10
1  ఆయన అక్కడ నుంచి బయలుదేరి యూదయ ప్రదేశంలో యొర్దాను నది అవతలికి వెళ్ళాడు. మరో సారి జనం గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు. తన అలవాటు ప్రకారం ఆయన వారికి మళ్ళీ ఉపదేశమిచ్చాడు.
2 పరిసయ్యులు కొందరు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయనను ఇలా అడిగారు: “పురుషుడు తన భార్యతో తెగతెంపులు చేసుకోవడం ధర్మమా?”
3 ఆయన “మోషే మీకిచ్చిన ఆజ్ఞ ఏమిటి?” అని వారికి జవాబిచ్చాడు.
4 “విడాకులు రాయించి ఆమెతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతించాడు” అని వారు చెప్పారు.
5 అందుకు యేసు వారికి జవాబిచ్చాడు “బండబారిపోయిన మీ హృదయాలను బట్టి అతడు ఆ ఆదేశం మీకు వ్రాశాడు. 6 కానీ సృష్టి ఆరంభంనుంచి దేవుడు ‘వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు’; 7 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. 8 వారిద్దరూ ఒకే శరీరమవుతారు’. కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాదు గాని ఒకే శరీరంగా ఉన్నారు. 9 కనుక దేవుడు ఏకంగా చేసినదాన్ని మనిషి వేరు చేయకూడదు.”
10 ఇంట్లో ఉన్నప్పుడు ఆయన శిష్యులు మరో సారి ఈ సంగతి గురించి ఆయనను అడిగారు. 11 ఆయన “భార్యతో తెగతెంపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడేవాడెవడైనా ఆమెకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నాడు. 12 అలాగే స్త్రీ తన భర్తతో తెగతెంపులు చేసుకొని మరొకణ్ణి పెండ్లాడితే ఆమె వ్యభిచారం చేస్తున్నది” అని వారితో అన్నాడు.
13 ఆయన చిన్నపిల్లల మీద చేతులుంచాలని కొందరు వారిని తీసుకువచ్చారు గాని శిష్యులు వారిని తీసుకు వచ్చినవారిని మందలించారు. 14 అది చూచి యేసు చాలా చికాకు చెంది శిష్యులతో ఇలా అన్నాడు: “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆటంక పరచవద్దు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. 15 మీతో ఖచ్చితంగా అంటున్నాను, చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారెవరైనా సరే అందులో ఎన్నడూ ప్రవేశించరు.”
16 అప్పుడు ఆ చిన్నవారిని చేతులలోకి తీసుకొని వారిమీద చేతులుంచి వారిని దీవించాడు.
17 ఆయన దారిలో బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక మనిషి పరుగెత్తి వచ్చి ఆయన ముందు మోకరించి “మంచి బోధకుడా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.
18 అతడితో యేసు “నన్ను మంచివాడు అంటూ ఎందుకు సంబోధిస్తున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఇంకెవరూ లేరు. 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు – ‘వ్యభిచారం చేయకూడదు’, ‘హత్య చేయకూడదు’, ‘దొంగతనం చేయకూడదు’, ‘అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు’, ‘వంచించ కూడదు’, ‘తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.
20 అతడు ఆయనతో “బోధకుడా, చిన్నప్పటి నుంచి వీటన్నిటినీ పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
21 అతణ్ణి చూస్తూ అతడిపట్ల యేసు ప్రేమభావం కలిగి అతడితో ఇలా అన్నాడు: “నీకు ఒకటి కొదువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. ఆ తరువాత సిలువ నెత్తుకొని వచ్చి నన్ను అనుసరించు.”
22 అతడు గొప్ప ఆస్తిపరుడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని నొచ్చుకొంటూ వెళ్ళిపోయాడు.
23 యేసు చుట్టూరా చూచి తన శిష్యులతో “ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టతరం!” అన్నాడు.
24 ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే యేసు వారితో మళ్ళీ ఇలా అన్నాడు: “పిల్లలారా, ఆస్తిమీద నమ్మకం ఉంచినవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టం! 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో గుండా వెళ్ళడమే సులభం!”
26 వారింకా అధికంగా ఆశ్చర్యపడి తమతో తాము “అలాగైతే ఎవరు మోక్షం పొందగలరు?” అన్నారు.
27 యేసు వారివైపు చూస్తూ “మనుషులకు ఇది అసాధ్యం గాని దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
28 పేతురు ఆయనతో “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా” అని చెప్పసాగాడు.
29 అందుకు యేసు “మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఎవరైనా సరే నాకోసం, శుభవార్తకోసం ఇంటిని గానీ అన్నదమ్ములను గానీ అక్కచెల్లెళ్ళను గానీ తల్లిని గానీ తండ్రిని గానీ భార్యను గానీ పిల్లలను గానీ భూములను గానీ వదిలివేస్తే 30 ఆ వ్యక్తికి ఇప్పుడు ఇహంలో ఇండ్లూ అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ తల్లులూ పిల్లలూ భూములూ హింసలతోపాటు నూరు రెట్లు దొరకక తప్పదు. వచ్చే యుగంలో అలాంటి వ్యక్తికి శాశ్వత జీవం ఉంటుంది. 31 అయితే మొదటివారు చాలామంది చివరివారవుతారు, చివరివారు చాలామంది మొదటివారు అవుతారు అన్నాడు.
32 వారు జెరుసలంకు ప్రయాణమై దారిన వెళ్తూ ఉన్నారు. వారికి ముందు యేసు నడుస్తూ ఉన్నాడు. వారికి ఆశ్చర్యం వేసింది. ఆయనను అనుసరిస్తూ ఉన్నవారు భయపడుతూ ఉన్నారు. ఆయన ఆ పన్నెండు మందిని ప్రక్కకు తీసుకువెళ్ళి తనకు జరగబోయేవాటిని మరో సారి వారికి తెలియజేశాడు, 33 “ఇదిగో వినండి, మనం జెరుసలం వెళ్ళిపోతున్నాం. అక్కడ మానవ పుత్రుణ్ణి ప్రధాన యాజులకూ ధర్మశాస్త్ర పండితులకూ పట్టి ఇవ్వడం జరుగుతుంది. వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు. 34 ఆ యూదేతరులు ఆయనను వెక్కిరించి కొరడా దెబ్బలు కొడతారు, ఆయన మీద ఉమ్మివేసి చంపుతారు. మూడో రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు.”
35 అప్పుడు జెబెదయి కొడుకులైన యాకోబు, యోహానులు ఆయన దగ్గరికి వచ్చి “గురువర్యా, మేము నిన్ను ఏది అడిగితే అది మాకు చేయాలని మా ఆశ” అన్నారు.
36 వారితో ఆయన “మీకు నేనేమి చేయాలనుకొంటారు?” అన్నాడు.
37 వారు “నీ మహిమలో మమ్మల్ని ఒకరిని నీ కుడి ప్రక్కన, ఒకరిని ఎడమ ప్రక్కన కూచుని ఉండేలా దయ చెయ్యి” అని ఆయనతో చెప్పారు.
38 అందుకు యేసు “మీరు అడిగేదేమిటో మీకు తెలియదు. నేను త్రాగే గిన్నెలోది త్రాగడానికీ, నేను పొందే బాప్తిసం పొందడానికీ మీకు చాలినంత బలం ఉన్నదా?” అని వారితో అన్నాడు.
39 వారాయనతో “మాకు చాలినంతబలం ఉంది” అన్నారు.
యేసు వారితో “నేను త్రాగే గిన్నెలోది మీరూ త్రాగుతారు, నేను పొందే బాప్తిసం మీరూ పొందుతారు, నిజమే. 40 కానీ నాకు కుడి ఎడమల ప్రక్కల కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. ఆ స్థానాలు ఎవరికోసం సిద్ధం చేయబడ్డాయో వారికి అవి దొరుకుతాయి” అన్నాడు.
41 ఇది విని తక్కిన పదిమంది శిష్యులకు యాకోబు యోహానుల మీద చాలా చిరాకు కలిగింది. 42 అయితే యేసు వారిని తన దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు: “ఇతర ప్రజలపై అధికారులుగా ఎంచబడ్డవారు వారిమీద పెత్తనం చెలాయిస్తారు, వారి ప్రముఖులు వారిమీద అధికారం ప్రయోగిస్తారు. 43 మీ విషయంలో మాత్రం అలా కాదు. మీలో ప్రముఖుడు కావాలని ఇష్టమున్నవాడు మీకు సేవకుడై ఉండాలి. 44 మీలో ప్రధానుడు కావాలని ఇష్టపడేవాడు అందరికీ దాసుడై ఉండాలి. 45 ఎందుకంటే, మానవ పుత్రుడు సహా తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికే వచ్చాడు. ఇదీ గాక, అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధార పోయడానికి వచ్చాడు.”
46  వారు యెరికో చేరారు, యెరికోనుంచి తన శిష్యులతో, పెద్ద జన సమూహంతో బయలుదేరుతూ ఉంటే ఒక గుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండి బిచ్చమెత్తుతున్నాడు. అతడు తీమయి కొడుకు బర్‌తీమయి. 47 వస్తున్నది నజరేతువాడైన యేసు అని విని అతడు “యేసూ! దావీదు కుమారా! నామీద దయ చూపండి!” అని కేకలు పెట్టసాగాడు.
48 ఊరుకొమ్మని అనేకులు అతణ్ణి గద్దించారు గాని అతడు “దావీదు కుమారా! నామీద దయ చూపండి” అంటూ మరీ ఎక్కువగా కేకలు పెట్టాడు.
49 యేసు ఆగి “అతణ్ణి పిలవండి” అని ఆదేశించాడు. వారా గుడ్డివాణ్ణి పిలిచి “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు.
50 అతడు తన పైబట్ట అవతల పారవేసి గబాలున లేచి యేసుదగ్గరికి వచ్చాడు. 51 అందుకు యేసు “నీకోసం నన్నేమి చెయ్యమంటావు?” అని అతణ్ణి అడిగాడు.
గుడ్డివాడు ఆయనతో “బోధకుడా, నాకు చూపు కలిగేలా చేయండి” అన్నాడు.
52 యేసు అతడితో “నీవు వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. వెంటనే అతడికి చూపు వచ్చింది. అతడు దారిన యేసు వెంట వెళ్ళాడు.