11
1 వారు జెరుసలం దరిదాపులకు వచ్చి ఆలీవ్‌ కొండమీద ఉన్న బేత్‌ఫగే, బేతనీ చేరుకొన్నారు. అప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ ఆయన వారితో ఇలా అన్నాడు: 2 “మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిదపిల్ల ఒకటి మీకు కనబడుతుంది. ఇదివరకు దానిమీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకురండి. 3 ‘మీరెందుకిలా చేస్తున్నారు?’ అని ఎవరైనా మీతో అంటే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దానిని ఇక్కడికి పంపిస్తాడు.”
4 వారు వెళ్ళి వీధిలో ఒక గుమ్మం దగ్గర కట్టి ఉన్న ఆ గాడిద పిల్లను చూశారు, దానిని విప్పారు. 5 అక్కడ నిలుచున్న కొందరు వారితో “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అన్నారు. 6 యేసు చెప్పమన్నట్టే శిష్యులు వారితో చెప్పినప్పుడు వారు వారిని వెళ్ళనిచ్చారు. 7 వారు గాడిద పిల్లను యేసు దగ్గరికి తోలుకువచ్చి దానిమీద తమ పైబట్టలు వేశారు. ఆయన దానిమీద కూర్చున్నాడు.
8 అనేకులు తమ పైబట్టలు దారిన పరిచారు. మరి కొందరు చెట్ల కొమ్మలను నరికివేసి దారిన పరిచారు. 9 ముందు నడుస్తూ ఉన్నవారూ వెనుక వస్తూ ఉన్నవారూ కేకలు వేస్తూ “జయం! ‘ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి!’ 10 ప్రభువు పేరట వచ్చే మన పూర్వీకుడైన దావీదు రాజ్యం ధన్యం! పరమ స్థలాల్లో జయం!” అన్నారు.
11 యేసు జెరుసలంలో, దేవాలయంలో ప్రవేశించాడు, చుట్టూరా అన్నిటినీ చూశాడు. అప్పటికే సాయంకాలం అయిపోయినందుచేత ఆయన తన పన్నెండు మందితో బేతనీకు వెళ్ళాడు. 12 మరుసటి రోజున బేతనీనుంచి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూర చెట్టు ఒకటి ఆయనకు కనిపించింది. దానికేమైనా పండ్లు ఉంటాయేమో అని ఆయన దానివైపు వెళ్ళాడు గాని దానిదగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. అది అంజూర పండ్ల కాలం కాదు. 14 ఆయన దానితో ఇకనుంచి తినడానికి పండ్లు నీమీద ఎవరికీ ఎన్నడూ దొరకకపోతాయి గాక!” అన్నాడు. అది ఆయన శిష్యులు విన్నారు.
15 వారు జెరుసలం వచ్చినప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అమ్మేవారినీ కొనేవారినీ వెళ్ళగొట్టసాగాడు. డబ్బు మారకం వ్యాపారుల బల్లలనూ గువ్వల వర్తకుల పీటలనూ పడద్రోశాడు. 16 దేవాలయంలో గుండా ఎవరినీ సామానేమీ మోసుకు వెళ్ళనివ్వలేదు. 17 ఆయన వారికి ఉపదేశిస్తూ “నా ఆలయం జనాలన్నిటికీ ప్రార్థన ఆలయం అంటారని రాసి ఉంది గదా. మీరైతే దానిని దోపిడీదొంగల గుహగా చేశారు” అన్నాడు.
18 అది విని ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయనను ఎలా రూపుమాపాలా అని చూశారు. ఆయనంటే వారికి భయం. ఎందుకంటే, జన సమూహమంతా ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడేవారు.
19 సాయంకాలం అయినప్పుడు ఆయన నగరంనుంచి వెళ్ళాడు. 20 ప్రొద్దున వారు దారిన వస్తూ ఉంటే ఆ అంజూర చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం చూశారు.
21 పేతురు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనతో “గురువర్యా, ఇదిగో, నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
22 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు: “దేవునిమీద నమ్మకం ఉంచండి. 23 మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఎవరైనా సరే ఈ పర్వతంతో ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే తాను చెప్పినదేదైనా అతనికి జరిగి తీరుతుంది. 24 అందుచేత మీతో అంటున్నాను, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరుకుతాయని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. 25 అయితే మీరు నిలిచి ప్రార్థన చేసేటప్పుడెల్లా, పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించేలా మీకు ఎవరితోనైనా వ్యతిరేకమైన దేదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి. 26 మీరు క్షమించకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించడు.”
27 వారు మళ్ళీ జెరుసలం చేరారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉంటే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ ఆయన దగ్గరికి వచ్చి, 28 ఆయనతో “నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ క్రియలు చేయడానికి ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అన్నారు.
29 యేసు జవాబిస్తూ వారితో అన్నాడు “నేనూ మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. దీనికి జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెపుతాను. 30 యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి ఎక్కడనుంచి? పరలోకం నుంచా? మనుషుల నుంచా? నాకు జవాబివ్వండి!”
31 వారు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు: “ఒకవేళ అది పరలోకంనుంచి అని మనం చెపితే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతణ్ణి నమ్మలేదు?’ అంటాడు గదా! 32 ‘మనుషుల నుంచి’ అందామా–.” అయితే వారికి జనమంటే భయం. ఎందుకంటే యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ ఎంచేవారు. 33 కనుక వారు యేసుకు “మాకు తెలియదు” అని జవాబిచ్చారు.
వారికి జవాబిస్తూ యేసు “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.