9
1 ✝ఆయన వారితో ఇంకా అన్నాడు “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం బలప్రభావాలతో రావడం చూచేవరకు చనిపోరు.”2 ✝ఆరు రోజుల తరువాత యేసు పేతురునూ యాకోబునూ యోహానునూ వెంటబెట్టుకొని ఎత్తయిన ఒక పర్వతంమీదికి ఏకాంతంగా వెళ్ళాడు. వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది. 3 ఆయన వస్త్రాలు హిమమంతగా, భూమిమీద ఎవ్వరూ చలువ చేయలేనంతగా అతి తెల్లగా మారి తళతళ మెరిశాయి. 4 అప్పుడు ఏలీయా మోషేతో కూడా వారికి కనబడ్డారు. వారు యేసుతో మాట్లాడుతున్నారు.
5 అప్పుడు అందుకు పేతురు “గురువర్యా, మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలు వేయనియ్యి – ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అని యేసుతో అన్నాడు. 6 ✽ ఎందుకంటే ఏమి చెప్పాలో అతడికి పాలుపోలేదు. ఎందుకంటే శిష్యులకు ఎంతో భయం కలిగింది.
7 అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. మేఘంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఆయన మాట వినండి.”
8 తటాలున వారు చుట్టూ చూచేటప్పటికి తమతో యేసు తప్ప ఇంకెవ్వరూ కనబడలేదు.
9 వారు పర్వతం దిగి వస్తూ ఉన్నప్పుడు, మానవ పుత్రుడు చనిపోయినవారిలో నుంచి తిరిగి సజీవంగా లేచేవరకు వారు చూచినవి ఎవ్వరికీ చెప్పకూడదని ఆయన వారికి ఆదేశించాడు. 10 వారు ఆ విషయం బయటికి పొక్కనివ్వకుండా చనిపోయినవారిలో నుంచి లేవడం అంటే ఏమిటో అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొన్నారు. 11 అప్పుడు వారు ఆయనను చూచి “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని అడిగారు.
12 ✽ఆయన వారికి జవాబిస్తూ “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ పూర్వస్థితికి తెస్తాడు, నిజమే. అయితే మానవపుత్రుడు అనేక బాధలు అనుభవించి తృణీకారానికి గురి అవుతాడని ఎందుకు రాసి ఉన్నట్టు? 13 కానీ మీతో నేను చెప్పేదేమిటంటే, అతణ్ణి గురించి రాసి ఉన్నట్టు ఏలీయా వచ్చాడు. అతణ్ణి తమకిష్టం వచ్చినట్టు వారు చేశారు” అన్నాడు.
14 ✽ శిష్యుల దగ్గరకు ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జన సమూహం ఉండడం, వారితో కొందరు ధర్మశాస్త్ర పండితులు వాదించడం చూశాడు. 15 జన సమూహమంతా ఆయనను చూచిన వెంటనే అధికంగా ఆశ్చర్యపడిపోతూ✽ ఆయనదగ్గరకు పరుగెత్తివచ్చి ఆయనకు నమస్కరించారు.
16 ✽ఆయన “వారితో దేన్ని గురించి వాదిస్తున్నారు?” అని ధర్మశాస్త్ర పండితులనడిగాడు.
17 ✽జన సమూహంలో ఒకడు ఆయనకిలా జవాబు చెప్పాడు: “బోధకుడా, తమరిదగ్గరికి నా కొడుకును తీసుకువచ్చాను. అతడు దయ్యం పట్టి మూగవాడయ్యాడు. 18 అది అతణ్ణి పూనినప్పుడెల్లా అతణ్ణి కింద పడేస్తుంది. అతని నోటివెంట నురుగు కారుతుంది. పండ్లు పటపటా కొరుక్కొంటాడు. ఒళ్ళంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని తమరి శిష్యులతో మాట్లాడాను గాని వారు అలా చేయలేకపోయారు.”
19 ఆయన అతనికిలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను! ఎందాకా మిమ్ములను సహించాలి! అతణ్ణి నా దగ్గరకు తీసుకురండి.”
20 వారతణ్ణి ఆయనదగ్గరికి తీసుకువచ్చారు. అతడు ఆయనను చూచినవెంటనే ఆ దయ్యం అతణ్ణి విలవిల లాడించింది. అతడు నేలమీద పడి నురుగు కక్కుతూ సుడులు తిరిగాడు.
21 ఆయన “ఇతనికి ఇది ఎంత కాలంనుంచి ఉంది?” అని అతడి తండ్రిని అడిగాడు. అతడు అన్నాడు “చిన్నప్పటి నుంచీ ఉందండి. 22 ✽పదేపదే అది అతణ్ణి నిప్పులో, నీళ్ళలో పడేసి నాశనం చేయజూసింది. తమరు ఏమైనా చేయగలిగితే మామీద జాలి చూపి సహాయం చెయ్యండి.”
23 ✽యేసు అతడితో “నీవు నమ్మగలిగితే – దేవుణ్ణి నమ్మే వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
24 ✽వెంటనే ఆ పిల్లవాడి తండ్రి కన్నీరు కారుస్తూ బిగ్గరగా అన్నాడు “నేను నమ్ముతున్నాను. నా అపనమ్మకం విషయంలో సహాయం చెయ్యండి.”
25 ✽అక్కడికి జనం పరుగెత్తి రావడం చూచి యేసు ఆ మలిన పిశాచాన్ని గద్దించి దానితో “మూగ, చెవిటి దయ్యమా! అతనిలో నుంచి బయటికి వచ్చి ఇంకెన్నడూ అతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.
26 అది పెడ బొబ్బలు పెట్టి ఆ పిల్లవాణ్ణి అధికంగా విలవిలలాడించి అతనిలోనుంచి బయటికి వచ్చింది. అప్పుడతడు చచ్చినవాడిలాగా అయ్యాడు, గనుక “వాడు చనిపోయాడు” అని చాలామంది చెప్పుకొన్నారు. 27 అయితే యేసు అతడి చేయి పట్టుకొని అతణ్ణి లేవనెత్తాడు. అతడు లేచి నిలబడ్డాడు.
28 ఆయన ఇంట్లోకి వచ్చిన తరువాత ఆయన శిష్యులు ఒంటరిగా ఆయనను ఇలా అడిగారు: “మేము దానినెందుకు బయటికి వెళ్ళగొట్టలేకపోయాం?”
29 ఆయన వారితో “అలాంటిది ప్రార్థనవల్ల, ఉపవాసంవల్ల తప్ప మరి దేనివల్లా బయటికి రాదు” అన్నాడు.
30 ✽అక్కడనుంచి వారు బయలుదేరి గలలీ మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికైనా తెలియడం ఆయనకిష్టం లేదు. 31 ఎందుకంటే, తన శిష్యులకు ఉపదేశిస్తూ వారితో “మానవ పుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరగబోతుంది. వారాయనను చంపుతారు. ఆయన చంపబడిన తరువాత మూడు రోజులకు ఆయన సజీవంగా లేస్తాడు” అన్నాడు.
32 ✽ వారైతే ఆ మాట గ్రహించలేదు. ఆయనను అడగడానికి వారికి భయంగా ఉంది కూడా.
33 ఆయన కపెర్‌నహూం చేరారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన “దారిలో మీరు దేన్ని గురించి వాదిస్తున్నారు?” అని వారినడిగాడు.
34 ✝✽వారు ఊరుకొన్నారు. ఎందుకంటే, దారిన వారు తమలో ఎవరు గొప్ప అని వాదించారు. 35 ✝ఆయన కూర్చుని ఆ పన్నెండుమందిని పిలిచి “ఎవడైనా ప్రముఖుడుగా ఉండాలి అనుకొంటే అతడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
36 అప్పుడాయన చిన్న బిడ్డణ్ణి తీసుకొని వారి మధ్య నిలబెట్టాడు, వాణ్ణి తన చేతుల్లోకి తీసుకొని వారితో ఇలా అన్నాడు: 37 ✝“ఇలాంటి చిన్నవారిలో ఒకణ్ణి నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారు. నన్ను స్వీకరించేవారెవరైనా నన్ను కాదు గాని నన్ను పంపినవాణ్ణి స్వీకరిస్తున్నారు.”
38 ✽యోహాను ఆయనతో “గురువర్యా, మనల్ని అనుసరించని వాడొకడు నీ పేర దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనల్ని అనుసరించేవాడు కాడు గనక అతణ్ణి అడ్డగించాం” అన్నాడు.
39 అయితే యేసు అన్నాడు “అతణ్ణి అడ్డగించకండి. నా పేర అద్భుతం చేసేవాడెవడూ తేలికగా నన్ను గురించి చెడు మాట చెప్పలేడు గదా. 40 ✽మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షంవాడే. 41 ✝మీతో ఖచ్చితంగా అంటున్నాను, మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేర మీకు త్రాగడానికి గిన్నెడు నీళ్ళు ఇస్తే అతడు తన బహుమతిని ఎంత మాత్రమూ పోగొట్టుకోడు. 42 ✝కానీ నన్ను నమ్ముకొన్న ఇలాంటి ఒక చిన్న బిడ్డడికి ఎవరైనా ఆటంకంగా ఉన్నారా, అలా ఉండడం కంటే అతడి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టి అతణ్ణి సముద్రంలో పడవేయబడడమే అతనికి మేలు.
43 “ఒకవేళ మీ చెయ్యి మీకు ఆటంకంగా ఉందనుకోండి. అలాంటప్పుడు దానిని నరికివేయండి! రెండు చేతులుండి నరకంలోని ఆరని అగ్నిలోకి వెళ్ళిపోవడం కంటే చెయ్యి లేకుండా జీవంలో ప్రవేశించడం మీకు మేలు. 44 నరకంలో వాళ్ళ పురుగు చావదు, అగ్ని ఆరదు. 45 ఒకవేళ మీ పాదం మీకు ఆటంకంగా ఉందనుకోండి. అలాంటప్పుడు దానిని నరికివేయండి! రెండు పాదాలుండి నరకంలో ఆరని అగ్నిలో పడవేయబడడం కంటే పాదం లేకుండా జీవంలో ప్రవేశించడం మీకు మేలు. 46 నరకంలో వాళ్ళ పురుగు చావదు, అగ్ని ఆరదు. 47 అలాగే మీ కన్ను మీకు ఆటంకంగా ఉంటే దానిని పీకి పారవెయ్యి! రెండు కండ్లుండి నరకంలో పడవేయబడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. 48 ✽ నరకంలో వాళ్ళ పురుగు చావదు. అగ్ని ఆరదు. 49 ✽ప్రతి ఒక్కరూ మంటలతో ఉప్పన చేయబడుతారు. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది.
50 ✽ “ఉప్పు మంచిదే గాని ఒకవేళ ఉప్పు దాని ఉప్పదనాన్ని కోల్పోతే మీరు దానికి ఉప్పదనం కలిగించడం ఎలాగా? మీలో ఉప్పదనం కలిగి ఉండండి. ఒకరితో ఒకరు శాంతితో ఉండండి.”