగో అక్కడ ఉన్నాడు!’ అంటే నమ్మకండి. 22 ఎందుకంటే కపట క్రీస్తులూ కపట ప్రవక్తలూ వస్తారు. సాధ్యమైతే, దేవుడు ఎన్నుకొన్నవారిని కూడా మోసగించి తప్పుదారి పట్టించడానికి సూచనలూ అద్భుతాలూ ప్రదర్శిస్తారు. 23 జాగ్రత్తగా ఉండండి! నేను మీతో అన్ని విషయాలు ముందుగానే చెప్పాను సుమా!
24 “ఆ రోజుల్లో ఆ బాధకాలం అయిన తరువాత సూర్య మండలాన్ని చీకటి కమ్ముతుంది. చంద్రబింబం కాంతి ఇవ్వదు. 25 ఆకాశంనుంచి చుక్కలు రాలుతాయి. ఆకాశంలోని శక్తులు కంపించిపోతాయి. 26 అప్పుడు మానవ పుత్రుడు మేఘాలలో మహా బలప్రభావాలతో, మహిమాప్రకాశంతో రావడం వారు చూస్తారు. 27 అప్పుడాయన తన దేవదూతలను పంపి నలుదిక్కుల నుంచి, భూమి కొనల నుంచి ఆకాశం కొనల వరకు, తాను ఎన్నుకొన్నవారిని సమకూరుస్తాడు.
28 “అంజూర చెట్టును చూచి ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు లేతగా తయారై ఆకులు పట్టినప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీకు తెలుసు. 29 అలాగే ఈ సంగతులు జరుగుతూ ఉండడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలోనే, తలుపు దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 30 మీతో నేను ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగేవరకు ఈ జాతి గతించదు. 31 ఆకాశం, భూమి గతిస్తాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
32 “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో ఏ మనిషికీ తెలియదు. పరలోకంలోని దేవదూతలకూ తెలియదు. కుమారునికి కూడా తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రత్తగా ఉండండి! మెళకువగా ఉండండి! ప్రార్థన చేస్తూ ఉండండి! ఎందుకంటే ఆ కాలమెప్పుడు వస్తుందో మీకు తెలియదు.
34 “ఇది ఎలా ఉంటుందంటే, ఒక మనిషి వేరే దేశానికి వెళ్ళిపోబోతూ తన ఇంటిని విడిచి తన దాసులకు అధికారమిచ్చి ఒక్కొక్కనికి ఒక్కొక్క పని నియమించి, ద్వారపాలకుణ్ణి ఎప్పుడూ మెళకువగా ఉండాలని ఆజ్ఞాపించాడు. 35 అలాగే మీరూ మెళకువగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో – అది సాయంకాల సమయమో, మధ్యరాత్రి వేళో, కోడి కూసే జామో, తెల్లవారేటప్పుడో మీకు తెలియదు. 36 ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త! 37 నేను మీకు చెపుతున్నది అందరికీ చెపుతున్నాను – మెళకువగా ఉండండి!”