12
1 అప్పుడాయన వారితో ఉదాహరణలలో చెప్పసాగాడు: “ఒక మనిషి ద్రాక్షతోట నాటాడు. దాని చుట్టూ గోడ కట్టి ద్రాక్ష గానుగ తొట్టి కోసం అందులో గుంట తొలిపించి కావలి గోపురం కట్టించాడు. అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూర దేశానికి వెళ్ళాడు. 2 కోతకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పంటలో కొంత రైతుల దగ్గరనుంచి తెమ్మని వారి దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు. 3 అయితే వారు అతణ్ణి పట్టుకొని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. 4 అతడు మళ్ళీ మరో దాసుణ్ణి వారిదగ్గరకు పంపాడు. వారు అతని వైపు రాళ్ళు రువ్వి అతని నెత్తి గాయపరచి అతణ్ణి అవమానించి పంపివేశారు. 5 అతడు ఇంకొకణ్ణి పంపాడు. అతణ్ణి వారు చంపారు. ఇంకా అనేకులను పంపాడు. వారు కొందరిని కొట్టారు, కొందరిని చంపారు.
6 “ఇంకా అతనికి తన ప్రియ కుమారుడొక్కడే మిగిలాడు. ‘వారు నా కుమారుణ్ణి గౌరవిస్తారు’ అని చెప్పి చివరిగా అతణ్ణి వారిదగ్గరకు పంపాడు. 7 కానీ ఆ రైతులు తమలో ఇలా చెప్పుకొన్నారు: ‘వారసుడు వీడే! వీణ్ణి చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది!’ 8 వారతణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేశారు.
9 “అందుచేత ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను చంపి ద్రాక్షతోటను వేరే వారి చేతికిస్తాడు. 10 మీరు ఈ లేఖనం చదవలేదా? – కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది. 11 అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.”
12 వారు తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ ఆయన చెప్పాడని గ్రహించి ఆయనను పట్టుకోవాలని చూశారు గాని జన సమూహానికి భయపడ్డారు. అప్పుడు వారు ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
13 ఆయనను మాటలలో చిక్కించుకోవడానికి వారు పరిసయ్యులలో, హేరోదు పక్షంవారిలో కొందరిని ఆయన దగ్గరికి పంపారు. 14 వారు వచ్చి ఆయనతో ఇలా అన్నారు: “బోధకుడా! మీరు యథార్థవంతులనీ ఎవరినీ లెక్క చేయరనీ మాకు తెలుసు. మీరు మనుషులను పక్షపాతంతో చూడకుండా దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తారు. సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా, కాదా? 15 మనం చెల్లించాలా? చెల్లించకూడదా?”
అయితే వారి కపట బుద్ధి తెలిసి ఆయన వారితో “నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తెచ్చి నాకు చూపెట్టండి” అన్నాడు.
16 వారు నాణెం తెచ్చినప్పుడు “ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు.
వారాయనతో “సీజర్‌వి” అన్నారు.
17 యేసు వారికి జవాబిస్తూ “సీజర్‌వి సీజర్‌కూ దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.
ఆయనంటే వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
18 అప్పుడు సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. (చనిపోయినవారు సజీవంగా లేవరని వీరు చెప్పేవారు.) వారాయనను ఇలా ప్రశ్నించారు: 19 “బోధకుడా, మోషే మనకోసం రాసినది ఇది – ఒక మనిషి సోదరుడు తన భార్యను సజీవంగా విడిచి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతడి భార్యను పెళ్ళి చేసుకొని అతడి వంశాన్ని నిలబెట్టాలి. 20 ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా చనిపోయాడు. 21 రెండోవాడు ఆమెను పెళ్ళాడాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడోవాడి సంగతి కూడా అంతే. 22 ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళాడి సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది. 23 చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు వారిలో ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమె ఆ ఏడుగురికీ భార్యగా ఉంది గదా?”
24 వారికి జవాబిస్తూ యేసు అన్నాడు “లేఖనాలూ దేవుని బలప్రభావాలూ మీకు తెలియదు. ఈ కారణంచేతే గదా మీరు పొరబడుతున్నారు! 25 చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు పెండ్లి చేసుకోరు, పెండ్లికియ్యరు. ఇందులో వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు. 26 చనిపోయినవారు సజీవంగా లేచే విషయమైతే – మోషే వ్రాసిన గ్రంథంలో పొదను గురించిన భాగం మీరు చదవలేదా? దేవుడు అతనితో చెప్పినది ఏమంటే ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’. 27 ఆయన చనిపోయినవారి దేవుడు కాడు గాని జీవిస్తూ ఉన్న వారి దేవుడు. మీరు అధికంగా పొరబడుతున్నారు.”
28 ఈలోగా ధర్మశాస్త్ర పండితులలో ఒకడు వచ్చి వారు వాదించడం విన్నాడు. యేసు వారికి బాగా జవాబిచ్చాడని తెలిసి అతడు ఆయనను చూచి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది?” అని అడిగాడు.
29 యేసు అతడికి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఇది: ‘ఇస్రాయేల్ ప్రజలారా, వినండి. ప్రభువు మన దేవుడు, ప్రభువు ఒక్కడే. 30 హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా, బలమంతటితో మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. 31 రెండోది, దానిలాంటిది ఇది: ‘మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’. వీటికంటే గొప్ప ఆజ్ఞ మరేదీ లేదు” అని జవాబిచ్చాడు.
32 ఆ ధర్మశాస్త్ర పండితుడు ఆయనతో “ఉపదేశకా, మీరు బాగా చెప్పారు. దేవుడు ఒక్కడే అనీ ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పినది నిజమే. 33 హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బుద్ధి అంతటితో, బలం అంతటితో ఆయనను ప్రేమించడమూ మనలను ప్రేమించుకొన్నట్టే పొరుగువారిని ప్రేమించడమూ అన్ని హోమాలకంటే, బలులకంటే అధికం” అన్నాడు.
34 అతడు జ్ఞానంతో జవాబివ్వడం చూచి యేసు అతడితో “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు.
ఆ తరువాత ఆయనను ఏ ప్రశ్నా అడగడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది.
35 యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ “అభిషిక్తుడు దావీదు కుమారుడు అని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు? 36 దావీదు తానే దేవుని పవిత్రాత్మ మూలంగా అన్నదేమంటే, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు – నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచేవరకు నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.’ 37 దావీదు తానే ఆయనను ‘ప్రభువు’ అంటున్నాడు. అలాంటప్పుడు ఆయన అతనికెలా కుమారుడు అవుతాడు?” అన్నాడు.
జన సమూహం ఆయన ఉపదేశం ఎంతో సంతోషంతో వింటున్నారు.
38 ఆయన ఉపదేశంలో వారితో ఇంకా ఇలా అన్నాడు: “ధర్మశాస్త్ర పండితుల విషయం జాగ్రత్త! పొడుగాటి అంగీలు తొడుక్కొని తిరగడం, సంత వీధులలో వందనాలు అందుకోవడం, 39 సమాజ కేంద్రాలలో అగ్ర స్థానాలు, విందులలో ముఖ్య స్థలాలు వారికిష్టం. 40 విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగివేసేవారు కూడా వీరే. వారు నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వారు మరీ కఠినమైన శిక్షావిధికి గురి అవుతారు.”
41 యేసు దేవాలయంలో కానుక పెట్టెకు ఎదురుగా కూర్చుని జన సమూహం ఆ పెట్టెలో డబ్బు వేయడం చూస్తూ ఉన్నాడు. ధనవంతులు అనేకులు పెద్ద మొత్తంలో డబ్బు వేశారు. 42 అప్పుడు ఒక బీద విధవరాలు వచ్చి రెండు పైసలు అందులో వేసింది.
43 ఆయన తన శిష్యులను దగ్గరకు పిలిచి “మీతో ఖచ్చితంగా అంటున్నాను, కానుక పెట్టెలో డబ్బు వేసినవారందరి కంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. 44 ఎలాగంటే, వారంతా తమ అతి సమృద్ధిలోనుంచి కొంత వేశారు గాని ఈమె తన లేమిలోనుంచి తనకున్నదంతా, తన బ్రతుకుదెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.