8
1 ఆ రోజుల్లో చాలా పెద్ద జన సమూహం గుమికూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోవడం చేత యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు: 2 “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తున్నది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా. 3 ఒకవేళ నేను వారిని ఆకలితోనే వారి ఇండ్లకు పంపివేస్తే దారిలో శోషపోతారు. కొందరు చాలా దూరం నుంచి వచ్చారు.”
4 అందుకు ఆయన శిష్యులు “ఈ నిర్జన ప్రాంతంలో వీరు తృప్తిగా తినేలా ఎవరు రొట్టెలు పెట్టగలరు?” అని జవాబిచ్చారు.
5 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని ఆయన వారినడిగాడు. వారు “ఏడు” అన్నారు.
6 జనసమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు. అప్పుడా ఏడు రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి జనానికి వడ్డించాలని తన శిష్యులకు అందించాడు. వారు జన సమూహానికి వడ్డించారు. 7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఆయన వాటిని దీవించి ఇవి కూడా జనానికి వడ్డించాలని ఆదేశించాడు. 8 జనం తృప్తిగా తిన్నారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే ఏడు గంపలు నిండాయి. 9 తిన్న వారు సుమారు నాలుగు వేలమంది. ఆయన వారిని పంపివేసి, 10 వెంటనే తన శిష్యులతోపాటు పడవ ఎక్కి దల్మానుతా ప్రాంతానికి వెళ్ళాడు.
11 పరిసయ్యులు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకంనుంచి సూచనకోసం అద్భుతం ఒకటి చూపించమని కోరుతూ ఆయనతో తర్కించసాగారు. 12 దానికి ఆయన అంతరాత్మలో దీర్ఘంగా నిట్టూర్చి “ఈ తరంవారు సూచనకోసం అద్భుతం ఎందుకు కోరుతున్నారు? మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఈ తరంవారికి ఏ సూచనా ఇవ్వబడదు” అన్నాడు.
13 ఆయన వారిని విడిచి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు. 14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మరచిపోయారు. వారి దగ్గర పడవలో ఒకే రొట్టె తప్ప మరెక్కువ ఏమీ లేదు. 15 ఆయన వారిని హెచ్చరిస్తూ “మీరు శ్రద్ధ కలిగి ఉండండి – పరిసయ్యులకూ హేరోదురాజుకూ సంబంధించిన ‘పొంగజేసే పదార్థం’ గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.
16 వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ “మనదగ్గర రొట్టెలు లేవు గనుక ఇలా అన్నాడు” అని చెప్పుకొన్నారు.
17 అది తెలుసుకొని యేసు వారితో అన్నాడు “మీ దగ్గర రొట్టెలు లేవని ఎందుకు చర్చించుకొంటున్నారు? మీరింకా తెలుసుకోలేదా? గ్రహించలేదా? మీకింకా గుండె బండబారి పోయిందా? 18 కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు జ్ఞాపకం లేదా? – 19 ఆ అయిదు వేలమందికి నేను ఆ అయిదు రొట్టెలు విరిచి పంచిన సమయంలో మిగిలిన ముక్కలను ఎన్ని గంపల నిండ ఎత్తారు?”
వారాయనతో “పన్నెండు” అన్నారు.
20 “నేను నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు విరిచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని గంపల నిండా ఎత్తారు?” అన్నాడు.
వారాయనతో “ఏడు” అన్నారు.
21 ఆయన వారితో “మీకు అర్థం కాకపోవడమెలాగు?” అన్నాడు.
22 ఆయన బేత్‌సయిదా చేరుకొన్నప్పుడు కొందరు ఒక గుడ్డివాణ్ణి ఆయనదగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు. 23 ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి బయటికి తీసుకువెళ్ళాడు. అతడి కండ్లమీద ఉమ్మివేసి అతడి మీద చేతులుంచి “నీకేమైనా కనిపిస్తున్నదా?” అని అతణ్ణి అడిగాడు.
24 అతడు పైకి చూస్తూ “మనుషులు నడవడం నాకు కనిపిస్తున్నది. వారు చెట్లలాగా ఉన్నారు” అన్నాడు. 25 మరో సారి ఆయన అతడి కండ్లమీద చేతులుంచి పైకి చూడమన్నాడు. అప్పుడతడు పూర్తిగా నయమయ్యాడు. అందరూ తేటగా అతనికి కనిపించారు. 26 అతణ్ణి అతని ఇంటికి పంపిస్తూ ఆయన “ఊరిలోకి వెళ్ళకు, ఈ సంగతి ఊరిలో ఎవరికి చెప్పకు” అన్నాడు.
27 యేసు, ఆయన శిష్యులు కలిసి సీజరియ ఫిలిప్పీలో ఉన్న గ్రామాలకు బయలుదేరారు. దారిలో ఆయన తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “నేనెవరినని మనుషులు చెప్పుకొంటున్నారు?”
28 వారు “బాప్తిసమిచ్చే యోహానంటారు కొందరు. ఏలీయావని అంటారు మరి కొందరు. మరి కొందరేమో ప్రవక్తలలో ఒకరివంటారు” అన్నారు.
29 “అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటున్నారు?” అని ఆయన వారినడిగాడు.
“నీవు అభిషిక్తుడవే!” అని పేతురు ఆయనకు సమాధానం చెప్పాడు.
30 అప్పుడు ఆయన తనను గురించి ఎవరికీ చెప్పకూడదని వారిని హెచ్చరించాడు.
31 అప్పుడాయన వారికి ఈ సంగతులు నేర్పడం ఆరంభించాడు: మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవించి పెద్దల, ప్రధాన యాజుల, ధర్మశాస్త్ర పండితుల నిరాకరణకు గురి అయి చంపబడి మూడు రోజుల తరువాత మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి అని.
32 ఈ విషయం తేటతెల్లంగా చెప్పాడు. అయితే పేతురు ఆయనను ఒక్కణ్ణే తీసుకువెళ్ళి మందలించసాగాడు.
33 అందుకు యేసు మళ్ళుకొని తన శిష్యులను చూచి పేతురును మందలిస్తూ “సైతానూ! నా వెనుకకు పో! మనుషుల సంగతుల మీదే గాని దేవుని సంగతులమీద నీ మనసు ఉండడం లేదు.”
34 అప్పుడాయన తన శిష్యులనూ జన సమూహాన్నీ దగ్గరకు పిలిచి వారితో అన్నాడు “ఎవరైనా సరే నావెంట రావాలనుకొంటే, తనను తిరస్కరించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి. 35 తమకోసం ప్రాణాన్ని దక్కించుకోవాలి అనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు. కానీ నాకోసం, శుభవార్త కోసం తమ ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకొంటారు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొంటే ఆ వ్యక్తికి లాభమేమిటి? 37 మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు? 38  వ్యభిచార సంబంధమైన ఈ పాపిష్ఠి తరంలో ఎవరైనా సరే నన్ను గురించి గానీ నా మాటల గురించి గానీ సిగ్గుపడుతూ ఉంటే, మానవ పుత్రుడు కూడా తన తండ్రి మహిమతోనూ పవిత్ర దేవదూతలతోనూ వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి సిగ్గుపడుతాడు.”